WFTW Body: 

దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులైయుంటే దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు (1 పేతురు 5:5,6).

హెచ్చింపబడుట అంటే ఈ లోకములో గొప్ప వారమవుతామని గానీ, క్రైస్తవ లోకములో ప్రసిద్ధులమవుతామనిగానీ మరియు మనుష్యుల యొద్ద నుండి ఘనత పొందుతామనిగాని కాదు. ఇది ఆత్మీయ హెచ్చింపును మాత్రమే సూచిస్తుంది. మన జీవితము మరియు పరిచర్యలో దైవచిత్తమంతటినీ నెరవేర్చుటకు గాను అవసరమైన ఆత్మీయ అధికారము మనకు ఇవ్వబడుతుంది. అయితే ఇటువంటి హెచ్చింపు మనలను మనము తగ్గించుకొనుటపై ఆధారపడి ఉంటుంది.

ఇతరుల దృష్టిలో ఘనులుగా, ఇంకా ఘనులుగా కనబడాలని ఉవ్విళ్ళూరే మానవులతో ఈ లోకము నిండివున్నదని మనకు తెలుసు. ప్రతి రాజకీయవేత్త, ప్రతి వ్యాపారవేత్త తాను అందరికన్నా గొప్పవాడైపోవాలని కోరుకుంటాడు. దురదృష్టవశాత్తు తాము క్రీస్తు సేవకులమని చెప్పుకునేవారు కూడా గొప్పవారిగా, ఇంకా గొప్పవారిగా కావాలని ఆశిస్తారు. "రెవరెండ్‌ డాక్టర్‌", వంటి బిరుదులు చైర్మన్‌ వంటి సంస్థాపరమైన అధికార స్థానాల కోసం ఆరాటపడతారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచము లోకములోని ఏ వ్యాపార సంస్థకు భిన్నంగా లేదని చెప్పుట విచారకరమైన విషయము!

తమ నాయకులు సినిమా నటుల వలె ప్రకాశమానముగా సమావేశాల్లో పెద్ద పెద్ద వేదికలమీద నిలిచి ఉండడం, ఖరీదైన హోటల్లో, మేడల్లో నివసించుట, ఖరీదైన సుఖవంతమైన కార్లు నడపటం ఈనాటి యువ విశ్వాసులు చూస్తున్నారు. దేవుని మార్గాల గూర్చి ఎక్కువగా తెలియని వీరు అటువంటి నాయకుల్ని అభిమానిస్తూ తాము కూడా ఒకనాడు ఆ స్థాయికి ఎదగాలని ఎదురు చూస్తుంటారు! సంవత్సరాల తరబడి దేవునికి నమ్మకమైన సేవకులుగా ఉన్న ఫలితంగా ఆ బోధకులకు దేవుడు ఈ విధంగా బహుమానాలందించాడని వారు భావిస్తారు. నమ్మకంగా ఉంటే తాము కూడా ఒకనాటికి తమ నాయకుల వలె అటువంటి వేదికలపై ప్రకాశమానమైన వెలుగులో అందరికీ కనబడవచ్చునని వారు ఊహించుకుంటారు.

బోధకులు బహుమతుల ద్వారా ఎంతో డబ్బు సంపాదించుటను యౌవనస్థులు చూచినప్పుడు, ఆ బోధకులవలె తాముకూడా ధనవంతులయ్యే రోజుకోసం ఎదురు చూస్తుంటారు. ఈ యౌవనస్థులకు ఆదర్శప్రాయము యేసు క్రీస్తు కాదుగానీ, ధనవంతులు, సినీ నటుల్లాంటి ఈ బోధకులే. క్రైస్తవ్యములో ఈనాడు విషాదకరమైన విషయం ఇదే.

ప్రభువును అనుసరిస్తే మనము ధనవంతులముకాము, ప్రసిద్ధులము కాము కానీ దైవస్వభావములోనికి మారుతామని మన జీవితం, మన మాటల ద్వారా యౌవనస్థులకు చూపించాలి.

అలా చేసినప్పుడు మనము అపార్థము చేసుకోబడతాము, తిరస్కరించబడతాము, శ్రమలు పొందుతాము! అయితే మనలను ద్వేషించే వారిని మనము ప్రేమించ గలుగుతాము, శపించే వారిని దీవించ గలుగుతాము. రాబోవు తరానికి మనము చూపించవలసినది ఇదే. ఇది గనుక మనము చేయకపోతే - ఈనాటి శరీర సంబంధులైన బోధకుల్లో కనబడుతున్న "మరియొక యేసును" వారు అనుసరిస్తారు.

దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనము తగ్గించుకొనుట అంటే - మన జీవితాల్లో దేవుడు పంపుతున్న అన్నిపరిస్థితులను ఆనందముగా అంగీకరించటమే. మనము అనుమతించిన ఆ పరిస్థితులు మనల్ని దీనులుగా చేసినప్పుడు మనము అల్పులమవుతాము మరియు దేవుడు గొప్ప వాడవుతాడు. ప్రజల దృష్టిలో మనము చిన్నగా మారినప్పుడు, వారు ఇంకెంత మాత్రము మనపై ఆధారపడక ప్రభువును ఆశ్రయిస్తారు.

మనలో క్రీస్తు హెచ్చింపబడుతూ మనం తగ్గించబడాలని మనము తృష్ణ కలిగియుండాలి. క్రీస్తు మనలో హెచ్చింపడునట్లుగా దేవుడు మనల్ని మన జీవితములో అనేక పరిస్థితులగుండా నడిపించి మనల్ని దీనులుగా చేస్తాడు. ఆ పరిస్థితుల్లో మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనలో దేవుని ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది.

మనము ఎవరి యెడల తప్పు జరిగించామో వారి దగ్గర క్షమాపణ అడుగుట అనేది మనల్ని మనము తగ్గించుకొనుటలో ఇమిడి యున్నది. ప్రభువు సేవకులముగా మనము ప్రజలందరికీ సేవకులమై వారిని ఆశీర్వదించుటకు వారికి క్రిందగా ఉండుటకు ఇష్టపడాలి. మనము తప్పులు చేసినప్పుడు వెంటనే వాటిని గుర్తించి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ క్షమాపణ అడగాలి. ఎన్నడూ ఏ తప్పు చేయని వాడు దేవుడొక్కడే.

సూర్యుని క్రింద ఎవరి దగ్గరైనా క్షమాపణ కోరటానికి ఇష్టపడుతున్నానని నేను ప్రభువుతో చెప్పాను-అది పిల్లలు, పనిమనుషులు, బిచ్చగాళ్ళు ఎవరైనా ఫరవాలేదు. ఈ విషయంలో నేనెప్పుడూ నా పరువు ప్రతిష్టల కోసము నిలబడను. నేను ఆవిధంగా చేశాను. దేవుడు నన్ను దీవించాడు.

మీలో చాలామంది వివాహితులు. మీరు మీ భార్యలను నొప్పించాలనే ఉద్దేశ్యము లేకపోయినా అనుకోకుండా మీ భార్యలను నొప్పించుట ఎంత సులభమో మీకు తెలుసు. మీరు ఏదో ఒక విషయమును మంచి ఉద్దేశంతోనే చెప్పియుండవచ్చును. అయితే మీ ఉద్దేశ్యాన్ని మీ భార్య అపార్థము చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇది వేరే విధముగా జరగొచ్చు. మీరు మీ భార్యల ఉద్దేశ్యాలను అపార్థము చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరేమి చేయాలి? ఈ విషయమును నన్ను చెప్పనివ్వండి: మీ ఉద్దేశాలు గూర్చి బహుప్రయాసతో కూడిన దీర్ఘమైన వివరణ ఇవ్వటంకన్నా, అసలు తప్పు ఎవరిదో అన్న విశ్లేషణ కన్నా ఒక్క క్షమాపణ మాటతో మీ కుటుంబంలో శాంతి సమాధానము పునరుద్ధరింపబడుతుంది!

నీ సహోద్యోగులు నిన్ను అపార్థము చేసుకుంటున్న పరిస్థితిలో నీవున్నట్లయితే, విషయమును వారికి వివరముగా చెప్పుట వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే వారు వినుటకు ఇష్టపడకపోవచ్చు. అటువంటప్పుడు, ముఖ్యముగా నీవు ఆ విషయములో ఎటువంటి తప్పు చేయనట్లయితే నీవు ఏమి చేయాలి? నీ మీద నీవు జాలిపడాలా? కానే కాదు. దేవుని యెదుట మరియు మనుష్యుల యెదుట నీ మనస్సాక్షి నిర్మలముగా ఉండునట్లు చూచుకొని, ఆ విషయమును దేవునికి అప్పగించు. నీవు చేయవలసినదల్లా ఇదే. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా నేను పాటిస్తున్న విధానము ఇదే. నిజముగా దీనిద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. మీరు దీనిని చేయవలెనని నేను సిఫారసు చేస్తున్నాను.