WFTW Body: 

యేసు ఆయన రాకడ గూర్చి శిష్యులకు మత్తయి 24వ అధ్యాయములో చెప్పినప్పుడు, వారు మెళకువ కలిగి సిద్ధపాటుతో ఉండవలెనని ఒకటి కంటే ఎక్కువ సార్లు నొక్కి చెప్పెను (మత్తయి 24:42,44; 25:13). అందువలన ఎల్లవేళలా ఆత్మీయముగా మెళకువ కలిగి సిద్ధపాటుతో ఉండుట ప్రవచన సత్యముల గూర్చిన జ్ఞానము కంటే అన్ని విషయములలో ప్రాముఖ్యమైనది. మత్తయి 25వ అధ్యాయములో (మత్తయి 24వ అధ్యాయములో ప్రవచనములకు కొనసాగింపుగా చెప్పబడినది), మనము ఆయన రాకడ గూర్చి ఏ మూడు విషయములలో నమ్మకముగా ఉండి సిద్ధపాటు కలిగియుండవలెనో యేసు చెప్పెను.

రహస్యజీవితములో నమ్మకత్వము

మత్తయి 25:1-13. ఈ ఉపమానములో యేసు ప్రభువు పదిమంది కన్యకల గూర్చి చెప్పెను. అందులో గమనించినట్లయితే వారిలో ఎవ్వరు కూడా వ్యభిచారిణులు కాదు(ఆత్మీయ వ్యభిచారులు ఎవరో తెలిసికొనుటకు యాకోబు 4:4 చూడండి). వారందరు కన్యకలు. వేరే మాటలలో చెప్పాలంటే వారికి మనుష్యుల ఎదుట మంచి సాక్ష్యముండెను. వారి దీపములు అన్ని వెలుగుచుండెను (మత్తయి 5:16). వారి మంచి క్రియలు ఇతరులకు కనబడుచుండెను. అయినా, ఈ కన్యకలందరిలో అయిదుగురు మాత్రమే తెలివైనవారు. అయితే ఈ విషయం ప్రారంభంలో అందరికి తెలియదు. అయిదుగురు మాత్రమే సిద్దెలలో నూనె తీసుకువెళ్ళిరి(మత్తయి 25:4).

సిద్దెలలో ఉన్న నూనె వెలుగు కనబడినట్లు రాత్రులందు కనబడదు. అది దేవుని యెదుట మన రహస్య జీవితముగా ఉన్నది. లోకపు చీకటిలో దానిని మనుష్యులు చూడలేరు. మనందరకు ఒక సిద్దె ఉన్నది. అయితే ఇక్కడి ప్రశ్న అందులో నూనె ఉన్నాదా లేదా? అనునది. లేఖనాలన్నిటిలో నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా చెప్పబడింది. ఇక్కడ మన ఆత్మలకు పరిశుద్ధాత్ముడు దేవుని జీవాన్ని తెలియజేయుట గూర్చి చెప్పబడినది. ఆ జీవము యొక్క ప్రత్యక్ష గుర్తు వెలుగైయున్నది (యోహాను 1:4). అంతరంగములో ఉండాల్సింది నూనె. అనేకులు వారి బాహ్య సాక్ష్యముతోనే సంతోషపడిపోవుదురు. ఇది వారి తెలివి తక్కువతనము. మనకు వచ్చే పరీక్షలలో మరియు శ్రమలలో మనకున్న బాహ్యపు వెలుగు ఒక్కటే సరిపోదని మనము తెలుసుకొందుము. ఒకడు ఉత్సాహముతో ముందుకు వెళ్ళుటకు అంతరంగములో దేవుని జీవము అవసరము.

