WFTW Body: 

మనుష్యుడుగా ప్రభువైనయేసు ఈ భూమిమీద ఏ విధముగా జీవించారో దానిని ఇక్కడ ఒక వచనము చెప్పుచున్నది. "నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడి వారికంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను" (హెబ్రీ 1:9).

ప్రభువైనయేసు భూమిమీద జీవించినప్పుడు, మనుష్యులముగా మనకున్న పరిమితులన్నిటిలో జీవించాడు. కాబట్టి ఆయనకు అభిషేకం అవసరము. తండ్రియైన దేవునికి అభిషేకం అవసరములేదు. పరలోకంలో ఉన్నప్పుడు ప్రభువైనయేసుకు అభిషేకం అవసరములేదు. కాని ఆయన భూమిమీద నివసించినప్పుడు, మనకు మాదిరిగా ఉండుటకు ఆయన అభిషేకం పొందవలసియున్నది. తనతోడి వారి అందరికంటే ఎక్కువగా ఎందుకు దేవుడు ఆయనను ఆనందతైలము(సంతోషం)తో అభిషేకించాడు. ఎందుకనగా ఆయన నీతిని ప్రేమించి మరియు దుర్నీతిని ద్వేషించాడు. ఆయన పవిత్రతను ప్రేమించి మరియు పాపమును ద్వేషించాడు.

నీతిని ప్రేమించుటకును మరియు నీతిని జరిగించుటకును మధ్య తేడా ఉన్నది. విధేయతను ప్రేమించకుండానే ఒక బిడ్డ తన తండ్రికి లోబడవచ్చును. ప్రభువైనయేసు కేవలము నీతిని జరిగించలేదుగాని, ఆయన నీతిని ప్రేమించాడు. అలాగే ఆయన పాపమును కేవలం తప్పించుకోలేదుగాని ఆయన పాపమును ద్వేషించాడు.

ఈరోజులలో వ్యభిచారం ద్వారా ఎయిడ్స్ అనే మరణకరమైన వ్యాధిని కొందరు కలిగియున్నారు. కాబట్టి తమకు ఎయిడ్స్ వస్తుందనే భయములో అనేకులు వ్యభిచారం చేయుట లేదు. వారు ఆ పాపమును ద్వేషించుట లేదుకాని ఎయిడ్స్ వస్తుందని భయపడుతున్నారు. అలాగే అనేకులు దొంగతనం చేయవలెనని ఉన్నప్పటికిని, పట్టుబడతామేమో అనే భయంతో వారు దొంగలించరు. కాని వారు దానిని ద్వేషించుటలేదు. అదేవిధముగా నీవు పాపమును ద్వేషించనప్పటికిని నీవు దానిని చేయకుండ ఉండవచ్చును.

కాని నీవు ఆనందతైలాభిషేకంతో అభిషేకించబడాలని కోరినట్లయితే నీవు నీతిని ప్రేమించి మరియు పాపమును ద్వేషించాలి. ఈ కారణం చేతనే ఇతరులందరికంటే ఎంతో ఎక్కువగా ప్రభువైనయేసు అభిషేకించబడ్డాడు.

దేవునిలో పక్షపాతములేదు. ఒక మంచితండ్రి తన ఇతరపిల్లలకంటే తన పెద్ద కుమారునికి ఎక్కువుగా చేయడు. ఆయనలో పక్షపాతములేదు. తన పెద్దకుమారునికి తాను చేసినదంతయు తన ఇతరపిల్లల కొరకు కూడా చేస్తాడు. మన తండ్రియైన దేవుడు ఆ విధముగా ఉన్నాడు. అనేక సహోదరులలో ప్రభువైనయేసు మొదట పుట్టినవాడైయున్నాడు. క్రొత్తగా జన్మించిన మనమందరమును ఆయనకు తమ్ముళ్ళమైయున్నాము. ప్రభువైనయేసు అందరికంటే పెద్దకుమారుడు. తన పెద్దకుమారునికి చేసినదంతయు పక్షపాతము లేకుండా దేవుడు మనకు కూడా చేస్తాడు. ప్రభువైనయేసువలె మనం కూడా షరతులను నెరవేర్చినయెడల దేవుడు ఆయనకు చేసినదంతయు మనకు కూడా చేస్తాడు. క్రీస్తుయొక్క మానవతను ఎరుగుటద్వారా ఈ గొప్ప సత్యాన్ని మనము కనుగొనెదము.

ఆయన దేవుని కుమారుడైయున్నాడు కాబట్టి ప్రభువైనయేసు ఆనందతైలముతో అభిషేకింపిబడిన యెడల అది మనకు ప్రోత్సాహంగాగాని, సవాలుగాగాని ఉండదు. కాని ఆయన నీతిని ప్రేమించి మరియు దుర్నీతిని ద్వేషించుటవలన అభిషేకం పొందియున్నాడని మనము చదివినప్పుడు, మనము కూడా నీతిని ప్రేమించి మరియు పాపమును ద్వేషించినయెడల, మనము కూడా అభిషేకము పొందుదమనే నిరీక్షణ మనకు కలుగుచున్నది. కాబట్టి మనం ఈ విధముగా ప్రార్థించాలి, "ఓ యేసుప్రభువా, నేను నీతిని జరిగించుట మాత్రమేకాక దాని ప్రేమించునట్లును మరియు పాపము చేయకుండ తప్పించబడుటయేకాక దానిని ద్వేషించునట్లును పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో పని చేయుము" .

మన జీవితములలో మనము ఎంత ఎక్కువుగా నీతిని ప్రేమించి మరియు పాపమును ద్వేషిస్తామో, అంత ఎక్కువుగా పరిశుద్ధాత్మయొక్క సంతోషముతోను, ఆనందముతోను నింపబడెదదము. నీతితోను మరియు పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందముతోను అంతకంతకు మన హృదయంలో నింపబడుటయే దేవుని రాజ్యము అయిఉన్నది(రోమా 14:17). "అప్పుడు ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించుడి" అను ఆజ్ఞకు మనము లోబడెదము(ఫిలిప్పీ 4:4).