WFTW Body: 

"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని" (యోహాను 6:38). ప్రభువైన యేసు భూమి మీదకు ఎందుకు వచ్చెనో ఆయన మాటలలోనే ఇక్కడ చెప్పారు. మరియు ఈ ఒక్క వాక్యములోనే ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ప్రతి ఒక్క దినము ఎలా జీవించెనో వివరించబడియున్నది. ప్రభువైన యేసు నజరేతులో జీవించిన ముప్పై సంవత్సరాల కాలమును మరుగుపరచబడిన సంవత్సరాలుగా చెప్తుంటారు. అయితే ఇక్కడ ఆయన ఆ ముప్పై సంవత్సరాలలో ప్రతిదినము ఏమి చేసెనో యేసు మనతో చెప్పుచున్నారు. అది ఆయన తన స్వంత చిత్తమును ఉపేక్షించుకొని తన తండ్రి చిత్తాన్ని చేసారు.

యేసుప్రభువు శాశ్వతకాలము నుండి పరలోకములో తన తండ్రితో కలసి ఉన్నప్పుడు ఎప్పుడైనను ఆయన చిత్తమును ఉపేక్షించుకోవాల్సిన అవసరం లేకుండెను. ఎందుకంటే ఆయన చిత్తము మరియు తండ్రి చిత్తము ఒక్కటిగా నుండెను. కాని, ఆయన మన శరీరమువంటి శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ శరీరము ప్రతి విషయంలో తండ్రి చిత్తమునకు సంపూర్తిగా వ్యతిరేకమైన స్వంత చిత్తమును కలిగియుండెను. అందువలన యేసు తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తన స్వంత చిత్తమును అన్ని వేళలా ఉపేక్షించుకొనుట ఒక్కటే మార్గము. ఈ సిలువను యేసు తాను ఈ లోకములో జీవించినంత కాలము భరించెను. అది ఆయన స్వంత చిత్తమును సిలువవేయుట. మనము ఆయనను వెంబడించాలంటే, మనము కూడా దీనిని ప్రతిదినము భరించవలసియున్నదని ఇప్పుడు ఆయన మనలను అడుగుచున్నాడు. ఎల్లప్పుడు తన చిత్తమును ఉపేక్షించుకొనుట అనునది యేసును ఒక ఆత్మానుసారమైన వ్యక్తిగా చేసెను. మరియు మనము ఎల్లప్పుడు మన స్వంత చిత్తమును ఉపేక్షించుకొనుట అనునది మనలను కూడా ఆత్మానుసారమైన వారిగా చేయును.

ఆత్మానుసారముగా ఉండుట అనేది ఒక్కసారి దేవుని ఎదుర్కొనుట వలన వచ్చునది కాదు. అది మన స్వంత చిత్తమును వదులుకుంటూ మరియు దినదినము వారం తరువాత వారం మరియు సంవత్సరం తరువాత సంవత్సరం మానక ఎల్లప్పుడు దేవుని చిత్తమును చేయుట యొక్క ఫలితము. క్రీస్తులోనికి ఒకే దినమున మారిన ఇద్దరు సోదరులు పది సంవత్సరాల తరువాత ఎలా ఉన్నారనే విషయమును ఆలోచించండి. ఒకడు ఆత్మీయ వివేచన కలిగి పరిపక్వత చెందినవాడై సంఘములో దేవుని చేత బాధ్యత అప్పగింపబడిన వానిగా ఉన్నాడు మరియొకడు వివేచన లేకుండాయుండి, ఇంకా ఒక చిన్న బిడ్డ వలె, ఎల్లప్పుడు ఇతరులచే పోషింపబడుతు, ఇతరులచే ప్రోత్సాహము పొందువాడుగా ఉన్నాడు. వీరిరువురిలో అటువంటి వ్యత్యాసాన్ని తీసుకువచ్చినదేమిటి? దానికి జవాబు వారు గత పది సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రతి దినము వారు తీసుకొనిన చిన్న చిన్న నిర్ణయములే. వారు అలాగే కొనసాగినట్లయితే, మరొక పది సంవత్సరాల కాలంలో వారి మధ్య నున్న వ్యత్యాసము ఇంకా తేటపర్చబడుతుంది. మరియు నిత్యత్వములో వారి మహిమ యొక్క వ్యత్యాసము రెండువేల వాట్ల బల్బుకు ఐదు వాట్ల బల్బుకు మధ్య ఉన్న తేడాగా ఉండును. "మహిమను బట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదు" (1 కొరింథీ 15:41).

