"మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల్లా ఉండకండి..." (మత్తయి 6:5). ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పించే ముందు, హెచ్చరికగా ప్రార్థన గురించి అనేక విషయాలు యేసు చెప్పారు.
మొట్టమొదటిగా, వేషధారులు ప్రార్థన చేస్తున్నట్లు కనిపించడానికి ఇష్టపడతారు. వారు అందరికి కనిపించాలని సమాజ మందిరాలలో మరియు వీధి మూలలలో నిలబడి ప్రార్థిస్తారు. వారికి "వారి ప్రతిఫలం పూర్తిగా లభిస్తుంది". ఇక్కడ సూత్రం ఏమిటంటే, మీరు బహిరంగంగా ప్రార్థిస్తునప్పుడు ఇతరులు మీ ప్రార్థనను అభినందించాలని కోరుకుంటే, అది మనుష్యుల నుండి గౌరవాన్ని కోరుకోవడం. దాదాపు ప్రతి ఒక్కరూ బహిరంగంగా ప్రార్థించడం ప్రారంభించినప్పుడు, తమ ప్రార్థనకు తాము మెప్పును కోరుకున్నామని అంగీకరిస్తారు.
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు ఏకాంతంలో ప్రార్థించే విధంగానే బహిరంగంగా ప్రార్థిస్తున్నారా? మీరు ఒంటరిగా మీ మంచం దగ్గర మోకరిల్లినప్పుడు, మీరు ఎలా ప్రార్థిస్తారు? మీరు దేవునికి ఏమి చెబుతారు? మీరు బహిరంగంగా ప్రార్థిస్తున్నప్పుడు మీరు అదే చెబుతున్నారా? లేదా చాలా మంది బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు వారు చాలా హృదయపూర్వకంగా లేదా చాలా భావోద్వేగంగా ఉన్నారని చూపుటకు మరియు ప్రజలను ఆకట్టుకోవడానికి చేసినట్లు మీరు మీ భాషను మరింత అందంగా మార్చి, మీ గొంతులో కొంచెం వణకి, నటుడిలా ప్రవర్తిస్తున్నారా?
ఇదంతా వేషధారణ. దేవుడు దానిని ద్వేషిస్తున్నాడు. దేవుని ముందు ఆవిధమైన బహిరంగ ప్రార్థన అసహ్యకరమైనదని మనం గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు దానిని అసహ్యించుకుంటాడు మరియు దానిని వినడు. సంఘాలలో అనేక బహిరంగ ప్రార్థనలు ఈ వర్గంలోకే వస్తాయి, ఇక్కడ ప్రజలు ఇతర వ్యక్తుల ముందు ఎంత బాగా ప్రార్థన చేయగలరో ప్రదర్శించడానికి ప్రార్థిస్తారు. ఇది యేసు బోధనకు పూర్తిగా విరుద్ధం. యేసు ఆజ్ఞాపించినవన్నీ వారికి బోధించబడలేదు కాబట్టి ప్రజలు దీనిని చేస్తున్నారు.
దాని నుండి మనల్ని మనం ఎలా శుద్ధి చేసుకోవాలి? మనం ప్రార్థించే ప్రతిసారీ మనల్ని మనం తీర్పుతీర్చుకోవాలి. నేను మొదటిసారి క్రైస్తవుడిగా బహిరంగంగా ప్రార్థించినది నాకు గుర్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రజల నుండి గౌరవం కోరానని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్లి నన్ను నేను తీర్పుతీర్చుకొని, "ప్రభువా, నేను ప్రార్థన చేయవలసిన విధానం అది కాదు" అని అన్నాను. తదుపరిసారి నేను లేచి బహిరంగంగా ప్రార్థించినప్పుడు, నేను ఇంకా మెప్పు కోరుతూనే ఉన్నాను, కాబట్టి నేను ఇంటికి వెళ్లి నన్ను నేను మళ్ళీ తీర్పుతీర్చుకున్నాను. బహిరంగ ప్రార్థనలో మనుష్యుల నుండి మెప్పు పొందాలనే ఈ కోరిక నుండి నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది, కానీ చివరికి, చాలా సంవత్సరాల తర్వాత, నేను సర్వశక్తిమంతుడైన దేవునికి, నా పరలోక తండ్రికి మాత్రమే ప్రార్థించడం నేర్చుకున్నాను. మీరు ఆ స్థితికి వచ్చారా? లేనట్లయితే మనుష్యుల మెప్పును కోరుకునే విషయంలో మీ రక్షణను అభ్యాసం చేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
తరువాత యేసు ఇలా అన్నారు, "మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ లోపలి గదిలోకి వెళ్ళండి; మీరు మీ తలుపు మూసివేసినప్పుడు, రహస్యంగా మీ తండ్రికి ప్రార్థించండి". మనం దీన్ని బహిరంగ ప్రార్థనలో ఎలా చేస్తాము? మన మనస్సులో మనం మూసివేయగల తలుపు ఉంటే మనం దానిని బహిరంగంగా చేయవచ్చు. నేను 100 మంది మధ్యలో నిలబడి ఉన్నప్పుడు కూడా, నా మనస్సులో ఒక తలుపు ఉంది. నేను దానిని మూసివేస్తాను. ఆపై నేను, "నేను ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు నా తండ్రి ముందు ఒంటరిగా నిలబడి ఉన్నాను" అని అంటాను. నా చుట్టూ ప్రజలు ఉండవచ్చు, కానీ నేను వారి గురించి స్పృహలో ఉండకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన కళ్ళు మూసుకోవడానికి అది ఒక కారణం. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ కళ్ళు మూసుకోవాలని చెప్పే నియమం లేదు. మీరు కళ్ళు తెరిచి ప్రార్థించవచ్చు, ఎందుకంటే యేసు కూడా కొన్నిసార్లు అలా చేశారు.
