మత్తయి 6:5-8లో ఏ విధంగా ప్రార్థించకూడదో- వేషధారులవలె కాకుండా, అర్థంలేకుండా మరలా మరలా చేయవద్దని, దీర్ఘ ప్రార్థనలు చేయవద్దని, మన తండ్రికి మన అవసరాలు తెలుసునని నమ్మమని చెప్పిన తరువాత ఏ విధంగా ప్రార్థించాలో యేసు మనకు చెప్పారు. నేను క్రైస్తవులని చూసినప్పుడు గమనించినదేమిటంటే చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకునే యేసు చెప్పిన సాధారణమైన మాటలను కొంతమంది మాత్రమే లక్ష్య పెడతారు. ఏ విధంగా ప్రార్థించవద్దో ఆయన చెప్పారు అనేకమంది దానిని తీవ్రంగా తీసుకోరు, ఏ విధంగా ప్రార్థించాలో ఆయన బోధించారు దీనిని కూడా అనేకమంది తీవ్రంగా తీసుకోరు.
మనం గుడ్డిగా పునరావృతం చేయడానికి ఒక ప్రార్ధనను ఆయన ఇవ్వలేదు. మనం ప్రతి మాటను అర్థవంతంగా చేసినట్లయితే ఆ విధంగా పునరావృతం చేయడంలో నష్టమేమీ లేదు. అయితే మన ప్రార్థనలన్నిటిలో ఉండవలసిన ఒక నమూనాను ఆయన బోధిస్తున్నారు.
మనం ప్రార్థించినప్పుడు ఈ విధంగా ప్రార్థించాలని అని చెప్పారు - "పరలోకమందున్న మా తండ్రి". యేసు చెప్పిన మొదటి విషయం మనం దేవునితో మాట్లాడినప్పుడు ఆయనను తండ్రి అని పిలవమని చెప్పాడు. పాత నిబంధనలో ఎవరూ కూడా దేవుని వైపు చూసి "తండ్రి" అని పిలిచే సాహసం చేయలేదు. పాత నిబంధనలో ప్రార్ధనలన్నీ కూడా "ఓ దేవా ప్రభువా సర్వశక్తిమంతుడా" అనేవిగా ఉండేవి. ఎందుకంటే ఈ సృష్టికి దేవుడు ఒక CEO మరియు ఆయన ప్రజలు ఆయన కింద పనిచేసే పరిశ్రమలోని చిన్న చిన్న ఉద్యోగుల వలే ఉండేవారు. CEOతో నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు మాట్లాడలేవు. కానీ కొత్త నిబంధనలో మనం దేవుని పిల్లలం. CEO యొక్క బిడ్డ నేరుగా అతని తండ్రి యొక్క ఆఫీసులోనికి వెళ్లి "నాన్నా" అని ఎలా పిలవగలడో అదేవిధంగా దేవుని పిల్లలుగా మనకున్న ఆధిక్యతను అర్థం చేసుకోవాలి. ఇది ప్రాథమికంగా వ్యత్యాసమైనది.
అయినప్పటికీ అనేక మంది క్రైస్తవుల విషయంలో దేవుణ్ణి ’తండ్రి’ అని పిలవడం లేదనేది నిజం. వారు ’ఓ దేవా’ అని పిలుస్తారు. అలా పిలవడంలో తప్పు ఏమీ లేదు. ఆయన దేవుడు మరియు ఆయనను దేవుడని సంబోధించడం సరైనదే; కానీ నీవు ఆయనను తండ్రి అని సంబోధించకుండా దేవుడని మాత్రమే సంబోధించినట్లయితే అప్పుడు దానిలో తప్పు ఉంది.
పాత నిబంధనలో దేవునికి పేరు ఉంది అది యెహోవా లేక యావే (దాని సరియైన ఉచ్చారణ ఎవరికీ తెలియదు ఎందుకంటే హెబ్రీ అక్షరమాలలో అచ్చులు లేవు). నా మట్టుకు అయితే దాని గురించి మాట్లాడడం అంత ప్రాముఖ్యమైనది కాదు ఎందుకంటే నేను దేవుణ్ణి యెహోవా అని లేక యావే అని పిలవను నేను ఆయనను నాన్నా అని పిలుస్తాను.
ఆయన నా తండ్రి ఎందుకంటే "మా తండ్రి" అని ప్రార్థించమని యేసు మనకు బోధించారు. రోమా 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మన హృదయాల్లోనికి వచ్చి "అబ్బా తండ్రి" అని మొర పెట్టునని మనం నేర్చుకుంటాము (రోమా 8:15). అయినప్పటికీ మనం ప్రజలు పాడే కొన్ని పాటలను చూసినట్లయితే "ఓ గొప్ప యెహోవా నన్ను నడిపించు" వంటివి చూసినప్పుడు, వారు వారి తండ్రితో మాట్లాడుతున్నారా? అని అనిపిస్తుంది. ఆయన యెహోవా, కానీ ఆయనను తండ్రి అని సంబోధించుట మనం నేర్చుకోవాలి. ఒకవేళ నా పిల్లలు నా దగ్గరకు వచ్చి మిస్టర్.పూనెన్ అని పిలచినట్లయితే వారిలో ఏదో తప్పు ఉందని నేను అనుకుంటాను. వారు నన్ను మిస్టర్.పూనెన్‍అని ఎందుకు పిలుస్తున్నారు. నన్ను నాన్నా అని పిలవాలి కదా. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది ఆయన పేరు అయినప్పటికిని నేను ఆయనను యెహోవా లేదా యావే అని పిలవను. ఆయన నా తండ్రి కాబట్టి నేను తండ్రి అని పిలుస్తాను. నేను ఆయన బిడ్డను.