నీవు ఒక ఇంటిని దర్శించి అక్కడ మాట్లాడుచున్నప్పుడు, అక్కడలేని ఒక సహోదరుని (నీవు ఇష్టపడని వానిని) గురించి వ్యతిరేకముగా మాట్లాడటానికి నీవు శోధింపబడ్డావనుకో, నీవు ఏమి చేయుదువు? నీవు ఆ శోధనకు లోబడిపోయి అతడి గూర్చి కొండెములు మాట్లాడుదువా? లేక నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ నోటిని మూసుకొని ఉందువా? ఎవరు కూడా చెడు మాట్లాడినంత మాత్రాన దేవుడు వారిని కుష్టురోగముతోనో, క్యాన్సరు రోగముతోనో మొత్తలేదు. గనుక అటువంటి పాపము వారి జీవితాలను నాశనము చేయదని చాలా మంది అనుకొందురు. అయ్యో! కేవలము నిత్యత్వములోనే అనేకులైన సహోదరులు మరియు సహోదరీలు, ఏ విధముగా వారిని వారు సంతోషపర్చుకొన్న ప్రతిసారి, వారిని వారు మరికొంచెం నాశన పర్చుకొన్నారో తెలిసికొందురు. వారు భూమిపై వారి జీవితములను వ్యర్థపర్చుకొనిన విధానాన్ని బట్టి వారు విచారించెదరు.

ప్రభువైన యేసు కూడా అటువంటి పరిస్థితులలోనే నజరేతులో 30 సంవత్సరములు శోధింపబడెను. ఆ మరుగు పరచబడిన సంవత్సరాల గూర్చి ఆయన ఎప్పుడూ "తన్ను తాను సంతోషపరచుకొనలేదు" అని వ్రాయబడెను (రోమా 15:3). ఆయన ఎల్లప్పుడు తన్నుతాను ఉపేక్షించుకొనెను. ఆవిధముగా ఆయన తండ్రిని అన్ని సమయములయందు సంతోషపరచెను. ఒకరి జీవితములో తననుతాను సంతోషపరచుకొనుట అనేది అనేక విషయములలో జరుగును. ఉదాహరణకు తినుట విషయము. నీకు ఆకలి లేకపోయినా, కొంత డబ్బును రుచిగల పదార్థములు తినుటకొరకు ఖర్చుపెట్టు పరిస్థితిని ఆలోచించుము. అలా చేయుటలో నిజానికి పాపముకాని, తప్పుకాని లేదు. కాని అది ఒకవిధమైనా జీవితవిధానమును సూచిస్తున్నది. నీకు డబ్బు ఉంది కాబట్టి, నీకు అవసరము ఉన్నా లేకపోయినా నీకిష్టమైన వాటిని నీవు కొనుక్కొనెదవు. నిన్ను సంతోషపరచు వాటిని నీవు చేయుదువు. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళెదవు. నీవు ఆలస్యంగా నిద్ర పోవాలనుకుంటే నీవు ఆలస్యంగా నిద్రించెదవు. నీవు క్రమముగా క్రైస్తవకూటములకు వెళ్ళినా, నీ బైబిలు ప్రతి దినము చదివినా, అటువంటి జీవితము యొక్క చివరి ఫలితమేమిటి? నీవు నీ రక్షణను పోగొట్టుకొనకపోవచ్చును. కాని, దేవుడు ఆయన కొరకు జీవించటానికి నీకిచ్చిన ఒకే ఒక్క జీవితాన్ని నీవు తప్పనిసరిగా వ్యర్థపరచుకొందువు.

