WFTW Body: 

క్రీస్తుయొక్క శరీరములో దేవుడు ఏర్పరచిన భిన్నత్వము ఉన్నది. మనలో ఉన్న వ్యత్యాసమైన స్వభావాలను మరియు వరములను, లోకమునకు సరితూకము కలిగిన క్రీస్తు యొక్క ప్రతిరూపమును చూపుటకు దేవుడు ఉపయోగించును. మనలో ఒక్కొక్కరము వికృతమైన మరియు సరితూకములేని క్రీస్తు యొక్క రూపమును మాత్రమే చూపగలము. ఒంటరియైన ఏ వ్యక్తి యొక్క పరిచర్యయైనను సరితూకములేని క్రైస్తవులను ఉత్పత్తి చేయును. శరీరములో వ్యత్యాసమైన ప్రాధాన్యతలను మరియు స్వభావములను కలిగిన యితరులు ఉండుటనుబట్టి మనమెంత కృతజ్ఞులమై యుండవలెను. ఉదాహరణకు, ఇద్దరు సహోదరులు ఒకే గుంపులో నుండిన విశ్వాసులకు దేవుని యొక్క వాక్యమును పరిచర్య చేయుచున్నట్లయితే మరియు అందులో ఒకరు "మీరు పరిశుద్ధాత్మచేత నింపబడియున్నారని ఖచ్చితముగా అనుకొనవద్దు, ఎందుకనగా మిమ్ములను మీరు మోసగించుకొనవచ్చు" అని వక్కాణించి చెప్పవచ్చును. ఇంకొక సహోదరుడు "మీరు పరిశుద్ధాత్మచేత నింపబడియున్నారని నిశ్చయత కలిగియుండుడి" అని నొక్కి చెప్పవచ్చును. పైకి కనబడుటకు వారు ఒకరినికరు విభేదించుకొనుచున్నట్లు కనబడవచ్చును. కాని రెండు విధముల నొక్కి చెప్పబడిన బోధ అవసరమైయున్నది. దాని వలననే వారి పరిచర్యలు ఒకదాని నొకటి సంపూర్ణము చేసుకొనునవిగా ఉన్నవి.

క్రీస్తుయొక్క శరీరములో, మనకు కాల్వనిస్టులు మరియు ఆర్మేనియన్లు కలసి పనిచేయుచు ఒక్కొక్కరు వారి యొక్క ప్రత్యేకమైన వివరణలను తీసుకువచ్చుదురు. అవి రెండూ కూడా బైబిలులో ఉన్నవే. చార్లెస్ సిమెయోను అనే ఆయన "ఏ ఒక్క వివరణలోను సత్యమంతయు లేదు కాని ఈ రెండు వివరణలలోను సత్యము ఉన్నది" అని చెప్పినట్లుగా ఉన్నది. కనుక, మనకు రెండు వివరణలలో నుండిన సత్యమును చెప్పువారు కావలసియున్నారు.

అలాగే, కలుపుగోలుగా ఉండువారు మరియు సిగ్గుపడువారికి కూడా చోటు ఉన్నది. వ్యత్యాసమైన స్వభావములు ఒకదానికొకటి సంపూర్ణము చేసుకొనేటట్లుగా ఉండును. కొందరు అతి జాగ్రత్తగా ఉండి, ముందు వెనుక ఎంతో ఆలోచించి లాభనష్టాలు బేరీజు వేసుకొనకుండా, ముందుకు వెళ్ళాలా వద్దా అనేది ఎంతో సమయము ఆలోచించకుండా ఎప్పుడూ అడుగు ముందుకు వెయ్యరు. మరికొందరు అన్నింటిని ఎంతో తేలికగా తీసుకొనువారైయుండి, పర్యవసానములు గూర్చి లోతుగా ఆలోచించకుండా ఆసక్తితో ముందుకు అడుగువేయువారుగా ఉందురు. ఇటువంటి రెండు (మరియు ఇతరమైన) విధములైన వ్యక్తిత్వములు క్రీస్తు శరీరములో ఉండుటచేత, అందులో ఒక సమతుల్యత ఉన్నది. శరీరములో కేవలము సంకోచించువారు, లోతుగా ఆలోచించువారు ఉండినట్లయితే ప్రగతి చాలా నెమ్మదిగా ఉండును. దానికి వ్యతిరేకముగా, శరీరములో కేవలము అనాలోచితముగా ముందుకు ఉరికే వారుండినట్లయితే, అక్కడ ఎన్నో పూర్తికాని పథకములు ఉండును.

