క్రైస్తవత్వంలోని గొప్ప విషాదం ఏమిటంటే, గొప్పపని యొక్క మొదటి సగాన్ని నెరవేరుస్తున్న చాలా మంది క్రైస్తవులు రెండవ సగం నెరవేర్చడం ఎంత ముఖ్యమో గ్రహించకపోవడం. అధ్వాన్నమైన విషయం ఏమిటంటే, మొదటి సగాన్ని పూర్తి చేసే అనేకమంది పనివారు, రెండవ సగం పూర్తి చేయాలని కోరుకునే వారిని తృణీకరిస్తారు. మనం దీనులమైతే, మనం క్రీస్తు శరీరంలో తోటి పనివారిగా ఉన్నామని మరియు ఒక పని మరొక దానివలె ముఖ్యమైనదని చూస్తాము. క్రీస్తు వారి పాపాల కోసం మరణించాడన్న సందేశంతో సువార్త వినని వారిని చేరుకోవడానికి బయలుదేరిన వ్యక్తియొక్క పని ఎంత ముఖ్యమో, ఆ వ్యక్తిని శిష్యుడిగా చేసి అతనికి యేసు ఆజ్ఞాపించినదంతయు బోధించి ఆ పనిని పూర్తి చేయాలని కోరుకునే వ్యక్తియొక్క పని కూడా అంతే ముఖ్యం.
గొప్పపని యొక్క మొదటి భాగాన్ని పూర్తి చేయడం చాలా ఉత్తేజకరమైనది ఎందుకంటే ఈ పని తరచుగా అనేక అద్భుతమైన కథనాలను అందిస్తుంది. మిషనరీ మరియు సువార్త పని యొక్క నిజమైన కథనాలు ఎల్లప్పుడూ ఉత్తేజకరంగా ఉంటాయి. దెయ్యాలు మరియు విగ్రహారాధన నుండి విముక్తి పొందిన వ్యక్తుల గురించి కథనాలు మరియు అలాంటి అనేక విషయాలు ఉన్నాయి మరియు ముఖ్యంగా నివేదించడానికి చాలా గణాంకాలు ఉన్నాయి. సువార్తికులు వారు క్రీస్తు వద్దకు తీసుకువచ్చిన వ్యక్తుల సంఖ్య గురించి ప్రగల్భాలు పలుకవచ్చు. అయితే ఆ మారినవ్యక్తిని యేసు బోధించిన వాటన్నిటికీ కట్టుబడి ఉండే శిష్యునిగా చేస్తున్న మరో క్రైస్తవ పనివాని విషయమేమిటి? ప్రగల్భాలు పలికేందుకు అతని వద్ద గణాంకాలు లేవు, కానీ క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి శిష్యులను చేసినందుకు భూమిపై ఎటువంటి గౌరవం పొందకుండా మరింత నమ్మకమైన పని చేశాడని మనం కనుగొనవచ్చు. సాధారణంగా చెప్పాలంటే, క్రైస్తవులు తాము నివేదించగల పరిచర్యలను మరియు ఎక్కడ సంఖ్యలను చెప్పగలరో అటువంటి పరిచర్యలను చేయుటకు ఇష్టపడతారు. అందుకే గొప్పపనిలో భాగమైన మార్కు 16:15 అంశం, మత్తయి 28:19-20లోని మిగిలిన సగం కంటే చాలా ప్రజాదరణ పొందింది. అందుకే మనం మిగిలిన సగంపై దృష్టి కేంద్రీకరించాము మరియు యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయాలని ప్రజలకు బోధిస్తున్నాము.
మీరు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుని, సువార్త ప్రకటిస్తూ, సౌవార్తీకరణ చేస్తూ 25 సంవత్సరాలు గడిపారని అనుకుందాం. మీరు సువార్తికులైతే, మీరు క్రీస్తు వద్దకు తీసుకువచ్చిన వందల లేదా వేల మంది వ్యక్తుల గణాంకాలను నివేదించే అవకాశం మీకు ఉండవచ్చు. కానీ మీరు ఆ 25 సంవత్సరాలు యేసు ఆజ్ఞాపించినవన్నీ చేయమని ఇంకా శిష్యులుగా మారని మార్పుచెందిన గుంపుకు బోధిస్తూ గడిపినట్లయితే, గణాంకాల పరంగా మీకు నివేదించడానికి పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. అయితే, మీరు క్రీస్తును పోలిన వ్యక్తులను తయారుచేశారు, వారు భూమిపై క్రీస్తుకు ఎంతో మంచి సాక్ష్యంగా ఉంటారు. దేవుడు, ఆదాము యొక్క స్వభావం నుండి విముక్తి పొందిన వ్యక్తులుగా మరియు క్రీస్తు యొక్క స్వభావాన్ని వ్యక్తపరచగల వ్యక్తుల నమూనాలుగా వారిని అపవాదికి చూపించగలడు. ఆ కృషి ఈ భూమిపై కాదు పరలోకంలో మహిమను తెస్తుంది.
