కొత్త నిబంధనలో ఇద్దరు వ్యక్తులు "నన్ను అనుసరించండి" అని చెప్పారు. పాత నిబంధన ప్రవక్త ఎవరూ నన్ను అనుసరించండి అని చెప్పలేరు. వారి జీవితం అనుసరించదగిన మాదిరి కాదు. యెషయా లేదా మోషే ఎవరూ లేరు. వారు "దేవుడు నా ద్వారా చెప్పేది వినండి. ఇవి దేవుని మాటలు" అని మాత్రమే ప్రకటించగలిగారు. కానీ వారిలో ఎవరూ "నా మాదిరిని అనుసరించండి" అని చెప్పలేకపోయారు. మోషే తన భార్యతో గొడవపడి తన కొడుకుకు సున్నతి చేయకుండా దేవునికి అవిధేయత చూపించాడు. వారందరూ వారి జీవితంలో మంచి మాదిరిలు కాదు, కానీ వారు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రకటించి, "యెహోవా సెలవిచ్చునదేమనగా" అని చెప్పగలిగారు. కానీ కొత్త నిబంధనలో, "యెహోవా సెలవిచ్చునదేమనగా" అని మనం చెప్పము. "దేవుడు ఏమి చెబుతున్నాడో వచ్చి వినండి" అని మనం చెప్పము.
కొత్త నిబంధనలో, "దేవుడు ఏమి చేశాడో వచ్చి చూడండి" అని మనం చెబుతాము, ఇది పాత నిబంధన ప్రవక్తలు "దేవుడు ఏమి చెబుతున్నాడో వచ్చి వినండి" అని చెప్పడానికి భిన్నంగా ఉంది. కొత్త నిబంధన ప్రవక్త ఈ విధంగా చెప్తాడు, "దేవుడు నా జీవితంలో ఏమి చేశాడో వచ్చి చూడండి. దేవుడు నా కుటుంబంలో ఏమి చేశాడో వచ్చి చూడండి. దేవుడు నాలో ఏమి చేశాడో వచ్చి చూడండి. ఇప్పుడు యేసు ఆజ్ఞాపించిన దానిని పాటించమని నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను, తద్వారా ఆయన మీ జీవితంలో కూడా అదే చేయగలడు. నన్ను అనుసరించండి".
బైబిల్లో "నన్ను వెంబడించండి (అనుసరించండి)" అని చెప్పిన మొదటి వ్యక్తి యేసే. తరువాత పౌలు, "నేను క్రీస్తును అనుసరించినట్లే నన్ను అనుసరించండి" అని చెప్పాడని మనం చదువుతాము (1 కొరింథీ 11:1). ఫిలిప్పీ 3:17లో అతను ఇలా అంటున్నాడు, "సహోదరులారా, నా మాదిరిని అనుసరించండి. నా మాదిరిని మాత్రమే కాదు, నాలా నడుస్తున్న ఇతరులను గమనించి, మీరు వారి మాదిరిని కూడా అనుసరించండి. ఎందుకంటే నేను క్రీస్తును అనుసరిస్తున్నాను. "క్రీస్తు 10,000 మీటర్ల ఎత్తైన పర్వతం పైకి ఎక్కిన వ్యక్తి లాంటివాడు. ఆయన శిఖరం చేరుకున్నాడు, మనం అనుసరిస్తున్నాము. పౌలు బహుశా మనకంటే ముందు ఉన్నాడు. బహుశా అతను 3,000-4,000 మీటర్లు ఎక్కి ఉండవచ్చు. అతను తన వెనుక ఉన్న వారితో, "నన్ను అనుసరించండి" అని అంటున్నాడు. బహుశా నేను 500 మీటర్లు మాత్రమే వెళ్ళాను. పర్వతం మీద ఇంకా దిగువన ఉన్న వ్యక్తులతో నేను ఇలా చెప్పగలను, "నన్ను అనుసరించండి." నా ముందు ఉన్న, క్రీస్తును శిఖరం వరకు అనుసరిస్తున్న ఇతరుల ఉదాహరణను నేను అనుసరించగలను. ఆ శిఖరం క్రీస్తు పోలికలోనికి పూర్తిగా మార్చబడటం. అదే లక్ష్యం. ప్రపంచంలోని రోగులందరినీ స్వస్థపరచడం లక్ష్యం కాదు, కానీ మన జీవితంలో పూర్తిగా యేసుక్రీస్తులాగా మారడమే లక్ష్యం. అటువంటి జీవితం నుండి పరిచర్య పొంగిపొర్లుతుంది.
మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తాను చేసిన పరిచర్యనే ప్రజలకు వెళ్లి చేయమని యేసు మనకు ఆజ్ఞాపించలేదు. పౌలు పరిచర్య గురించి మాట్లాడుతుంటే, "నన్ను అనుసరించండి" అని చెప్పినప్పుడు మనం అతనిని అనుసరించలేము. అతడు మనల్ని అపొస్తలులుగా మారమని చెప్పడం లేదు. అందరూ అపొస్తలులు ఎలా అవుతారు? పౌలు లాగా అందరూ ప్రవక్తలు లేదా సువార్తికులు ఎలా అవుతారు? అతను, "నా జీవితాన్ని అనుసరించండి. నేను క్రీస్తును అనుకరించే విధంగా నన్ను అనుకరించండి" అని చెబుతున్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా క్రీస్తువలె రోగులందరినీ స్వస్థపరచడం, నీటిపై నడవడం లేదా ఐదు రొట్టెలతో 5,000 మందికి ఆహారం ఇవ్వడం వంటి పరిచర్యను అనుకరించలేకపోయాడు. పౌలు తనకు ఆకలిగా ఉందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి (2 కొరింథీ 11:27). తనకు అవసరం ఉన్నప్పుడు, చలిలో వణుకుతూ, తిమోతిని తన కోసం దుప్పటి తీసుకురావాలని అడిగాడు (2 తిమోతి 4:13). తొలి క్రైస్తవులు అనేక విధాలుగా బాధపడ్డారు. సింహాలకు విసిరి వేయబడినప్పుడు వారు కాపాడబడలేదు, సిలువ వేయబడినప్పుడు రక్షింపబడుటను నిరాకరించిన యేసును అనుసరించారు. మనం అనుసరించాల్సింది ఆయన జీవితాన్ని. ఆయన పరిచర్యలో మనం యేసును అనుసరించలేము.
దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే, ఆయన పరిచర్యలో లోక పాపాల కోసం మరణించడం కూడా ఉంది. మనం ఆ పరిచర్యను ఎలా అనుసరించగలం? మనం అనుసరించలేము. కాబట్టి, మనం అనుసరించేది ఆయన జీవితాన్నే. యేసు జీవితానికి మరియు ఆయన పరిచర్యకు మధ్య తేడాను మనం గుర్తించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు తన తండ్రి చిత్తాన్ని ఆయన జీవితంలో మరియు ఆయన పరిచర్యలో చేశాడని చెప్పగలడు. మన జీవితాల్లో మరియు మన పరిచర్యలో కూడా దేవుని చిత్తాన్ని మనం చేయగలము. మన జీవితంలో, యేసు మాదిరిని ఖచ్చితంగా అనుసరించాలి. పౌలు చేసింది అదే. మన పరిచర్యలో, క్రీస్తు శరీరంలో మనకు ఇవ్వబడిన ఆ ప్రత్యేకమైన పనిని నెరవేర్చాలి. యేసు జీవితానికి మరియు యేసు పరిచర్యకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం మోసం నుండి, అవాస్తవికత మరియు వేషధారణ నుండి మనల్ని మనం రక్షించుకున్నామని గ్రహిస్తాము. యేసు చేసిన పనులనే తాము చేస్తున్నామని నటించే క్రైస్తవులలో చాలా వేషధారణ ఉంటుంది.
కొన్నిసార్లు ప్రజలు ఇలా అడుగుతారు, యేసు చివరి భోజనం తర్వాత, ’నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను... నేను తండ్రిని వేడుకొందును, ఆయన ఆత్మను మీకనుగ్రహించును’ (యోహాను 14:12,16)" అని ఆయన చెప్పిన మాట ఏమిటి?. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఆయన చేసిన క్రియలను మరియు వాటి కంటే గొప్ప క్రియలను మీరు చేయగలరని ఆయన ఇక్కడ చెప్తున్నారు. మనం దానిని అర్థం చేసుకోవాలి.