అయితే వేరొక సహోదరుడు వేరొక విధముగా జీవించును. అతడు తన శరీరమును క్రమశిక్షణ చేసుకొనుటకు నిర్ణయించుకొనును. అతడు ఆకలిగొననప్పుడు ఏమియు అనవసరముగా తినకూడదని నిర్ణయించుకొనును. ఎల్లప్పుడు తన కొరకు అనవసరమైన వస్తువులు కొనకూడదని నిర్ణయించుకొనును. అతడు ప్రతిదినము దేవునితో గడుపుటకై 15 నిమిషములు ముందుగా నిద్రనుండి లేవాలని నిర్ణయించుకొనును. ఎవరైనా తనతో కోపముగా మాట్లాడినపుడు వారితో నెమ్మదిగా మాట్లాడాలని నిర్ణయించుకొనును. అతడు ఎల్లప్పుడు ప్రేమ, మంచితనములోనే నిలచియుండాలని నిర్ణయించుకొనును. అతడు వార్తాపత్రికలలో తన శరీర కోర్కెలను రేకెత్తించే కొన్ని వార్తలను చదువకూడదని నిర్ణయించుకొనును. అతడు ప్రతి పరిస్థితిలో తనను తాను తగ్గించుకొని యుండుటకును మరియు తనను తాను సమర్థించుకొనకుండుటకును నిర్ణయించుకొనును. అతడు తనను లోకము వైపు ఆకర్షించే కొన్ని స్నేహాలను విడిచిపెట్టుటకు నిర్ణయించుకొనును. అదే సమయములో వీటన్నింటిని చేయువారిని చూచి వారిని తీర్పు తీర్చకూడదని అతడు నిర్ణయించుకొనును. ఎల్లప్పుడు తన స్వంత చిత్తమును(తనను సంతోషపెట్టువాటిని) ఉపేక్షించుకొనుట వలన దేవుని మాత్రమే సంతోషపెట్టవలెనన్న తన కోరికను బలపరచుకొనును. అతడు ఆ అనవసరమైన వస్తువులు కొనుట మానుట ద్వారా లేక నిద్రనుండి 15 నిమిషములు ముందు లేచుట ద్వారా లేక మానవపరమైన ఆత్మగౌరవాన్ని వదులుకొని క్షమాపణ అడుగుట ద్వారా ఏమి పోగొట్టుకొనెను? ఏమీలేదు. కాని, వాటి వలన అతడు పొందుకొన్నదేమిటో ఆలోచించండి. అటువంటి వ్యక్తి చిన్న విషయాలలో ఎల్లప్పుడు నమ్మకముగా ఉండుట ద్వారా కొద్ది సంవత్సరాల కాలములో నమ్మదగిన దైవజనుడిగా మారును. అది అతనికున్న బైబిలు జ్ఞానము వలన కాదుగాని తన్నుతాను సంతోషపెట్టుకొనక దేవుని సంతోషపరచవలెనని అతడు చిన్న విషయాలలో నమ్మకముగా నిర్ణయములను తీసుకొనుట వలననే. అందువలన బలహీన మనస్కులు కాకుండుడి. అన్ని సమయాల్లో దేవునిని సంతోషపరచువారిగా మీ మనస్సును అభ్యాసము చేయండి.

"అభ్యాసముచేత (వారి యిష్టాలను ఎన్నో సంవత్సరాల నుండి సరియైన దిశగా ఉంచుటకు అభ్యాసము చేసికొన్నవారు) మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నవారే" పరిపక్వత చెందిన క్రైస్తవులు (హెబ్రీ 5:14).