పాత నిబంధనలో, "కంటికి కన్ను, పంటికి పన్ను" అని ధర్మశాస్త్రం బోధించింది. ఇది నిర్గమకాండము 21, లేవీయకాండము 24 మరియు ద్వితీయోపదేశకాండము 19 లో దేవుడు ఇచ్చిన నియమం. ఎవరైనా మీ కన్ను తీసివేస్తే మీరు వారి కన్ను తీయాలని దేవుడు చెప్పడం లేదు. ఆయన చెప్పేది ఏమిటంటే, మీయొక్క ఒక కన్ను మాత్రమే తీసివేయబడితే వారి రెండు కళ్ళను తీయకండి. దాని ఉద్దేశ్యం, మీరు అపరాధిని క్షమించి అతన్ని విడిచిపెట్టవచ్చు మరియు అతని కళ్ళలో దేనినీ తీయవద్దనేదే. అదే ఉత్తమమైన మార్గం. దేవుడు "కంటికి కన్ను, పంటికి పన్ను" అని చెప్పడం ద్వారా శిక్షను పరిమితం చేస్తున్నాడు.
కానీ యేసు ప్రమాణాన్ని మరింత ఉన్నతంగా ఎత్తి, "నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము. ఎవడైన నీమీద వ్యాజ్యెము వేసి నీ అంగీ తీసికొనగోరినయెడల వానికి నీ పైవస్త్రము కూడ ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లుము" (మత్తయి 5:39-41). రోమా సైనికులు కొన్నిసార్లు తమ బానిసలుగా ఉన్న యూదా ప్రజలను వారి సామాను మరియు సైనిక సామగ్రిని ఒక మైలు దూరం తీసుకెళ్లమని బలవంతం చేసేవారు. యూదులు బానిసలు కాబట్టి వారు అలా చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితులలో మనం ఆ వ్యక్తితో రెండు మైళ్ళు వెళ్ళాలని, దాని గురించి అతనితో పోరాడకూడదని, మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వాలని మరియు మీ నుండి అప్పు తీసుకోవాలనుకునే వ్యక్తి నుండి దూరంగా ఉండకూడదని యేసు మనకు చెబుతున్నాడు.
ఈ మాటలను అవి మాట్లాడిన స్ఫూర్తితో మనం తీసుకోవాలి. యేసు ఏమని అర్థం వచ్చే విధంగా చెప్తున్నాడో మనం ఖచ్చితంగా చూడాలి. ఆయన మనల్ని కాళ్ళుతుడుచుకునే చాపలలా ఉండమని చెబుతున్నాడా? ప్రజలు తమకు నచ్చినది చేయనివ్వాలా? అది జరగకూడదు. మీరు లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడల్లా, యేసుక్రీస్తు ఉదాహరణను చూడండి - ఎందుకంటే ఆయన శరీరధారియైన వాక్యం. పాత నిబంధనలో, దానిలోని ప్రతి చిన్న చిన్న పదాన్ని వివరించడానికి ధర్మశాస్త్రాన్ని పరిశీలించే శాస్త్రులు ఉన్నారు. కొత్త నిబంధనలో, మనం యేసును చూసినంతగా వచనాలను విశ్లేషించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఇప్పుడు ఆయన ఉదాహరణ ఉంది.
"ఎవరైనా నీ కుడి చెంప మీద కొడితే మరో చెంపను తిప్పండి" అని యేసు చెప్పడంలో అర్థం ఏమిటి? యేసు సిలువ వేయబడటానికి ముందు విచారణలో ప్రధాన యాజకుల ముందు నిలబడి ఉన్నప్పుడు, ఆయనను చెంపమీద కొట్టారు ఆయన మరో చెంపను తిప్పలేదు. యోహాను 18:23లో ఆయన ఇలా అన్నాడు, "నేను సరైనది మాట్లాడి ఉంటే, మీరు నన్ను ఎందుకు కొట్టారు?" వారు దానికి ప్రతిస్పందించలేదు (వారు బహుశా ఆయనను మళ్ళీ కొట్టి ఉండవచ్చు మరియు ఆయన తిరిగి పోరాడలేదు). వారు ఆయనను కొట్టినప్పుడు, ఆయన తన మరో చెంపను కూడా కొట్టమని చూపలేదు. కాబట్టి, క్రీస్తు చెబుతున్న దాని సారాంశాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే యేసు తాను బోధించిన దానిని తానే పాటించలేదని ఆయనను నిందించాల్సి ఉంటుంది.
ఇక్కడ సూత్రం ఏమిటంటే: నేను ప్రతీకారం తీర్చుకోవడాన్ని కోరుకోను; నాకు జరిగిన దానికి నేను ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించను. ఎవరైనా నన్ను దెయ్యం అని పిలిస్తే, నేను ఆ వ్యక్తిని దెయ్యం అని పిలవను. నన్ను చెంపదెబ్బ కొడితే, నేను తిరిగి చెంపదెబ్బ కొట్టను. నేను నెమ్మదిగా ఉండి, దేవుడు నన్ను మోసం చేయబడకుండా కాపాడతాడని నమ్ముతాను.