వారు దేవుని పిల్లలనే నిజం ఇంకా అనేక మంది క్రైస్తవులకు అర్థం కాలేదు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మకు తమ్ముతాము లోపరచుకోలేదు. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు నింపినప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని, "అబ్బా తండ్రి" అంటే నాన్నా అని పిలచునట్లుగా చేయుట. ఇలా నీకు జరిగిందా ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎవరో ఒకరు నీకు చెప్పి తర్ఫీదు ఇవ్వడం వలన జరగదు. అది స్వతంత్రంగా, అంతరంగంలో నుంచి వచ్చే మొర. ఒక వ్యక్తి తిరిగి జన్మించి అతని హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అంతరంగంలో ఈ అనుభవం నిజమవుతుంది. అతను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు తన తండ్రి అని నిజంగా తెలుసుకుంటాడు. దేవుణ్ణి తండ్రిగా తెలుసుకోవడం మరియు దేవుణ్ణి తండ్రి అని పిలవడం క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. నీవు ఆయనను ప్రభువా అని దేవా అని పిలవవచ్చు. కానీ ప్రార్ధించేటప్పుడు "అబ్బా తండ్రి" అని పిలవడం అత్యంత ఉత్తమమైన మార్గం.
కేవలం తండ్రి అని మాత్రమే కాకుండా పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని యేసు చెప్పారు. మనం ఏదో ఒక భూలోక తండ్రికి ప్రార్థించడం లేదు. మన భూలోక తండ్రి మనని ఎంతో ప్రేమించవచ్చు. అయితే కష్ణతరమైన పరిస్థితుల్లో అతడు నిస్సాహాయుడైన వ్యక్తిగా ఉండవచ్చు. అయితే పరలోకమందున్న తండ్రి నిస్సాహాయుడు కాదు. ఆయన ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. భారతదేశపు ప్రధానమంత్రి కంటే ఆయన ఎంతో శక్తిమంతుడు. భారతదేశ ప్రధానమంత్రి నీ తండ్రి అని అనుకుంటే నీకు సమస్య వచ్చినప్పుడు కేవలం నీ తండ్రికి ఫోన్ చేసి దాని గురించి చెప్పడం మాత్రమే నీవు చేయాల్సింది. నీ పరలోకమందున్న తండ్రి ఈ లోకంలో ఉన్న వారందరి కంటే బలవంతుడు మరియు శక్తిమంతుడు. నీ సమస్యలన్నిటితో ఆయన దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?
ఈ ప్రార్థన యొక్క మొదటి మాటలోనే విశ్వాసపు పునాదిని వేయుటకు యేసుప్రభువు చూస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి అనే మాట నేను ప్రార్థించడం ప్రారంభించినప్పుడు నేను మాట్లాడుతున్నది నా పరలోకపు తండ్రితో అని మరియు నన్ను ఎంతగానో ప్రేమించే తండ్రితో అనే విషయం నా హృదయంలో ఎంతో స్పష్టపరుస్తుంది. ఈ తండ్రి పరలోకమందు ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని దేవుడు సర్వశక్తిమంతుడనే ఈ రెండు సత్యాలు నా విశ్వాసానికి మూలాధారం. ఆయన ఏ సమస్య అయినా పరిష్కరించగలడు -ఆయన ఏదైనా చేయగలడు -ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. విశ్వాసానికి ఇదే గొప్ప పునాది.
దీని తర్వాత ఉన్న ఆరు విన్నపాలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి మూడు విన్నపాలు దేవునికి చెందినవని మీరు చూస్తారు. మీరు దేవుని దగ్గరకు ప్రార్థనలో వెళ్ళినప్పుడు మీ మొదటి విన్నపం ఏమిటి? ప్రతిసారి కూడా అది మీకు లేదా మీ కుటుంబానికి చెందినదని కనుగొంటారు. ప్రభువా ఈ అవసరం తీర్చు, ప్రభువా నా వెన్ను నొప్పిని స్వస్థపరచు, ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, నా పిల్లల్ని జాగ్రత్తగా చూడు, వారికి ఉద్యోగం ఇవ్వు, వారికి జీవిత భాగస్వామిని ఇవ్వు అనేవే. ఈ విన్నపాలలో ఎటువంటి తప్పులేదు. వీటన్నిటి గురించి కూడా మనం తప్పకుండా ప్రార్థించవచ్చు. ప్రతిదానికి మరియు ప్రతి చిన్న దానికి ఆయన దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు తాళపు చెవులు పోగొట్టుకున్నట్లయితే వాటిని కనుగొనుటకు దేవుని సహాయం అడగవచ్చు.
నువ్వు అత్యంత చిన్నవాటిని మరియు అత్యంత పెద్దవాటిని కూడా దేవుని అడగవచ్చు, అయితే నీవు దేనికి ప్రాధాన్యతను ఇస్తున్నావు? నీవు ప్రార్థించినప్పుడు నీ మొదటి ప్రాధాన్యత దేవుడు మరియు ఆయన అవసరాలై ఉండాలని యేసు చెప్పారు. ఆయన రాజ్యమును మొదట వెతకమనే దానికి అర్థం అదే. మత్తయి సువార్త 6:33లో యేసు దీనిని చెప్పారు "ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి. మిగిలిన భూలోక సంబంధమైనవి మీకు చేర్చబడతాయి". వాటి గురించి మీరు అడగవచ్చు అయితే దేవుని రాజ్యాన్ని మొదటగా పెట్టండి; ఇదే దేవుని మార్గం.
మన మొదటి విన్నపం ఇలా ఉండాలని యేసు చెప్పారు, "దేవా పరలోకమందున్న తండ్రి నీ నామం ఘనపరచబడాలి. నా పేరు గురించి ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు. అది ప్రాముఖ్యమైనది కాదు. ఎందుకంటే నా పరువు ప్రతిష్టలు చెత్తబుట్టలో వేయుటకు తగినవి". దేవుని పేరు కంటే నీ పేరు గూర్చి ఎక్కువగా నీవు పట్టింపు కలిగి ఉన్నావా? అప్పుడు యేసు బోధించినట్లుగా నీవు ప్రార్థించడం లేదు. ఒకవేళ ఎవరైనా నిన్ను కానీ నీ కూతురిని కానీ మోసం చేశారని అనుకుందాం. యేసు యొక్క నామము మీ దేశంలో అగౌరవ పరచబడటం కంటే ఈ విషయం నిన్ను ఎక్కువగా కలపరుస్తుందా? క్రైస్తవులు పోట్లాడుకోవడం వారు అనేకమైన చెడ్డ విషయాలు చేయడం గురించి మనం కలవరపడుతున్నామా?. ఒకవేళ అది మనల్ని కలత పరచకపోయినట్లయితే నిజంగా దేవుణ్ణి ఒక తండ్రిగా సంబంధం కలిగి ఉన్నావో లేవో అని నేను ఆశ్చర్యపోతాను. నీ పేరు గురించి నీ కుటుంబం పేరు గురించి నీ పిల్లల గురించి (ప్రజలు వారి గురించి ఏమి చెప్పుకుంటున్నారు) అన్న దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నట్లయితే అప్పుడు నీ ఆలోచన విధానాన్ని నీవు మార్చుకొని నీ ఆలోచనలకు దేవుడే కేంద్రమై ఉండునట్లుగా నీ ఆలోచన విధానాన్ని తిప్పుకోవాలి.
ప్రార్థనకు యేసు ఎంతో గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చారు. లూకా 18:1లో ఆయన చెప్పిన విషయాల్లో ఒకటి మనుషులు విసుగక నిరుత్సాహపడకుండా నిత్యం ప్రార్థించాలని చెప్పారు. ప్రార్థన గురించి ఆయన చెప్పిన రెండు ఉపమానాలలో యేసు ప్రభువు పట్టుదల గురించి చెప్పారు. ఒక ఉదాహరణ లూకా సువార్త 18:1-8లో ఒక విధవరాలు న్యాయం చేయమని న్యాయధిపతి దగ్గరకు వెళ్ళి, ఆమె శత్రువు నుంచి ఆమె న్యాయం పొందేంత వరకు అడుగుతూనే ఉండే ఉపమానం చూస్తాము. సాతానుపై మరియు మన దురాశలపై జయం పొందుటకు చేసే ప్రార్థన ఇదే. మరొక ఉదాహరణ లూకా 11:5-13లో దేవుణ్ణి రొట్టె కొరకు అనగా మన దగ్గరకు వచ్చే అవసరంలో ఉన్న ఇతరులకు సహాయం చేయుటకు వరాలు మరియు బలం గూర్చి యేసు చెప్పుటను చూస్తాము. ఈ రెండు ఉపమానాలలో పట్టుదల గురించి నొక్కి చెప్పబడింది. ఆ రొట్టె పొందు వరకు ఆ వ్యక్తి తలుపు తడుతూనే ఉన్నాడు. ప్రార్థన గురించి యేసు చెప్పిన బోధంతయు ఏమిటంటే: దేవుడు మీ తండ్రి. మీ అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నీ కొరకు ఆయన శత్రువులను జయిస్తాడు. ఇతరులను ఆశీర్వదించుటకు కావలసినదంతయు అనుగ్రహిస్తాడు, విడువక ప్రార్థించండి. మనం ప్రార్థనలో విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్లాలి. ఆయన మహిమ కొరకు మనం అడిగేదంతయు ఆయన అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఆమెన్.