WFTW Body: 

క్రొత్త సంవత్సరమును మనము ఆరంభించుచుండగా, ఈ సంవత్సరములో మన ఆత్మీయ జీవితములోని ప్రాధాన్యతలను తీవ్రముగా తీసుకొనెదము. ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నవి. వాటిని తీవ్రముగా తీసుకొని మరియు అవి మన జీవితములో నెరవేరునట్లు ప్రార్థించెదము. ప్రభువు మనకు సహాయపడునుగాక!

1. క్రొత్త ఆరంభమును ప్రారంభించుము: లూకా 15లో, తన జీవితములో పూర్తిగా ఓడిపోయిన తప్పిపోయిన కుమారునికి, తన తండ్రి ప్రశస్త వస్త్రమును తొడిగించెను. సువార్తయొక్క సందేశమిదియే: ఓడిపోయిన వారికి దేవుడు అత్యంత శ్రేష్టమైన వాటిని ఇచ్చును. దేవుడు ఏ ఒక్కరిని కూడా ఎట్టి పరిస్థితులలోను విడిచిపెట్టడు గనుక వారు ఒక క్రొత్త ఆరంభమును ప్రారంభించవచ్చును. గతములో ఓడిపోయిన వారందరికీ ఇది చాలా గొప్ప ప్రోత్సహము. గతములో నీవు ఎంత పెద్ద తప్పులు చేసినను లేక ఎంత ఓడిపోయినను, క్రొత్త సంవత్సరమును ఆరంభించినట్లే నీవు ఒక క్రొత్త ఆరంభమును ప్రారంభించవచ్చును.

2. క్రమశిక్షణ కలిగియుండుము: 2 తిమోతి 1:7లో పౌలు ఇట్లనుచున్నాడు, "దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియనిగ్రహము గల ఆత్మనే ఇచ్చెనుగాని పిరికితనముగల ఆత్మనియ్యలేదు". దేవుని ఆత్మ మనకు శక్తిని, ఇతరులయెడల ప్రేమను మరియు ఆశానిగ్రహమును ఇచ్చును. నీవు పరిశుద్ధాత్మద్వారా ఎటువంటి అనుభవమును పొందినప్పటికీ, నీ సమయమును గడిపే విషయములోగాని మరియు నీ డబ్బు విషయములో క్రమశిక్షణ కలిగియుండుటకుగాను మరియు మితముగా మాట్లాడుటకుగాని పరిశుద్ధాత్ముని నీవు అనుమతించనియెడల, నీవు దేవుడు కోరిన విధముగా ఉండలేవు. వారి జీవితములలో పరిశుద్ధాత్మునిద్వారా క్రమశిక్షణ చేయబడుటకు అనుమతించిన వారే సంఘచరిత్రలో గొప్ప దైవజనులయ్యారు. వారు నిద్రించే విషయములోను, తినే అలవాట్ల విషయములోను మరియు బైబిలు చదివి, ప్రార్థించే విషయములోను వారు క్రమశిక్షణ చేయబడిరి. భూసంబంధమైన వాటిన్నిటికంటే వారు మొదటిగా దేవునికి విలువనిచ్చియున్నారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటద్వారానే అనేకమంది క్రైస్తవులు తృప్తిపడుచున్నారు మరియు తరువాత వారి జీవితము సాఫీగా ఉంటుందని ఊహించుకొనుచున్నారు. కాని ఈ సంవత్సరములో, నీవు దేవునిచిత్తము చేయగోరినయెడల, నీవు కూడా క్రమశిక్షణ చేయబడాలి.

