వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

మనము ప్రకటన 22:2లో "ఆ వీధిమధ్యలో, ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును" అని చదువుతాము. ఆదికాండము 2వ అధ్యాయమునకు ప్రకటన 22వ అధ్యాయమునకు మనము ఎంతో పోలికను కనుగొనెదము. జీవవృక్షము స్వయంగా దేవుని జీవమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇది మనము ఇప్పుడు పాలుపొందగలిగిన నిత్యజీవము లేక దేవస్వభావము. నిత్యజీవము అంటే "ఎప్పటికీ(ఉనికిలో) ఉండుట" కాదు, ఎందుకనగా అగ్నిగుండములోకి వెళ్ళువారు కూడా ఎప్పటికీ(ఉనికిలో) ఉందురు. కాని వారు నిత్యజీవము కలిగియుండరు. నిత్యజీవము అనగా ఆరంభము మరియు అంతము లేని జీవము. ఇది స్వయంగా దేవుని జీవమే. అదే జీవవృక్షములో సాదృశ్యరూపముగా చూపబడెను. ఈ రోజు మనలో అనేకమంది జీవముకు బదులు బైబిల్ జ్ఞానమును వెదకినట్లే ఆదాము కూడా అవివేకముగా జీవవృక్షము యొద్దకు వెళ్ళుటకు బదులు జ్ఞానమునిచ్చు వృక్షము యొద్దకు వెళ్ళెను. ప్రకటన 22వ అధ్యాయములో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము కనబడదు. అది అదృశ్యమాయెను. జీవవృక్షమునకు పోవు మార్గమున దేవుడు ఖడ్గజ్వాలను ఉంచెను(ఆదికాండము 3:24). మనము జీవవృక్షములో పాలు పొందుటకు ఈ ఖడ్గము మన స్వజీవము(స్వంత చిత్త ప్రకారము ఉండగోరిన జీవము) మీద పడవలసియున్నదని ఇది మనకు నేర్పించుచున్నది. అందుచేత, ఏ ఖడ్గములేని జ్ఞానమునిచ్చు వృక్షము చెంతకు ఎక్కువ మంది క్రైస్తవులు వెళ్ళుటకు ఇష్టపడుదురు. బైబిల్ జ్ఞానమును పొందుటకు, మన స్వజీవమునకు చనిపోయి, అనుదినము మన సిలువనెత్తికొనే అవసరతలేదు. కాని దేవస్వభావములో పాలుపొందుటకు, "యేసు యొక్క మరణానుభవమును మన శరీరమందు ఎల్లప్పుడు వహించుకొనిపోవలెను" (2 కొరింథీ 4:10). ఆ ఖడ్గము మనపై పడుటకు మనము అనుమతించవలెను. సిలువ మార్గమే జీవవృక్షమునకు వెళ్ళు మార్గము. ఆ ఖడ్గము యేసుపై పడెను గనుక ఆయన సిలువ వేయబడెను. మనము కూడా ఆయనతో కూడా సిలువ వేయబడితిమి గనుక, ఆ ఖడ్గము మన మీద కూడా పడవలసియున్నది. ఆ విధముగా నెలనెలా ఒక క్రొత్త రకమైన కాపును కాయుచు, దాని ఆకుల ద్వారా స్వస్థతనిచ్చు జీవవృక్షములో మనము పాలుపొందవచ్చును.

ప్రకటన 22:7 వచనములో "ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు" . వెంటనే వచ్చుచున్నానని ప్రభువు ఇక్కడ చెప్పుటలేదు. అలాకాదు. ఆయన త్వరగా హఠాత్తుగా ఏ హెచ్చరిక లేకుండా, రాత్రివేళ దొంగవలె వచ్చెదనని ఆయన చెప్పుచున్నాడు.

ప్రకటన 22:8,9 వచనాలలో "యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచిన వాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు - వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను" అని చదువుతాము. దేవుడు ఈ సత్యములన్నియు నేర్పించుటకు వాడుకున్న వ్యక్తికి ప్రాధాన్యతనిచ్చే తప్పును యెహాను మరియొకసారి చేసెను. వీటన్నిటిని చూపించిన దూత పాదముల యెదుట అతడు సాగిలపడి నమస్కారము చేసెను. కాని ఆ దూత "అలా చేయవద్దు, నేను కేవలము నీ సహదాసుడను, దేవునికి మాత్రమే నమస్కారము చేయుము" అని వెంటనే చెప్పెను. ఒక నిజమైన దేవుని సేవకుని యొక్క గుర్తు ఏమిటంటే, ఎవరైనా అతనితో దగ్గర సంబంధము ఏర్పరచుకొనుటను అతడు చూచినప్పుడు, ఆ వ్యక్తి మనుష్యులను హత్తుకొనక దేవుని హత్తుకొనునట్లు, అతడు ఆ వ్యక్తి నుండి తన్నుతాను వేరుచేసుకొనును. పరలోకములో ఒకే ఒక్క పాటను పాడుదురు - "నీవు మాత్రమే అర్హుడవు" అనుచు క్రొత్త పాట పాడుదురు. ఈ దూత ఆ పాటను నేర్చుకొనెను గనుక అతడు వెంటనే యోహానును వదిలించుకొని దేవునికి మాత్రమే మహిమనిమ్మని అతనితో చెప్పెను.

