WFTW Body: 

దేవుణ్ణి ఘనపరచుట ద్వారా వచ్చే ఆశీర్వాదము కానాలో జరిగిన వివాహము ద్వారా మనకు అర్థమవుతుంది (యోహాను 2:1-11). యేసుప్రభువు మొట్టమొదటి సారి తన మహిమను ఒక వివాహములో బయల్పరచాలని నిర్ణయించుకొనుట ప్రాముఖ్యమైనది. ఈనాడు కూడా ఆయన తన మహిమను ప్రతి వివాహములో బయల్పరచాలని అనుకొంటున్నాడు. సెక్స్, ప్రేమ, పెళ్ళి దేవుడు మనకిచ్చిన ఎంతో ప్రాముఖ్యమైన వరములు. మనం ఆయనకు అనుమతి ఇచ్చినట్లయితే దేవుడు తన మహిమను మనకు మాత్రమే కాదు ఇతరులకు కూడా ప్రత్యక్షపరచుటకు ఇవే మాద్యములుగా కాగలవు.

కానా వివాహములోని ద్రాక్షారసము యొక్క కొరత ప్రతి వివాహంలో ఉండే సమస్యలు మరియు అవసరతలను సూచిస్తుంది. ఈ సమస్యలు చివరకు భార్యాభర్తలను నిరంతరం చిరాకులోనికి, నిరాశలోనికి తీసుకొని వెళ్ళగలవు. కాని వివాహములో యేసుప్రభువుకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే, ఆయన కానాలో చేసినట్లుగా చాలా త్వరగా మన సమస్యలను పరిష్కరించి, మన అవసరములను తీర్చును.

ఏదో ఒక అతిథిగా యేసుప్రభువును ఇంట్లోకి ఆహ్వానిస్తే సరిపోదు. ఆయన ప్రభువుగా ఉండాలి. "క్రీస్తే ఈ గృహమునకు అధిపతి" అనే అక్షరాలను ఇంట్లో వ్రేలాడదీసి, నిజానికి ఆ గృహమునకు భర్త(లేక భార్య) అధిపతిగా ఉన్నట్లయితే అపహాస్యం చేసినట్లవుతుంది. కాని ఎక్కడైతే క్రీస్తును అధిపతిగా, ప్రభువుగా గుర్తిస్తారో అక్కడ ఆయన రెండువేల సంవత్సరాల క్రితం కానాలో చేసినట్లుగా తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు (యోహాను 2:11).

"ఆయన మీతో చెప్పునది చేయుడి" అనేది మరియ అక్కడున్న పరిచారకులకు ఇచ్చిన సలహా (యోహాను 2:5). వెంటనే వారు నిస్సందేహంగా ఆ సలహాకు చెవియొగ్గి యేసుప్రభువుకు విధేయత చూపించారు. త్వరలోనే సమస్య పరిష్కరించబడింది. ఒకవేళ వివాహమైనవారు (వివాహం కొరకు ఎదురుచూచుచున్న వారు) కూడా అదే సలహాకు చెవియొగ్గి, ప్రభువుయొక్క ఆజ్ఞలకు అంతే నిస్సందేహముగా, త్వరగా విధేయత చూపించినట్లయితే వారి సమస్యలకు ఎంత త్వరగా పరిష్కారం లభిస్తుందో కదా.

ఆ వివాహంలో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. రంగు, రుచి లేకుండా, సామాన్యంగా ఉన్న ఆ నీరు ఒక్క క్షణంలో మధురముగా, ఆకర్షణీయముగా, విలువైనదిగా మారింది. వివాహ జీవితంలోని సాధారణ విషయాలు (ఎప్పుడూ చేసే రోజువారి చాకిరి) కూడా ప్రభువుకు మన గృహము మీద పూర్తి నియంత్రణ ఇచ్చినప్పుడు ఎంతో ఆకర్షణీయముగా మారతాయి. రుచిలేనిది మధురముగా మార్చబడుతుంది. ఇంతకుమునుపు తృణీకరించి, సాధారణముగా చూడబడిన వాటిని అనంతమైన విలువ వస్తుంది.

