వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము శిష్యులు
WFTW Body: 

ఇతర మతములను గాని మరియు వారి విగ్రహములను గాని పేరు పెట్టి తీర్పు తీర్చకుండుటకు మనము జాగ్రత్తపడవలెను. వారిని గురించి హాస్యముగా మాట్లాడకూడదు. ఇటువంటి విషయములను గురించి ప్రభువైన యేసు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నిజమైన దేవుడు తమకు తెలుసని చెప్పుకొనే వేషధారణను గురించి ఆయన ఎక్కువగా మాట్లాడియున్నాడు.

అపొస్తలుడైన పౌలు యొక్క ఉదాహరణను గమనించెదము: అతడు ఎఫెసీ పట్టణములో రాజీపడకుండా సత్యమును బోధించినప్పుడు, ఆ పట్టణములో పెద్ద గందరగోళము జరిగినది. చివరకు ఆ పట్టణము యొక్క మేయరు ఇట్లన్నాడు, "ఇతడు మన దేవతను దూషింపను లేదు" (అపొ.కార్యములు 19:37). పౌలు క్రీస్తునే ప్రకటించాడు. కాని ఎఫెసులోని వారు ఆరాధించుచున్న అన్యదేవతలను అతడు ఖండించలేదు. క్రీస్తు వారి యొక్క పాపములనుండి రక్షించగలడని, వారికి అనుకూలమైన వర్తమానమును చెప్పెను. వారి దేవతలను మరియు వారి విగ్రహములను తీర్పుతీర్చుచు, వారికి ప్రతికూలముగా మాట్లాడలేదు. అది దైవిక జ్ఞానము. ఒక వ్యక్తి ఒకసారి క్రీస్తు యొద్దకు వచ్చినయెడల, తన యొక్క విగ్రహములనుండి ప్రభువే అతనిని విడిపించును.

ఇటువంటి జ్ఞానమును మనము కూడా కలిగియుండాలి. మనము ఏ మతమునైనను లేక వారి విశ్వాసములను లేక వారి ఆచారములనైనను తీర్పుతీర్చకూడదు. అది మన యొక్క సందేశము కాదు. మనము క్రీస్తును మాత్రమే ప్రకటించెదము అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువవేయబడి యున్నాడనియు, మృత్యుంజయుడై లేచియున్నాడనియు, ఈనాడు పరలోకములోను మరియు మనలోను జీవించుచున్నాడనియు మరియు లోకమునకు తీర్పు తీర్చుటకు త్వరలో రాబోవు చున్నాడనియు బోధించెదము. ఇదియే మన సందేశము మరియు ప్రతి ఒక్కరు వారి పాపములను ఒప్పుకొని మరియు ప్రభువైన క్రీస్తును ప్రభువుగాను మరియు రక్షకునిగాను వారిలోనికి స్వీకరించవలెనని వారిని పిలుచుచున్నాడు. ప్రతి ఒక్కరికి అనగా పిల్లలకు కూడా దీనినే ప్రకటించెదము. క్రీస్తును వారిలోనికి స్వీకరించమని మనము వారిని ఆహ్వానించెదము గాని వారిని బలవంతపెట్టము. దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యము ఇచ్చియున్నాడు. ప్రజలు వారి జీవితములోనికి నిజముగా క్రీస్తును స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు వారియొక్క పాపమును ఒప్పింపచేయును గనుక వారితో ఉన్న వ్యర్థమైన విషయములనుండి కాలము గడిచేకొద్ది కొద్దికొద్దిగా విడుదల పొందెదరు.

క్రీస్తు మాత్రమే లోకరక్షకుడని ప్రకటించుటకు మనము పిలువబడియున్నాము. మనము పాపమునకు విరోధముగా మాట్లాడుచు, మనలను మనము తీర్పు తీర్చుకొనుచు మరియు మన మధ్యలో ఉన్న వేషధారణను బహిర్గతము చేయాలి. జ్ఞానములేని కొందరు సహోదర సహోదరీలు, వారి మాటలలోను మరియు ప్రార్థనలలోను వేరే మతములను గూర్చి పేరు పెట్టి చెప్పెదరు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నుండవలెనని మనము ప్రజలను హెచ్చరించాలి. మనము ఏ మతము పేరైనను ఉపయోగించుకొనక, "క్రైస్తవేతరులు" అని చెప్పుట మంచిది. ఈ లోకమును తీర్పుతీర్చుటకు కాక ఈ లోకమును రక్షించుటకు మాత్రమే దేవుడు తన కుమారుని పంపియున్నాడు (యోహాను 3:17). మనము యేసు యొక్క మాదిరిని వెంబడించుటకు పిలువబడియున్నాము. గనుక మనము ఎల్లప్పుడు ఇతరులను రక్షించుటకొరకే ప్రయాసపడాలి కాని వారిని తీర్పు తీర్చకూడదు.