నా జీవితంలో చాలా సార్లు ప్రభువు నన్ను ఎలా నడిపించాడో తిరిగి చూసుకున్నాను - అది నా విశ్వాసాన్ని పునరుద్ధరించింది. నేను క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, మార్గం లేనట్లు అనిపించినప్పుడు, నేను బైబిల్లోని వాగ్దానాలను గుర్తుచేసుకుంటాను, ఇతర విశ్వాసులు నాకు ఇచ్చే ప్రోత్సాహాన్ని వింటాను. కానీ అన్నింటికంటే నా విశ్వాసాన్ని బలపరిచేది నేను వెనక్కి తిరిగి చూడటమే. "నేను ఇంతవరకు ఒక్కసారైనా నిన్ను నిరాశపరిచానా?" అని ప్రభువు నన్ను అడిగాడు. "లేదు ప్రభువా, ఒక్కసారి కూడా లేదు" అని జవాబిచ్చాను. అప్పుడు ఆయన, "నేను ఇప్పుడు కూడా నిన్ను నిరాశపరచను". ఇది అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది.
మళ్ళీ పడిపోయావా? వెనక్కి తిరిగి చూడు, గతంలో ప్రభువు నిన్ను ఎలా క్షమించాడో చూడు. ఆయన మిమ్మల్ని క్షమించినప్పుడు, మీరు మళ్లీ పడతారని ఆయనకు తెలియదా? మీరు మళ్లీ పడిపోవడం ఆయనకు ఆశ్చర్యంగా ఉందా? లేదు. అప్పుడు ఆయన మిమ్మల్ని మళ్లీ క్షమిస్తాడు. కృతజ్ఞతతో వెనక్కి తిరిగి చూడు. అది నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రభువు దయకు కృతజ్ఞత కలిగి ఉండు. మీరు గతంలో మీ వైఫల్యాలను చూసినప్పుడు, విఫలమైన మీ చుట్టూ ఉన్న ఇతర విశ్వాసుల పట్ల మీరు కనికరం చూపడం నేర్చుకుంటారు.
మనం పైకి చూడటం మరియు ప్రభువు యొక్క మహిమను ఎక్కువగా చూడటం మానుకోకూడదు. మనం ఇంకా చూడని యేసు మహిమ చాలా ఉంది. మనం దీని కోసం ఆకలితో ఉండాలి, ఎందుకంటే ఆ స్వరూపంలోనికే పరిశుద్ధాత్ముడు మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం ప్రభువు మహిమను చూచినప్పుడు, అది మనల్ని దీనులుగా చేస్తుంది ఎందుకంటే మన స్వంత అవసరతను మనం చూస్తాము. మన జీవితాంతం వినయంతో(దీనులుగా) ఉండడానికి ఇదే రహస్యం.
దేవుడు అభిషేకించి, గొప్పగా ఉపయోగించిన వ్యక్తి గర్వపడటం చాలా సులభం. అలాంటి బోధకులను నేను చాలా మందిని చూశాను. దేవుడు వారిని ఉపయోగించుకున్నాడు కాబట్టి వారు చాలా గర్వంగా ఉన్నారు మరియు వారు ప్రజలకు చాలా దూరంగా ఉన్నారు. మన జీవితాంతము వరకు మనల్ని విరగిన వారుగా, దీనులుగా ఉంచగలిగేది ఏమిటి? ఒకే ఒక్క విషయం: మన విశ్వాసానికి కర్త మరియు కొనసాగించువాడైన యేసు వైపు చూడటం. మనం యేసును చూసినప్పుడు గర్వపడటం అసాధ్యం. ఒక వ్యక్తి ఇతర వ్యక్తులను చూడటం ప్రారంభించినప్పుడు, తాను వారి కంటే గొప్పవాడినని లేదా వారి కంటే ఎక్కువ అభిషేకించబడ్డానని లేదా వారి కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నానని మొదలగు వాటిని ఊహించుకొని గర్వపడతాడు.
అయితే, అతను యేసు వైపు పైకి చూస్తే, అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపంలో చేసినట్లు పశ్చాత్తాపంతో అతను దుమ్ములో తన ముఖం మీద పడిపోతాడు. అతను యేసు వైపు చూస్తూ ఉంటే, అతను తన ముఖాన్ని ఎప్పటికీ దుమ్ములో ఉంచుకుంటాడు. మనమందరం ఎప్పుడూ మన ముఖాలను దుమ్ములో ఉంచుకోవడం నేర్చుకోవాలి. అది సురక్షితమైన ప్రదేశం. కాబట్టి మీ రోజులు ముగిసే వరకు దేవుడు మీతో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే, పైకి చూస్తూ ఉండండి.
దేవుడు మనకొరకు అద్భుతమైన విషయాలను దాచి ఉంచాడు. మనం చేయాల్సిన గొప్ప పని ఆయన వద్ద ఉంది. మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందో తెలియదు. కానీ ప్రభువు రాకముందే, ఈ భూమిపై ఆయనకు ఉపయోగపడేదేదైనా చేయాలని ఎదురుచూస్తున్నాము. ప్రపంచంలో చాలా మంది ప్రజలు భయం మరియు ఆందోళనతో భవిష్యత్తు వైపు చూస్తారు. కానీ మనం విశ్వాసంతో ముందుకు చూస్తాము.
ద్వితీయోపదేశకాండము 11:21 (KJV)లో, "మీ దినములు మరియు మీ కుమారుల దినములు భూమిపై పరలోకపు దినములవలె భూమిపై వర్ధిల్లవలెను" అని దేవుడు వారి కొరకు కోరుకుంటున్నాడని మోషే వారితో చెప్పాడు. ఇది మనందరి యెడల దేవుని చిత్తం - భూమిపై మన రోజులు పరలోకపు రోజులలా ఉండాలి. మన ఇళ్లలో, మన సంఘాలలో పరలోకపు ఆనందం, సమాధానం, ప్రేమ, పవిత్రత మరియు మంచితనం యొక్క ముందస్తు రుచిని మనం ఇప్పుడు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను దానిలో కొంచెం అనుభవించాను. కాబట్టి నా జీవితం, నా పరిచర్య నాకు పెద్ద భారం కాలేదు. అస్సలు కాలేదు. అది ఆనందంగా మరియు ప్రతిరోజూ ఉత్తేజకరమైనదిగా ఉంది, ఎందుకంటే నేను లోకంయొక్క నియమాల ప్రకారం కాకుండా, పరలోకపు నియమాల ప్రకారం జీవించడం నేర్చుకున్నాను. మీరు మీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు దీన్ని చేయాలని నిర్ణయించుకోవడం సులభం. అయితే ఈ రాబోయే సంవత్సరంలో కూడా మీరు లోకానికి సంబంధించిన నియమాల ప్రకారం కాకుండా పరలోక నియమాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకుంటారని నేను ఆశిస్తున్నాను. చివరి వరకు సహించిన యేసుపై దృష్టి పెట్టండి - తద్వారా మీ రోజులు భూమిపై పరలోకపు రోజులవలె ఉంటాయి. అది మన పట్ల దేవుని చిత్తం.
ప్రతిరోజు దేవుని అత్యంత గొప్ప ఆశీర్వాదంతో నిండిన నూతన సంవత్సరాన్ని మీ అందరి కొరకు నేను కోరుకుంటున్నాను.