WFTW Body: 

"మీరు విశ్వాసముద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" (ఎఫెసీ 2:8).

విశ్వాసము ద్వారా కృప చేతనే మనము పాపక్షమాపణను మరియు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుట ద్వారా మన క్రైస్తవ జీవితమును ఆరంభించియున్నాము. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు, మనము ఆయనను ఆకాశమండలములో కలుసుకొనెదము. అది కూడా కేవలము కృపద్వారాను మరియు విశ్వాసముద్వారాను మాత్రమే. కాబట్టి ఈ భూమిమీద మన క్రైస్తవ జీవితము యొక్క ఆరంభము మరియు ముగింపు కూడా కృపద్వారాను మరియు విశ్వాసముద్వారాను మాత్రమే. ఈ మధ్యకాలములో మనము పొందుకొనవలసినదంతయు కూడా అదే నియమముతో పనిచేయును. విశ్వాసముద్వారా, కృపచేత సమస్త దుష్టత్వము నుండి విడుదల పొంది మరియు ఈ భూమిమీద దేవుని చిత్తమును నెరవేర్చగలము. దేవునికి భవిష్యత్తంతయు తెలియును. రేపుగాని లేక వచ్చేవారంలోగాని లేక రాబోయే సంవత్సరములోగాని మనకు జరుగునదేదియు దేవునిని ఆశ్చర్యపరచదు. ఆయనకు ఆరంభము నుండె అంతయు కూడా తెలియును. ఇది మనకు ఎంతో ఆదరణ నిచ్చును. నీవు రేపుగాని లేక వచ్చేవారంలోగాని పొందబోయే పెద్ద పరీక్షను గాని లేక శోధనను గాని దేవుడు ముందుగానే ఎరిగియుంటే, తప్పకుండా దానికి కావలసిన కృపను కూడా ఆయన అనుగ్రహించును.

"నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని" ప్రభువు పౌలుతో చెప్పారు (2 కొరింథీ 12:9). ఆయన కృప మన అవసరమంతటికీ చాలును. "మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు" (2 కొరింథీ 9:8). ఆయన అవసరమంతటిలో సహాయపడుటకు దేవుని కృప అందుబాటులో ఉన్నది. "గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము" (హెబ్రీ 4:16). నీ అవసరమేదైనను సరే, దానిని తీర్చుటకు దేవుని కృప అందుబాటులో ఉన్నది. కాబట్టి మనము కృప వెంబడి కృపను పొందుటకు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. గతములో మనము అవసరమైనంత కృపను పొందలేదు కాబట్టి ఓడిపోయాము. భవిష్యత్తులో మన కథ వేరుగా ఉండును. మనము అవసరములో ఉన్నప్పుడు దీనులమై మరియు కృపకొరకు మొఱ్ఱపెట్టిన యెడల, దేవుడు మనలను నిరాశపరచడు.

దేవుని కృపను పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురని బైబిలు చెప్పుచున్నది, "మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలినయెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు" (రోమా 5:17). భూమిమీద ప్రాకు ప్రతిజీవిని ఏలుటయే ఆదాము యెడల దేవునిచిత్తము. "దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను" (ఆదికాండము 1:26). ఆదాము యొక్క అవిధేయతను బట్టి, అతని జీవితములో అది నెరవేరలేదు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసముంచుట ద్వారా దేవుని కుమారులైన క్రొత్త జాతిని దేవుడు లేపియున్నాడు. వారు ఈ భూమి మీద రాజులుగా ఏలెదరు.

నిన్ను నీవు తగ్గించుకొని మరియు దేవుని కృపను పొందినయెడల ఏ పాపము నీమీద ప్రభుత్వము చేయదు. ఎటువంటి చింతగాని లేక భయముగాని నీ హృదయములోనికిరాదు. సాతానుగాని, నీ శత్రువులుగాని, నీ యాజమానిగాని లేక భూమిమీద ఉన్న ఎవరైనను నిన్ను చింతించేటట్లు చేయలేరు. క్రీస్తులో మమ్మును ఎల్లప్పుడు విజయమిచ్చుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ 2:14). దేవుని క్రొత్త నిబంధన కృపలో జీవించుట ఎంత అద్భుతముగానుండును. వాగ్దానదేశము నీయెదుట తెరువబడియున్నది.

నీవు వెళ్ళి మరియు స్వాధీనపరచుకొనుము!