3. ఎల్లప్పుడు మండుచు ఉండాలి: తిమోతి విశ్వాసమును మరియు ఆత్మీయవరములను కలిగియున్నప్పటికినీ పౌలు ఇట్లన్నాడు, "నా హస్తనిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలెనని కోరుచున్నాను". అది ఎల్లప్పుడు మండుచూ ఉండునట్లు, ఆ కృపావరమును ప్రజ్వలింపజేయుమని పౌలు జ్ఞాపకము చేయుచున్నాడు. కాబట్టి ప్రభువైనయేసు పరిశుద్ధాత్మతోను మరియు అగ్నిలోను బాప్తిస్మమిచ్చినప్పటికినీ (మత్తయి 3:11), అది ఎల్లప్పుడు ప్రజ్వలించునట్లు మనము చేయవలెను. మనము దేవుని చిత్తానికి సంపూర్ణముగా సమర్పించుకొని, ఎల్లప్పుడు సరఫరాను పొందుచూ ఉండాలి. దేవుడు ఒకసారి నిన్ను అభిషేకించిన తరువాత అది చాలునని ఊహించుకొని మరియు ఇట్లనవద్దు, "ఒకసారి అభిషేకము పొందితే, అది ఎల్లప్పుడు ఉండును". కొందరిట్లనుచున్నారు, "ఒకసారి రక్షణ పొందితే, ఎప్పటికి రక్షణ పొందినట్లే". దేవుని చేత నిజముగా అభిషేకించబడినవారిలో కొందరు సంవత్సరము తరువాత ఆత్మీయముగా మరణించినట్లు నేను చూశాను. వారిలో అగ్ని ఆరిపోయింది. లోకతత్వము మరియు గర్వము వారిలోనికి వచ్చి మరియు అగ్నిని ఆర్పివేసినది. వారు ఇప్పుడు డబ్బు వెంట పరిగెత్తుచూ మరియు సుఖసౌకర్యాలతో జీవించాలని కోరుచూ మరియు దేవుని అగ్నిని కోల్పోయారు. అది బాధాకరము మరియు పరలోకరాజ్యానికి ఎంతో నష్టము. కాబట్టి పౌలు తిమోతితో ఇట్లన్నాడు, "నీ మీదకు వచ్చిన అగ్నిని, తాజాగా ఉంచుచూ మరియు ప్రజ్వరిల్లునట్లు చేయుము. అది ఇప్పుడు నీమీద ఉన్నది. నీవు దానిని ప్రజ్వలింపజేయనట్లయితే, అది ఆరిపోవును. మంచి మనస్సాక్షి కలిగియుండుట ద్వారాను, దేవుని వాక్యము చదివి, ధ్యానించుటద్వారాను, ఎల్లప్పుడూ నిన్ను నీవు తగ్గించుకొనుటద్వారాను, హృదయపూర్వకముగా దేవుని వెదకి, ప్రార్థించుటద్వారాను, ధనాపేక్షకు దూరముగా ఉండుట ద్వారాను మరియు ఇతరులతో వాదనలు పెట్టుకొనకుండుటద్వారాను మరియు అగ్నిని ఆర్పు దానికి దూరముగా ఉండుటద్వారాను ఆ విధముగా చేయాలి.

4. ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందుచూ ఉండుము: మనము సంపూర్ణుమగుటకు సాగిపోవలెనని హెబ్రీ 6:1-3లో హెచ్చరించబడుచున్నాము. సంపూర్ణులమగుటకు సాగిపోవుటను ఒక పర్వతమును (10,000 మీటర్ల ఎత్తు) ఎక్కుటతో పోల్చవచ్చును. ప్రభువైనయేసు పర్వత శిఖరము మీద ఉన్నారు. మనము క్రొత్తగా జన్మించినప్పుడు పర్వతమును ఎక్కుట ఆరంభించెదము. అది ఎంతకాలము పట్టినను, ప్రభువైనయేసును వెంబడించుచూ మరియు ఆ పర్వతశిఖరమును చేరుకొనుటయే మన గురియైయున్నది. అప్పుడు మనము 100 మీటర్లే ఎక్కినను, మన కంటే చిన్నవారైన సహోదరసహోదరీలతో, "నేను క్రీస్తు వెంబడించినట్లే నన్ను వెంబడించుమని" చెప్పగలము (1 కొరింథీ 11:1). దేవునితో ఒక్కసారి కలిసినంత మాత్రన, మనము ఆత్మీయులము కాలేము. సంవత్సరాల తరబడి, వారము వెంట వారము మరియు దినము తరువాత దినము, మనలను మనము ఉపేక్షించుకొనుచూ మరియు దేవునిచిత్తమును చేయుచున్నట్లయితే ఆ విధముగా కాగలము. తన స్వచిత్తాన్ని ఎల్లప్పుడు ఉపేక్షించుకొనుట ద్వారా ప్రభువైనయేసు ఆత్మానుసారమైన వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా ఎల్లప్పుడు మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకొనుట ద్వారా ఆత్మానుసారులము కాగలము. వీటిని సాధకము చేసుకొనుమని పౌలు తిమోతితో 1 తిమోతి 4:15లో చెప్పుచున్నాడు. ఒక వ్యాపారస్థుడు డబ్బు సంపాదించుటకు ఎంతో కష్టపడి మరియు తన వ్యాపారమును విస్తరింపజేయాలని కోరును. క్రైస్తవ జీవితమును నీవు తీవ్రముగా తీసుకొనినట్లయితే, వాక్యమును ధ్యానించుటలోను, పరిశుద్ధాత్మ వరములను ఆశతో అపేక్షించుచూ మరియు సమస్త అపవిత్రత నుండి పవిత్రపరచుకొనెదవు. మరొక తర్జుమాలో "అవి మనలో ఇంకునట్లు పీల్చుకొనెదము" అని వ్రాయబడింది. అవి మీలో ఇంకినప్పుడు నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడును. ఈ లోకము చేత మనము ఆకర్షింపబడకుండునట్లు మనలో క్రీస్తు మరియు ఆయన వాక్యము ఇంకవలెను. లోకస్థులు పరుగెత్తునట్లు మనము ఈ లోక విషయాల కొరకు పరుగెత్తము. ఆ విధముగా నీవు క్రీస్తును, ఆయన వాక్యమును పీల్చుకొనుచున్నట్లయితే, నీవు అభివృద్ధి పొందుచూ ఉండెదవు. ప్రతి సంవత్సరము నీవు మరి శ్రేష్టమైన క్రైస్తవుడుగాను మరియు దేవునిసేవకుడుగాను మారెదవు.

5. జయించువాడుగా ఉండుము: హెబ్రీ 12:1-3లో, మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తాలని ప్రోత్సహించబడుచున్నాము. మనము నిలిచియుండకూడదు. విశ్వాస సంబంధమైన ఈ పరుగును మనము ఆపకూడదు. కాలము సంకుచితమైయున్నది కాబట్టి నీవు పరుగెత్తాలి. పరుగు పందెములో పాల్గొనే వారిలో అనేకులు క్రిందపడియున్నారు, అయినప్పటికీ వారు లేచి పరుగెత్తి మరియు మొదటిగా వచ్చియున్నారు. కాబట్టి ప్రభువుతో నీవు నడుచుచుండగా నీవు పడిపోయినట్లయితే నీవు నిరాశపడవద్దు. నీవు అక్కడనే ఉండవద్దు. నీవు లేచి, నీ పాపము ఒప్పుకొని మరియు పరుగెత్తుము. సిలువను సహిస్తూ మరియు తన జీవితాంతము పరుగెత్తిన ప్రభువైనయేసును చూడుము. నీ శత్రువులు నిన్ను వ్యతిరేకించినప్పుడు, ఎంతోమంది శత్రువులచేత వ్యతిరేకించబడిన యేసును గురించి ఆలోచించుము (హెబ్రీ 12:3). ఆయన వలే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు (హెబ్రీ 12:4). ఇక్కద ప్రభువైన యేసు పాపముతో పోరాడెనని చూచెదము. మరొక మాటలో చెప్పాలంటే, "నేను పాపము చేయకుండుటకు అవసరమైతే రక్తమును కార్చెదను" అను వైఖరిని పాపము విషయములో ఆయన కలిగియున్నాడు. అదే వైఖరిని అనగా, "నేను పాపము చేయుట కంటే చనిపోవుట మేలు" అను వైఖరిని కలిగియుంటే నీవు జయించెదవు. కొంచెం డబ్బు ఎక్కువ సంపాదించుటకు మోసము చేయవలెననే శోధన వచ్చినట్లయితే, నీవు ఇట్లనాలి, "నేను కొంచెం మోసం చేయుట కంటే మరణాన్ని కోరెదను" అప్పుడు నీవు జయించెదవు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడవలెననే శోధన నీకు వచ్చినప్పుడు, నీవు ఈ విధంగా అనుకొనవలెను "నేను మోహించుటకంటే చనిపోయెదను". అప్పుడు నీవు జయించెదవు. జయజీవితం జీవించుటకు ఇదియే రహస్యము.

6. దేవుని ప్రెమలో నీవు భద్రత కలిగియుండుము: జెఫన్యా 3:17లోని ఈ మాటలను, "నీయందు తనకున్న ప్రేమను బట్టి ఆయన శాంతము వహించును" ఈ విధంగా తర్జుమా చేయవచ్చును. "ఆయన ప్రేమతో నీకొరకు నిశ్చయముగా ప్రణాళిక వేయుచున్నాడు". నీయెడల తనకున్న ప్రేమను బట్టి సమస్తమును నీ జీవితంలో దేవుడు అనుమతించి, జరిగించుచున్నాడని నీవు గుర్తించియున్నావా? నీకు వచ్చే ప్రతి పరీక్ష మరియు ప్రతి సమస్య నీ మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడు. రోమా 8:28 వచనమును నీవు విశ్వాసించినట్లయితే, నీ జీవితాంతం మనుష్యులకు గాని లేక పరిస్థితులకు గాని భయపడవు. నీకేదైనా ప్రమాదము జరుగునేమోననిగాని లేక కాన్సర్ వచ్చునేమోననిగాని లేక క్రైస్తవ వ్యతిరేకులు నీకు హాని చేస్తారేమోననిగాని మరిదేనికైనను భయపడవు. ఎందుకనగా నీ పరలోకపు తండ్రియే ప్రతి ఒక్కరిని మరియు సమస్తమును తన ఆధీనములో ఉంచుకొనియున్నాడు.