ప్రకటన 22:11 వచనాలలో "అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుగానే ఉండనిమ్ము" అని చదువుతాము. ఇది బైబిల్ యొక్క చివరి పేజీలో మనము కనుగొనే ఆశ్చర్యకరమైన హెచ్చరిక. ఇది ప్రజలను "అపవిత్రముగా ఉండనిమ్ము" మరియు "అన్యాయమే చేయనిమ్ము" అని వారికి చెప్పుచున్నది. దాని అర్థము ఇదే! "మీరు బైబిలంతయు చదివి చివరి పేజీకి వచ్చి కూడా మీరు ఇంకను మారుమనస్సు పొందుటకు, మీ పాపములను విడచిపెట్టుటకు ఇష్టపడని యెడల మీరు అపవిత్రముగానే ఉండి అన్యాయమునే చేయుడి. మీకు ఎటువంటి నిరీక్షణలేదు." ప్రకటన గ్రంథములో పాపముపైన దేవుని తీర్పులను చదివిన తరువాత కూడా మీరు ఇంకను మీ యిచ్ఛల ప్రకారము నడచుకొనుచు పాపభోగములను కోరుకొనుచు, అశ్లీల పుస్తకాలను చదువుచు, అశ్లీల చలన చిత్రాలను చూచుచు, ఇతరులకు వ్యతిరేకముగా ద్వేషమును నిలుపుకొనుచు, క్షమింపలేకుండా ఉండుచు, దూషించుటకు కొండెములాడుటకు చూచుచు, అసూయపడుచు మీ కొరకు మరియు ఈ కుళ్ళిపోయిన లోకము కొరకు జీవించాలని కోరుకొనుచు ఉంటే అలాగే చేయుడి. దేవుడు మిమ్ములను ఆపడు. కాని 11వ వచనము యొక్క రెండవ భాగములో నీతిమంతులకొరకు ఏమి వ్రాయబడియున్నదో చూడుడి. "నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము". పరిశుద్ధత కొరకు ప్రయాసపడుటలో అంతము ఎప్పుడు ఉండదు. కాబట్టి నీతికొరకు పరిశుద్ధత కొరకు ఇంకా ప్రయాసపడుము. మనము నిత్యత్వములో ఎలా గడుపుతాము అనేది ఏ స్థితిలో మన జీవితాలు ముగియునో నిర్ణయించును. మనము పాపములోను అపవిత్రతలోను జీవించిన యెడల మనము నిత్యత్వమంతా కూడా అగ్నిగుండములో పాపములోను అపవిత్రతలోను చెడుతనములోను గడిపెదము. మనము ఈ జీవిత కాలములో నీతిని పరిశుద్ధతను వెంటాడిన యెడల నిత్యత్వములో కూడా దానికొరకే వెంటాడుదుము. మనము మరణించినప్పుడు నిత్యత్వమంతటికి మన స్థితి స్థిరముగా నిర్ణయింపబడును. "మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును" (ప్రసంగి 11:3).

ప్రకటన 22:21 వచనములో

"ప్రభువైనయేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్"

అని చదువుతాము. దేవుని వాక్యము ఎలా ముగిసెనో చూచుట అద్భుతముగా ఉన్నది. కృప ద్వారా మాత్రమే మనము నూతన యెరూషలేములో ఉండగలము. దేవుడిచ్చు బలముతోను సహాయముతో మాత్రమే మనలను ఎన్నో సంవత్సరములుగా బంధించిన(దాసులుగా ఉంచిన) బంధకములనుండి మనము విడిపింపబడగలము. "కృప" మన పాపములను క్షమించును! కృప మనము పాపమును లోకమును సాతానును జయించుటకు సహాయపడును! ఈ మాటను పాత నిబంధన యొక్క చివరి మాటతో పోల్చిచూడండి. ఆ మాట "శాపము". మలాకీ 4:6లో "నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు" అని దేవుడు చెప్పెను. క్రొత్త నిబంధన యేసు యొక్క జననముతో ప్రారంభమై "ప్రభువైనయేసు క్రీస్తు కృప మీ అందరితో ఉండునుగాక" అనే దీవెనతో ముగియును. పాత నిబంధన చివరిలో వచ్చు శాపము నుండి విడుదల పొందుటకు క్రొత్త నిబంధనలో ఉన్న కృప క్రిందకు వచ్చి మన జీవితాలయొక్క ప్రతి విషయములోను, దేవుని ఆశీర్వాదమును అనుభవించుట మరియు నిత్యత్వమంతయు కూడా దేవుని నివాసస్థలములో ఒక భాగముగా ఉండుట ఎంతో అద్భుతమైన విషయము. హల్లెలూయా! దేవునికి మన పాపముల కొరకు వధింపబడిన గొఱ్ఱెపిల్లకు సమస్త మహిమ ఘనత స్తుతియు కలుగును గాక! ఆమేన్, ఆమేన్!