WFTW Body: 

గత కొన్ని వారాలుగా, మనం శిష్యత్వం యొక్క షరతులను చూస్తున్నాము. ఈ షరతులు బాప్తిస్మం యొక్క ముందస్తు అవసరాలు. మత్తయి 28:19లో ఉన్న గొప్పపనిని తిరిగి చూద్దాం, యేసు ఇలా అన్నాడు, "మీరు వారిని శిష్యులుగా చేసిన తర్వాత, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి."

మరో మాటలో చెప్పాలంటే, మనం ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చే ముందు, శిష్యత్వానికి సంబంధించిన షరతులను వారి ముందుంచాలి, "మీరు క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మేము మిమ్మల్ని ఆహ్వానించడం లేదు. కేవలం మీ పాపాలు క్షమించబడటానికి మాత్రమే రమ్మని మేము ఆహ్వానించడం లేదు. మీ జీవితానికి యేసును ప్రభువుగా చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, యేసును మీరు వారానికి ఒకసారి సందర్శించే వ్యక్తిగా కాదు, మీకు భర్తగా ఉండబోయే వ్యక్తిగా చేయుటకు ఆహ్వానిస్తున్నాము" అని చెప్పాలి.

ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు, ఆమె తన తల్లిదండ్రుల పేరును కూడా వదులుకుంటుంది. ఆమె తన భర్తతో పూర్తిగా ఏకమవుతుంది. ఆమె ఆ విధంగా ఉండాలి. ఇటువంటి సంబంధాన్నే, క్రీస్తు మనలో ప్రతి ఒక్కరితో కలిగి ఉండాలని కోరుతున్నాడు. శిష్యుడుగా ఉండటం అంటే ఇదే. "నేను నా భర్తతో వారానికి ఒక రోజు మాత్రమే గడపాలి" లేదా "నేను నా స్వంత జీవితాన్ని ఇలాగే కొనసాగించవచ్చు, ఎప్పుడో ఒకసారి నా భర్తను సందర్శించవచ్చు" అని భావించే ఒక స్త్రీ వివాహంలోకి ప్రవేశించకూడదు. ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తికి పూర్తిగా కట్టుబడి(నిబద్ధతతో) ఉండాలి అనే వాస్తవాన్ని ఆమె తప్పనిసరిగా తెలుసుకోవాలి.

సువార్త బోధలో కూడా మనం ఎవరికి బోధిస్తున్నామో, క్రైస్తవ జీవితానికి పూర్తి నిబద్ధత అవసరమని వారికి వివరించే విధానంలో స్పష్టత ఉండాలి. అంటే దాని అర్థం శిష్యరికం. అంటే దాని అర్థం ప్రభువును అనుసరించడం. అందుకు సిద్ధపడిన వారు బాప్తిస్మం పొందుటకు సిద్ధంగా ఉన్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అయ్యే వరకు మనం వేచి ఉండము, కానీ ఒక వ్యక్తికి శిష్యత్వం యొక్క షరతులు తప్పక అందించబడాలని మనం చెప్తాము. క్రీస్తును రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరించే ఈ షరతులకు అతను ఒప్పుకునప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట మనం అతనికి బాప్తిస్మం ఇస్తాము. అందుకే మనం బాప్తిస్మం ఇచ్చే ముందు ఒక వ్యక్తి ప్రభువును అనుసరించడానికి ఇష్టపడుతున్నాడో లేదో చూడటానికి మన సంఘాలలో వేచి ఉంటాము.

శ్రమలు ఉన్న దేశాల్లో లేదా క్రైస్తవులుగా ఉండటం ప్రజాదరణ పొందని దేశాల్లో, మనం చాలా కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తొలినాళ్లలో, ఒక యూదుడు క్రైస్తవుడిగా మారడం అద్భుతమైన త్యాగం (అది ఇప్పటికీ నిజం), అందుకే వారు ఒక వ్యక్తికి దాదాపు వెంటనే బాప్తిస్మం ఇచ్చారు (అపొస్తలుల కార్యాలలో మనం చూస్తున్నట్లుగా). ఒక విగ్రహారాధికుడు తన విగ్రహారాధనను విడిచిపెట్టి క్రైస్తవుడిగా మారడం అంటే వారి బంధువులచే పూర్తిగా వేరుచేయబడడం. ఆ విధంగా వారు శిష్యులుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవడం సులభం, అందువలన వారు చాలా త్వరగా బాప్తిస్మం తీసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో, హింస లేని దేశాల్లో, ఒక వ్యక్తి శిష్యత్వం యొక్క షరతులను అర్థం చేసుకున్నాడో లేదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అతను పరలోకానికి వెళ్లాలనుకుంటున్నాడు కాబట్టి అతను క్రీస్తును అంగీకరించి ఉండవచ్చు. శిష్యత్వం యొక్క షరతులు అతనికి చెప్పబడకపోవచ్చు, లేదా అతను వాటిని అర్థం చేసుకోకపోవచ్చు, లేదా అతను వాటిని అర్థం చేసుకున్నప్పటికీ, అతను శిష్యత్వం యొక్క షరతులను నెరవేర్చడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారికి బాప్తిస్మం ఇచ్చే హక్కు మనకు లేదు.

ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెనక్కి దిగజారవచ్చు -- అది వేరే సమస్య -- కానీ శిష్యత్వానికి సంబంధించిన షరతులు మొదట్లోనే ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. యేసు ఎప్పుడూ అలానే సత్యాన్ని ప్రకటించాడు. ఒక ధనవంతుడైన యౌవన అధికారి ఆయన వద్దకు వచ్చి, "నిత్యజీవానికి వారసుడగుటకు నేను ఏమి చేయాలి" అని అడిగినప్పుడు, ఆయన తనకు ఉన్నదంతా విడిచిపెట్టమని అతనికి చెప్పాడు. అతను అలా చేయడానికి ఇష్టపడక వెళ్ళిపోయినప్పుడు, ప్రభువు అతని వెంట వెళ్ళలేదు. సౌకర్యవంతంగా ఉంచుటకు ప్రభువు ఎప్పుడూ షరతులను తగ్గించడానికి ప్రయత్నించలేదు. అంచెలంచెలుగా రమ్మని కూడా అడగలేదు. ఆయన, "ఇది ఖచ్చితమైనది. నీవు నన్ను అనుసరించాలనుకుంటే, నీవు అన్నింటినీ వదులుకోవాలి" అని చెప్పాడు.

బాప్తిస్మం ముఖ్యమైనది, ఎందుకంటే, మనం రోమా 6లో చదివినట్లుగా, ఇది పాతస్వభావాన్ని(స్వయాన్ని) సమాధి చేయడానికి ప్రతీకగా ఉంది: నా పాత జీవన విధానం, అది ప్రాథమికంగా నా స్వంత ఇష్టాన్ని చేయడం, నాకు నచ్చినది చేయడం, నన్ను సంతోషపెట్టుకోవడం లేదా ఇతరులను సంతోషపెట్టాలని కోరుకోవడం. ఆ వ్యక్తి, నాలో నివసిస్తున్న ఆదాము అనే ఆ వ్యక్తి చనిపోయాడు. నేను సిలువపై క్రీస్తుతో నా స్థానం తీసుకున్నాను మరియు ఆ వ్యక్తి మరణించాడు. నేను దానిని అంగీకరించినప్పుడు, నేను బాప్తిస్మం పొందగలను. బాప్తిస్మపు నీటి నుండి బయటకు వస్తున్నప్పుడు, నేను ఇప్పుడు కొత్త వ్యక్తినని సాక్ష్యమిస్తున్నాను. అది బాప్తిస్మం లేదా ముంచుట యొక్క అర్థం. మారిన వ్యక్తి విషయంలో అది నిజం కాకపోతే, బాప్తిస్మం అర్థరహితం అవుతుంది.

మీరు చనిపోని వ్యక్తిని పాతిపెట్టలేరు మరియు బాప్తిస్మం పొందిన చాలా మంది చనిపోలేదు, ఎందుకంటే వారు తమకు తాము చనిపోవాలని నిర్ణయించుకోలేదు. బదులుగా, వారు ఒక ఆచారంగా నీటిలోకి వెళతారు. చాలామంది తల్లిదండ్రులు తమ సొంత గౌరవం కోసం బాప్తిస్మం తీసుకోవాలని తమ పిల్లలను కోరుతున్నారు. లేదా తమ పిల్లలను లోకంనుండి ఏదో ఒక విధంగా బాప్తిస్మం కాపాడుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. అలా జరుగదు.

బాప్తిస్మం అనేది ఒక వ్యక్తి ఇప్పటికే చేసిన ’తన స్వంత ఇష్టానికి చనిపోవడం’ అనే ఎంపిక యొక్క చిహ్నం మాత్రమే. అతను ఆ ఎంపికను చేసుకోకపోతే, అది అర్థం లేని ఆచారం అవుతుంది.