మన చుట్టూ ఉన్న ప్రజల నుండి మెప్పు కోరుకోకుండా, మన చుట్టూ ఉన్న పరిసరాల వల్ల మనం పరధ్యానం చెందకుండా ఉండటానికి మనం కళ్ళు మూసుకుంటాము. ఒక విధంగా మనం కళ్ళు మూసుకున్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నట్లే. మన మనస్సును కూడా మూసుకుని, "తండ్రీ, నేను ఇప్పుడు తలుపులు మూసుకున్నాను మరియు నేను నీకే ప్రార్థిస్తున్నాను" అని చెప్పుకోవాలి. ప్రార్థన చేయడానికి అదే మార్గం, మరియు మనం దానిని బహిరంగంగా కూడా చేయవచ్చు. మనం రహస్యంగా మన తండ్రికి ప్రార్థిస్తాము, మరియు రహస్యంగా చూసే మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. మీరు మనుష్యుల నుండి గౌరవం కోరుకోకుండా, మీ తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తే, ఆయన ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఇస్తాడని మరియు ఆ ప్రార్థనకు సమాధానం ఇస్తాడని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు.
మత్తయి 6:7లో ఎలా ప్రార్థన చేయకూడదనే దాని గురించి యేసు మనకు మరిన్ని సలహాలు ఇస్తున్నారు, "అన్యజనులు చేసే విధంగా అర్థరహితంగా మాటలు పునరావృతం చేయవద్దు ఎందుకంటే వారు తమ అనేక మాటలను బట్టి వారు వినబడతారని భావిస్తారు". అన్యులు చేసే తప్పులలో ఒకటి అర్థరహితంగా మాటలు పునరావృతం చేయటం. కొన్ని మతాలు ఏదో ఒకదాన్ని జపించే అలవాటును కలిగి ఉంటాయి. వారు కొన్ని మతపరమైన పదబంధాలను పునరావృతం చేస్తారు మరియు అది అర్థరహితమైన విషయంగా మారుతుంది.
కొంత ఆధ్యాత్మిక భాషను తీసుకొని దానిని పునరావృతం చేయడం సాధ్యమే. మనం "హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ" అని చెప్పడం సాధ్యమే మరియు కొంతకాలం తర్వాత అది చాలా అర్థరహితంగా మారుతుంది. ఇది ఒక ఆచారంగా మారుతుంది. "ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి" వంటి పదబంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. యేసు ఇలా అన్నారు, "అర్థరహితంగా దేనిని పునరావృతం చేయవద్దు". మీరు క్రొత్త నిబంధన చదివితే, హల్లెలూయ అనే పదం ప్రకటన 19 లో మాత్రమే వస్తుందని మీరు కనుగొంటారు మరియు అది "దీని కారణంగా హల్లెలూయ" అని చెప్పబడుతుంది మరియు అది మరొకసారి "దీని కారణంగా హల్లెలూయ" అని చెప్పబడుతుంది. మనం ప్రభువును స్తుతించడానికి ఒక కారణం ఉండాలి, కాబట్టి మనం అర్థరహితంగా "హల్లెలూయ" అని చెప్పకూడదు. మనం ప్రతిదానిలోనూ కృతజ్ఞతలు చెప్పాలి, కానీ అది అర్థరహిత పునరావృతం అయితే, అది చాలా మూర్ఖంగా ఉంటుంది మరియు అది దేవుని ముందు ఏ విలువాలేనిది. హల్లెలూయ యొక్క చివరి భాగం, ’యా’ అనేది యెహోవా యొక్క సంక్షిప్త రూపం కాబట్టి అది ప్రభువు నామాన్ని వ్యర్థంగా పలకడం అవుతుంది మరియు యూదు ప్రజలు ఆ పేరును ప్రస్తావించడానికి కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే వారు ప్రభువు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తారేమో అని భయపడ్డారు. చాలా మంది క్రైస్తవులు "హల్లెలూయ" అని అర్థరహితంగా చెప్పినప్పుడు ప్రభువు నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నారని నేను నమ్ముతున్నాను. నేను ప్రభువును స్తుతించేటప్పుడు దానిని తరచుగా చెబుతాను, కానీ నేను ప్రతిసారీ దానిని అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ పదాన్ని ఉపయోగించడాన్ని నేను వ్యతిరేకించను, దేవుడు కూడా వ్యతిరేకించడు. అది అర్థవంతంగా ఉండాలి కానీ అర్థరహిత పునరావృతంగా ఉండకుడదు.