"శ్రమదినమున నీవు కృంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు" (సామెతలు 24:10). జీవితములో వచ్చు సంక్షోభములే మనము బలవంతులమో బలహీనులమో మనకు తెలియజేయును. ఈ ఉపమానములో ఉన్న సంక్షోభము యేమంటే పెండ్లికుమారుని రాకయొక్క ఆలస్యం. కాలము, మన ఆత్మానుసారత యొక్క యధార్థతను ఋజువు చేస్తుంది. ఎవరికైతే విశ్వాసముంటుందో అతడు అంతము వరకు సహించి రక్షింపబడును. అలాగే ఎవరి అంతరంగ జీవితములో దేవుని జీవమున్నదో ఎవరిలో లేదో కూడా కాలమే ఋజువు చేయును. అనేకులు విత్తబడిన వెంటనే చిగురించు వారిగా నుండి, వారిలో అంతరంగ జీవితము లేనివారుగా ఉందురు. వారి హృదయములలో మన్ను లోతుగా లేకుండెను (మార్కు 4:5). ఆ కారణముచేతనే యౌవన విశ్వాసుల ఆత్మానుసారత గూర్చిగాని వారి సంపూర్ణ ఆసక్తి గూర్చిగాని అంచనా వేయుట కష్టము. కనిపెట్టుటకు మనకు ఓపిక ఉండినట్లయితే కాలము దానిని బయలుపరచును. కనుక క్రీస్తు రాకడకు సిద్ధపడు మార్గము మన చుట్టూ ఉన్న ప్రజలు చూడలేని మన ఆలోచనలలో, వైఖరిలలో మరియు ఉద్దేశ్యములలో దేవుని ముఖము యెదుట అంతరంగములో పవిత్రత కలిగి విశ్వాసముతో కూడిన జీవితము కలిగియుండుటయై ఉన్నది. ఇది మనలో లేకుండా క్రీస్తు రాకడకు మనము సిద్ధపడియున్నామనుకొన్నట్లయితే మనలను మనమే మోసగించుకొందుము.

మన పరిచర్యలో నమ్మకత్వము

మత్తయి 25:14-30. రెండవ ఉపమానము, దేవుడు మనకిచ్చిన తలాంతులను నమ్మకముగా ఉపయోగించుట గూర్చినది. ఈ తలాంతులు మనకుండిన వస్తు సామాగ్రి, ధనము, సహజముగా ఉండే సామర్థ్యములు, జీవితములో వచ్చిన అవకాశములు, సమయము, ఆత్మీయ వరములు మొదలైన వాటిని సూచిస్తున్నాయి. ఈ విషయములో అందరూ సమానము కాదు. ఒకరు ఐదు, వేరొకరు రెండు మరియెకరు ఒకటి పొందినట్లు చూడగలము. అయితే వారు పొందిన వాటితో అందరికీ నమ్మకముగా ఉండుటకు సమానమైన అవకాశము మరియు సమయము ఉండెను. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడినదో వారి నుండి ఎక్కువ రావలసియున్నది. అందువలన రెండును నాలుగుగా చేసిన వారికిని, ఐదును పదిగా చేసిన వారికి సమానముగా ప్రతిఫలమియ్యబడినది. అయితే ఒక తలాంతును భూమిలో పాతిపెట్టిన వానిపైకి తీర్పువచ్చినది (మత్తయి 25:18). అతడు దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు కాక ఈ లోకము కొరకు వాడెను. ఎవ్వరు కూడా నేను ఏమి పొందలేదని చెప్పలేరు. ఎందుకంటే అందరూ దేవుని నుండి ఏదొక తలాంతును పొందియున్నారు. అయితే వాటిని దేని కొరకు వాడమన్నదే ప్రశ్న. మన కొరకు వాడుకొన్నది భూమిలో పాతిపెట్టిన దానితో సమానము. మనము దేవుని మహిమ కొరకు వాడినదే నిత్యత్వములో లాభము తెచ్చినట్లుగా లెక్కింపబడును. ఈ ప్రమాణము చొప్పున విశ్వాసులలో అనేకులు ఎటువంటి పేదరికములో ఉన్నారో చూడవచ్చును. మన ముఖ్యసిద్ధాంతము "అంతయూ దేవునికే, మనకేమీ వద్దు" అన్నట్లుగా ఉండవలెను. అప్పుడు మనము క్రీస్తు రాకడకు సిద్ధముగా ఉండగలము. మనకున్నదంతా మనము విడిచిపెట్టనట్లయితే మనము యేసుకు శిష్యులుగా ఉండలేము. దేవుడు ఇచ్చిన ఆస్తిపాస్తులను మరియు వరములను కేవలము దేవుని కొరకు ఉపయోగించని వాడు క్రీస్తు రాకడకు సిద్ధపడి ఉన్నాననుకొన్నట్లయితే తనను తాను మోసగించుకొనుచున్నాడు.

