వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   నాయకుడు శిష్యులు
WFTW Body: 

ఉన్నత ప్రమాణాలతో స్థానిక సంఘమును నిర్మించుటకు ఉన్నత ప్రమాణాలు కలిగిన నాయకులు అవసరం. "నన్ను వెంబడించుడి" అని ప్రభువైన యేసు చెప్పారు(లూకా 9:23). మరియు "నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి" అని పౌలు చెప్పాడు (1కొరంథి 11:1; పిలిప్పి 3:17). పౌలు యొక్క ఈ మాటలను బట్టి ప్రతి ఒక్క సంఘపెద్ద తన సంఘములోని ప్రతి వారితో ఈ విధముగా చెప్పవలెనని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడని మనము చూస్తున్నాము.

"నన్ను వెంబడించకుడి కాని క్రీస్తును వెంబడించుడి" అని చాలా మంది సంఘపెద్దలు చెప్పెదరు. ఇది పైకి చాలా దీనముగానే ఉన్నది కాని నిజానికి వారి ఓడిపోయిన జీవితాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక సాకు మాత్రమే మరియు ఇది పరిశుద్ధాత్మ బోధకు పూర్తిగా వ్యతిరేఖమైనది. ఒక నాయకుడుగా నీ జీవితము మరియు నీ మాటలు ఒక మాదిరిగా ఉండాలి. మరియు నేను క్రీస్తును పోలినడుచుకొనున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడని మీ సంఘములోని అందరికి చెప్పగలగాలి. పౌలు మారుమనస్సు పొందకముందు, అతడు పూర్తిగా ఓడిపోయాడు. అతడు పరిపూర్ణుడు కాకపోయినప్పటికినీ, దేవుడు అతనిని మార్చి ఇతరులు నడుచుకొనుటకు అతనిని ఒక మాదిరిగా ఉంచాడు(పిలిప్పీ 3:12-14). ఈ లోకంలో ఉన్న అందరికంటే అత్యుత్తమమైన క్రైస్తవుడు కూడా పరిపూర్ణుడు కాదు. కాని అతడు సంపూర్ణుడగుటకు సాగిపోతాడు. కాబట్టి నీ జీవితంలో గతములో అనేక విషయములలో నీవు ఓడిపోయినప్పటికినీ, దేవుడు ఇతరులు నిన్ను పోలినడుచుకొనునట్లుగా దైవభక్తిగల నాయకునిగా దేవుడు నిన్ను మార్చగలడు.

దేవుని ప్రజలకు నాయకునిగా నీవు ఇక్కడ ఇవ్వబడిన ఏడు గుణలక్షణములను కలిగియుండుటకు ప్రయత్నించాలి.

1. నీవు ఎల్లప్పుడు దీనుడవైయుండి ఇతరులకు అందుబాటులో ఉండాలి.

ప్రభువైన యేసు దీనుడైయుండి ఇతరులకు అందుబాటులో ఉండియున్నాడు (మత్తయి 11:29). ప్రజలు ఆయనను ఎక్కడైనను ఏ సమయమందైనను కలుసుకొనెడివారు. నికోదేము ఆయనను అర్థరాత్రియందు ఆయన ఇంటిలో కలిసాడు. మరియు ఎవరైనను ఎప్పుడైనను ప్రభువైన యేసుతో మాట్లడవచ్చును. బీదలకు సువార్త ప్రకటించుటకు ప్రభువైన యేసులో ఉన్న దీనత్వం ఆసక్తి పుట్టించింది(లూకా 4:18). తన పొరపాటులను వెంటనే ఒప్పుకొని మరియు క్షమాపణ అడుగునంతగా పౌలు దీనుడైయున్నాడు (అ.కా. 23:1-5). ఒక పెద్దగా, సంఘములో ధనికులకు మరియు పేదవారికి నీవు ఎటువంటి వ్యత్యాసం చూపించకూడదు. నీ గురించి నీవు "గొప్ప తలంపులు" కలిగియుండకు మరియు నీ పొరపాట్లకు వెంటనే క్షమాపణ అడిగేవాడుగా ఉండాలి. నీవు ఎల్లప్పుడు సామాన్యసహోదరుడుగా ఉండాలి.

2. నీ అవసరముల కొరకుకాని నీ పరిచర్య కొరకుకాని ఎవరినైనను ఎప్పుడైనను డబ్బు అడుగకూడదు మరియు నీవు సామాన్యముగా జీవించాలి.

పౌలు అప్పుడప్పుడు తీసుకొనిన రీతిగా నీవు ఇతరులనుండి కానుకలను తీసికొనినట్లయితే, వారు నీకంటే ధనవంతులై ఉండాలి కాని నీకంటే బీదవారై ఉండకూడదు. తన కొరకుకాని తన పరిచర్య కొరకుకాని ఒక్కసారికూడా ఎవరిని డబ్బు అడుగలేదు. ఆయనకంటే ధనవంతులైన వారియొద్ద మాత్రమే ఆయన కానుకలను తీసుకున్నాడు (లూకా 8:3). ప్రభువైనయేసు మరియు పౌలు ఇద్దరు సామాన్యముగా జీవించారు. డబ్బు విషయంలోను మరియు వస్తు వాహానాల విషయాలలోను నీవు వారివంటి వైఖరి కలిగియుండాలి.

3. దైవజనుడిగా నీకు ఒక సాక్షం ఉండాలి.

