WFTW Body: 

క్రీస్తు శరీరంలో ఒకరిని ఒకరు అంగీకరించుట గురించి రోమా 14,15 అధ్యాయాలలో చెప్పబడింది. విశ్వాసులముగా మనమందరము ప్రతి విషయంలో ఒకే విధంగా ఆలోచించము. యేసు తిరిగి వచ్చిన రోజు మన మనస్సులు పరిపూర్ణం చేయబడును. అప్పుడు మనం ప్రతి సిద్ధాంతం విషయంలో 100% అంగీకరిస్తాము, నిజమైన ఆత్మీయతను, మానసికమైన వాటిని మరియు లోకపరమైన వాటిని గుర్తిస్తాము. పాపము చేత మన మనస్సులు వక్రీకరించబడినందున, యదార్థవంతులం పూర్ణహృదయులం అయినప్పటికీ ఈ విషయాలలో వేరే వేరే అభిప్రాయాలను కలిగి ఉంటాము. ఎవరికైనను దేనిని గూర్చి అయినను పూర్ణ గ్రహింపు ఉండదు. ప్రతి దానిని ఇప్పుడు మనం అద్దంలో చూచినట్లు సూచనగా చూస్తున్నాము (1కొరంథీ 13:12). కాబట్టి ఇతరులు కొన్ని విషయాలలో వేరుగా ఉన్నట్లయితే వారందరు తప్పని మనమే సరిగా ఉన్నామని అనుకొని మొండిగా ఊహించుకొనకూడదు. ఆ విధముగా క్రీస్తు శరీరంలో విభజనలు వచ్చును. లేఖనాలలో స్పష్టమైన మరియు ముఖ్యమైన సత్యములు ఉన్నాయి - ప్రాముఖ్యంగా క్రీస్తును గూర్చి మరియు ఆయన పనిని గూర్చి లేఖనములలో స్పష్టంగా చెప్పబడింది. యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు, సంపూర్ణంగా మానవుడై ఉన్నాడు, ఆయన లోక పాపముల కొరకు మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, తండ్రియైన దేవుని వద్దకు ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. ఇట్టి సిద్ధాంతాలను మనం కొంచెం కూడా మార్చము. కానీ కొన్ని మూలాధారము కాని సిద్ధాంతాలు ఉన్నాయి.

నీటి బాప్తిస్మము రక్షణ పొందుటకు అవసరం లేనప్పటికీ స్థానిక సంఘములలో ముఖ్యమైన సిద్ధాంతముగా ఉన్నది. చిన్నపిల్లల బాప్తిస్మము లేఖనానుసారము కాదని నమ్మే వ్యక్తి అటువంటి బాప్తిస్మం ఇచ్చే వ్యక్తితో కలిసి పరిచర్య చేయుట అసాధ్యం ఎందుకనగా తరచుగా ఘర్షణలు వచ్చును. అటువంటి వారితో కలిసి మనం పరిచర్య చేయలేనప్పటికీ అతడు కొత్తగా జన్మించినవాడైతే దేవుడు అంగీకరించి ఉన్నాడు కాబట్టి మనము కూడా క్రీస్తులో అతనిని సహోదరుడుగా అంగీకరించాలి. మనం కలిసి పరిచర్య చేయలేనప్పటికీ వారితో సహవాసం చేయవచ్చు. కానీ ఈనాడు ఉన్న సమస్య ఏమిటంటే ఒక వ్యక్తితో పరిచర్య చేయలేనప్పుడు అతనితో సహవాసం కూడా చేయలేమని అనేకమంది క్రైస్తవులు భావిస్తున్నారు. అక్కడే రోమా 14,15 అధ్యాయాల అవసరం ఉంది.

