వ్రాసిన వారు :   Jeremy Utley విభాగములు :   గృహము సంఘము తెలిసికొనుట
WFTW Body: 

(జెరెమీ అట్లీ, NCCF సంఘ పెద్ద, శాన్ జోస్, కాలిఫోర్నియా, USA)

"భూమిమీదనున్న భక్తులే శ్రేష్ఠులు; వారు నాకు కేవలము ఇష్టులు (వీరిలోనే నా ఆనందమంతా ఉంది - ఆంగ్ల బైబిలు)" (కీర్తనలు 16:3).

పరిశుద్ధులలో "ఆనందించటం" అంటే ఆచరణాత్మకంగా ఏమిటి? మా కుటుంబంలో ఇటీవల జరిగిన ఒక అనుభవం, ఈ వచనాన్ని మరింత వెలుగులో చూడటానికి మరియు ఈ వైఖరి ప్రభువుకు ఎంత విలువైనదో నేను చూచుటకు సహాయపడింది.

జరిగిన కథ: మా ఒక సంవత్సరం పాప నడక నేర్చుకునే దశలో ఉంది. తాను స్థిరంగా నిలబటానికి తరచుగా ఫర్నిచర్‌ను పట్టుకుంటుంది, కానీ ఆమె ఎప్పుడూ సహాయంలేకుండా హాలులోనికి వెళ్ళుటకు కూడా ధైర్యం చేయలేదు.

తర్వాత ఒక ప్రత్యేకమైన రోజు, ఆమె దేనిని పట్టుకోకుండా లివింగ్ రూమ్‌లో నేను నిలబడిన చోటికి వణుకుతున్న తన యాత్రను నవ్వుతూ ప్రారంభించింది. నేను పులకరించిపోయాను! గదిని దాటడానికి ఆమె చేసే మొదటి ప్రయత్నంలో సఫలమవ్వగలదా అని ఆత్రుతగా ఆమెను ఉల్లాసంగా ప్రోత్సహించటం మొదలుపెట్టాను.

కానీ అప్పుడు పూర్తిగా ఊహించనిది జరిగింది, అది నా ఆనందాన్ని మరో స్థాయికి పెంచింది. లేదు, ఆ పసిపిల్ల దుమకడం ప్రారంభించలేదు; ఆమె అక్క నా వైపు వచ్చి, ఆమెను ప్రోత్సహించుటలో నాతో జతకలిసింది. నా పెద్ద అమ్మాయిలలో ఒకరు పసిబిడ్డలో నా ఆనందాన్ని నాతో పంచుకోవడం చూసినప్పుడు నాలోని ఆనందం ఎంతగా పెరిగిందో చూసి నేను ఆశ్చర్యపోయాను.

నిజం చెప్పాలంటే, చిన్న అమ్మాయి నడవడానికి ప్రయత్నించిన దానిలో ఆనందించిన దానికంటే పెద్ద అమ్మాయి ఆనందంలో నేను మరింతగా ఆనందించాను!

ఈ కథ చాలా సంవత్సరాలుగా అనేక రూపాల్లో పునరావృతమైంది. నా పిల్లలు ఒకరి ఎదుగుదలలో, వారి ప్రత్యేక బహుమతులలో మొదలైన వాటిలో మరొకరు ఆనందించినప్పుడు, అది ఒక తండ్రిగా నా హృదయానికి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని తెస్తుందన్న పాఠాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. క్రీస్తులోని నా సహోదరీ సహోదరుల పట్ల నిజమైన ప్రేమలో నేను ఆనందిస్తున్నప్పుడు, పరలోకంలో ఉన్న నా తండ్రి హృదయానికి నేను ఎలా ప్రత్యేకమైన ఆనందాన్ని తీసుకురాగలనో అది నాకు కొంత నేర్పింది.

సరిగా విద్యావంతులైన మరియు అధునాతనమైన మన మనస్సులలో, దేవుని కుటుంబంలోని ఇతర సభ్యులలో ఆనందించటం క్రీస్తు యెడల ఉన్న ప్రేమ యొక్క పరిధికి దిగువన ఉందని ఆలోచించడం సులభం. అయినను చాలా పరిణతి చెందిన క్రైస్తవుల నుండి దేవుని కుటుంబంలోని ఇతరుల పట్ల సిగ్గుపడకుండా ప్రేమ వ్యక్తీకరించబడటం మనం చూస్తాము:

"మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి" (1 థెస్సలొనీకయులు 2:8).

"నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను... నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను" (ఫిలేమోను 1:10, 12).

"నిజముగా అతడు రోగియై చావునకు సిద్ధమై యుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను" (ఫిలిప్పీయులు 2:27).

"కన్ను చేతితో - నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు... అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు" (1 కొరింథీయులు 12:21, 24-25).

"క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి" (ఫిలిప్పీయులు 1:8).

"మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే" (1థెస్సలొనీకయులు 3:8).

సంఘం యెడల పౌలుయొక్క ప్రేమను పరిగణించడం నన్నెంతో సవాలు చేసింది. "నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను" అని చెప్పడం చాలా సులభం. శరీరంలోని ఇతర సభ్యుల పట్ల నాకున్న అభిమానాన్ని ఇక్కడ ఇచ్చిన ఉదాహరణతో నిజాయితీగా పోల్చడం మరొక విషయం. నేను ఇతరుల ఎదుగుదలలో, ఇతరుల వరములలో ఆనందిస్తున్నానా? నేను ప్రభువుతో ఉండి (ఎప్పుడూ వారి కోసం విజ్ఞాపణ చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు - హెబ్రీ 7:25), నా పెద్ద కుమార్తె పసిబిడ్డ కోసం చేసినట్లుగా క్రీస్తులో నా సహోదరీ సహోదరులను బట్టి ఉల్లసిస్తు ప్రోత్సహకరంగా ఉన్నానా?

