WFTW Body: 

1కొరింథీ 2:14,15లో 'ప్రకృతి సంబంధియైన మనుష్యుడు' మరియు 'ఆత్మ సంబంధియైన మనుష్యుడు' గురించి చదివెదము. ప్రకృతి సంబంధమైన క్రైస్తవునికి మరియు ఆత్మ సంబంధమైన క్రైస్తవునికి చాలా తేడా ఉన్నది. "ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు". మానవ జ్ఞానముతో ఈ భేదమును అర్థము చేసుకోలేమని ఇక్కడ వ్రాయబడియున్నది.

కన్ను మరియు చెవి వేరుగా ఉన్నట్లే ఆత్మ మరియు మనస్సు వేరుగా ఉండును. ఒక వ్యక్తి బాగుగా వినగలిగినప్పటికి గ్రుడ్డివాడుగా ఉండుట సాధ్యమైనట్లే, ఒక వ్యక్తి చాలా తెలివితేటలు కలిగియుండి కూడా ఆత్మ విషయములో మృతుడైయుండవచ్చును మరియు ఆత్మీయముగా జీవము కలిగినప్పటికిని అతనికి తెలివితేటలు లేకపోవచ్చు. ఈ లోకములో పనిచేయుటకు మనకు మంచి మెదడు అవసరము కాని దేవుని విషయములను గ్రహించుటకు మన ఆత్మీయ స్థితి ముఖ్యమైయున్నది. దేవుని విషయములను గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత మనకు అవసరము. మరియు పసిబిడ్డల వంటి దీనాత్మగలవారికే ఆయన ప్రత్యక్షతలు ఇచ్చును (మత్తయి 11:25). మరియు ఆయన జ్ఞానులకును వివేకులకును వీటిని మరుగుచేయును (వారు దీనులైతే అనుగ్రహించును).

జ్ఞానము గలవాడు దీనుడగుట కష్టము, కాని అది అసాధ్యం కాదు. ఒక స్వనీతిపరులైన పరిసయ్యుడు తాను పాపినను ఒప్పుకొనుట కష్టమే, కాని అది అసాధ్యం కాదు. వ్యభిచారులకును మరియు దొంగలకును తాము పాపులమని ఒప్పుకొనుట సులభము. అవిధముగానే దేవునియొక్క ప్రత్యక్షతలు కూడా జ్ఞానము లేని వ్యక్తి తనకు తెలియదని ఒప్పుకొనుట ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొనెదరు. అందువలననే ఏమియు నేర్చుకొనని చేపలు పట్టువారైన పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురితో ప్రభువైనయేసు ఎక్కువగా సహవాసం చేసెను, ఎందుకనగా వారు ఆత్మ విషయములకు ఎక్కువగా స్పందించారు మరియు పరిసయ్యులు కూడా వారి తెలివితేటలను బట్టి గర్వించి మరియు ఆత్మీయముగా బుద్ధిహీనులమని ఒప్పుకొనక పోయినందున ప్రభువైనక్రీస్తును అంగీకరించలేదు. తెలివితేటలు గల కాలేజీ విద్యార్థులతో నీవు ఉంటున్నప్పుడు దీనిని జ్ఞాపకముంచుకొనుము.

మానవ తెలివితేటలకు దేవునియొద్ద విలువలేదు. మన శరీరములకు ఉన్న రంగువలె అవి పుట్టుకతోనే మనకు వచ్చును గనుక, వాటిని గూర్చి దేవునియెదుట ప్రత్యేకత ఉండదు. మనుష్యుల స్వనీతివలె తెలివితేటలు కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలవంటివి (యెషయా 64:6). క్రీస్తే స్వయముగా మనయొక్క నీతియైయున్నాడు. అంతేకాదు క్రీస్తే మనయొక్క జ్ఞానమైయున్నాడు (1కొరింథీ 1:31).

పౌలు స్వనీతిపరుడైన పరిసయ్యుడును మరియు ఎంతో తెలివితేటలు గలవాడైనప్పటికిని, అతడు రక్షణ పొందుటయే కాక క్రీస్తుయొక్క గొప్ప అపొస్తలుడుగా మారటం మనలను ఎంతో ప్రోత్సహిస్తుంది. ఎందుకనగా అతడు ఎల్లప్పుడు తన్నుతాను తగ్గించుకొనెను. నేను మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనకుండునట్లు భయముతోను ఎంతో వణుకుతోను మీ మధ్యలో ఉంటినని పౌలు కొరింథీయులతో చెప్పుచున్నాడు (1కొరింథీ 2:3). పరిశుద్ధాత్మ శక్తితో గాక తన యొక్క స్వంత జ్ఞానముతో బోధించెదనేమోయని అతడు భయపడియున్నాడు. మనం మాట్లాడే ప్రతిసారి అటువంటి భయమును కలిగియుండాలి. మనకు పరిశుద్ధాత్మయొక్క శక్తి ఎల్లప్పుడు అవసరం కనుక ఎల్లప్పుడు దానికొరకు ప్రార్థించాలి.

కాబట్టి ఆత్మతో కాకుండా తెలివితేటలతో బైబిలు సత్యమును బోధించుట విషయములో పొరపాటు చేయకూడదు. లేక ఒక ఉద్రేకముతో కూడిన ప్రసంగము ఆత్మ సంబంధమైనదని అనుకొనకూడదు. తెలివితేటలు మరియు ఉద్రేకములు మన ప్రాణములో ఉన్నవి. ఇవి మంచిసేవకులే గాని చెడ్డ యజమానులు. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన జీవితములకు ప్రభువైయుండవలెను. దీనత్వము, దీనత్వము, దీనత్వము అను మూడు రహస్యములు కలిగిన క్రైస్తవుడే ఆత్మ సంబంధమైన వాడగును.