మన తోటి విశ్వాసులకు పరిచర్య చేయుటలో నమ్మకత్వము

మత్తయి 25:31-46. ఈ ఆఖరి భాగములో యేసు ప్రభువు మనతోటి విశ్వాసుల అవసరము విషయములో మన వైఖరి గుర్చి తెలిపారు (ఆ అవసరము భౌతికమైనది కావచ్చు లేక ఆత్మీయమైనది కావచ్చును). ఇక్కడ కొందరు తమ తోటి విశ్వాసులకు ప్రభువుకు చేసినట్లుగానే భావించి చేసినందున వారు పరలోక రాజ్యములో ప్రవేశించిరి. వారు ఎడమచేతితో చేసినది కుడిచేతికి తెలియనంతటి రహస్యముగా చేయబడినది (మత్తయి 6:3). అది ఎంతగా ఉండెనంటే వారు చేసిన మంచిని ప్రభువు వారికి గుర్తు చేసినప్పటికీ అది వారికి జ్ఞాపకము లేకపోయెను (మత్తయి 25:38). ఇక్కడ యేసు ప్రభువు ఆయన సహోదరులలో అల్పులైన వారికి చేసిన ఏ పరిచర్యయైనా ఆయనకే చేసినట్లు పరిగణింపబడునని బోధించెను (మత్తయి 25:40). ఇక్కడ ఆయన అల్పులైన వారికి అని చెప్పుటలో ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ప్రాముఖ్యమైన విశ్వాసులకు సేవ చేసి అంత ప్రాముఖ్యత లేని అల్పులైన వారిని విడిచిపెట్టుట మన యొక్క నైజం. ఎవరైతే వారి కొరకు మాత్రమే తినుట, త్రాగుట, అమ్ముట, కట్టుట, నాటుటలో మునిగిపోయి ఉందురో వారు యేసు తిరిగి వచ్చినప్పుడు విడిచిపెట్టబడుదురు (లూకా 17:28-34). ప్రభువు కొరకైన సేవలో, ఎవరైతే వారితోటి విశ్వాసులయెడల ప్రేమతో కూడిన ఆలోచన కలిగియుందురో వారు పైకెత్తబడుదురు. వేరొక వాక్య భాగములో, యేసు ప్రభువు వేరొక గుంపు గూర్చి మాట్లాడారు. ఆ గుంపు ఈ గుంపునకు వేరుగా ఉన్నది. వారు ప్రభువు పేరట చేసిన ప్రతి మంచి పనిని జ్ఞాపకముంచుకొన్నవారు. వారు కూడా తీర్పు సింహాసనము యొద్ద ఉండి వారు యేసు పేరిట దయ్యములను వెళ్ళగొట్టిన విషయమును, రోగులను స్వస్థపరచిన విషయమును ప్రభువుకు జ్ఞాపకము చేసారు. కాని, వారు ఈ విషయాలన్నిటిని చేసినా మొట్టమొదట ఉండవలసిన మరుగైన పరిశుద్ధతతో కూడిన జీవితము లోపించినందున వారు త్రోసివేయబడిరి. వారికున్న గొప్ప వరముల గూర్చి మాత్రమే వారు ఆలోచించారు.