ఐగుప్తు బంధకాల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొని వచ్చి వారిని అరణ్యంలోనుండి నడిపిస్తునప్పుడు, ఆయన వారికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు "నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను" (నిర్గమకాండం 25:8). ఈ పరిశుద్ధ స్థలము, ప్రత్యక్ష గుడారం అని పిలవబడింది. కానానులోనికి ప్రవేశించిన తర్వాత దాని స్థానంలో దేవాలయం నిర్మించబడింది.
ఈ వచనం నుండి మనం చూసే విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని ఆశ కలిగి ఉన్నాడు. క్రీస్తు వచ్చినప్పటి నుండి, దేవుడు భౌతికమైన ఏ నిర్మాణంలోనూ నివసించడు. ఇప్పుడు ఆయన మానవ హృదయాలలో మరియు గృహాలలో నివసించాలని కోరుతున్నాడు. ఈరోజు కూడా ఆయన, ‘నేను నివసించునట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుడి’ అని చెప్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవుడు భార్యాభర్తలను వివాహంలో ఐక్యపరిచాడు. వారు, దేవుడు వారితో కూడా నివసించే ఒక పరిశుద్ధ స్థలముగా వారి ఇంటిని నిర్మించాలి.
దేవుని మహిమ కొరకు గృహమును నిర్మించుట
సాధారణంగా ప్రజలు వివాహం చేసుకున్నప్పుడు వారి కొరకు ఒక ఇంటిని నిర్మించుకోవాలని ఆలోచిస్తారు. ప్రతి క్రైస్తవేతర జంట కూడా ఇదే గురిని కలిగి ఉంటారు. అయితే విశ్వాసులుగా ప్రభువైన యేసుక్రీస్తును మరియు ఆయన వాక్యమును ఘనపరచాలంటే, మనం మన కొరకే ఇంటిని నిర్మించుకోకూడదు. దేవుడు నివసించునట్లుగా పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. నిజమైన క్రైస్తవ గృహానికి క్రైస్తవేతరుల గృహానికి ఉన్న ప్రాథమికమైన తేడా ఇదే. అనేకమంది విశ్వాసుల యొక్క లక్ష్యం ఇది కానందున వారి గృహాల్లో అనేకమైన బాధలను, భక్తిహీనతను మనం చూస్తున్నాం. వారు దేవుని కొరకు కాక తమ కొరకే ఇంటిని నిర్మించుకున్నారు.
ప్రజలు వివాహం చేసుకున్నప్పుడు వారు ఎంత సంతోషంగా ఉండబోతున్నామన్న దానిపై గొప్ప ఆశలను కలిగి ఉంటారు. అయితే ఆరు నెలల తర్వాత వాస్తవ పరిస్థితి బోధపడుతుంది, అది పూర్తిగా వేరుగా ఉంటుంది. వారు ఎప్పుడూ పొట్లాడుతూ, ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. వారి పదవ పెళ్లిరోజు వచ్చేసరికి అనేకమంది జంటలు ఒకరిపై ఒకరు విసుగుచెంది మరియు చికాకుతో ఉంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వారి కొరకే స్వార్థంతో తమ ఇంటిని నిర్మించుకున్నారు. అయితే మనం దేవుణ్ణి ఘనపరుచుటకు, ఆయన కొరకు ఇంటిని నిర్మించుటకు మాత్రమే చూసినట్లయితే సంతోషకరమైన వివాహ జీవితమును మనం కలిగి ఉండవచ్చని దేవుని వాక్యము చెప్తుంది.
పాత నిబంధనలోని ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ఉద్దేశం, వివాహమైన జంటల కొరకైన దేవుని ఉద్దేశం ఒకటే. తన మహిమ కొరకు వారు ఇంటిని కట్టుటకు ఆయన వారిని వివాహంలో జతపరుస్తాడు. నిర్గమకాండంలో, వారు ప్రత్యక్ష గుడారమును కట్టుటకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితమైన కొలతలను ఇచ్చాడు. వారు ఆయన ఆజ్ఞాపించిన ఖచ్చితమైన విధానంలో దాన్ని నిర్మించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రణాళికను ఉన్నదున్నట్లుగా దీనులుగా వెంబడించారు. దాని ఫలితముగా ప్రత్యక్ష గుడారముపై దేవుని మహిమ నిలిచింది (నిర్గమకాండం 40:34,35). దేవుని మహిమ నీ ఇంటిలో నివసించాలంటే నీవు కూడా నీ యొక్క ఇంటిని ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ప్రకారం కట్టుకోవాలి. ప్రభువు లేఖనములలో ఆజ్ఞాపించినట్లుగా నీ వివాహమును కట్టుకొనుటకు కోరుకొనుము. అప్పుడు దేవుని మహిమ నీ ఇంటిపై కూడా నిలిచి ఉంటుంది.
దేవుని క్రమము ప్రకారము గృహమును నిర్మించుట
మనం అనేక క్రైస్తవ గృహాల్లో ద్వేషం, అసూయ, సణుగుట, ధనాపేక్ష చూస్తాము. క్రైస్తవేతర గృహాలతో పోలిస్తే ఇది ఎంత మాత్రము వ్యత్యాసమైనది కాదు. దీనికున్న కారణము ఎంతో స్పష్టమైనది: దేవుని మహిమ ఆ ఇంటిని నింపలేదు, ఎందుకంటే ఆ జంట దేవుని వాక్యానుసారంగా తమ ఇంటిని కట్టుకొనుటకు చూడలేదు. దానికి బదులుగా, వారి సొంత కారణాన్ని అనుసరించి వారి ఇంటిని కట్టుకున్నారు.
1కొరంథీ 13లో గృహము కొరకైన దేవుని క్రమమును స్పష్టంగా మనం చూస్తాము: పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. "క్రీస్తు ఈ గృహమునకు అధిపతి" అనే మాటలను మనం సాధారణంగా క్రైస్తవ గృహాలలో ఒక చెక్కపలకపై చూస్తాము. కానీ నిజానికి క్రీస్తు ఆ గృహమునకు అధిపతి కాదు. దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు హవ్వకు తలగా ఆదామును నియమించాడు. దేవుడే ఆదాము యొక్క తలగా ఉన్నాడు. దేవుడు ఇద్దరినీ జతపరిచినప్పుడు ఆ తర్వాత వెంటనే సాతాను ప్రవేశించినట్లుగా మనం లేఖనంలో చదువుతాము. ఇది మనకు ఏం బోధిస్తుందంటే ఈరోజు కూడా దేవుడు ఒక పురుషున్ని స్త్రీని వివాహంలో జతపరిచిన వెంటనే సాతాను ప్రవేశిస్తాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి. మన గృహాలలోనికి సాతాను ప్రవేశించకూడదు.
మొదటి ఇంటిలోనికి సాతాను ఏ విధంగా ప్రవేశించాడు? ఆదాము హవ్వలు దేవుని యొక్క క్రమమును వెంబడించలేని కారణం చేతనే. సాతాను హవ్వ దగ్గరకు వచ్చి దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపమని సలహా ఇచ్చినప్పుడు, "సాతాను, ఈ నిర్ణయాన్ని నా అంతట నేను తీసుకోలేను. దేవుడు నాకు ఒక తలను ఇచ్చాడు, మొదటిగా అతణ్ణి సంప్రదించనివ్వు. ఆ తర్వాత వచ్చి నీకు సమాధానం చెప్తాను" అని ఆమె చెప్పి ఉండాల్సింది. ఆమె ఆవిధంగా చేసినట్లయితే, ఆ కథ ఎంత వేరుగా ఉండేదో కదా!. కానీ సాతానుతో ఆమె సంభాషణను కొనసాగించి తన తలను సంప్రదించకుండానే ఆఖరి నిర్ణయం తీసుకుంది. ఆమె దేవుని యొక్క చట్టమును ఉల్లంఘించి, తర్వాత తన భర్తను కూడా దేవునికి అవిధేయత చూపమని చెప్పింది. అప్పుడు ఆదాము, "దేవుడు నా తల, మొదటిగా ఆయనను సంప్రదించనివ్వు" అని చెప్పాల్సింది. అయితే అతను దేవుని క్రమమును వెంబడించలేదు. వారి ఇంటిలో వారు దేవుని క్రమమును వెంబడించినట్లయితే ఈ లోకంలో ఈరోజు మనం చూస్తున్న పాపం, దుఃఖం, కలవరం అన్నీ ఉండేవి కాదు. ఈరోజు కూడా ఈ విధంగానే సాతాను అనేక గృహాలలోనికి ప్రవేశించి వాటిని నాశనం చేస్తున్నాడు. కీర్తన 127:1 ఈ విధంగా చెప్తుంది, "యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే".
మనం ఆయన వాక్యానికి ఖచ్చితమైన విధేయత చూపడమే, ప్రభువు మన ఇంటిని నిర్మించకలుగుటకు మార్గం.