ఆనందానికి వ్యతిరేఖమైనది

అన్ని రకాల ద్వేషాల నుండి మనల్ని మనం శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. కానీ మనల్ని మనం మూర్ఖంగా అభినందించుకుంటూ, ఇతరుల పట్ల మనకు ఎలాంటి ద్వేషం లేదని, లేదా చాడీలు చెప్పటంలేదని, లేదా నిందలు వేయటంలేదని మొదలైనవాటిని బట్టి మనం ఆనందించవచ్చు. ఇవి ఆనందానికి వ్యతిరేకమైనవిగా ఊహించుకోవచ్చు. కానీ ఆనందానికి ప్రమాదకరమైన వ్యతిరేఖత ఉందని నేను గమనించాను, అది ఉదాసీనత .

"మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు? అని అందురు. (ప్రభువు ఇలా జవాబిస్తున్నాడు) మీ ఉపవాసదినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు... దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును" (యెషయా 58:3, 6-8).

ప్రతిరోజు తనను తెలుసుకోవాలని కోరుకునే ప్రజలకు (యెషయా 58:1-2) దేవుడు ప్రకటించిన పాపాలు - అజాగ్రత్త, ఉదాసీనత, నిర్లక్ష్యం. వారు దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నారు, ఆయన మార్గాలను తెలుసుకోనుటలో సంతోషించాలనుకున్నారు, అయినప్పటికీ వీటిని వెంబడించుటలో తమ సహోదరులు మరియు సహోదరీలతో సంబంధం లేదని భావించినందున వారు దోషులయ్యారు. వారు దేవుని కుటుంబం పట్ల ఉదాసీనంగా ఉండి, దేవుణ్ణి వెతకవచ్చు అనుకున్నారు!

మనము ప్రభువుతో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, ఆయన ఖచ్చితంగా చేసిన పాపాలతో (ద్వేషించడం, చాడీలు, నిందించడం మొదలైనవి) వ్యవహరించాలని కోరుకొనును, కానీ దాని కంటే ఎక్కువగా ఆయన చేయవలసి ఉండి చేయని ప్రతి పాపాన్ని, ముఖ్యంగా మన హృదయాలలో ప్రేమ లేకపోవడాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరిక కేవలం మన స్వంత అవసరత కొరకు ఆయన ప్రేమతో మనలను నింపుట మాత్రమే కాదు, ఇతరుల కొరకు మనలను పొంగిపొర్లేటట్లు నింపుట (యోహాను 7:38). ఇది నమ్మడం చాలా కష్టం, కానీ ఉదాసీనత అనేది అసలైన ద్వేషం కంటే అధ్వాన్నమైనదని దేవుని వాక్యం చెబుతోంది - "నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను" (ప్రకటన 3:15-16). దేవుడు నిజానికి నులివెచ్చని దానికంటే చల్లదనాన్ని కోరుకుంటాడు!!

నేను చేయవలసినవి చేయకపోవటం (నిర్లక్ష్యం చేసేవాటి) కంటే నేను చేసే తప్పులపై దృష్టి పెట్టడం చాలా సులభం అని నేను గమనించాను. కానీ దేవుడు కేవలం చెడును ("చల్లని") వదిలించి, మనల్ని ఉదాసీనంగా ("నులివెచ్చని స్థితిలో") ఉంచుటలో సంతృప్తి చెందడు; ఆయన మంచితో (ఆయన మండుతున్న ప్రేమతో) మనల్ని ముంచెత్తాలని కోరుకుంటున్నారు; ఆయన కృప ద్వారా మనం దాటవలసిన కీలకమైన దశ - శూన్యత్వం, నులివెచ్చతనం, అజాగ్రత్త మరియు ఉదాసీనత వంటి ఎడారులు.

"అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి వెళ్లి, తనకంటె చెడ్డైవెన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను" (లూకా 11:24-26).

మన ఆత్మలకు ద్వేషం ఎంత ప్రమాదకరమో క్రీస్తు శరీరంలోని అజాగ్రత్తగా ఉండటం అంత ప్రమాదకరమని మనం చూడాలి. మనం అలా చూస్తే, ఇతర సహోదరీ సహోదరుల పట్ల మనకున్న ఉదాసీనత గురించి మనకు వెల్లడి చేయమని ప్రభువును అడుగుతాము. ఆయన దయ మనల్ని ప్రేమలేని తనం నుండి పశ్చాత్తాపపడేలా చేస్తుంది. ఆయన కుటుంబంలో తన ఆనందం యొక్క సంపూర్ణతతో మన హృదయాలను నింపునుగాక. ఒక తండ్రిగా అధికమైన ఆనందాన్ని అనుభవించుటలో నా స్వంత అనుభవాన్ని గుర్తుకుచేసుకొనుట ద్వారా, ఆయన కుటుంబ సభ్యుల కోసం మనం దేవుని హృదయాన్ని పంచుకున్నప్పుడు, ఆయన ఆనందాన్ని అధికంచేసే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం నన్ను ఎంతో ఆశీర్వదించింది.

"నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నదే నా ఆజ్ఞ." (యోహాను 15:12)

"అన్నిటికి అంతం దగ్గరపడింది... అన్నింటికంటే మించి, ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమలో తీవ్రంగా ఉండండి, ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది." (1పేతురు 4:7-8)

"అక్రమం ఎక్కువైనందున, చాలా మంది ప్రజల ప్రేమ చల్లారిపోతుంది. అయితే (దేవుని మండుతున్న ప్రేమలో) చివరి వరకు సహించేవాడు రక్షింపబడతాడు." (మత్తయి 24:12-13)