WFTW Body: 

ఎఫెసీ సంఘములో తిమోతి యౌవనస్తుడు అయియున్నాడు. మరియు ఆ సంఘములో పెద్దవారు కూడా ఉన్నారు. కాబట్టి పౌలు అతనితో "నీ యౌవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము" అని చెప్పాడు (1 తిమోతి 4:11). ఒక యౌవన బోధకుడు సంఘములోని పెద్దవారి చేత ముఖ్యముగా ధనవంతులు మరియు పలుకుబడి గల వారిద్వారా భయపెట్టబడవచ్చును. కాని నీవు వారికి బెదరక నీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, శ్రమలలో విశ్వాసము ద్వారాను, నీ జీవితములో పవిత్రత ద్వారాను మరియు ప్రతి విషయములోను వారికి మాదిరిగా యుండుము (1 తిమోతి 4:12). ఇది 1 తిమోతి 4:1-3కి విరుద్ధంగా ఉన్నది. అబద్ధ బోధకులు కేవలము బోధిస్తారు కాని నిజమైన బోధకులు జీవించి బోధిస్తారు. అబద్ధ బోధకులు కేవలము వేదాంతము చెప్తారు కాని నిజమైన బోధకులు వారి జీవితముల ద్వారా బోధిస్తారు. ఆ దినములలో బైబిలు లేదు కాబట్టి విశ్వాసులు బహిరంగంగా కలసి చదివేవారు (1 తిమోతి 4:13). కాబట్టి బైబిలు ఉన్న వ్యక్తి అందరికి వినబడేటట్లు బిగ్గరగా చదువుతాడు. ఈనాడు విశ్వాసులు తమ ఇంటివద్దనే చదువవచ్చును.

మంచి జీవితము మరియు వాక్యము తెలిసియుండుటయే గాక, మంచి మాదిరిగా యుండి వాక్యము చదవాలని పౌలు చెప్పుచున్నాడు (1 తిమోతి 4:12, 13). ఇది మంచిది. కాని ఆత్మవరములను నిర్లక్ష్యము చేయకూడదు (1 తిమోతి 4:14). అతడు ఆత్మీయ వరములు పొందునట్లు పౌలు హస్తనిక్షేపణ చేశాడు. ప్రభువును సేవించుటకు మనకు ఆత్మవరములు కూడా అవసరం. ప్రవచనా వరాన్ని ఆసక్తితో వెదకాలి (1 కొరంథీ 14:5). అనగా మనము మాట్లాడినప్పుడు అవి సూటిగా వినే వారి హృదయములోనికి వెళ్ళి నిష్ఫలముగా మరలక దేవునికి అనుకూలమైన దానిని నెరవేర్చును (యెషయా 55:11). ఆ విధముగా పరిచర్యను చేయుటకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. అది ప్రభువైన యేసుకు అవసరమైయుండెను మరియు ఎల్లప్పుడు మనకు కూడా అవసరం. దీనిని ఒక్కసారే మనము పొందుకొనము. మనము అభిషేకింపబడునట్లు ఎల్లప్పుడు ప్రార్థించాలి.

యౌవనస్తులకు: నీవు ప్రభువును సేవించుటకు 40 సంవత్సరముల వరకు కనిపెట్టాలని నీవు అనుకోవద్దు. నేను 19వ సంవత్సరమున క్రొత్తగా జన్మించి మరియు 21వ సంవత్సరములో బాప్తీస్మము తీసుకొన్నాను. వెంటనే నేను బోధించుట ఆరంభించాను. కాని నాకు తెలిసిన దానిలోనే అనగా క్రైస్తవ జీవితములోని 'అ, ఆ' లను గూర్చి బోధించాను. నేను ఎదిగేకొలది మరి ఎక్కువగా బోధించాను. 2వ తరగతి చదివిన విద్యార్థి, ఒకటవ తరగతి చదివే విద్యార్థికి బోధించగలడు. కాబట్టి నీవు పెద్దవాడవు అయ్యే వరకు వాక్యాన్ని బోధించుటకు వేచియుండవద్దు. నీవు రక్షణ పొందినప్పటి నుండి రక్షణ లేనివారికి బోధించవచ్చు. ఎల్లప్పుడు దేవుని వాక్యము పంచిపెట్టుటకు సిద్ధముగా ఉండి దానిని ఫలభరితముగా చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు ప్రార్థించాలి.