పరిశుద్ధతకొరకు ఆసక్తి కలిగి యదార్థమైన వ్యక్తివని మీ స్థానిక సంఘములో నీవు గుర్తింపు పొందాలి - అనగా ఏ విషయంలోను తన సొంతమును కోరనివాడు. నీ నోటిని నీవు అదుపులో పెట్టుకొనువాడవని ప్రజలు నిన్ను గుర్తించాలి (యాకోబు 1:26; ఎఫెసి 4:26-31) మరియు ఓడిపోయిన వారి విషయంలో కనికరముగల వాడవైయుండాలి (హెబ్రీ 5:2). స్త్రీలందరి విషయంలో అనగా చిన్నలు మరియు పెద్దల విషయంలో నీవు పవిత్రమైన సాక్షం కలిగియుండాలి(1 తిమోతి 5:2). ఇది నీ జీవితంలో దేవునియొక్క సువాసనగా ఉండాలి.

4. ప్రభువును ప్రేమించేవారిగా నీ పిల్లలను నీవు పెంచాలి.

విశ్వాసులు విధేయులైన పిల్లలుగల వారినే సంఘపెద్దలుగా నియమించాలని పరిశుద్ధాత్ముడు చెప్పారు (1తిమోతి 3:4-5; తీతుకు 1:6). మన పిల్లలు మనలను ఎల్లప్పుడు ఇంటిలో చూస్తారు కనుక మన గురించి ఇతరులకంటే ఎక్కువగా వారికే తెలుస్తుంది. మనం దైవభక్తికలిగి ఇంటిలో జీవిస్తున్నట్లయితే వారుకూడా ప్రభువును వెంబడిస్తారు (సామెతలు 22:6). ఇది సులభమైన పని కాదు. కాని ప్రభువుయొక్క సహయము కొరకు మనము ఆయనను నమ్ముకొనవచ్చు. కాబట్టి నీ పిల్లలు ప్రభువును ప్రేమించునట్లుగాను, వారు అందరిని గౌరవించునట్లును కృపకొరకు ప్రభువును వెదకు.

5. దేవుని నిత్యసంకల్పమంతటిని భయములేకుండా నీవు భోదించాలి.

నీవు ఎప్పుడైనను ఇతరుల మెప్పుకోరక, క్రొత్తనిబంధనలోని ప్రతి ఒక్క వాగ్ధానము మరియు ప్రతిఒక్క ఆజ్ఞను ప్రకటించాలి (అ.కా 20:27; గల 1:10). నీ ప్రసంగములు ప్రోత్సహించేవిగాను ఇతరులకు సవాలుగాను ఉండునట్లును, నీవు ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము పొందునట్లు ప్రార్థించాలి.

6. క్రీస్తుయొక్క శరీరము నిజముగా ప్రత్యక్షపరచబడునట్లుగా నీ స్థానిక సంఘము నిర్మించబడునట్లు నీవు గొప్ప ఆసక్తి కలిగియుండాలి.

తనయొక్క జీవాన్ని ప్రత్యక్షపరచుటకు భూమిమీద ప్రజలను వారి పాపములనుండి రక్షించి మరియు వారిని తన శరీరములోని అవయవములుగా నిర్మించుటకు ప్రభువైన యేసు భూమిమీదకు వచ్చారు (మత్తయి 16:18). క్రీస్తుయొక్క శరీరమును వ్యక్తపరచుటకు లేక బయలుపరచుటకు ప్రతి స్థలములో అటువంటి స్థానిక సంఘములు నిర్మించాలని పౌలు ఆసక్తి కలిగియుండెను (ఎఫెసి 4:15, 16). అదియే నీయొక్క ఆసక్తి కూడా అయియుండాలి. అటువంటి స్థానిక సంఘములు నిర్మించుటకు పౌలు ఎంతో కష్టపడి పరిచర్య చేశాడు. నీవు కూడా అదే విధముగా కష్టపడి పరిచర్య చేయాలి (కొలస్సీ 1:28, 29).

7. నీకున్న దర్శనమును మరియు నీకున్న ఆత్మను పంచుకొనే కొందరిని మీ సంఘములో సిద్ధపరచాలి. రాబోయే తరములో కూడా మీ సంఘములో ప్రభువుయొక్క పవిత్రతతో కూడిన సాక్షము కాపాడబడునట్లు ఒక పెద్దగా నీవు శ్రద్ధ తీసుకోవాలి. ప్రభువైన యేసు తన యొక్క ఆత్మతో కలపబడిన వారై ఆయనవలె జీవించి పరిచర్యను కొనసాగించుటకు 11 మంది శిష్యులను ఆయన సిద్ధపరిచాడు. పౌలు కూడా తన యొక్క దీనాత్మ మరియు స్వార్థరహితమైన పరిచర్య కొనసాగించుటకు తిమోతి మరియు తీతును సిద్ధపరిచాడు (పిలిప్పీ 2:19-21; 2కొరంథీ 7:13-15). నీ యొక్క దర్శనము మరియు నీ యొక్క ఆసక్తిని కొనసాగించుటకు మీ స్థానికసంఘములో కొందరిని సిద్ధపరచుటకు నీవు ప్రభువుయొక్క సహాయమును కోరాలి.

కాబట్టి నీ సంఘములోని వారందరు నిన్ను పోలి నడుచుకొనునట్లుగా, నీవు ఈ గుణ లక్షణములను కలిగియుండునట్లును, ఎల్లప్పుడు పరిశుద్ధాత్మచేత అభిషేకము పొందునట్లును నీవు ప్రభువును ప్రార్థించుము.