విశ్వాసంలో బలహీనంగా ఉన్న సహోదరుని నీవు చూచినట్లయితే అతన్ని అంగీకరించు. అతన్ని ఏ విధంగా అంగీకరించాలి? "క్రీస్తు నిన్ను చేర్చుకున్న ప్రకారము నీవు అతన్ని చేర్చుకోవాలి" (రోమా 15:7). నీవు సంపూర్ణంగా ఉన్నప్పుడు క్రీస్తు నిన్ను చేర్చుకున్నాడా? లేదు. కాబట్టి చేర్చుకొనుటకు ముందు నీ సహోదరుడు సంపూర్ణంగా ఉండాలని ఎందుకు కోరుతున్నావు? మనం కొత్తగా జన్మించిన రోజున, ఎంత బలహీనులుగా మరియు బుద్ధిహీనులముగా ఉన్నామో కదా. మనకు దేవుని గూర్చి తెలియదు, మనమందరము పాపం చేత ఓడింపబడియున్నాము. అయినప్పటికీ ప్రభువు మనల్ని స్వీకరించాడు. ఆయన మనలో ఎన్నో విషయాలు తప్పుగా ఉన్నట్లు చూశాడు అయినప్పటికీ మనల్ని అంగీకరించాడు. దేవుడు అంగీకరించిన వారిని మనం అంగీకరించనట్లయితే, మనం గర్విష్టులమై, దేవుని కంటే కూడా ఎక్కువ ఆత్మీయులుగా ఊహించుకుంటున్నాము! ఈ విధంగా కొన్ని తప్పుడు గుంపులు వచ్చాయి - అవి తప్పుడు సిద్ధాంతములతో మాత్రమే కాదు, ఇతర దేవుని బిడ్డల ఎడల తప్పుడు వైఖరి కలిగి ఉండడం ద్వారా కూడా వచ్చాయి. క్రీస్తు శరీరంలోని ఇతర సభ్యులను అంగీకరించడానికి మన చిన్న చిన్న నియమాలు మరియు చట్టాలు ఆధారం చేసుకోకూడదు.

"నీ సహోదరునికి నీవు తీర్పు తీర్చనేలా?" (రోమా 14:10a). ఇది బాహ్యంగా జరిగే క్రియ. "నీ సహోదరుని నిరాకరింపనేల?" (రోమా 14:10b). ఇది అంతరంగంలో ఉన్న వైఖరి. మనము ఈ రెండింటినీ నివారించాలి. దేవుడు అంగీకరించిన వారందరినీ (వారు ఎలా ఉన్నారో అలాగే) మనం కూడా చేర్చుకొనునట్లు మన హృదయం విశాలపరచబడినప్పుడు, మనము సువార్త సందేశం యొక్క ఉన్నతమైన స్థితికి వస్తాము. "ఏక భావము గలవారమై క్రీస్తు శరీరంలోని ఇతరులతో ఏకగ్రీవంగా, ఏక స్వరముతో, దేవుణ్ణి మహిమ పరచెదము" (రోమా 15:6).

రోమా 16వ అధ్యాయములో, రోమాలోని వివిధ విశ్వాసులకు పౌలుయొక్క వందనములు ఉన్నాయి. రోమాలోని సంఘములో, ఐదు గృహ సంఘాలు ఉన్నాయి (రోమా 16:5-15). వారందరూ ఒక పెద్ద మందిరంలో కలిసేవారు కారు. రోమా సంఘంలో అనేకులు ఉన్నారు, వారు అనేక చిన్న గుంపులుగా వేరే వేరే గృహాలలో కలిసేవారు. పౌలు రోమా వెళ్ళనప్పటికీ అక్కడ సంఘములోని కొందరిని తెలుసుకుని వారికి వందనములు చెప్పుటకు ఆసక్తి కలిగి ఉన్నాడు.

చివరిగా ఈ పత్రిక మొదట్లో ఉన్నట్లే చివరిలో కూడా "విశ్వాసమునకు విధేయులవుటను" గూర్చి చెప్పబడింది (రోమా 16:25). పౌలు ప్రజలను విశ్వాసంలోనికి నడిపించుటయే కాక వారు విశ్వసించిన దాని విధేయతలోనికి నడిపించుటకు కూడా పిలువబడి ఉన్నాడు. జీవము లేని శరీరము వలె క్రియలు లేని విశ్వాసము మృతము. పాత నిబంధనలో విధేయత గురించి నొక్కి చెప్పబడింది. కొత్తనిబంధనలో విశ్వాసమునకు విధేయులమగుట గురించి నొక్కి చెప్పబడింది. ప్రతి ఆజ్ఞ, మన ప్రేమగల తండ్రి దగ్గరనుండి వచ్చినదని మరియు కేవలం మన అతి శ్రేష్టమైన మేలు కొరకే రూపొందించబడినదని తెలుసుకొని ఇప్పుడు మనం దేవునికి విధేయుల మగుదుము.