మీరు మనుష్యుల నుండి (తోటి క్రైస్తవుల నుండి అయినా!) గౌరవాన్ని కోరుకునే క్రైస్తవులైతే, మీరు గొప్పపని యొక్క రెండవ భాగం గురించి పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అది మీరు నివేదించడానికి ఏమి ఇవ్వదు. గణాంకాలు, సంఖ్యలు మరియు మనుష్యుల ఘనతపై మీకు ఆసక్తి ఉన్నట్లయితే, మీరు మొదటి భాగంపై మాత్రమే ఆసక్తిని కలిగి ఉంటారు. పాత నిబంధన ప్రవక్తలు ఎప్పుడూ ప్రజాదరణ పొందలేదు; ఇశ్రాయేలులో ప్రసిద్ధి చెందింది అబద్ధ ప్రవక్తలే. రెంటికి తేడా ఏమిటి? ఒక తేడా ఏమిటంటే, తప్పుడు ప్రవక్తలు ప్రజలు వినడానికి ఇష్టపడే వాటిని చెప్పారు, అయితే నిజమైన ప్రవక్తలు దేవుని నుండి వినవలసిన వాటిని ప్రజలకు చెప్పారు. చాలా తరచుగా, ఇది వారి పాపం, వారి ప్రాపంచికత, వారి విగ్రహారాధన, వ్యభిచారం మరియు వారు దేవుని నుండి దూరంగా వెళ్లడం గూర్చిన గద్దింపు. అలాగే మారుమనస్సుకు పిలుపు (దేవుని వైపుకు తిరిగి రావడం).
పాత నిబంధనలో లేదా కొత్త నిబంధనలో ప్రవచించు పరిచర్య ఎన్నడూ ప్రజాదరణ పొందలేదు. కొత్త నిబంధన ప్రవచన పరిచర్య కూడా, దేవుని ప్రజలను ఆయన వైపుకు, వాక్యం వైపుకు, తిరిగి లేఖనాలకు విధేయత చూపుటకు, యేసు బోధించినదంతా పాటించమని పిలుస్తుంది. ఇది సువార్త పరిచర్యకు భిన్నమైనది - క్రీస్తు శరీరాన్ని కేవలం ప్రవక్తలు మాత్రమే లేదా కేవలం సువార్తికులు మాత్రమే నిర్మించలేరు.
ఒక దృష్టాంతాన్ని ఉపయోగించాలంటే, సువార్త ప్రచారం ద్వారా గొప్పపని (మార్కు 16:15) యొక్క మొదటి అర్ధభాగాన్ని నెరవేర్చడం అనేది ఒక పళ్ళెం నుండి ఆహారాన్ని తీసుకొని మన నోటిలో పెట్టుకోవడంతో పోల్చవచ్చు. ప్రతి సౌవార్తీకరణ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? క్రీస్తు శరీరంలో అవయవం కాని వ్యక్తిని క్రీస్తు శరీరంలోకి తీసుకురావడం. ప్రాథమికంగా సౌవార్తీకణ అంటే అదే. సువార్త ప్రచారం అనేది ఒక అవిశ్వాసిని, విగ్రహారాధన చేసే వ్యక్తిని లేదా ఏ దేవుడు లేని వ్యక్తిని, క్రీస్తు శరీరంలో భాగమయ్యేలా చేయడానికి రూపొందించబడింది. నా చేయి ప్రస్తుతం నా శరీరంలో భాగం కాని ఆహారాన్ని పళ్ళెంలో నుండి తీసుకొని నా శరీరంలో ఉంచుతుంది. క్రైస్తవేతరుడిని క్రీస్తు శరీరంలోకి సౌవార్తీకరణ ఎలా తీసుకువస్తుందనుటకు ఇది ఒక చిత్రం.
