వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

తన జీవితములో దేవుని యొక్క సంపూర్ణ చిత్తమునుండి తప్పిపోవుట విశ్వాసి జీవితములో సాధ్యమే. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సౌలు ఎన్నుకొనబడ్డాడు, అయితే క్రమేపీ అతని అసహనమును బట్టి మరియు అవిధేయతను బట్టి దేవుడు సౌలును నిరాకరించ వలసి వచ్చింది. కొన్ని సంవత్సరాలు అతడు సింహాసనం మీద ఉండుట నిజమే, కాని తన జీవితములో దేవుని చిత్తమునుండి అతడు తప్పిపోయాడు. సొలొమోను దీనికి మరొక ఉదాహరణ. తన జీవిత ప్రారంభ దశలో దేవుణ్ణి అతడు సంతోషపరచాడు, కాని తరువాత అన్యులైన స్త్రీలను వివాహం చేసుకొనుటను బట్టి పడిపోయాడు.

అరణ్యములో నశించిన ఇశ్రాయేలీయుల దృష్టాంతమును గురించి జాగ్రత్త పడవలసినదిగా క్రొత్త నిబంధనలో రెండుసార్లు మనము హెచ్చరించబడ్డాము. వారు కనానులోనికి ప్రవేశించాలనేది వారికోసమైన దేవుని పరిపూర్ణ ప్రణాళిక. ఇద్దరు తప్ప మిగిలిన వారందరు వారి అవిశ్వాసము, అవిధేయతను బట్టి దేవుడిచ్చు శ్రేష్టమైన దానిని వారు కోల్పోయారు (1కొరింథీ 10:1-12; హెబ్రీ 3:7-14), అనేక మంది విశ్వాసులు ఇదేవిధముగా వారి జీవితములలో అవిధేయత ద్వారా మరియు రాజీపడుట ద్వారా వివాహములో, వృత్తిని ఎంచుకొనే విషయములో దేవుని యొక్క సంపూర్ణ చిత్తమును కోల్పోయారు.

జి. క్రిస్టియన్‌ విస్‌ అనే వ్యక్తి ”ది పర్‌ఫెక్ట్‌ విల్‌ ఆఫ్‌ గాడ్‌” (దేవుని సంపూర్ణ చిత్తము) అను పుస్తకములో ఈవిధముగా చెప్తాడు -ఒక బైబిలు పాఠశాల ఉపాధ్యాయుడు ఒక రోజు తన విద్యార్ధులకు ఈవిధముగా చెప్తాడు "నా జీవితములో ఎక్కువ భాగము దేవుని యొక్క రెండవ శ్రేష్టమైన ప్రణాళికలో జీవించాను". అతడు యౌవనస్తుడుగా ఉన్నప్పుడు మిషనరీగా వెళ్ళమని దేవుడు పిలిచాడు కాని అతడు వివాహము చేసుకొనుటను బట్టి ఆ పిలుపును తిరస్కరించాడు. ఆ తరువాత అతడు కేవలము డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యముతోనే స్వార్ధపూరితముగా వ్యాపారం చేస్తూ, బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. దేవుడు ఎన్నో సంవత్సరములు అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు కాని అతడు లోబడలేదు. ఒకరోజు అతని కుమారుడు (చాలా చిన్నవాడు) కుర్చీలోనుంచి క్రిందపడి మరణిస్తాడు. ఆ సంఘటన అతడిని మోకాళ్ళ మీదకు నడిపించినది. రాత్రి మొత్తం దేవుని సన్నిధిలో కన్నీటితో గడిపిన తరువాత తన జీవితము పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇప్పుడు అతడు ఆఫ్రికా వెళ్ళుటకు చాలా ఆలస్యమైనది. ఆ ద్వారము మూయబడినది. తన జీవితములో దేవుని యొక్క శ్రేష్టమైన ప్రణాళిక ఏమిటో అతనికి తెలుసు, కాని దాని నుండి అతడు తప్పిపోయాడు. ఇప్పుడు అతడు చేయగలిగినది కేవలము తన మిగిలిన జీవితమును దేవుని ఉపయోగించుకొనుమని అడుగుట మాత్రమే. తరువాత అతడు ఒక బైబిలు పాఠశాలలో ఉపాధ్యాయుడయ్యాడు కాని కేవలము అది దేవుని యొక్క రెండవ శ్రేష్టమైన ప్రణాళికని ఎప్పుడూ మరచిపోలేదు.

