WFTW Body: 

కీర్తన 27:4లో దావీదు ఇట్లునుచున్నాడు, "యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను".

దావీదు గొప్ప రాజైయున్నాడు. అతడు ధనవంతుడైయుండి, అనేక యుద్దములను గెలిచి మరియు పేరుప్రఖ్యాతలు కలిగియుండెను. అయినప్పటికి అతడు ఇట్లునుచున్నాడు, "నాలో సంతృప్తి లేదు. ప్రభువునే నా హృదయమంతటితో కోరుకొనుచున్నాను. లోకమంతటికి రాజును కావలెననిగాని లేక గొప్ప బోధకుడిని కావలెననిగాని లేక చాలా గొప్పవాడిని కావలెనిగాని నాకు లేదు కాని నా జీవితకాలమంతయు దేవుని ప్రసన్నతను చూడవలెననియు, ఆయన బలమును ధ్యానించవలెననియు కోరుచున్నాను". మన జీవితములలో కూడా ఆ విధమైన కోరికను కలిగియున్నామా?

యోహాను 20 అధ్యాయములో అటువంటి ఒకే ఒక కోరిక కలిగిన వ్యక్తిని గురించి చదివెదము. మగ్దలేనే మరియ, ఆదివారము వేకువనే ప్రభువు సమాధి యొద్దకు వెళ్ళెను. ఆ సమయములో ఆమె ఎందుకు నిద్రించుట లేదు? ఆమె చీకటి ఉండగానే వేకువనే లేచి మరియు సమాధియొద్దకు ఎందుకు వెళ్ళింది? ఎందుకనగా మహిమ స్వరూపియైన ప్రభువును చూడవలెననే ఒకే ఒక్క కోరిక ఆమె కలిగియున్నది. ఆమె సమాధియొద్దకు వచ్చినప్పుడు, సమాధి రాయి తీయబడియుండెను. గనుక ఆమె పరిగెత్తుకొని శిష్యులయొద్దకు వెళ్ళెను. వారు కూడా సమాధి యొద్దకు వచ్చి, సమాధిని చూచి మరియు బహుశా నిద్రించుట కొరకు వారు తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.

అయితే మరియ సమాధియొద్ద యేడ్చుచుండెను. మరియ వలె శిష్యులు ప్రభువును ప్రేమించుటలేదని మనము చూచుచున్నాము. శిష్యులు ఖాళీ సమాధిని చూచి మరియు నిద్రించుటకు తిరిగి వెళ్లిపోయిరి. కాని మరియకు ప్రభువైనయేసే సర్వమైయున్నాడు కాబట్టి ఆమె వెళ్ళలేదు. ఈనాడు సంఘములో కూడా దేవుడు అటువంటి వారినే కోరుచున్నాడు. ప్రభువైనయేసు మగ్దలేనే మరియ దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె ఆయనను తోటమాలి అనుకొని మరియ ఆయనతో ఇట్లనెను, "అయ్యా నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను" (యోహాను 20:15). ఆమె ఆయనను ఎత్తికొనిపోవుటకు కూడా సిద్ధపడియున్నది. ఒక స్త్రీకి మృతదేహమును మోసికొనిపోవుట ఎంత అసాధ్యమో మనకు తెలియును. కాని, ప్రభువు నిమిత్తము ఎటువంటి బాధనైనను అనుభవించునంతగా, ఆమె ప్రభువును ప్రేమించెను. దేవుని ప్రసన్నతను వెదకుట అనగా అర్థమిదియే, అనగా ప్రభువుయొక్క ప్రసన్నతను తప్ప మరిదేనిని కోరుకయుండుట. ఈ లోకములో ధనవంతులములు అవ్వవలెనని గాని లేక గొప్పవారము కావలెనని గాని కోరక, దినదినము ప్రభువును మాత్రమే కోరుకొనుచు ఆయన యొక్క ప్రసన్నతను చూచుటయే.

ఒక విధవరాలి ఇంటికి వెళ్ళిన వ్యక్తిని గురించిన కథ నాకు గుర్తు ఉన్నది. ఆమె చాలా బీదరాలు అయినప్పటికిని ప్రభువును ప్రేమించింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె చిన్న గుడిసెలో జీవించేది. మీ ఇంటిలో ఎందుకు ఇంత సంతోషము, సమాధానము యున్నదని అతడు ఆమెను అడిగెను. నీకు ఎక్కువ ధనములేదు నీ పిల్లలు కొంత ఆకలితో ఉన్నను, ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండెదరు. మీ ఇంటిలో చాలా సమస్యలు మరియు అనారోగ్యములున్నప్ప్పటికిని, మీరు ఎల్లప్పుడు సంతోషముగా ఉండెదరు. నీ జీవితములోని రహస్యమేమిటి? "యేసు ప్రభువే నాకు సర్వమైయున్నాడు. ఈ లోకములో నాకు ఏదియు అక్కరలేదు" అని ఆమె చెప్పింది.

ప్రియులారా, ప్రభువైన యేసే మనకు సర్వమైనట్లయితే, మనము కూడా ఆమెవలె ఉండెదము.