ఆహారం పూర్తిగా శరీరంలో ఎలా భాగం అవుతుంది? అన్నింటిలో మొదటిది, నేను ఆహారాన్ని చూసి దానిని నా చేతితో తీసుకొని నా నోటిలో పెట్టుకుంటాను, ఇది సౌవార్తీకరణ, అవిశ్వాసిని తీసుకొని క్రీస్తులోనికి తీసుకురావడం. కానీ ఈ ఆహారం నా నోటిలోనే ఉంటే, నేను దానిని నా నోటిలో ఉంచుకున్నంత కాలం నా శరీరంలో భాగం కాదు. అది కుళ్ళిపోతుంది, నేను దానిని ఉమ్మివేస్తాను. చేతులు పైకెత్తి నిర్ణయకార్డులపై సంతకం చేసి, క్రీస్తు దగ్గరకు వచ్చామని చెప్పే చాలా మంది వ్యక్తులు నోటిలో పెట్టుకున్న ఆహారంలా ఉంటారు. మీరు వెళ్లి, ఈ నిర్ణయకార్డులపై సంతకం చేసిన ఐదు వందల మందిని సందర్శించండి, కేవలం వారిలో ఒకరు మాత్రమే నిజమైన శిష్యుడిగా మారినట్లు మీరు కనుగొనవచ్చు. మిగిలిన 499 మంది తొలగిపోయారు. అది అన్ని వేళలా జరుగుతుంది. ఆహారం నోటిలోకి వస్తే సరిపోదు. దంతాలు ఆహారాన్ని నమలాలి, ఆపై అది గొంతులోకి వెళ్లి కడుపులోకి వెళుతుంది, అక్కడ దానిని విచ్ఛిన్నం చేయడానికి దానిపై అన్ని రకాల ఆమ్లాలు వేయబడతాయి. ఈ సమయంలో, అది ఇకపై బంగాళాదుంప, లేదా చపాతీ, లేదా అన్నం కాదు. ఇది ఇంకా ఇతర రూపాల్లోకి మార్చబడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ మరియు శరీరం లోపల జరిగే అనేక ఇతర విషయాల తర్వాత, చివరకు ఆ ఆహారం పూర్తిగా శరీరంలో ఒక భాగం అవుతుంది. ఇది చాలా సున్నితమైన పరిచర్య, ప్రారంభంలో ఆహారాన్ని తీసుకొని నోటిలో పెట్టడం సౌవార్తీకరణ. కానీ ఆ తర్వాత, శరీరంలోని ఇతర భాగాలు దానిని తమ స్వాధీనంలోకి తీసుకుంటాయి. చేయి ఎప్పటికీ చేయలేని పనులను అవి చేస్తాయి. అదేవిధంగా, ప్రవచన పరిచర్య, బోధనా పరిచర్య, కాపరి పరిచర్య మరియు అపోస్తలుల పరిచర్యల వంటి సువార్తికులు ఎప్పటికీ చేయలేని విధులను ఇతర పరిచారకులు నిర్వహిస్తారు. ఇవన్నీ క్రీస్తు శరీరంలో ఆ వ్యక్తిని సజీవమైన, క్రియాశీలకమైన, ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన సభ్యునిగా తయారు చేస్తాయి. కొన్ని వారాల తర్వాత ఆహారం బంగాళాదుంప లేదా చపాతీ కాదు, కానీ మాంసం, రక్తం మరియు ఎముకగా మారినట్లే, సువార్తికుడు క్రీస్తు వద్దకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తిలో ఈవిధంగానే జరగాలి.
కాబట్టి ఏ పరిచర్య మరింత అవసరం? సువార్తికుడా, లేక ప్రవక్తా, లేక కాపరియా, లేక బోధకుడా? ఇది "చేయి ఎక్కువ ముఖ్యమా, లేక పళ్ళా, లేక పొట్టా?" అని అడగడం లాంటిది. శరీర భాగాలను పోల్చలేము, ఎందుకంటే చేతితో ఆహారం తీసుకోకపోతే, దంతాలు మరియు కడుపుకు ఏ పని ఉండదు; ఒకవేళ చేయి ఆహారాన్ని నోటిలో పెట్టే పనిని చేశాక, దంతాలు మరియు కడుపు ఏమీ చేయకపోతే, అది కూడా వృధా అవుతుంది. కాబట్టి ప్రవక్త కంటే సువార్తికుడు ముఖ్యమైన వాడని లేదా సువార్తికుని కంటే ప్రవక్త ముఖ్యమైన వాడని భావించడం వల్ల ప్రయోజనం లేదు. ఒకరు మరొకరి కంటే ముఖ్యమైన పనిని పూర్తి చేసినట్లు కనిపించవచ్చు, కానీ రెండూ శరీరంలో సమానంగా అవసరం. శరీరంలోని ప్రతి భాగం ఉపయోగపడేలా దాని పనితీరును నెరవేర్చడానికి ఆరోగ్యంగా మరియు కండరాలతో ఉండాలని దేవుడు నిర్ణయించాడు.