పరిశుద్ధాత్మను సత్యస్వరూపియైన ఆత్మ అని పిలుస్తారు. యేసు ఇలా చెప్పారు, "సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును" (యోహాను 16:13).
నా జీవితం పూర్తిగా, తల నుండి పాదాల వరకు నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అదే యేసును అనుసరించడం. "నేనే సత్యమును" అని యేసు చెప్పారు. అయితే తరచుగా క్రైస్తవ బోధకులు కూడా ఇతరులతో మాట్లాడే విధానంలో దౌత్యపరంగా ఉంటారు. వారు, "నేను ఇలా చెబితే, అది కొన్ని సమస్యలను కలిగిస్తుంది కాబట్టి నన్ను దౌత్యపరంగా ఉండనివ్వండి" అని అంటారు. యేసు ఎప్పుడూ దౌత్యవేత్త కాదు. ఆయన ఎల్లప్పుడూ సత్యాన్ని స్పష్టంగా మరియు నేరుగా మాట్లాడాడు. ఆయన మొరటుగా ఉన్నాడని నేను చెప్పటంలేదు మరియు మనం మొరటుగా ఉండాలని నేను నమ్మను, కానీ యేసు ఏ వ్యక్తిగత లాభం కోసం దౌత్యపరంగా లేడు. మనం సత్యాన్ని మాట్లాడటంలో దయతో మరియు శ్రద్ధతో ఉండాలని నేను నమ్ముతున్నాను (మొరటుగా కాదు) -- మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ దయతో ఉండాలి -- కానీ అది మిమ్మల్ని ఎక్కడ ప్రభావితం చేస్తుందో అక్కడ సత్యాన్ని మాట్లాడటం గురించి చెప్తున్నాను. మన విషయంలో మనం నిజాయితీగా ఉండాలి.
పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని మీకు తెలుసా? ఆది సంఘంలో తీర్పు తీర్చబడిన మొదటి పాపం దురాశ కాదు, నీజాయితిగా లేకపోవడం. అపొస్తలుల కార్యములు 5లో చాలా మంది తమ భూములను అమ్మి డబ్బును అపొస్తలుల పాదాల వద్దకు తీసుకురావడాన్ని అననీయా మరియు సప్పీరాలు చూశారు (అపొ.కా. 4:34లో చాలా మంది అలా చేస్తున్నారు). అననీయా మరియు సప్పీరా కూడా సంఘంలో పూర్ణహృదయులుగా మరియు దేవునికి పూర్తిగా లోబడినవారుగా ఖ్యాతిని కోరుకున్నారు, కాబట్టి వారు కూడా తమ భూమిలో కొంత భాగాన్ని అమ్మేశారు, కానీ ఇతరులు చేస్తున్నట్లుగా అపొస్తలుల పాదాల వద్ద పూర్తి మొత్తాన్ని ఉంచలేదు. వారు ఆ భూమిని లక్ష రూపాయలకు అమ్మి, 50,000 రూపాయలను తమ వద్దే ఉంచుకుని, 50% సంఘానికి ఇచ్చారని అనుకుందాం. ఈరోజు ఎవరైనా తమ ఆస్తిని అమ్మి, తమ ఆదాయంలో 50% దేవునికి ఇస్తే, ఆ వ్యక్తిని పూర్ణహృదయుడైన క్రైస్తవుడు అంటారు! కానీ అననీయ చంపబడ్డాడు, అతను ఇచ్చిన దానికో లేదా ఇవ్వని దానికో కాదు, అతను అబద్ధం చెప్పినందుకు చంపబడ్డాడు.
అతను ఇతరులతో వరుసలో నిలబడి, ప్రజలు తమ డబ్బును అపొస్తలుల పాదాల వద్ద వదిలివేస్తుండగా నోరు మూసుకొని, అతను కూడా తన డబ్బును వదిలి వెళ్ళాడు. అతను ముందుకు వెళ్తునప్పుడు, పేతురు అతని పిలిచాడు, "అననీయ, ఇక్కడికి తిరిగి రా". ఈ వ్యక్తి అబద్ధికుడు అని దేవుడు పేతురుకు వివేచన ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 5:4 లో పేతురు అతనితో ఇలా అన్నాడు (స్వేచ్ఛానువాదం), "ఈ భూమి నీవద్ద ఉన్నప్పుడు అది నీది. ఎవరూ నిన్ను అమ్మమని అడగలేదు. దేవుడు నీ డబ్బును లేదా నీ భూమిని కోరుకోడు. అందరూ స్వచ్ఛందంగా ఇస్తున్నారు మరియు మీరు దానిని అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీదే. ఎవరూ నిన్ను 50% లేదా 10% లేదా 1% ఇవ్వమని అడగలేదు -- ఎందుకు ఈ విధంగా ఆలోచించావు? నువ్వు దేవునికి అబద్ధం చెప్పావు". అననీయ, "నేను ఎప్పుడూ నోరు తెరవలేదు! నేను ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు" అని చెప్పి ఉండవచ్చు. కానీ నువ్వు నోరు తెరవకుండా దేవునికి అబద్ధం చెప్పగలవని నీకు తెలుసా? అననీయ వరుసలో నిలబడి, అపొస్తలుల పాదాల వద్ద డబ్బు పెట్టి, ముందుకు సాగాడు. అతను ఎప్పుడూ నోరు తెరవలేదు, కానీ ఆ చర్య అబద్ధం. ఇది వేషధారణ - నటించడం.
