WFTW Body: 

మత్తయి 5:3లో, "ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు" అని యేసు చెప్పారు. "ధన్యత" అనే ఈ పదానికి "సంతోషం" లేదా యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పినట్లుగా "అసూయపడదగిన వ్యక్తి" అని అర్థం వస్తుంది. మీరు భూమిపై ఎవరి మీద అయినా అసూయపడాలనుకుంటే, ధనవంతుడిని చూసి అసూయపడకండి, ప్రసిద్ధమైన వ్యక్తిని చూసి అసూయపడకండి మరియు అందంగా కనిపించే వ్యక్తిని చూసి అసూయపడకండి. ఆత్మ విషయమై దీనుడైన వ్యక్తిని చూసి అసూయపడండి, ఎందుకంటే పరలోక రాజ్యం అతనిదే. ఆకర్షించగలిగిన స్వభావం మరియు సంపద వంటి అనేక ఇతర లక్షణాలు ఉన్న వ్యక్తులు ఈ భూమిపై వస్తువులను కలిగి ఉండవచ్చు మరియు భూమిపై రాజ్యాన్ని కలిగి ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యం ఆత్మలో దీనులదే (పేదవారిదే). దీర్ఘకాలంలో, నిజంగా అసూయపడవలసినది ఇతనినే, ఎందుకంటే అతని సంపద నిత్యత్వం ఉంటుంది. భూమిపై మన జీవితకాలం గురించి ఆలోచించినప్పుడు, అది 70 లేదా 80 సంవత్సరాలు అయినప్పటికీ, మనిషి నిత్యత్వపు జీవి అని మీరు నిజంగా నమ్మితే (నిత్యత్వం ఎప్పటికీ అంతం కాదు, లక్షలాది సంవత్సరాలు నిత్యత్వంలో ఒక సెకను లాంటివి), 70 సంవత్సరాలు ఎంత? కనీసం లెక్కలోనికి రావు! ప్రభువు ముందు వెయ్యి సంవత్సరాలు ఒక రోజు లాంటిదని మరియు ఒక రోజు వెయ్యి సంవత్సరాల వంటివని 2 పేతురు చెప్తుంది. నిత్యత్వంయొక్క వెలుగులో, భూమిపై మన మొత్తం జీవితం చాలా చిన్నది.

దేవుని రాజ్యంలో నిజంగా భవిష్యత్తును కోరుకునేవాడు జ్ఞానవంతుడు. దేవుని రాజ్యంలో అత్యధిక ఆస్తులను కలిగి ఉండేవాడు ఆత్మలో దీనుడని మనకు ఇక్కడ చెప్పబడింది. ఇది చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని మాట. ఎందుకంటే వారు లేఖనాలలోని గందరగోళపరచే ప్రకటనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. వారు చదివి ముందుకు సాగుతారు. నాకు సహాయపడిన ఒక విషయం ఏమిటంటే, ఒక దృష్టాంతంతో ఆలోచించడం. నేను దృష్టాంతంతో ఆలోచించినప్పుడు, లేఖనం యొక్క స్పష్టమైన అవగాహన లభిస్తుందని కనుగొన్నాను. నిజానికి, స్వయంగా యేసు ఉప్పు మరియు వెలుగు వంటి దృష్టాంతాలతో మరియు అనేక ఉపమానాల ద్వారా అనేక సిద్ధాంతాలను వివరించాడు.

మనం "ఆత్మలో పేదవాడి"ని "శరీరంలో పేదవాడి"తో పోల్చవచ్చు. ఎందుకంటే మనిషి ఆత్మ మరియు శరీరంగా ఉన్నాడు. శరీరంలో పేదవాడు అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఒక బిచ్చగాడు శరీరంలో పేదవాడు, అంటే అతని శారీరక అవసరాలను తీర్చుకోవడానికి అతనికి ఏమి లేదు. వీధుల్లో నివసిస్తున్న నిజంగా పేద బిచ్చగాడు ఇంటింటికీ వెళ్లి తన అవసరాల కోసం అడుక్కుంటూ ఉండవచ్చు, రోజుకు తగినంత మాత్రమే పొందవచ్చు, ఆపై మరుసటి రోజు కోసం మరికొంచెం పొందడానికి అతను అదే ఇంటికి తిరిగి రావాలి. కాబట్టి ఆ చిత్రాన్ని "ఆత్మలో పేదవాడు" అనే పదానికి వర్తింపజేస్తే, ప్రతిరోజూ తన ఆత్మీయ అవసరతను ఎరిగిన వ్యక్తి గూర్చి యేసు చెప్పినట్లు మనం చూస్తాము. ఆయన, ప్రతిరోజూ తన శారీరక అవసరాన్ని ఎరిగి సహాయం కోసం ఒక ఉదారవాది ఇంటికి వెళ్ళే ఒక బిచ్చగాడిలాగే ఉన్న వ్యక్తిని వర్ణిస్తున్నాడు. ఆ వ్యక్తి అతనిని, "నిన్న నేను నీకు ఇచ్చినది ఏమైంది?" అని అడిగితే, "అది నిన్ననే అయిపోయింది - నిన్న నువ్వు నాకు ఇచ్చిన డబ్బు నిన్నటి అవసరానికి సరిపోయింది, మళ్ళీ నాకు అవసరం ఉంది. నా దగ్గర డబ్బు లేదు, నేను అవసరంలో ఉన్నాను" అని అతను అంటాడు.

"ఆత్మలో పేదవాడైన" వ్యక్తి దేవుని వద్దకు వచ్చి, "ప్రభువా, నేను పేదవాడిని" అని చెప్తాడు. అతను ప్రతిరోజూ తన ఆత్మీయ అవసరాన్ని తెలుసుకుని దేవుని వద్దకు వచ్చి, తన ఆత్మీయ అవసరాన్ని తీర్చుకోవడానికి సహాయం కోసం అడుగుతాడు. ఒక బిచ్చగాడు తన శారీరక అవసరాలను తీర్చుకోవడానికి సహాయం కోరినట్లుగానే ఇతను కూడా అడుగుతాడు.

ఈ పరిస్థితి గురించి మాట్లాడే ఒక వచనం సామెతల గ్రంథంలో ఉంది. సామెతలు 8వ అధ్యాయం జ్ఞానం గురించి చెప్తుంది, క్రీస్తు ఇక్కడ జ్ఞానంగా చిత్రీకరించబడ్డాడు, "జ్ఞానమను నేను.." (12వ వచనంలో ప్రారంభమవుతుంది). జ్ఞానం ద్వారానే ప్రపంచం సృష్టించబడిందని ఆయన చెబుతున్నాడు. 24వ వచనంలో ఆయన అక్కడ మైదానాలు భూమి మరియు మిగతావన్నిటికంటే ముందు - ఆయన ఆకాశాలను స్థాపించినప్పుడు (27వ వచనం), ఆయన అక్కడ ఉన్నాడని చెబుతుంది. కాబట్టి మనకు అవసరమైనది జ్ఞానం, "అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు" అని చెప్పబడింది. దేవుని ద్వారబంధముల వద్ద వేచి ఉన్న ఆ బిచ్చగాడి గురించి ఇప్పుడు ఆలోచించండి. తన రోజువారీ డబ్బు బహుమతి కోసం ఎదురు చూస్తున్న బిచ్చగాడిలాగే, మనం ప్రతిరోజూ ఆత్మీయ పేదలుగా దేవుని సన్నిధికి రావాలి.

మనం అవసరంలో ఉంటే తప్ప ఆవిధంగా రాము. ధనవంతులు ఇతరుల ఇళ్లలో బిచ్చమెత్తుకోరు; వారు అలా చేయడానికి సిగ్గుపడతారు. బిచ్చగాడు తాను అవసరంలో ఉన్నందున సిగ్గుపడడు. అతని వద్ద ఆహారం లేదా అతని రోజువారీ అవసరాలకు డబ్బు లేదు, అతనికి అది తెలుసు. ప్రతిరోజూ తన ఆత్మీయ అవసరాన్ని గురించి తెలిసిన వ్యక్తి మాత్రమే ప్రతిరోజూ దేవుని సన్నిధికి వచ్చి, "ప్రభువా నేను అవసరంలో ఉన్న వ్యక్తిని. దయచేసి ఈరోజు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి" అని అంటాడు. సామెతలు 8:35లో చెప్పినట్లుగా, "నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు".

ఆత్మలో పేదవాడిగా ఉండటం అంటే ఇదే: మన ఆత్మీయ అవసరాన్ని నిరంతరం తెలుసుకోవడం. తన ఆత్మీయ అవసరాన్ని నిరంతరం తెలుసుకునేవాడు మరియు దేవుని నుండి జ్ఞానం కోసం వెతుకుతున్నవాడు పరలోక రాజ్యాన్ని పూర్తిగా కలిగి ఉంటాడు. దేవుని రాజ్యం యొక్క ఐశ్వర్యంగా మీరు పరలోక రాజ్యాన్ని చూస్తే, దేవుడు క్రీస్తులో పరలోక విషయములలో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదంతో మనల్ని ఆశీర్వదించాడని ఎఫెసీ 1:3లో బైబిల్ చెబుతోంది. క్రీస్తునందు పరలోక విషయాలలో పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదం మనదే. పరలోక రాజ్యంలోని అన్ని ఆత్మీయ ఆశీర్వాదాలను వెయ్యి గదులతో కూడిన భారీ భవనంగా మనం భావించవచ్చు మరియు ఆ భవనం యొక్క ప్రతి తలుపును తెరిచే ప్రధాన తాళం ఆత్మలో పేదరికం(దీనత్వం). ఆత్మలో పేదవాడైనవాడు ధన్యుడు, ఎందుకంటే అతను మొత్తం పరలోక రాజ్యాన్ని - అంటే, భవనంలోని ప్రతి గదిని కలిగి ఉండగలడు. ఈ ప్రధాన తాళపుచెవిని గట్టిగా పట్టుకుంటే, ప్రతి గదిలోని సంపద అతనిదవుతుంది.