వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   స్త్రీలు గృహము పురుషులు
WFTW Body: 

"కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను, మీ మనస్సులలోను ఉంచుకొని... అలాగు చేసిన యెడల వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలము విస్తరించును" (మీ దినములు భూమిపై పరలోకమువలె నుండును- కింగ్ జేమ్స్ వెర్షన్) అని ద్వితీయోపదేశకాండము 11:18-21లో వ్రాయబడియున్నది. "మీ దినములు భూమిపై పరలోకమువలె ఉండును" అనునది ఎంత చక్కని మాట. పరలోకపుదినములు ఎట్లుండునో ఆలోచించండి. అక్కడ గొడవలు లేక పోరాటములు ఉండవు కాని కేవలము సమాధానము, సంతోషమే ఉండును. మరియు అన్నిటికంటె పైగా ప్రతి చోట ప్రేమ ఉండును. అటువంటి ఇంటిని మీరు కలిగియుండవచ్చును. ప్రతిదినము పరలోకములో ఒక దినమువలె ఉండిన అనుభవము గల యింటిని మీరు కలిగియుండవచ్చును. ప్రతి గృహము అట్లుండవలెననేది దేవుని ఉద్దేశ్యమై ఉన్నది.

బైబిలు ఆదాము హవ్వల వివాహముతో ప్రారంభమై క్రీస్తు మరియు ఆయన జనులైన సంఘము యొక్క వివాహముతో ముగియుచున్నది. దేవుడు మొదటి వివాహమైన ఆదాము హవ్వల వివాహము జరిగించినప్పుడు, వారి దినములు భూమిపై పరలోకపు దినములవలె ఉండవలెనని ఆయన కోరుకొనెను. వారి మొదటి గృహమైన ఏదేను ఒక పరదైసు. కాని సాతాను వచ్చి వారి గృహమును నరకమువలె మార్చివేసెను. ఇప్పుడు లోకమంతా ఈనాడు నరకమువలె ఉండిన గృహములు మనము కలిగియున్నాము. అయితే దేవునికి స్తోత్రము, అదే కథకు ముగింపు కాదు. అక్కడే ఏదేను వనములో ఆదాము పాపము చేయగానే, సాతాను కల్పించిన సమస్యను పరిష్కరించుటకు ఏ విధముగా తన కుమారుని పంపించుటకు దేవుడు వాగ్దానము చేసెనో బైబిలు మనకు చెప్పుచున్నది. అక్కడే సాతానుకు వ్యతిరేకముగా దేవుడు ఎల్లప్పుడు మన పక్షమున ఉండును అనే గొప్ప సత్యమును చూచుదుము. ఆదాముయొక్క పాపమునుబట్టి దేవుడు భూమిని శపింపక ముందు, సాతాను తలను నలుగగొట్టే సంతానము, స్త్రీ ద్వారా వచ్చునని ఆయన ఆదాము హవ్వలకు చెప్పెను. దాని తరువాత మాత్రమే దేవుడు వారియొక్క శిక్షను తెలిపెను. సాతాను వచ్చి పరిస్థితులను గలిబిలి చేసినా దేవుడు సాతానుకు వ్యతిరేకముగా వారి పక్షమున ఉండెనని ఆదాము హవ్వలు తెలుసుకొనవలెనని దేవుడు కోరుకొనెను. సాతాను ఏ ఇంటిలో ఏమి చేసినా, గృహములను విడుదల చేసే పనిలో దేవుడు ఉన్నాడు. మన గృహములు ఈ భూమిపై పరలోకములో రోజులవలె ఉండవలెననే ఆయన అసలైన ప్రణాళికలోనికి మన గృహములను తీసుకొని రావలెనని ఆయన కోరుచుండెను. ఇప్పుడు క్రీస్తు వచ్చి యున్నాడు మరియు విడుదల కార్యము పూర్తి అయ్యెను. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరికి నిజమైన అవకాశము ఉన్నది. ఒకరిని ఒకరు ప్రేమించుట గురించి మూడు విషయాలు నేను చెప్పాలనుకొనుచున్నాను.

1. ప్రేమ ప్రశంసలను వ్యక్తం చేస్తుంది

వివాహజీవితము గూర్చి ఒక పూర్తి పుస్తకమును దేవుడు బైబిలులో చేర్చెను అది పరమగీతము. వివాహమైన దంపతులందరు దానిని ఒకరికొకరు చదువవలెను. భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎట్లు మాట్లాడుకొనవలెనని అత్యున్నతమైన దేవుడు ఉద్దేశించెనో చూచుట ఆశ్చర్యము కలుగజేయును మరియు ఆ పుస్తకము బైబిలులో యితర పుస్తకముల వలె ప్రేరేపింపబడి వ్రాయబడినది. భార్యభర్తలుగా మనమందరము ఒకరినొకరు మెచ్చుకొనుట తెలుసుకొనునట్లు ఆ పుస్తకములో కొన్ని భాగములు మీ కొరకు నేను చదువుదును. మెచ్చుకొను విషయము వచ్చేసరికి మనమందరము పిసినిగొట్టుగా యుందుము. విమర్శించుటకు మనము త్వరపడువారుగా ఉందుము కాని మెచ్చుకొనుటకు చాలా నెమ్మదిగా ఉందుము. మనము జనుల వైపు చూచి వారిలో ఎన్నో తప్పులెంచుదుము. అది మానవ నైజము. మరియు దానిని బట్టియే నేరారోపణ చేయువాడైన సాతాను మనలో కాలు మోపును. దానికి వేరుగా మనము ఒకరిని చూచి వారిలో మెచ్చుకొనదగినది చూచినప్పుడు మనలో దేవుడు కాలు మోపుటకు వీలగును. మనలో ప్రతి ఒక్కరు ఈ విషయములో మన పద్ధతి ఎట్లున్నదో పరీక్షించుకొనవచ్చును.