మీరు ఒక సంఘ సహవాసంలోకి వచ్చి మిగతా వారందరిలాగా పూర్ణహృదయులైనట్లు నటించి, అబద్ధికులుగా ఉండవచ్చు. మీరు పూర్ణహృదయులు కాకపోయినా, ఇతరులలాగా పూర్ణహృదయులైనట్లు నటిస్తునట్లయితే మీరు నోరు తెరవకపోయినా అబద్ధికులుగా ఉన్నారు. "నా వెండి బంగారాన్ని తీసుకో, నేను ఒక్క నాణెం కూడా ఉంచుకోను" అని మీరు యేసుకు పాడవచ్చు, ఎందుకంటే పాట మరియు పదాలు బాగున్నాయి మరియు మీరు మిగతా వారితో పాటు పాడుతున్నారు, కానీ మీరు దాన్ని అర్థాన్ని నిజంగా వెంబడించనందువల్ల, మీరు పూర్తిగా అబద్ధికులు అవుతారు. చాలా మంది క్రైస్తవులు వారంలోని ఏ ఇతర రోజు కంటే ఆదివారం వారు పాడే పాటల ద్వారా దేవునికి ఎక్కువ అబద్ధాలు చెబుతారు! "అన్నీ యేసుకే నేను లోపరస్తున్నాను" అని మీరు పాడి అన్నీ లోపరచకపోతే మీరు అబద్ధికులుగా ఉంటున్నారు. ఒక బోధకుడు మీకు నిజం చెప్పడం మీరు వినకపోవచ్చు, కానీ మీరు దానిని వినాలి ఎందుకంటే అది నిజం. మీరు అన్నిటినీ క్రీస్తుకు లోపరచి ఉంటే దాన్ని చెప్పండి, లేకపోతే మీ నోరు మూసుకోండి, లేదా "ప్రభువా నేను అన్నీ లోపరచాలనుకుంటున్నాను, కానీ నేను అన్నిటినీ లోపరచలేదు" అని చెప్పండి. అది నిజాయితీ. అది ఇతరులు పాడుతున్న రాగంతో సరిపోకపోయినా పర్వాలేదు. మీరు దేవునితో నిజాయితీగా ఉండండి.
దీని పర్యవసానమేమిటి? 2 థెస్సలొనీకయులు 2:10, సత్యాన్ని ప్రేమించని వారి గురించి మాట్లాడుతుంది. సత్యాన్ని ప్రేమించడం అంటే సత్యం మాట్లాడటం కంటే ఎక్కువ. నేను సత్యాన్ని మాట్లాడగలను కానీ దానికంటే ఉన్నతమైన స్థాయి సత్యాన్ని ప్రేమించడం. సత్యాన్ని మాట్లాడాలనే అపారమైన కోరిక నాకు ఉంది, నేను దానిని ప్రేమిస్తున్నాను మరియు నాలో ఎలాంటి అబద్ధం ఉండాలని నేను కోరుకోవటం లేదు. అన్ని అబద్ధాల నుండి రక్షించబడటానికి మనం సత్యం పట్ల ప్రేమను కలిగి ఉండకపోతే, దాని పర్యవసానాన్ని 2 థెస్సలొనీకయులు 2:11 చెబుతుంది: దేవుడే మనల్ని మోసం చేస్తాడు. అది క్రొత్త నిబంధనలోని అత్యంత భయంకరమైన వచనాలలో ఒకటి.
ప్రియమైన స్నేహితుడా, నేను నీకు సూటిగా చెబుతున్నాను: నువ్వు సత్యాన్ని ప్రేమించకపోతే, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను మోసం చేస్తాడు. సాతాను ఒక మోసగాడు. నీ కోరికలు నిన్ను మోసం చేస్తాయి. నీ హృదయం మోసపూరితమైనది. వీటన్నిటికి పైగా, మోసం నుండి రక్షింపబడుటకు నీకు ఏకైక ఆశాకిరణమైన సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను మోసం చేయాలని నిర్ణయించుకుంటే, నీకు ఎటువంటి ఆశ లేదు. 2 థెస్సలొనీకయులు 2:11 ప్రకారం, దేవుడు నీవు అబద్ధాన్ని నమ్మునట్లు చేస్తాడు. నువ్వు తిరిగి జన్మించకపోయినా నువ్వు తిరిగి జన్మించావని ఆయన నమ్మునట్లు చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోయినా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని ఆయన నమ్మునట్లు చేస్తాడు. ఎందుకు? ఒకేఒక కారణం వల్ల: నువ్వు సత్యాన్ని ప్రేమించటం లేదు.
బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి పాపం ఏమిటో నీకు తెలుసా? సాతాను హవ్వతో "మీరు చనిపోరు" అని చెప్పిన అబద్ధం (ఆదికాండము 3:4). అబద్ధం - అది బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి పాపం.
బైబిల్లో ప్రస్తావించబడిన చివరి పాపం ఏమిటి? బైబిల్ చివరి అధ్యాయంలో చూస్తే చెప్పబడిన చివరి పాపం ’అబద్ధం’ అని మీరు చూస్తారు. ప్రకటన 22:15లో అబద్ధం చెప్పేవారు పరిశుద్ధ పట్టణం వెలుపల ఉంటారని చెప్పబడింది. కాబట్టి బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి మరియు చివరి పాపం అబద్ధం. ఆదిసంఘంలో తీర్పుతీర్చబడిన మొదటి పాపం అబద్ధం. దేవుడు మోసగించేది సత్యాన్ని ప్రేమించని వారినే.
దీనిని మనం తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. "మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండనివ్వండి" (మత్తయి 5:37). ఇది మనల్ని మోసం నుండి రక్షిస్తుంది. యేసు, "నేనే మార్గము" అని చెప్పాడు. మనమందరం దానిని అభినందిస్తున్నాము. యేసు మార్గము మరియు జీవము అని మనం అంగీకరిస్తున్నాము. కానీ ఆయన, "నేనే సత్యము - నేనే వాస్తవికతను" (యోహాను 14:6) అని కూడా చెప్పాడు.
పాత నిబంధనలోని వారు దీనిని కలిగి ఉండలేరు. దావీదు కీర్తన 51:6 లో బత్షెబతో పాపం చేసిన తర్వాత తన ఒప్పుకోలును ఇలా చెబుతున్నాడు (వివరణ), "ప్రభువా, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావని నేను గ్రహించాను, అది నేను కలిగిలేను. నేను వేషధారిని. నేను గొల్యాతును చంపగలను, ఫిలిష్తీయులను ఓడించగలను, కానీ నా హృదయంలో నేను వేషధారిని. నేను బత్షెబతో పాపం చేశాను మరియు మొదట ఆమె భర్తను ఆ రోజు ఆమె వద్దకు పంపడం ద్వారా దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాను. నేను అక్కడ విజయం సాధించలేదు. అప్పుడు నేను ఆమె భర్తను వదిలించుకుని ఆమెను వివాహం చేసుకున్నాను. ప్రభువా, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావని నేను గ్రహించాను. అది నేను కలిగిలేను". అయితే అంతరంగంలో సత్యం అనేది పరిశుద్ధాత్మ వలన నేడు మనం కలిగి ఉండగల అద్భుతమైన విషయాలలో ఒకటి. సత్యస్వరూపియైన ఆత్మ మన జీవితంలో మరియు హృదయాంతరంగం వరకు కూడా మనల్ని సత్యవంతులుగా చేస్తాడు.
ప్రకటన 14వ అధ్యాయం, సీయోను పర్వతంపై గొర్రెపిల్లతో నిలబడి ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయనను అనుసరించే జయించువారి గుంపు గురించి ప్రకటన 14:4 చెబుతుంది. వారి యొక్క ఒక లక్షణం ఏమిటంటే, "వారి నోటిలో అబద్ధం లేదు" (ప్రకటన 14:5). మనుష్యుల పిల్లలు పుట్టినప్పటి నుండి అబద్ధికులు. కీర్తన 58:3 లో మనం దానిని చదువుతాము. కానీ వారి మొత్తం వ్యవస్థలో అబద్ధం కనిపించకుండా అబద్ధం నుండి పూర్తిగా విముక్తి పొందిన వ్యక్తుల సమూహం ఇక్కడ ఉంది. వారు సత్యసంపూర్ణుడైన యేసువలె మారారు! ప్రతి విధమైన అబద్ధం నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
నిజం మాట్లాడటానికి మీరు ఒక మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ, మీరు సత్యం కోసం నిలబడి మీ జీవితం నుండి అబద్ధాన్ని తొలగించాలని నిర్ణయించుకుంటే, మీ జీవితం 100% నిర్మలంగా ఉంటుంది. మీరు దేవుడిని చూడగలరు. నేడు క్రైస్తవ్యంలో జరుగుతున్న ఏ మోసాల ద్వారా మీరు ఎప్పటికీ మోసపోరు. మీరు సత్యాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే దేవుడే మీకు సత్యాన్ని చూపిస్తాడు మరియు మీ ఆధ్యాత్మిక స్థితి గురించి మీరు ఎప్పటికీ మోసపోరు.