ఆ అద్భుతానికి ఫలితముగా అనేకమంది అవసరాలు తీర్చబడ్డాయి. కేవలం భాగస్వాములిద్దరికీ సంతోషం కలుగజేయడం ద్వారా క్రైస్తవ వివాహము యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడదు. వారి వివాహంలో నిరంతరం వారి గిన్నెలు నిండి పొంగిపొర్లాలనేది (కీర్తనలు 23:5) దేవుని ఉద్దేశమైయున్నది. అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి - నిజానికి వారు కలిసిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. విధేయుడైన తన సేవకునితో దేవుడు ఒకసారి ఈవిధంగా చెప్పాడు. "నేను నిన్ను ఆశీర్వదించెదను.. నీవు ఆశీర్వాదముగా ఉందువు - ఇతరులకు మంచిని పంచుట.. భూమియొక్క వంశములన్ని, కుటుంబములన్ని నీయందు ఆశీర్వదించబడును" (ఆది.కా. 12:2,3). గలతీ 3:14 ప్రకారము దేవుని యొక్క అదే ఆశీర్వాదము మనకు కూడా ఉంది. వివాహములో దీనికంటే మరి ఎక్కువైన లక్ష్యమును ఎవరైనా ఏమి కలిగియుండగలరు? మన అనుదిన జీవితములో దేవునికి మనం ఎంత విధేయత చూపిస్తున్నాము అన్న దానిని బట్టి మనం ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నామనేది ఆధారపడి ఉంటుంది. "నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును" (ఆది.కా. 22:18) అని ప్రభువు అబ్రహాముతో చెప్పారు.

సెక్స్, ప్రేమ, పెళ్ళికి సంబంధించి ఎవరైతే ఘోరతప్పిదములు చేసి ఓడిపోయారో వారికి కానాలోని అధ్బుతము ఒక నిరీక్షణ సందేశముగా కూడా ఉంది. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు ప్రభువు వైపు తిరిగారు, ప్రభువు వారిని సిగ్గుపరచలేదు. నీ ఓటమి ఎంత పెద్దదైనా సరే నీవు నీ అవసరంలో ప్రభువు వైపు తిరిగినప్పుడు ఆయన నిన్ను కూడా సిగ్గుపరచడు. ఆయన కేవలం, నీ అవసరం గురించి నిజాయితీగా ఉండి (కానాలో వలె) నీ ఓటమి గురించి ఆయనకు చెప్పాలని కోరుకుంటున్నాడు. నీ బుద్ధిహీనత ద్వారా ఆ అమ్మాయితో/అబ్బాయితో చాలా దూరం వెళ్ళావా? ప్రేమ విషయంలో బహుశా తెలియక తప్పు చేశావా? దాని ఫలితంగా ఇప్పుడు నీవు ఇబ్బందిపడుతున్నావా? నిరాశను ఎదుర్కొంటున్నావా? ఇతరులు నిన్ను అపార్థం చేసుకొని నిందిస్తున్నారా? దూషిస్తున్నారా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయక వెంటనే ప్రభువు వైపు తిరుగు. ఆయన పాపులకు స్నేహితుడు. ఆయన కేవలం నీ పాపములను క్షమించుట మాత్రమే కాక సాతాను నీ జీవితంలో అస్తవ్యస్తముగా చేసిన వాటిని శుభ్రపరుస్తాడు. ఈ రెండింటిని నెరవేర్చుటకే ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు (1యోహాను 3:5,8). నిరాశకు తావివ్వద్దు. నీకు కూడా నిరీక్షణ ఉంది. కానా వివాహములో, కొదువగా ఉన్నదానిని ఎంతో సమృద్ధిగా చేసిన ప్రభువు, నీ జీవితంలో ఉన్న కొదువలను కూడా ఎంతో సమృద్ధిగా చేయగలడు. కానాలో తన మహిమను ప్రత్యక్షపరచిన ప్రభువు, నీ విషయంలో కూడా అదే చేయగలడు.

ఒకవేళ నీవు నిరాశ చెందియున్నట్లయితే, క్రైస్తవ జీవితములో నిజమైన ఆశీర్వాదము స్వాధీనం చేసుకొనుట వలన గాక త్యజించుట ద్వారా వస్తుందనే (అపొ.కా 20:35) సత్యము ద్వారా ధైర్యము తెచ్చుకో. సమస్తము నీ మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగించగలడు, నీ కోర్కెలన్నీ నెరవేర్చబడకపోయినా కూడా ఆయన మహిమ కొరకు నీవు ఒక సంపూర్ణ జీవితం జీవించుటకు సహాయము చేస్తాడు.