ప్రతి స్వభావముకు బలములు మరియు బలహీనతలు ఉండును. వివిధ రకములైన జనులు వివిధ రకములైన స్వభావములతో ఉండిన ఉద్రేకములతో కలిసి క్రైస్తవులుగా పనిచేసినప్పుడు వారు లోకమునకు మరి ఎక్కువ సంపూర్ణమైన మరియు ఎక్కువ ఖచ్చితమైన క్రీస్తు యొక్క ప్రతిరూపమును చూపగలరు. కనుక శరీరములో ఉన్నవారందరిని మనవలె ఉండవలెనని మార్చుటకు ప్రయత్నిస్తూ మనము సమయమును వృధా చేసుకొనకూడదు. ప్రతివారు వారు ఎట్లుండునో అట్లుండునట్లు మనము అనుమతించవలెను. ఏ విధముగా మన బలము ఇతరులయొక్క బలహీనతలో సహయముగా ఉండునో అనుదానిపై మనము దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరము ఉన్నది. అదేవిధంగా అతడి బలము మన యొక్క బలహీనతలో మనకు ఆధారమగును.

పేతురు, యోహానులు (వ్యత్యాసమైన వ్యక్తిత్వములు కలిగినవారు) కలిసి పనిచేయుట ద్వారా వారు ఎవరికి వారుగా నుండి పనిచేసిన దానికంటే ఎంతో ఎక్కువైన మహిమను దేవునికి తెచ్చిరి. పౌలు మరియు తిమోతి వారి స్వభావములలో కొట్టవచ్చినట్లుండే వ్యత్యాసములుండినా వారు శక్తివంతమైన జట్టుగా ఉండి సువార్త కొరకు కలసి ప్రయాసపడిరి.

సంఘములో మేధావులు మరియు సామాన్యమైన తెలువితేటలు కలవారు కూడా యుందురు. సహజముగానే, దేవుని గూర్చిన సత్యమును బోధించుతీరులో తేడా యుండును. కాని వారిలో ఎవరు కూడా వేరొకరిని తక్కువచేయుటకాని లేక విమర్శించుటకాని చేయలేరు, ఎందుకనగా వారిరువురు లోకములో ఉన్న తెలివిగలవారికి, తత్వవేత్తలకు మరియు గృహిణులకు, విద్యార్ధులకు మరియు రైతులకు మొదలైన వారికి సువార్త ప్రకటించుటకు శరీరమునకు అవసరమైయున్నారు. దేవునికి ప్రజ్ఞావంతుడు మరియు మేధావియైన పౌలు మరియు విద్యలేని పామరులై చేపలు పట్టు పేతురు కూడా ఆయన పని కొరకు కావలసియుండెను. వారు ఒకే సువార్తను వ్యత్యాసమైన రీతిలో ప్రకటించువారుగా ఉండిరి, కాని వారు ఒక్కొక్కరు ప్రత్యేకమైన పాత్రను పోషించవలసి యుండెను మరియు వారిలో ఏ ఒక్కరు దేవుడు ఇంకొకరి ద్వారా నెరవేర్చిన పనిని, అదే విధముగా నెరవేర్చలేక పోయియుందురు.

క్రైస్తవుడుగా మారుట ఒక మానవుని యొక్క తెలివితేటలను మార్పు చేయదు. అదే విధముగా అతడి యొక్క సాంఘీక స్థాయిని మారునట్లు బలవంతము చేయదు. క్రీస్తులో సాంఘీక అసమానత్వములు పట్టింపు లేనివైనా, సువార్త, సమాజములో నుండిన వైవిధ్యమైన స్వభావమును ఈ భూమిపై తొలగించదు. దేవునికి సంపన్నుడైన ఫిలోమోను కావలసియుండెను. అదే విధముగా ఫిలోమోను యింటిలో దాసుడైన ఒనేసిమసు కూడా కావలసియుండెను. వారి సామాజిక స్థాయిలు జీవన ప్రమాణములు మార్పు చెందలేదు కాని వారిలో ఒక్కొక్కరు క్రీస్తు శరీరము కొరకు, వేరొకరు ఎప్పుడూ చేయలేని ప్రత్యేకమైన పనిని చేయవలసియుండెను. కనుక వారు సువార్తలో కలసి ప్రయాసపడవలసియుండెను.

క్రీస్తు శరీరములో ఒక ఫ్యాక్టరీలో నుండి బయటకు వచ్చే మోటారు కార్లవలె ప్రతి విషయములో ఒకే విధముగా ఉండే ప్రజలుగా ఉండవలెనని దేవుడు ఎప్పుడూ ఉద్దేశించలేదు. అట్లు కాదు. శరీరముయొక్క పరిచర్య తన యొక్క వైవిధ్యమైన అవయవములపై ఆధారపడి యుండును. అన్ని ఒకే విధముగా నుండినట్లయితే అక్కడ స్తబ్ధత మరియు ఆత్మీయమరణము యుండును.

చివరకు మనము ఒకరితో ఒకరు అంగీకరించని విషయములు కూడా మన యొక్క సహవాసము లోతుగా వెళ్ళుటకు ఉపయోగపడి మనలను ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించును. సామెతలు 27:17 "ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును" అని చెప్పుచున్నది. ఇనుము ఒక దానితో ఒకటి రాపిడియైనప్పుడు, అక్కడ నిప్పు రవ్వలు వచ్చును, కాని అట్లు రెండు ఇనుప ముక్కలు పదునగును. ఆ విధముగానే ఇద్దరు "ఉక్కు మనుష్యులు" ఘర్షణపడుటకు బదులు ఒకరినొకరు పదును చేసుకొనవచ్చును. కొన్నిసార్లు వ్యత్యాసమైన స్వభావములు గల ఇద్దరిని దేవుడు ఆయన పనిలో కలిపియుంచును. వారు కలిసి పనిచేయుదురు, వారి మధ్యలో నిప్పురవ్వలు ఎగురవచ్చును, కాని అది వారిని పదును చేయుటకు దేవుడు ఉద్దేశించిన పద్దతి కావచ్చును. ఒకడు ఇనుమువలె ఉండినట్లయితే, ఇంకొకరు మట్టివలె ఉండినట్లయితే, అక్కడ నిప్పురవ్వలు ఉండవు మరియు పదునగుట కూడా ఉండదు. దానికి బదులు ఆ మట్టి ముద్దపై ఇనుము యొక్క ముద్రపడును. అది ఒక బలమైన వ్యక్తిత్వముండిన వారి అభిప్రాయము బలహీన వ్యక్తిత్వముండిన వానిపై బలవంతముగా ముద్రింపబడును. ఒకరి యొక్క అభిప్రాయములు ఇంకొకరిపై ముద్రించవలెననేది దేవుని ఉద్దేశ్యము కాదు, కాని వారిరువురు ఒకరి నుండి మరియొకరు నేర్చుకొనవలెననేది ఆయన ఉద్దేశ్యమైయున్నది. మనము అంగీకారమునకు రాలేకపోవచ్చును. కాని మనమింకను ఐక్యత కలిగియుండవచ్చును. అయినప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకొనవచ్చును. ఇంకా చెప్పవలెనంటే, ఒకరినొకరు ఇంతకు ముందుకంటే ఇంకా లోతుగా ప్రేమించుకొనచ్చును.