ఎవరైనా మీ చొక్కా తీసుకోవడానికి కోర్టులో దావా వేస్తే, మీ కోటు కూడా ఇవ్వండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఉదాహరణకు, ఎవరైనా అన్యాయంగా అబద్ధం చెప్పి, మీ స్వంత ఆస్తి తన ఆస్తి అని చెప్పి మీపై దావా వేస్తే - బహుశా అతను కోర్టులో కొన్ని తప్పుడు పత్రాలు సంపాదించి, మీ ఇంటిని మీ నుండి లాక్కోవాలనుకుంటే - మీరు ఏమి చేయాలి? మీరు అతనికి మీ ఇంటిని మరియు మీ మరొక ఇంటిని కూడా ఇవ్వాలా? అర్థం అదేనా?
యేసు ఉద్దేశ్యం అది కాదు. మళ్ళీ, మనం దాని వెనుక ఉన్న ఆత్మను అర్థం చేసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని ఒక మైలు వెళ్ళమని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. మరో మాటలో చెప్పాలంటే, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేయమని బలవంతం చేస్తే, మీరు దాని స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. మన నుండి అప్పు తీసుకోవాలనుకునే ఎవరినీ వెనక్కు పంపవద్దని కూడా యేసు మనకు ఉపదేశిస్తున్నాడు. మీ దగ్గర అప్పు తీసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ మీరు డబ్బు ఇవ్వాలని ఆయన చెబుతున్నాడా? ఇక్కడ భారతదేశంలో, మీరు ఒకసారి ఎవరికైనా డబ్బు ఇస్తే, ఎవరికైనా స్వేచ్ఛగా ఇచ్చే వ్యక్తిగా మీకు పేరు వస్తే, మీరు త్వరలోనే దివాలా తీస్తారు!
ఈ మాటల సారాంశాన్ని మీరు అర్థం చేసుకోకుండా వాటిని అక్షరాలా తీసుకుంటే, మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. ఆయన గ్రుడ్డివారుగా లేదా చేతులు నరికివేయబడిన వాడిలా ఉండాలని మనకు సూచించిన విధంగా, యేసు మనకు పాపం పట్ల తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలని బోధిస్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకోవలసిన స్ఫూర్తి అదే: ప్రతీకారం తీర్చుకోవద్దు, అలుసుగా తీసుకొనబడుటకు సిద్ధంగా ఉండండి మరియు నీకు నీవు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి; కానీ దాని అర్థం నాకు ఎటువంటి హక్కులు లేవని కాదు.
బస్ డ్రైవర్‌గా పనిచేసిన ఒక సోదరుడు ఒకసారి చర్చి సమావేశంలో సాక్ష్యమిస్తూ, తాను వీధిలో వెళుతుండగా, కొన్నిసార్లు రాత్రిపూట తన కళ్ళకు గుడ్డితనం కలిగించే మెరుస్తున్న హెడ్‌లైట్‌లతో ఎదురుగా ఉన్న కారులో ఎవరో ఒకరు తన వైపు రావడం చూస్తానని చెప్పాడు. కారు వ్యతిరేఖ దిశలో వస్తున్నప్పుడు వారు తమ లైట్లను డిమ్ చేయాలి, కానీ ఆ వ్యక్తులు అలా చేయరు. వారి లైట్లు అతని కళ్ళకు గుడ్డితనం కలిగిస్తున్నందున, తన బస్సు హెడ్‌లైట్‌లను కూడా వారి వైపు మరింత ప్రకాశవంతంగా చూపించాలని, ఆ డ్రైవర్ కళ్ళు మూసుకునే విధంగా చేసి అతనికి పాఠం నేర్పించాలని అతను భావించాడు. అతను అకస్మాత్తుగా తాను క్రైస్తవుడని మరియు ప్రతీకారం తీర్చుకోకూడదని గ్రహించాడు మరియు అలా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ సోదరుడు ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏమిటో ప్రత్యక్షతను పొందుటను గమనించండి: తాను బాధపడిన విధంగ మరొక వ్యక్తిని బాధపెట్టడం!
యేసు బోధించిన సూత్రాన్ని నేను అర్థం చేసుకుంటే, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎవరో తన హెడ్‌లైట్లు నా కళ్ళలోకి మెరుపులా పడటానికి అనుమతిస్తున్నప్పుడు నేను ఆ సూత్రం యొక్క అనువర్తనాన్ని కనుగొంటాను. ఈ పరిస్థితి లేఖనంలో ఎక్కడా వ్రాయబడకపోవచ్చు, కానీ నేను సూత్రాలను అర్థం చేసుకుని మరియు నా సమయం, నా డబ్బు మరియు నా శక్తి ప్రధానంగా ప్రభువుకు చెందినవని గుర్తించి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటాను. నేను మనుషుల బానిసను కాదు మరియు ప్రతి ఒక్కరికి నన్ను వారి బానిసగా చేసుకోవడానికి నేను అనుమతించను. నేను ప్రధానంగా ప్రభువు బానిసను మరియు నేను మనుషుల బానిసను కాను.
కాబట్టి నేను దానిని దృష్టిలో ఉంచుకుంటే, నేను ఈ సూత్రాలను అర్థం చేసుకుంటాను: నేను ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవాలనుకోను, ఆ వ్యక్తి నాతో ప్రవర్తించిన విధంగా నేను ఎప్పుడూ వ్యవహరించాలనుకోను, మరియు అతను నాతో మాట్లాడిన విధంగా నేను అతనితో మాట్లాడ కూడదనుకుంటాను. నేను లొంగిపోవాలనుకుంటాను, నేను దయతో ఉండాలనుకుంటాను మరియు నా హక్కులను వదులుకోవాలనుకుంటాను.