యేసు చేసిన క్రియలు ఏవి అని మీరు ఎవరినైనా అడిగితే, వారు వెంటనే రోగులను స్వస్థపరచడం, చనిపోయినవారిని లేపడం, నీటిపై నడవడం, ఐదు రొట్టెలతో 5000 మందికి ఆహారం పెట్టడం గురించి మాట్లాడుతారు. కానీ మీరు యేసు జీవితంలో చివరి 10% గురించి మాత్రమే మాట్లాడుతున్నారు! ఇది ఆయన తన జీవితంలో చివరి మూడున్నర సంవత్సరాలలో చేసింది. ఆయన చేసినదంతా అంతేనా? ఆయన జీవితంలో మిగిలిన 90% గురించి ఏమిటి? ఆయన తన జీవితంలోని ఆ 90% లో ఏమి చేశాడు? ఆయన తన జీవితమంతా ఏమి చేశాడు? ఒక్క మాటలో చెప్పాలంటే: ఆయన తన తండ్రి చిత్తాన్ని చేశాడు. యోహాను 6:38 లో యేసు స్వయంగా ఇలా చెప్పాడు, "నేను చనిపోయినవారిని లేపడానికి, రోగులను స్వస్థపరచడానికి మరియు నీటిపై నడవడానికి పరలోకం నుండి రాలేదు. నా స్వంత చిత్తాన్ని తిరస్కరించడానికి మరియు నా తండ్రి చిత్తాన్ని చేయడానికి నేను పరలోకం నుండి వచ్చాను"(వివరణ).
క్లుప్తంగా చెప్పాలంటే అదే "యేసు క్రియలు". ఆయన తన స్వంత చిత్తానికి "లేదు" అని చెప్పడానికి మరియు తన తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. ఆయన తండ్రి చిత్తంలో కొండపై ప్రసంగం, అనారోగ్యంతో ఉన్న వారందరినీ స్వస్థపరచడం, కొన్నిసార్లు బేతెస్ద కొలను దగ్గర ఉన్న ఒక వ్యక్తిని స్వస్థపరచడం, నీటిపై నడవడం, పేతురును నీటిపై నడవమని చెప్పడం మరియు 5,000 మందికి ఐదు రొట్టెలతో ఆహారం పెట్టడం ఉన్నాయి. పౌలు కోసం తండ్రి చిత్తంలో నీటిపై నడవడం లేదా 5,000 మందికి 5 రొట్టెలతో ఆహారం పెట్టడం లేదా లాజరులాగా నాలుగు రోజులు చనిపోయిన వ్యక్తిని లేపడం వంటివి లేవు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఉంది.
అదే ముఖ్య విషయం. యేసు చేసిన కార్యాలను ఒక్క మాటలో చెప్పాలంటే -దేవుని చిత్తం. పౌలు కూడా అలాగే చేశాడు. అతనికి విషయంలో దేవుని చిత్తం ఏమిటంటే, ప్రయాణించడం, సంఘాలు స్థాపించడం మరియు లేఖనాలు రాయడం. యేసు ఎప్పుడూ ఏ లేఖనాలను వ్రాయలేదు, కానీ పౌలు అలా చేశాడు. మనం లేఖనాలను వ్రాయడానికి పిలువబడలేదు. కానీ మనం తండ్రి చిత్తాన్ని చేయడానికి పిలువబడ్డాము. అవి యేసు చేసిన కార్యాలు. ఇందులో ఇంట్లో యోసేపు మరియు మరియలకు ఆయన విధేయత చూపించడం కూడా ఉంది. మరియ బావి నుండి ఒక బిందె నీరు తీసుకురావాలని అడిగితే, యేసు ఒక బిందె నీరు పూర్తిగా తెచ్చేవాడు. అవి యేసు చేసిన కార్యాలు: చిన్న విషయాలలో మరియు పెద్ద విషయాలలో తండ్రికి విధేయత చూపించుట. మనమందరం అలా చేయగలం.