వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు
WFTW Body: 

ఒక ఆత్మీయ నాయకుడు ప్రాథమికముగా, అతిప్రాముఖ్యముగా దైవపిలుపు కలిగి ఉంటాడు. అతడు చేసే పని అతని వృత్తిగాక అతని పిలుపై ఉంటుంది.

ఎవ్వరు తనకు తానుగా ఒక ఆత్మీయ నాయకుడిగా నియమించుకోలేరు. "ఈ పనికోసమై అతడు దేవుని చేత పిలువబడాలి" (హెబ్రీ 5:4 లివింగ్ బైబిల్). ఇది మార్చజాలని నియమం. మనకు ప్రధాన యాజకుడిగా ఉండేందుకు సాక్షాత్తు యేసు కూడా తనను తాను నియమించుకోలేదని ఆ తరువాత ఉన్న వచనము చెబుతుంది. తండ్రి ఆయన్ని నియమించాడు. మరి ఇది సత్యమైతే ఇక మన పిలుపు విషయంలో ఈ నియమం మరెంత సత్యమై ఉండాలో కదా.

ఈనాటి విషాదకరమైన విషయమేమిటంటే భారతదేశంలోని "క్రైస్తవ సేవకుల్లో" అధిక సంఖ్యాకులు తమ పొట్టకూటికోసం మాత్రమే దేవుని సేవ చేస్తున్నారు. ఇది వారికి వృత్తిగా మారింది. వారు దేవుని పిలువు పొందిన వారుకారు.

ఒక వృత్తికి, పిలుపుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నా భావమేమిటో చెప్పనివ్వండి. ఒక హాస్పిటల్‍లో జబ్బుపడి చికిత్స పొందుతున్న ఒక చిన్న పాప ఉందనుకుందాం. హాస్పిటల్‍లో ఉద్యోగం చేస్తున్న నర్సు తన విధిననుసరించి కేవలం ఎనిమిది గంటలు మాత్రమే ఆ పాపను చూచుకుంటుంది. తన సమయం అయిపోగానే ఆ నర్సు తన ఇంటికి వెళ్ళి, హాస్పిటల్‍లో ఉన్న పాపను పూర్తిగా మర్చిపోతుంది. ఆమెకు ఆ పాప విషయంలో ఉన్న బాధ్యత కేవలం ఎనిమిది గంటలే. ఆ తరువాత ఆమె చేయాల్సిన ఇతర పనులున్నాయి, సినిమాలకు వెళ్ళాలి, టెలివిజన్ కార్యక్రమాలు చూడాలి. మళ్ళీ మరుసటి రోజు హస్పిటల్‍లో ఉద్యోగానికి వెళ్ళేదాకా ఆమె ఆ పాపను గూర్చి ఆలోచించనవసరం లేదు. కాని ఆ పాప తల్లి ఆ పాపకోసం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయదు గదా! తన పాప జబ్బుపడి ఉండగా తాను సినిమాకు వెళ్ళలేదు. పిలుపుకు, వృత్తికి మధ్య వ్యత్యాసం ఇదే.

నీ సంఘంలోని విశ్వాసుల్ని పెంచే విషయంలో పై సాదృశ్యమును నీ సేవకు పోల్చి చూచుకుంటే నీవు నర్సువో తల్లివో నీకే తెలిసిపోతుంది!.

1 థెస్స 2:7లో పౌలు ఇలా చెప్పాడు: "అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుండిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి".

ఆనాటి క్రైస్తవులకు పౌలు సువార్తను మాత్రమే బోధించలేదుగానీ తన ప్రాణాన్ని వారికోసం ఫణంగా పెట్టాడు. ఈ విధానములో జరగని ఏ పరిచర్యయైనా నిజమైన క్రైస్తవ సేవ కానేకాదు. దైవ సేవ కోసమైన పిలుపు పౌలుకు ఉన్నందువల్లనే అతడు ఆ విధంగా దేవుణ్ణి సేవించాడు. అతడు దైవసేవను ఒక వృత్తిగా చేపట్టలేదు.

ప్రభువును సేవించుట అమోఘమైన విషయం ఈ లోకంలో ఉన్న వాటన్నింటికంటే మహోన్నతమైనది. ఈ భూమిమీద మరేదీ ఈ పనితో పోల్చుటకు సరిరాదు - అయితే దీని విషయమై నీకు "పిలుపు" ఉండితీరాలి. ఇదొక వృత్తిగా మారకూడదు (దిగజారకూడదు).

నేను భారత నౌకా దళంలో ఓ ఆఫీసరుగా ఉన్న రోజుల్లో మే 6, 1964న దైవసేవ (పూర్తికాలపు) నిమిత్తం దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడు మా నౌకాదళాధిపతులకు నా రాజీనామా సమర్పించాను. అయితే ఇశ్రాయేలీయుల విడుదలకోసం మోషే ఫరోను అడిగినట్లుగా ఉంది నా పరిస్థితి!. భారత నౌకాదళం నన్ను విడుదల చేయలేదు. మళ్ళీ మళ్ళీ నేను అభ్యర్థించగా - చిట్టచివరకు రెండు సంవత్సరముల తరువాత నాకు విడుదల లభించింది. పరిపూర్ణమైన దేవుని సమయంలో అధ్బుతంగా విడుదలపొందాను.

దేవునిచేత పిలువబడుట అనేది నా జీవితంలో గొప్ప మార్పును కలుగజేసింది.

మొట్టమొదటిగా, నన్నుగూర్చిగాని, నా పరిచర్యను గూర్చిగాని ప్రజలు ఏమనుకున్నా ఇప్పుడు నేనేమి పట్టించుకోను. ఎందుకంటే నాకు యజమానుడు వేరొకరు ఉన్నారు. ఆయనకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సి ఉంది.

రెండవదిగా, నా పరిచర్యలో వ్యతిరిక్తతగాని, శ్రమగాని ఎదురైనప్పుడు నా పక్షంగా నిలవాలని, నాపై కృపచూపాలని నేను దేవుణ్ణి నమ్ముకోగలను - ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది.

మూడవదిగా, నాకు డబ్బు లభించినా, లభించకున్నా తినడానికి భోజనం దొరికినా, దొరక్కపోయినా ఫరవాలేదు. ఒకవేళ నాకు డబ్బు, భోజనం లభిస్తే మంచిదే. అలా లభించకపోయినా నాకు సంతోషమే. దేవుడు నన్ను పిలిచాడు గనుక, డబ్బు, తిండి దొరకనంత మాత్రాన ప్రభువును సేవించుట నేను మానుకోను.

నాకు లభించిన పిలుపును నేను వదులుకోను. నేను జీతం కోసం పని చేయటంలేదు. అందుచేత డబ్బు, తిండి లభించకపోయినా నేను సేవించుట మానను. నా పరిచర్య తల్లీ-బిడ్డ సంబంధంలాంటిది. ఒకనెల జీతం రాకపోతే నర్సు ఉద్యోగం మానుకుంటుంది. అయితే తల్లి అలామానుకోదు. తల్లికి ఎటువంటి జీతం రాదుగదా! తిండి, డబ్బు లభించినా లభించకపోయినా తల్లి తన బిడ్డను సంరక్షించుకుంటుంది. అపోస్తలులు ఈ విధానములోనే ప్రభువును సేవించారు.

దేవునిచేత పిలువబడటం ఎంత మహిమకరమైన విషయమో కదా!.