1 తిమోతి 4:14, 15లో వీటన్నిటిని మనస్కరించమని పౌలు, తిమోతితో చెప్పుచున్నాడు. ఒక వ్యాపారస్థుడు డబ్బు సంపాదించుట కొరకు నూతన వ్యాపారమును అభివృద్ధి చేసుకొనుటకును ఎంతో కష్టపడతాడు. నీకు క్రైస్తవ జీవితమును గూర్చి ఆసక్తి ఉన్నట్లయితే నీవు ఎక్కువ సమయాన్ని లేఖనాలను ధ్యానించి, ఆత్మవరములు పొందుట కొరకు ప్రార్థించి మరియు సమస్త అపవిత్రత నుండి నిన్ను నీవు పవిత్ర పరచుకొంటావు. వీటితో నింపబడమని మరొక తర్జుమాలో చెప్పబడింది (నీలో నింపబడుటకు బదులు అది నీలో ఇంకబడాలి) అవి నీలో ఇంకిన యెడల నీ అభివృద్ధి అందరికి తేటగా కనిపిస్తుంది.

"ఇంకుట" అనగా ఏమిటో నేను ఒక ఉదాహరణ చెపుతాను. ఒక కుటుంబము ఒక టి.వీ. కార్యక్రమము ప్రతిరోజు చూసినయెడల అది వారిలో ఇంకిపోతుంది. ఆ కుటుంబము ఆవిధముగా చూస్తున్నారని దొంగలు తెలుసుకొని నెమ్మదిగా ఆ ఇంటిలోనికి ప్రవేశించి వారు దొంగలించగలిగినదంతయు దొంగలిస్తారు. ఆ టి.వీ. కార్యక్రమము అయ్యే వరకు ఆ కుటుంబానికి ఆ విషయము తెలియదు.

అలాగే ఈ లోకములోని శోధనలచేత మనము ఆకర్షింపబడకుండునట్లు ప్రభువైన యేసుక్రీస్తు మరియు ఆయన వాక్యము మనలో ఇంకాలి. మరియు లోకస్థులు వెంబడించే అనేక విషయాల వెంట మనము పరుగెత్తము. క్రీస్తు వాక్యము నీలో ఇంకి నీలో భాగము అయినట్లయితే నీవు ఎల్లప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటావు. ప్రతి సంవత్సరము కొంచెము మంచి క్రైస్తవుడుగా మారుచూ మరియు మరియెక్కువ ఫలభరితమైన ప్రభువు యొక్క సేవకుడుగా మారగలవు.

1 తిమోతి 4:16లో రెండు విషయములను గూర్చి జాగ్రత్తపడుమని పౌలు తిమోతికి చెప్పుచున్నాడు: అతని జీవితము మరియు అతని బోధ. ఈ రెండింటిని మనము ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. మన జీవితము మరియు మన బోధ పవిత్రముగా ఉండాలి. "నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొనుము". మనం సంపూర్ణ రక్షణ పొందియున్నట్లయితే ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించగలము. దాని అర్థము ఏమిటి? ఒక పాపపు అలవాటునుండి నీవు రక్షింపబడని యెడల ఇతరులను దానిలోనుండి ఏవిధముగా రక్షణలోనికి నడిపించగలవు?. నీ అనుభవానికి మించి నీవు బోధించినట్లయితే నీవు వేషధారి అయియుంటావు మరియు దేవుడు కూడా నీ మాటలకు సాక్షముగా ఉండడు. వ్యాపారస్తులు తన వ్యాపారము గూర్చి ఆసక్తి కలిగియున్నట్లే, మనము కూడా క్రైస్తవ జీవితము గూర్చి ఆసక్తి కలిగియుండాలి. వారు పూర్ణ హృదయముతో లాభము సంపాదించాలని అనుకుంటారు. అలాగే మనము కూడా దేవుని కొరకు జీవించి, ఆయనను సేవించుటకు మనలను మనము ఆయనకు అప్పగించుకోవాలి.