జి. క్రిస్టియన్‌ విస్‌ ఇంకా ఇలా చెప్పాడు "ఈ విధమైన సాక్ష్యం కలిగిన వారిని ఎంతో మందిని నేను కలిశాను. సాధారణముగా ఈ సాక్ష్యములు బాధతో, కన్నీటితో కూడుకొని ఉంటాయి. పాపము చేసిన వారినైననూ మరియు గతములో దేవుని యొక్క చిత్తమును చేరుటకు ఉన్న ఒకే ఒక్క ప్రవేశమును పోగొట్టుకొన్న వారిని కూడా ఉపయోగించుకొనుటకు ఆయనకు మార్గములు కలవు. దీనిని బట్టి దేవునికి వందనములు. కాని ఆయన మొదటిగా కోరుకొనిన విధముగా జీవితము ఎప్పటికినీ ఉండదు. ఒకరి జీవితములో దేవుని యొక్క చిత్తమును కోల్పోవుట అనేది ఎంతో విచారకరం. క్రైస్తవుడా, ఈ మాటలను, సాక్ష్యమును గమనించు. దేవుని ప్రథమ ఉద్దేశ్యాన్ని పోగొట్టుకుంటావేమో జాగ్రత్త. తనకు అప్పగించుకొనిన ఎవరి జీవితమునైనా మరియు ఏ సమయములో అప్పగించుకొనినా నిస్సందేహముగా దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. కాని, జీవితారంభములోనే ఆయన చిత్తమునకు మనము సమర్పించుకొని తరువాత వచ్చే బాధాకరమైన మరియు అవమానములనుండి తప్పించుకొనవచ్చు”.

కేవలము మనము కోరుకొన్న ప్రదేశం (స్థానం) లో ఉండి, మనం జయజీవితమును జీవించలేము. లేక దేవునికి సంపూర్ణముగా ఉపయోగపడలేము. లేక ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండలేము. కొంత మంది వారి వృత్తిని (ఉద్యోగమును) మరియు నివసించే ప్రదేశమును వారే ఎంచుకొని అక్కడ నుండి దేవునికి సాక్షులుగా ఉందామని అనుకుంటారు. అటువంటి వారిని దేవుడు తన కనికరము చొప్పున చాలా పరిమితముగా (తక్కువగా) వాడుకుంటాడు. కాని వారు ఆసక్తితో దేవుని యొక్క ప్రణాళికను కనుగొని మరియు దేవుని యొక్క సంపూర్ణ చిత్తములోనుండి ఉంటే ఆయన ద్రాక్షతోటలో ఎంత ఉపయోగపడి ఉండే వారో, అందులో చాలా కొద్ది భాగము మాత్రమే ఈ విధముగా ఉపయోగపడతారు. తక్కువ ఆత్మీయ అభివృద్ధి, పరిమిత ఫలములు దేవుని యొక్క నియమములను నిర్లక్ష్యం చేసినందువల్ల వచ్చే పరిణామాలు.

ఏదైనా ఒక విషయములో నీవు దేవునికి అవిధేయత చూపించినట్లయితే, ఇంకా ఆలస్యం కాకమునుపే నీవు ఆయన వైపు తిరుగు. యోనా విషయములో జరిగినట్లుగా, నీ జీవితములో దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికకు తిరిగి వచ్చుటకు నీ విషయములో సాధ్యపడవచ్చును. మనందరికీ ఉన్నది ఒకే ఒక్క జీవితము. దేవుడు నాకిచ్చిన పనిని కడముట్టించితిని అని తన జీవిత చివరి భాగములో చెప్పిన పౌలు వలె చెప్పగలిగిన మనుష్యుడు ధన్యుడు (2 తిమోతి 4:7).

లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలచును (1 యోహాను 2:17).

"జీవితం యొక్క అర్థం మరియు ఉద్దేశ్యం తెలియని వ్యక్తులుగా కాకుండా, సరైన బాధ్యతతో జీవితాన్ని గడపండి. ఈ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అస్పష్టంగా ఉండకండి, కానీ దేవుని చిత్తమని మీకు తెలిసిన దానిని గట్టిగా పట్టుకోండి" (ఎఫె. 5:15-17- JBP).