పరమగీతములో భర్త తన భార్యకు ఏమి చెప్పుచున్నాడో చూడండి (ఇంగ్లీషు మెసేజ్ బైబిలు తర్జుమా). "నీవు సౌందర్యవంతురాలవు, ఓ నా ప్రియురాలా! తలనుండి కాలివరకు పోల్చలేని సౌందర్యవంతురాలవు మరియు ఏ అవలక్షణము లేనిదానవు. నీవు నా ఊహలలో కనబడునంత సౌందర్యవంతురాలవు. నీ స్వరము నెమ్మది కలుగజేయునది మరియు నీ ముఖము ఆనందింపజేయునది. నా ప్రియమైన స్నేహితురాలా, నీవు అంతరంగమందు మరియు బాహ్యముగాను నీ సౌందర్యము పరిపూర్ణమైనది. నీవు పరదైసువంటి దానవు. నీవు నా హృదయమును బంధించితివి. నీవు నా వైపు చూడగా నేను ప్రేమలో పడిపోతిని. నా వైపు నీవు చూచిన ఒక్క చూపుతో నేను ఏమి చెయ్యలేని విధముగా ప్రేమలో పడిపోతిని. నా హృదయము ఎగిరిపోయినది. ఓ! నిన్ను చూడగానే నాలో భావాలు మరియు రేకెత్తించే కోర్కెలు వచ్చుచున్నవి. మరొకరికి నేను పనికి రాకుండా పాడైపోతిని. ఈ భూమిపై నీ వంటి వారు ఎవ్వరూ లేరు, ఎప్పుడూ ఉండరు. పోల్చుటకు వీలుకాని స్త్రీవి నీవు". ఇప్పుడు భార్య ఏమి చెప్పుచున్నదో వినండి. ఇది ఆమె యొక్క స్పందన, "ఓ ప్రియుడా, నీవు అందగాడివి! నీ వంటివారు పదివేలలో ఒకరుందురు. నీవంటి వారెవ్వరూ లేరు! నీవు బంగారము. నీవు పర్వతతుల్యుడవు. నీ మాటలు ఆదరించునవి మరియు అవి ధైర్యము నిచ్చునవి. నీ మాటలు ముద్దువలె నుండును మరియు నీ ముద్దులన్నియు మాటలే. నీ గురించిన ప్రతీది నన్ను సంతోషపరచును. నీవు నన్ను పూర్తిగా పులకరింపచేయుదువు!. నేను నీ కొరకు ఆశగొనియున్నాను మరియు నిన్ను ఎంతగానో కోరుకొనుచున్నాను. నీవులేక పోవుట నాకు బాధాకరము. నేను నిన్ను చూడగానే, నా చేతులు నీ చుట్టువేసి నిన్ను గట్టిగా పట్టుకొందును. నిన్ను నేను వెళ్ళనీయను. నేను నీ దానను మరియు నీవు నావాడవు మరియు నీవు నా ఒకే ప్రియుడవు మరియు నీవు నా ఒకే పురుషుడవు".

2. ప్రేమ క్షమించుటకు త్వరపడుతుంది.

ప్రేమ నిందించుటకు నిదానించును, కాని క్షమించుటకు త్వరపడును. ప్రతి వివాహములో భార్యభర్తల మధ్య సమస్యలుండును. కాని ఆ సమస్యలను అట్లే ఉంచినట్లయితే, అవి తప్పక చికాకులు తెచ్చును. గనుక క్షమించుటకు త్వరపడండి మరియు క్షమాపణ అడుగుటకు త్వరపడండి. దానిని చేయుటకు సాయంత్రము వరకు వేచియుండకండి. నీ కాలిలో ఒక ముల్లు ఉదయమున గుచ్చుకొనినట్లయితే, దానిని వెంటనే తీసివేయుదువు. సాయంత్రము వరకు నీవు వేచి చూడవు. నీవు నీ భాగస్వామిని బాధపెట్టినట్లయితే, నీవు ఆమెను లేక అతడిని ఒక ముల్లుతో పోడిచినట్లే. వెంటనే దానిని తీసివేయి. వెంటనే క్షమాపణ అడుగు మరియు క్షమించుటకు వేగిరపడుము.

3. ప్రేమ తన భాగస్వామితో కలిసి పనిచేయుటకు వేగిరపడును అంతేకాని ఒంటరిగా కాదు.

సాతాను హవ్వను తోటలో శోధించుటకు వచ్చినప్పుడు, "నేను నిర్ణయము తీసుకొనుటకు ముందు నా భర్తను మొదట సంప్రదించనివ్వు" అని ఆమె చెప్పినట్లయితే మానవుని చరిత్ర ఎంత వ్యత్యాసముగా ఉండియుండేది. అప్పుడు ఎంత వ్యత్యాసమైన కథగా ఉండియుండేది. లోకములో సమస్యలన్ని ఒక స్త్రీ నిర్ణయము తీసికొనుటకు ముందు ఆమెకు సంప్రదించవలసిన ఒక తోడును దేవుడు ఇచ్చినా, ఆమె స్వంతముగా నిర్ణయము తీసుకొనుట వలన వచ్చియున్నవని జ్ఞాపకముంచుకొనుడి. నిజమైన ప్రేమ పనులను కలిసిచేయును. ఒక్కరి కంటే ఇద్దరు ఉండుట ఎప్పుడు శ్రేష్ఠమైనది.