WFTW Body: 

మనము సంఖ్యాకాండము 22-24 అధ్యాయములలో బిలాము గురించి చదువుతాము. ఇది అనేక విషయాలు కలిగియున్న ముఖ్యమైన వాక్యభాగము. రాజైన బాలాకు ప్రవక్తయైన బిలాము యొద్దకు వచ్చి ఇశ్రాయేలును శపించమని ఆహ్వానించినప్పుడు బిలాము దేవుని చిత్తాన్ని వెదకెను. వెళ్లవద్దని దేవుడు బిలాముతో స్పష్టముగా చెప్పాడు. అతడు వస్తే ఇంకా ఎక్కువ డబ్బును ఇంకా ఎక్కువ ఘనతను ఇస్తానని రాజు బిలాముతో చెప్పాడు. మరలా దేవుని చిత్తాన్ని వెదకుతానని బిలాము చెప్పాడు. ఆదినుండే కలుగుబోవు వాటిని యెరిగియున్న దేవుడు అప్పటికే అతనిని వెళ్లవద్దని చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని రెండవసారి వెదుకవలసిన అవసరమేమిటి? కాని డబ్బును, ఘనతను పొందాలని అతడు బహుగా ఆశించెను. దుర్నీతి వలన కలుగు బహుమానమును బిలాము ప్రేమించెనని బైబిలు చెప్పుచున్నది (2 పేతురు 2:15).

నీవు అటువంటి పరిస్థితులను ఎదుర్కొవచ్చును. నీవు దేవుని చిత్తాన్ని వెదకినప్పుడు దేవుడు నిన్నొక ప్రదేశానికి వెళ్లవద్దని నీ ఆత్మతో చెప్పడాన్ని నీవు గ్రహిస్తావు. కాని అక్కడ నీకు వచ్చే జీతము చాలా ఆకర్షణీయముగా కనిపించి మరలా దేవుని చిత్తాన్ని వెదకడానికి శోధింపబడతావు. నీవు భవిష్యత్తులో ఇటువంటి శోధనను ఎదుర్కొన్నప్పుడు బిలామును గుర్తుంచుకో. జీతము ఆకర్షణీయముగా ఉన్నది కాబట్టి ఎక్కువ ఘనత వస్తుంది కాబట్టి దేవుడు తన మనసును మార్చుకోడు. ఒక వ్యక్తి ఒక దారిలో వెళ్లాలనుకోవడం దేవుడు చూచినప్పుడు దేవుడతనిని ఆపడు. అతనిని వెళ్లనిస్తాడు. అందుకనే బిలాము దేవునిని రెండవసారి అడిగినప్పుడు వెళ్లమని అతనితో చెప్పాడు. అది దేవుని పరిపూర్ణ చిత్తము కాదు. ఆయన బిలాము చిత్తాన్ని కాదని అతనిని ఒక మరమనిషిగా చేయలేదు. బిలాము నిజంగా వెళ్లాలనుకున్నాడని ఆయన చూచాడు. గనుక వెళ్లమని చెప్పాడు. ఇది తప్పిపోయిన కుమారుని తండ్రి అతనిని దూరదేశమునకు వెళ్లుటకు అనుమతించినట్లు ఉన్నది. దేవుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఆయన మన సొంత చిత్తాన్ని త్రొక్కివేయడు.

అయినప్పటికీ బిలామును ఆపడానికి దేవుడు తన దూతను పంపించాడు. బిలాము దూతను చూడలేకపోయెనుగాని అతని గాడిద చూడగలిగెను. దీని నుండి మనమేమి పాఠం నేర్చుకోగలము? ఒక మనిషి ధనాశచేత గ్రుడ్డివాడైనప్పుడు ఒక గాడిద కూడా ఆత్మీయవాస్తవాలను అతని కంటే స్పష్టంగా చూడగలిగింది. బిలాము డబ్బును ప్రేమించెను గనుక చూడలేకపోయెను. బిలాము తన మీదకి దేవుని యొక్క ఆత్మను రావడాన్ని అనుభవించిన వ్యక్తి మరియు బిలాము క్రీస్తు రాకడను గూర్చి ప్రవచించాడు (సంఖ్యాకాండము 24:2, 17). కాని డబ్బును ప్రేమించుటవలన బిలాము తనకున్నదంతము పోగొట్టుకున్నాడు.

గాడిద దాని యజమానితో మాట్లాడుటకు మొదలు పెట్టెను. బైబిలు గ్రంథంలో "భాషలతో మాట్లాడుట" ఇదే మొదటిసారి. ఒక గాడిద దానికి తెలియని భాషను నేర్చుకొని భాషను ధారాళముగా మాట్లాడటం. ఇది మానవాతీతమైనది ఇది నిస్సందేహంగా దేవుని యొద్దనుండి వచ్చినది. లేఖనాలలో మొదటి సారిగా భాషలతో మాట్లాడిన ఈ సంఘటననుండి భాషలతో మాట్లాడుట ఎవరినీ ఆత్మానుసారులుగా చేయదని నేర్చుకుందాము. ఎందుకంటే ఆ గాడిద భాషలతో మాట్లాడిన తరువాత కూడా, దాని నాలుక ద్వారా దేవుని యొక్క మానవాతీతమైన శక్తిని అనుభవించిన తరువాత కూడా అది బుద్ధిహీనమైన గాడిదగానే ఉండిపోయింది. ఈ విషయాన్ని ఎల్లప్పుడు గుర్తుంచుకొనుడి.