వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   సంఘము నాయకుడు తెలిసికొనుట
WFTW Body: 

పెర్గమలో నుండిన పెద్ద సంఘమును లోకపు తీరు వైపు త్రిప్పి పాపము యెడల మెతకతనపు వైఖరిని బోధించువారిని అనుమతించినందున గద్దింపబడెను (ప్రకటన 2:14,15). ఆ పెద్ద మంచి వాడైయుండవచ్చును. కాని అతడు బిలాము బోధను బోధించుటకు ఇతరులకు అనుమతిచ్చెను, కనుక అతడు తప్పు చేశాడు.

సంఘములో సభ్యుల పాపమును తేలికగా తీసుకునే ఎటువంటి బోధనైనా అనుమతించినప్పుడు దేవుడు దానికి పెద్దలను బాధ్యులను చేయును. "దైవభక్తి లోనికి నడిపించే బోధ" (క్రీస్తు పోలికలోనికి నడిపించే) యొక్కటే "ఆరోగ్యకరమైన బోధ"యై యున్నది (1తిమోతి 6:3). మిగిలినదేదైనా కొద్దిగా గాని లేక ఎక్కువగా గాని అనారోగ్యకరమైనది.

ఈ పెద్ద తన సంఘములో ఎందుకు అటువంటి మెతకతనపు బోధను అనుమతించెను? బహుశా అతడు సంఘములో సాత్వికుడైన మరియు మృధువైన సహోదరుడని పేరు పొందుటకు సంఘములో సహోదరులను మరియు సహోదరీలను దేనికీ దిద్దుబాటు చేసి ఉండకపోవచ్చును. అలా అయినట్లయితే, అతడు సంఘముయొక్క మేలు కంటే తన ఘనతనే ఎక్కువగా చూచుకొనెను.

యేసుప్రభువు చెప్పినట్లు దీనత్వము మరియు సాత్వికమును మనము ఆయన యొద్దనే నేర్చుకొనవలెను (మత్తయి 11:29). అలా కానట్లయితే మనము వాటి గూర్చి తప్పుగా అర్థము చేసికొందుము.

యేసు యొక్క దీనత్వము మరియు సాత్వికము ఆయనను దేవాలయములో వ్యాపారము చేయు వారిని వెళ్లగొట్టకుండా ఆపలేదు లేక పేతురు సిలువను తప్పించుకొనుమని తప్పుడు బోధను యేసుకు చెప్పినప్పుడు, "సాతానా, నా వెనుకకు పొమ్ము", అని కఠినమైన మాటలతో గద్దించకుండా ఆపలేదు (మత్తయి 16:22,23).

పేతురు వంటి మంచి సహోదరుని కూడా సంఘమును ప్రక్క త్రోవ పట్టించునట్లు సాతాను వాడుకొనును. అటువంటి సహోదరుడు సంఘపు కూటములలో సిలువ యొక్క వార్తను పలుచన చేయునట్లు మాటలాడవచ్చును. అటువంటి బోధను సాతాను యొక్క స్వరమని ఎప్పుడూ గుర్తించవలెను. ఎందుకనగా సంఘమును దేవుడు తీసుకు వెళ్ళనుద్దేశించిన దిశ నుండి సాతాను ఆ విధముగా వేరు మార్గములోనికి తీసుకు వెళ్లును.

సంఘము ఏ దిశలో వెళ్లవలెననునది నిర్ణయించుట సంఘ పెద్దలు నిర్వర్తించవలసిన గొప్ప బాధ్యతలలో ఒకటి. అది ఎప్పటికి లోకపు తీరు మరియు రాజీ మార్గము కాకూడదు. అలాగే పరిసయతత్వము మరియు అక్షరానుసారమైనది కాకూడదు. కాని అది సిలువ మార్గమై యుండవలెను. అదే దేవుని చిత్తమైన దిశ.

బిలాము వంటి బోధకులకు సంఘములో ఉన్న వారిని తప్పుగా ప్రభావితము చేసే అనారోగ్యకరమైన మానసిక శక్తి ఉంటుంది. శక్తివంతమైన మానవ వ్యక్తిత్వము గలిగిన బోధకులు తప్పనిసరిగా ఇతరులను ఆకట్టుకొందురు. శిరస్సయిన క్రీస్తుతో వారు సంబంధము కలిగియుండకుండునట్లు ఈ బోధకులు ఆటంకముగా ఉందురు. వారు ఇతరులను నిజమైన ఆత్మీయత నుండి పైకి కనబడే ఆత్మీయత మరియు లోకపరమైన మతాసక్తిలోనికి నడిపించుదురు.

ఒక బోధకుడు తన మానసిక శక్తిని మరణింప చేయుట అంటే ఏమిటో అర్థము చేసికొనలేకపోతే, అతడు విశ్వాసులను శిరస్సయిన క్రీస్తుకు కాక తనతో సంబంధము కలుగునట్లు చేసికొనును. అప్పుడు విశ్వాసులు ఆ బోధకుని మెచ్చుకొని వెంబడించవచ్చును. కాని వారు వారి జీవితములలో పాపమును లోకమును ఎప్పటికీ జయించలేరు.

ఆత్మీయ శక్తికి మరియు మానసిక శక్తికి ఎంతో వ్యత్యాస మున్నది. ఆ రెండిటికి మధ్య నుండిన తేడాను మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తికి ఎంతో బైబిలు పరిజ్ఞానము మరియు బోధించే వరము ఉండి ఉండవచ్చును. అతడు సహోదర సహోదరీలకు ఆతిథ్యము చేయువాడై ఉండవచ్చును మరియు వారికి ఎన్నో అవసరాలలో సహాయపడువాడై ఉండవచ్చును. కాని అతడు జనులను క్రీస్తుకు కాక తనకు అతుక్కొనేలా చేస్తే, అతడు క్రీస్తు శరీరమును కట్టుటకు ఆటంకముగా ఉండును.

బిలాము వంటి బోధకులు ఇతరుల నుండి బహుమతులు తీసుకొనుటకు సంతోషించెదరు (సంఖ్యా 22:15-17). బహుమతి మన కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును (సామెతలు 17:8) మరియు మనలను మొహమాటములో పెట్టును. కనుక మనము వారికి దాసులమగుదుము. అది మనము దేవుని యొక్క సత్యము మాటలాడుటకు మరియు మనకు సహాయపడినవారిని దిద్దుబాటు చేయుటకు ఆటంకపర్చును.

ఒక దేవుని సేవకుడు ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండవలెను. "మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, మనుష్యులకు దాసులు కాకుడి" (1కొరింథీ 7:23).