WFTW Body: 

చివరి రోజులు మోసంతోను, అనేకమంది తప్పుడు బోధకులతోను నిండి ఉంటాయని యేసుప్రభువు మరియు అపొస్తలులు మరల మరల హెచ్చరించారు (మత్తయి 24:3-5,11,24; 1తిమోతి 4:1) - గత కొన్ని దశాబ్ధాలలో వాటిని మనం ఎన్నో చూశాము.

అనేక కోట్లమంది క్రైస్తవులు ఈ తప్పుడు ప్రవక్తల ద్వారా, నకిలీ 'ఉజ్జీవముల' ద్వారా ఎందుకు మోసపోతున్నారు? ఎందుకు అనేకమంది బోధకులు అనైతికతకు, ధనాపేక్షకు బలౌతున్నారు?

కొన్ని ముఖ్యమైన కారణాలు ఇవి:

1. ఈరోజున అనేకమంది క్రైస్తవులకు కొత్తనిబంధన ఏం బోధిస్తుందో తెలియదు, ఎందుకంటే దాన్ని వారు శ్రద్ధగా చదవరు; కాబట్టి వారు కొత్తనిబంధన బోధ కాకుండా వారి నాయకుల బోధను వెంబడిస్తారు.

2. వారికి వారి స్వభావం(దైవిక జీవితం) కంటే అద్భుతాలు(మానవాతీత వరాలు) ముఖ్యమైపోయాయి.

3. ఆత్మీయధనం కంటే భౌతికధనం వారికి ముఖ్యమైపోయింది.

4. నిజమైన పరిశుద్ధాత్మ కదలికకు, మానసినమైన ఆవేశానికి లేక మానసిక ప్రేరేపణకు భేదం వారు తెలుసుకొనలేక పోతున్నారు. వారికి కొత్తనిబంధన తెలియకపోవటమే దీనికి కారణం.

5. మానసిక స్వస్థతకు (సరియైన మానసిక వైఖరి ద్వారా వచ్చే స్వస్థత), యేసునామంలో కలిగే మానవాతీతమైన స్వస్థతకు భేదం తెలుసుకొనలేకపోవుతున్నారు.

6. అంతరంగంలో ప్రభువునందు ఆనందం కంటే భావోద్వేగ ఉత్సాహం, వింతైన భౌతిక వ్యక్తీకరణలు వారికి ముఖ్యమైపోయాయి.

7. నాయకులకు, దేవునితో నడవటం కంటే వారి స్వంత పరిచర్య ముఖ్యమైపోయింది.

8. ఇటువంటి నాయకులకు, దేవుని ఆమోదం కంటే మనుష్యుల ఆమోదం ముఖ్యమైపోయింది.

9. ఈ నాయకులకు, ప్రజలు నిజంగా క్రీస్తుకు సంపూర్ణంగా లోబడి ఉన్నారన్న దానికంటే కూటములలో ప్రజల సంఖ్య ప్రాముఖ్యమైపోయింది.

10. ఈ నాయకులకు, స్థానిక సంఘాన్ని నిర్మించి, స్థానిక సంఘంలో వారిని వారు సేవకులుగా చేసుకొనుటకంటే వారి స్వంత రాజ్యాలు, వారి ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుట ముఖ్యమైపోయింది. "వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసంచేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే" (యిర్మీయా 6:13).

ఇదంతా యేసుప్రభువు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంది. కొత్తనిబంధనలో క్రీస్తుకు సరిగ్గా వ్యతిరేకమైనది 'క్రీస్తువిరోధి' అని పిలవబడింది. క్రైస్తవులు దీనిని స్పష్టంగా చూడనట్లయితే, తప్పుడు సూచనలతో అద్భుతాలతో ప్రపంచ వేదికపై క్రీస్తువిరోధి వచ్చినప్పుడు (2థెస్స 2:3-10), వారు గుడ్డిగా అతనిని అంగీకరిస్తారు. క్రీస్తు ఆత్మ ద్వారా నడిపింపబడటం అంటే, పైన చెప్పబడిన వాటికి వ్యతిరేకమైన ఆత్మను కలిగి ఉండటం.

యేసుప్రభువు మత్తయి 7:13-27లో చెప్పబడిన మాటల వివరణ ఇది (మత్తయి 5-7 అధ్యాయాల సందర్భంలో దీన్ని చదవండి):

"ఇప్పుడు నేను వివరించిన రీతిగా (మత్తయి 5,6,7),నిత్యజీవముకు వెళ్ళే ద్వారం మరియు మార్గం రెండూ ఇరుకైనవే.కాని అబద్ధబోధకులు వచ్చి, ఆ ద్వారం మరియు మార్గం సులువైనవని,విశాలమైనవని చెప్తారు.వారి పట్ల జాగ్రత్తగా ఉండండి.వారి స్వభావ ఫలాల్ని బట్టి వారిని సులువుగా గుర్తించవచ్చు:కోపం నుండి విడుదల పొందిన జీవితం వారు జీవించుచున్నారా, స్త్రీలపట్ల మోహం నుండి విడుదల పొందారా, ధనాపేక్షనుండి విడుదల పొందారా, లోకస్తులు వెదకినట్లు భౌతిక సంపదకొరకు ఆసక్తితో వెదకుట నుండి విడిపింపబడ్డారా? ఇక్కడ నేను బోధించినట్లుగా (మత్తయి 5:21-32; 6:24-34) వీటికి వ్యతిరేకంగా బోధిస్తున్నారా?.ఈ అబద్ధ బోధకులు అనేక అద్భుతాలు చేసి మానవాతీతమైన వరాలను ప్రదర్శించవచ్చు,ప్రజలను నా నామంలో నిజంగా స్వస్థపరచవచ్చు,అయినప్పటికీ చివరిరోజున నేను వారిని నరకానికి పంపుతాను,ఎందుకంటే వారికి నేను (పరిశుద్ధుడనని)తెలియదు, వారి రహస్య జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేదు (మత్తయి 7:21-23).కాబట్టి ఇప్పుడుగాని, నిత్యత్వంలోగాని కదల్చబడని,పడిపోని సంఘమును బండపై నీవు నిర్మించాలనుకుంటే,నేను నీతో ఇప్పుడు చెప్పిన వాటిని (మత్తయి 5,6,7)చేయుటకు జాగ్రత్తపడుము. నీ ప్రజలకు నేను ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయుటకు బోధించుము. అప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నా అధికారం ఎప్పుడు నిన్ను బలపరుస్తుంది(మత్తయి 28:20,18). అలా కాకుండా నేను చెప్పేదాన్ని నీవు కేవలం విని దాని ప్రకారం చేయకుండా ఉన్నట్లయితే నీవు నిర్మించే సంఘం మనుష్యుల దృష్టికి పెద్దగా ఆకర్షణీయముగా ఉండవచ్చుకాని ఒక రోజున అది బ్రద్దలై పడిపోతుంది (మత్తయి 7:25)" .

ఈ చివరిరోజులలో కదల్చబడని సంఘమును ఎలా నిర్మించాలి?

1. కొండమీది ప్రసంగాన్ని మనం జీవించాలి. దాన్ని ఎల్లప్పుడు బోధించాలి.

2. మనం పాతనిబంధనలో కాక కొత్తనిబంధనలో జీవించాలి. ఇలా చేయుటకు, ఈ రెండు నిబంధనల మధ్య ఉన్న తేడాని స్పష్టంగా తెలుసుకోవాలి (2కొరింథీ 3:6). మనం కొత్తనిబంధనను తప్పక బోధించాలి.

ఈ రోజుల్లో బోధకులు తీవ్రమైన పాపంలో పడినప్పుడు, పాపంలో పడిన పాతనిబంధన పరిశుద్ధులను మాదిరిగా తీసుకొని వారిని వారు సమర్థించుకొంటారు (వారి ద్వారా ఓదార్పు పొందుతారు). కొంతకాలం మౌనంగా ఉన్న తరువాత తిరిగి వారి పరిచర్యను ప్రారంభిస్తారు. వ్యభిచారంలో పడిన దావీదును, నిరాశకు లోనయిన ఏలియాను వారు ఉదహరణగా చూపి, "అయినా కూడా దేవుడు వారిని వాడుకున్నాడు" అని చెప్తారు!. కాని వారు, జీవితాంతం జయించువాడిగా, పవిత్రంగా ఉన్న పౌలు మాదిరిని ప్రస్తావించరు.

ఈ బోధకులు (మరియు అనేక మంది క్రైస్తవులు) చూడనిదేమిటంటే, పాతనిబంధనలోని పరిశుద్ధులు ఈరోజున మనకు మాదిరి కారు. ఈ కృపాయుగంలో మనకు ఎంతో ఇవ్వబడింది - "ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వారినుండి ఎక్కువగా కోరబడుతుంది" (లూకా 12:48). కొత్తనిబంధనలో యేసుప్రభువే మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనే మనకు మాదిరి, మన విశ్వాసమునకు కర్త - దావీదు, ఏలియాలు కాదు. పాతనిబంధనలోని పరిశుద్ధులకు (హెబ్రీ 11) యేసుప్రభువుకు మధ్య బేధమును హెబ్రీ 12:1-4లో స్పష్టముగా వివరించబడింది. కాని కొందరు మాత్రమే దానిని నిజముగా జీవిస్తారు. "దేవుడు మనకొరకు మరి శ్రేష్ఠమైన దాన్ని" కొత్తనిబంధనలో ఉంచాడని కొందరు మాత్రమే చూశారు (హెబ్రీ 11:40).

మనం మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండనట్లయితే, అనేక బోధకులు పడిపోయినట్లు మనం కూడా పడిపోతాము - ఎందుకంటే సాతాను కుయుక్తి గల శత్రువు. కొత్తనిబంధన బోధకు ఉన్నదున్నట్లుగా లోబడటం, దైవికమైన నాయకులకు లోబడుటలోనే మన భద్రత ఉంది. (దైవిక నాయకత్వం అంటే, పైక పెర్కొన్న పది అంశాలలో ఒక్క విషయంలో కూడా తప్పులేని వారు). ఇతరుల తప్పులనుండి మనం నేర్చుకుంటే, అవే తప్పులను మనం చేయకుండా తప్పించుకోగలం.

కనుక దేవుని యెదుట మన ముఖములను ఎల్లప్పుడు దుమ్ములో పెట్టుకొందాం - ఎందుకంటే అక్కడ యోహాను వలె మనం దైవిక ప్రత్యక్షతలు పొందుతాము (ప్రకటన 1:17). మనలను మనం తగ్గించుకుంటే, జయించువారిగా ఉండుటకు కృపను పొందుతాము (1పేతురు 5:5). పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యంలోని సత్యాలను, మనలను గూర్చిన సత్యాలను చూపించినప్పుడు, 'సత్యమును ప్రేమించి, పాపమంతటినుండి రక్షింపబడుటకు' నిజాయితీగా ఉందాము. ఆ విధముగా అన్ని మోసాల నుండి దేవునిచే భద్రపరచబడతాము (2థెస్స 2:10-12). ఆమెన్.