క్రైస్తవులు ఇలాంటి సాధారణమైన ఆజ్ఞను ఎలా తీవ్రంగా పరిగణించడం లేదని మీరు చూస్తున్నారా? క్రైస్తవులు కాని వారు ఒక మంత్రం లాగా అర్థరహితంగా ఏదైనా పునరావృతం చేస్తారని, అది మన జీవితాల్లో నిజం కాకూడదని యేసు చెప్పారు. మనం దేవుణ్ణి గౌరవించాలి మరియు మన చెప్పేదాన్ని అర్థవంతంగా చెప్పాలి. మీరు ఏమి చెబుతున్నారో కూడా తెలియనప్పుడు మీరు రాజు, లేదా అధ్యక్షుడు లేదా భారత ప్రధానమంత్రి ముందుకు వెళ్లి ఏదైనా పునరావృతం చేయరు. మనకు దేవుని పట్ల ఇంకా ఎక్కువ భక్తి ఉండాలి. అర్థరహిత పునరావృతం మానుకోండి.
"ఎక్కువ మాటలను బట్టి మీ ప్రార్థనలు వినబడతాయని అనుకోకండి" అని కూడా యేసు చెప్పారు. అది ప్రార్థనలో చాలా మంది చేసే మరో తప్పు. వారు ఎక్కువసేపు ప్రార్థిస్తే, దేవుడు ఖచ్చితంగా తమ ప్రార్థనలు వింటాడని వారు అనుకుంటారు. "నేను 3 గంటలు ప్రార్థించాను, కాబట్టి ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థనలు వింటాడు". అది అర్ధంలేనిది. క్రైస్తవేతరులు కూడా వారు ఎక్కువసేపు ప్రార్థిస్తే, దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. అది నిజం కాదు.
కర్మేలు పర్వతంపై, బయలు ప్రవక్తలు చాలా గంటలు ప్రార్థించారు - బహుశా ఆరు గంటలు లేదా అంతకంటే ఎక్కువ - కానీ ఏమీ జరగలేదు. ఏలీయా లేచి అర నిమిషం ప్రార్థించాడు మరియు అగ్ని దిగివచ్చింది. ప్రభువు వినేలా చేసేది ప్రార్థన యొక్క పొడవు కాదు. దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
రాత్రంతా ప్రార్థించినందుకు తమ ప్రార్థనలు వినబడతాయని చాలా మంది అనుకుంటారు. "ఇదిగో, నేను రాత్రంతా ప్రార్థించాను, కాబట్టి దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇస్తాడు". ఎవరు అలా చెప్పారు? ప్రార్థనకు సమాధానాన్ని తెచ్చేది విశ్వాసం మరియు పాపం లేని హృదయం. అవే అతి ముఖ్యమైన విషయాలు. కీర్తన 66:18 ఇలా చెబుతోంది, "నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు".
మీరు రాత్రంతా ప్రార్థించినా, మీ ప్రార్థన ఎంత అద్భుతంగా అనిపించినా సరే, సరిచేసుకోని పాపం ఉంటే, మీ హృదయంలో ఒప్పుకోని పాపం ఉంటే, మీకు మరియు మీ సోదరుడికి మధ్య సరిచేయబడని సంబంధం ఉంటే, మీరు ఎవరినైనా బాధపెట్టి దేవునికి ప్రార్థిస్తుంటే దేవుడు మీ ప్రార్థన వినడు. వెళ్లి మీ సోదరుడితో ఆ విషయాన్ని పరిష్కరించుకోండి. మీకు మరియు దేవునికి మధ్య, లేదా మీకు మరియు మీ సోదరుడికి మధ్య, ఒప్పుకోని మరియు పరిష్కరించబడని పాపం ఉంటే, మీరు 1 నిమిషం లేదా 10 గంటలు ప్రార్థించినా మీరు ప్రార్థన చేస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు.