WFTW Body: 

"దైవజనుని(దైవిక) జీవితం ఉత్తేజకరమైనది" (సామె. 14:14 -TLB) అని బైబిల్ చెబుతోంది.

నా సాక్ష్యాన్ని మీకు తెలియజేయనివ్వండి. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు, నేను 65 సంవత్సరాలకు పైగా దేవునియొక్క తిరిగి జన్మించిన బిడ్డగా ఉన్నాను. నా క్రైస్తవ జీవితం ఉత్తేజకరమైనదని నేను నిజాయితీగా సాక్ష్యమివ్వగలను. నేను అనేక పరీక్షలను ఎదుర్కొన్నాను, కానీ వాటన్నింటిలో, నేను ఉత్తేజకరమైన మార్గాల్లో దేవుణ్ణి అనుభవించాను. నా జీవితంలో అత్యుత్తమ భాగం ఇంకా నా ముందు ఉందని నేను నమ్ముతున్నాను. దేవుని కొరకు జీవించి ఆయనను సేవించగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆయనకు సేవ చేయడమే ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలిగే గొప్ప పని.

ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిపైనా నాకు ఫిర్యాదు లేదు. నాకు హాని చేయడంలో ఇప్పటివరకు ఎవరూ విజయం సాధించలేదు. చాలా మంది నాకు హాని చేయడానికి ప్రయత్నించారు, నా తోటిపనివారిలో కొందరు నాకు ద్రోహం చేసి వ్యతిరేకంగా మారారు. చాలా మంది "క్రైస్తవులు", "క్రైస్తవ" పత్రికలలో మరియు ఇంటర్నెట్‌లో నా గురించి తప్పుడు విషయాలను ప్రచారం చేశారు. వారిలో కొందరు నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్లారు. కానీ ఇవన్నీ నాకు "క్రీస్తు శ్రమల సహవాసం"లో ఒక భాగం మాత్రమే; రోమా 8:28లో చెప్పినట్లుగా, ప్రతి ఒక్కరూ చేసిన ప్రతిదీ నా మంచి కోసమే పని చేసింది. కాబట్టి నేను నిజంగా వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే దేవుడు నన్ను మంచి మనిషిగా, నా ప్రతిస్పందనలలో మరింత క్రీస్తు వలె మార్చడానికి వారి చెడు పనులను ఉపయోగించాడు. వారి చెడు పనుల నుండి వచ్చిన ప్రధాన మేలు అదే.

మనం దేవునికి ఉపయోగపడాలంటే ముందుగా మనం విరగగొట్టబడాలి.

మన అహంకారాన్ని, మన స్వంత సామర్ధ్యాలపై మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మన దృష్టిలో మనల్ని తక్కువగా చేయడానికి దేవుడు చాలా మంది వ్యక్తులను మరియు సంఘటనలను ఉపయోగిస్తాడు.

దేవుడు నా యవ్వన దినాలలో నన్ను చాలా విరగగొట్టాడు మరియు నేటికీ నన్ను విరగగొట్టుచున్నాడు. ఇది ఫలించుటకు మార్గం. మనం ఎంత ఎక్కువగా విరగగొట్టబడతామో, అంత ఎక్కువగా దేవుడు మనల్ని ఇతరులకు ఆశీర్వాదంగా ఉపయోగించగలడు. నిర్గమకాండము 17లో బండను కొట్టినప్పుడే నీళ్ళు ప్రవహించడం ప్రారంభించాయని చదువుతాము. యేసును అభిషేకించుటకు ఒక స్త్రీ సుగంధ ద్రవ్యముతో కూడిన సీసాని తెచ్చినప్పుడు, ఆ సీసా పగలగొట్టబడినప్పుడు మాత్రమే ఆ ఇంటి నిండా సువాసనలు వ్యాపించాయి (మార్కు 14:3). ఐదు వేల మందికి ఆహారం పెట్టుటకు, యేసు రొట్టె తీసుకొని దానిని ఆశీర్వదించాడు. కానీ రొట్టె విరవబడే వరకు ఎవరు ఆహారం పొందలేదు. ఈ ఉదాహరణలన్నింటిలోని సందేశం ఏమిటి? విరగగొట్టబడటం అనేది ఆశీర్వాదానికి మార్గం అనేదే ఆ సందేశం. ఒక అణువు విభజింప బడినప్పుడు, అది మొత్తం నగరానికి విద్యుత్తును అందించడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది! పరమాణువు చాలా చిన్నది, మీరు దానిని సూక్ష్మదర్శినిలో కూడా చూడలేరు. కానీ అది విరగగొట్టబడినప్పుడు, ఎంత అద్భుతమైన శక్తి విడుదల అవుతుంది. ప్రకృతిలో మరియు బైబిల్‌లోని సందేశం ఇదే: దేవుని శక్తి విరగగొట్టబడుట ద్వారా విడుదల అవుతుంది. రాబోయే కొత్త సంవత్సరంలో ఆ సందేశంతో మనమందరం పట్టుబడుదుము గాక.

1963లో నేను నా జీవితంలో మరియు పరిచర్యలో అధికారం కోసం ఆయనను మొదటిసారి వెతికినప్పుడు దేవుడు ఈ సందేశంతో నన్ను పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే, నేను నావికాదళానికి రాజీనామా చేసే ముందు, విరగగొట్టబడే మార్గమే అధికారం కలిగి ఉండే మార్గం అని దేవుడు నాకు చూపించాడు. నేను దీన్ని నా జీవితాంతం మరచిపోకూడదని అనుకుంటున్నాను. వారు ఇంకా యౌవన వయస్సులో ఉన్నప్పుడే ఈ పాఠం నేర్చుకొనమని నేను ప్రత్యేకంగా యౌవనస్తులను ప్రోత్సహించాలను కుంటున్నాను.

రెండవ అవసరం దేవుని వాగ్దానాలలో సజీవ విశ్వాసం కలిగి ఉండటం.

దేవుడు ఐగుప్తులోని ఇశ్రాయేలీయుల పెద్దలకు రెండు వాగ్దానాలు చేశాడు: "నేను మిమ్మల్ని (1) ఐగుప్తు దేశం నుండి (2) కానాను దేశంలోకి తీసుకువస్తాను" (నిర్గమ 3:17). మీరు గమనించినట్లయితే, అక్కడ రెండు వాగ్దానాలు ఉన్నాయి. కానీ మొదటిది మాత్రమే నెరవేరింది. రెండవది నెరవేరలేదు. ఆ పెద్దలు ఎవరూ కనానులోకి ప్రవేశించలేదు - ఎందుకంటే కనానులోకి ప్రవేశించే సమయం వచ్చినప్పుడు వారు విశ్వాసంతో స్పందించలేదు (సంఖ్యా.కా. 13). మనం విశ్వాసంతో ప్రతిస్పందించే వరకు దేవుని వాగ్దానాలు నెరవేరవు. దేవుని వాగ్దానం మరియు మన విశ్వాసం రెండు విద్యుత్ తీగలలాంటివి. అవి ఒకదానికొకటి తాకినప్పుడు మాత్రమే (ఎలక్ట్రిక్ స్విచ్‌లో వలె) తీగల ద్వారా విద్యుత్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. మీరు దేవుని వాగ్దానాన్ని గురించి విని దానిని అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు విశ్వాసంతో ప్రతిస్పందించి, "అవును, అది నా జీవితంలో నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను" అని చెప్పినప్పుడు మాత్రమే వాగ్దానం నెరవేరుతుంది. కానాను సరిహద్దుల వద్ద, యెహోషువ మరియు కాలేబు మాత్రమే దేవుని వాగ్దానాన్ని విశ్వసించారు, కాబట్టి వారు మాత్రమే వాగ్దానం చేయబడిన దేశంలోకి ప్రవేశించారు. మనం అదే విశ్వాసాన్ని కలిగి ఉండి, కొత్త సంవత్సరంలో వాగ్దానం చేయబడిన జయించు దేశంలో నిరంతరం జీవిద్దాం.

మీరందరు, ఒక గొప్ప విరగగొట్టబడే మరియు దేవునిపై గొప్ప విశ్వాసం కలిగి ఉండే అధికమైన ఆశీర్వాద సంవత్సరాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము.