వ్రాసిన వారు :   Santosh Poonen విభాగములు :   గృహము సంఘము శిష్యులు
WFTW Body: 

పరిశుద్ధాత్మయొక్క పాతనిబంధన పరిచర్యకు మరియు క్రొత్తనిబంధన పరిచర్యకు ఉన్న వ్యత్యాసమును చూపించుటకు నా తండ్రి (జాక్ పూనెన్)గారు ఒక సాదృశ్యాన్ని చెప్పేవారు: పాతనిబంధనలో మానవుని హృదయము మూతవేసిన గిన్నెవలె ఉన్నది (అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళకుండా ఒక తెర ఉన్నట్లుగా). మోషే, బాప్తిస్మమిచ్చు యోహాను మొదలగు వారివలె మూతవేయబడియున్న గిన్నెమీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి, దానిమీదుగా ఆశీర్వాదములనే నదులు అనేకుల మీదకు ప్రవహించేవి.

కాని క్రొత్తనిబంధనలో ఆ మూత అనగా ముసుగు తీసివేయబడింది (2కొరింథీ 3:12-18). ఇది, యేసు మరణించినప్పుడు దేవాలయపు తెర నిలువునా చీలిపోయి అతిపరిశుద్ధ స్థలములోనికి మార్గము తెరువబడుట ద్వారా చూపించబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మొదటిగా గిన్నెనిండి విశ్వాసి హృదయాన్ని శుద్ధిచేసి మరియు యేసు యోహాను 7:37-39లో వివరించినరీతిగా అనేకులను ఆశీర్వదించుటకు వారి కడుపులోనుండి జీవజల నదులు ప్రవహించును. ఆ విధముగా క్రొత్తనిబంధన సంఘము నిర్మించబడుతుంది.

ఇప్పటికీ మనం పరిశుద్ధాత్మను ఇతరులకు బోధించుట కొరకు మాత్రమే ఉపయోగించినట్లయితే అప్పుడు మనం కేవలము ఒక సమాజమునుగాని క్లబ్‍నుగాని నిర్మిస్తాము. కాని మనం మొదటిగా దేవునిచేత నింపబడుటకు, మన హృదయములలో ఆయన ప్రేమ కుమ్మరింపబడుటకు అనుమతించినట్లయితే, అప్పుడు ఆయన మన హృదయాంతరంగములలో నుండి ఇతరులలోనికి ప్రవహించును. అప్పుడు మనం అటువంటి సహవాస ఆత్మను కలిగినవారితో సంఘమును నిర్మించగలము. మన హృదయములలో నుండి దేవుని యెడల మరియు ఇతరుల యెడల ప్రేమ ప్రవహిస్తుంది మరియు మనలో ప్రతిఒక్కరు సిలువ నెత్తుకొనుచున్నయెడల ఆత్మ మనలో కలిగించే ఐక్యత ద్వారా నిర్మించబడగలము.

నిజానికి, మనం ఒకరికి ఒకరు దూరముగా ఉన్నప్పుడే సంఘముగా నిర్మించబడతాము. ఆదివారపు కూటములలో మాత్రమే మనము నిర్మించబడము. అవును, అక్కడ పరిశుద్ధాత్మ వరముల ద్వారా నిర్మించబడగలము. కాని మనం దూరముగా ఉన్నప్పుడు మరి ఎక్కువగా నిర్మించబడతాము. నీవు అనేక విధములుగా - అనగా నిజాయితీగా లేకుండుటకును, లేక కోపగించుటకును, లేక మోహపుచూపులు చూచుటకును మొదలగు వాటిలో శోధించబడినప్పుడు, నీవు యేసు సంఘములో పాలిభాగస్థుడవా లేదా అనేది రుజువు చేయబడుతుంది. ఈ శోధనలలో మన సిలువ నెత్తుకొని, మన స్వజీవానికి చనిపోయి, ప్రభువు ప్రేమలో నిలుకడగా ఉంటూ, మరియు పాపమును ఎదిరించినయెడల అప్పుడు మనము వెలుగులో నడిచి మరియు ప్రభువుతో సహవాసము కలిగియుంటాము. అప్పుడు మనము కలుసుకొన్నప్పుడు ఒకరితో ఒకరు నిజమైన సహవాసము కలిగియుండగలము (1యోహాను 1:7).

మన హృదయములు 'ప్రేమలో అతుకబడటము' గురించి కొలొస్సి 2:2లో చెప్పబడింది. నాయంతట నేను ఇతరులతో ప్రేమలో అతుకబడలేను. కేవలము పరిశుద్ధాత్ముడు మాత్రమే మన హృదయములను ప్రేమలో అతుకబడునట్లు చేయును. ఆవిధంగా కాకుండా, నేను మానవ పద్ధతిలో బహుమానము లిచ్చుట, లేక సమయము గడుపుట మొదలగు పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తే, నేను ఒక క్లబ్‍నే నిర్మిస్తాను. "కేవలము నీ స్వజీవానికి చనిపో" అని దేవుడు చెప్పుచున్నాడు. ఆవిధంగా నన్ను నేను ఉపేక్షించుకొనప్పుడు, పరిశుద్ధాత్ముడు నా హృదయమును నన్ను ఉంచిన స్థానిక సంఘములో నావలె తమ్మునుతాము ఉపేక్షించుకొను వారితో అదృశ్యమైన, అతీతమైన రీతిలో అతుకచేస్తాడు.

అప్పుడు మనం ఒకే సిద్ధాంతాన్ని నమ్ముట వలనగాని పాటలు పాడుట వలనగాని కాక మనం భూమిలోపడి స్వజీవానికి చనిపోవుటవలన మన సహవాసము మధురముగా ఉంటుంది. ఆ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం సహవాసము కలిగియుండగలము.

స్వయానికి చనిపోకుండా ఉన్న ఐక్యత ఏదైనను అది కేవలము స్నేహానికి దారి తీస్తుంది కాని నిజమైన క్రైస్తవ సహవాసమునకు కాదు. సహవాసము ఆత్మ సంబంధమైనది, కాని స్నేహము భూలోక సంబంధమైనది.

లోకములోని ప్రజలు స్నేహాన్ని కలిగియుంటారు. లోకానుసారమైన క్లబ్‍లలోని వారు సన్నిహిత స్నేహాన్ని కలిగియుండి ఒకరియెడల ఒకరు జాగ్రత్త వహిస్తారు. కాని వారు నిజమైన సహవాసము కలిగియుండరు - ఎందుకనగా అది పరిశుద్ధాత్ముడు మన జీవితములలో చేసే ఆత్మ సంబంధమైన కార్యం. తన పిల్లలెవరైనను "యేసు యొక్క మరణానుభవమును తమ శరీరమందు వహించుచున్నట్లు" దేవుడు చూచినట్లయితే వారికి బహుమానముగా, "యేసు జీవాన్ని సమృద్ధిగా" ఇచ్చును (2కొరింథీ 4:10,11). ఇద్దరు విశ్వాసులలో ఉన్న ఈ "యేసు జీవము" మాత్రమే వారి మధ్యలో నిజమైన సహవాసాన్ని తెస్తుంది. అటువంటి వారితోనే దేవుడు తన క్రొత్తనిబంధన సంఘమును నిర్మిస్తాడు.

ఈ సత్యములను చూచుటకు నేను ఆరంభించినప్పుడు, "ప్రభువా, నీ నిజమైన సంఘమును నిర్మించాలని కోరువారు ఎక్కడ ఉన్నారు?" అని ప్రభువును ప్రార్థించుట ఆపివేశాను. మొదటిగా నేను భూమిలోపడి చనిపోయిన యెడల, దేవుడే అటువంటి వారిని మన యొద్దకు నడిపిస్తాడని గుర్తించాను. నేను నా స్వజీవానికి చనిపోవుటకు నిరాకరించినయెడల, దేవుడు వారిని నాయొద్దకు తీసుకొనిరాడు.

మన చుట్టు ప్రక్కల ఉన్నవారిలో పూర్ణహృదయులైన విశ్వాసులను వెదకుట "ఒక గడ్డివాములో సూదులను" వెదకినట్లుంటుంది. ఆ గడ్డివాములో ఆ చిన్న సూదులను వెదకుటకు మనం అనేక సంవత్సరములు ప్రయత్నించవచ్చును. బహుశా అనేక సంవత్సరముల తరువాత ఒక సూదిని కనుగొనవచ్చును. కాని ప్రభువు "ఆ సూదుల కొరకు వెదకుటలో నీ సమయాన్ని వృధా చేసుకొనవద్దు. వారు ఎక్కడున్నారో నాకు తెలుసు. నీవు కేవలము భూమిలో పడి నీ స్వజీవానికి చనిపో" అని చెప్తున్నాడు. అప్పుడు నీలో ఉన్న యేసు జీవము అయస్కాంతమువలె గొప్ప శక్తి కలిగి, "ఆ సూదులను" (హృదయపూర్వకమైన శిష్యులను) ఆకర్షించును (యోహాను 1:4; 12:32).

దైవభక్తి కలిగిన జీవితముకొరకు చూచువారు, క్రొత్తనిబంధన సంఘమును నిర్మించాలని కోరే ఇతర విశ్వాసులు మీ యొద్దకు మరియు సిలువ యొక్క సందేశానికి ఆకర్షింపబడతారు. అది దేవుని మార్గము. పూర్ణహృదయముతో ఉన్నవారిని ఆయన మన యొద్దకు నడిపిస్తాడు. యోహాను 6:37లో "నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నాయొద్దకు వత్తురు" అని యేసు చెప్పెను. తండ్రియైన దేవుడు మనకు కూడా అలాగే చేస్తాడు. ఆ విధంగా క్రొత్తనిబంధన సంఘమును నిర్మిస్తాము.