వ్రాసిన వారు :   Bobby McDonald విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

(బాబీ మెక్‌డొనాల్డ్ NCCF సంఘపెద్ద, San Jose, USA)

యేసు తన జీవితంలో కష్టతరమైన వ్యక్తులతో వ్యవహరించిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు ఆయనను తృణీకరించారు, కొందరు ఆయనను హింసించారు, కొందరు ఆయనను ఎగతాళి చేశారు, మరికొందరు ఆయనను నిర్లక్ష్యం చేశారు లేదా విస్మరించారు. ఆయనపై అరవడం, ఆయనపై ఉమ్మివేయడం, ఆయనతో వాదించడం, ఆయనను ఇరుకున పెట్టుటకు ప్రయత్నించడం, చంపడానికి ప్రయత్నించడం వంటివి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు.

మనలో ప్రతి ఒక్కరికి మన జీవితాంతం, వ్యవహరించుటకు కష్టతరమైన వ్యక్తులు ఉంటారు. వారు భక్తిహీనులుగా, నీచంగా, క్రూరంగా, బాధించేవారిగా మరియు చెడుగా అనిపించవచ్చు. కష్టతరమైన వ్యక్తుల గురించి నాకు సహాయపడిన బైబిలు చెప్పే కొన్ని సూత్రాలు ఇవి:

యోహాను 8:7 "మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి"
కష్టతరమైన వ్యక్తుల గురించి నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను వారిలో ఒకడిని!

ఇతర వ్యక్తులు పాపులు, నాకు కష్టం కలిగించే వారు, స్వార్థపరులు కావచ్చు. కానీ వారికి ఉన్న శరీరమే నాకు ఉంది మరియు నేను కూడా వారివలె దోషినే. పరలోకంలో ఉన్న నా పరిపూర్ణ తండ్రి పట్ల నేను ఎంత కఠినంగా, స్వార్థపూరితంగా, పాపిగా ఉన్నానో నేను స్పష్టంగా చూసినప్పుడు, నాకు వ్యతిరేకంగా పాపం చేసే ఇతరుల పట్ల దయ మరియు సహనం కలిగి ఉండటం సులభం అని నేను గుర్తెరిగాను. ఒక పరిసయ్యుడు అసహనంతో ఇతరులను తక్కువగా చూస్తాడు, కానీ ఒక క్రైస్తవుడు ముఖ్యంగా తనపై తాను మరియు తన స్వంత పాపంతో అసహనం మరియు విసుగు చెందుతాడు (లూకా 18:9-13). దేవుని రాజ్యం కష్టతరమైన సహోద్యోగులతో, దుష్ట ప్రభుత్వంతో, స్వార్థపూరిత కుటుంబంతో, చెడ్డ సంఘాలతో లేదా నులివెచ్చని క్రైస్తవులతో విసుగు చెందిన వ్యక్తులకు చెందినది కాదు. అది తమతో తాము విసుగు చెందిన వ్యక్తులకు చెందినది! వీరు పేద బిచ్చగాళ్లలాగా ప్రభువు వద్దకు వచ్చి "ప్రభువా, నాకు సహాయం కావాలి, నేను పాపాత్ముడైన పేద బిచ్చగాడిని, నన్ను క్షమించి నాకు సహాయం చేయండి!" అని చెప్పే ఆత్మతో దీనులైన వ్యక్తులు.

"ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది" (మత్తయి 5:3)
బైబిలు నాకు నేర్పిస్తున్న మరో ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, కష్టతరమైన వ్యక్తులు నన్ను ఎలా చూస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా వారిని ప్రేమించడం

మత్తయి 5:44 "మీ శత్రువులను ప్రేమించండి మరియు మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి."
రోమీయులు 2:4 "దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది.."

ఒకసారి నేను ఒక కథ విన్నాను: ఒక రోజు తెల్లవారుజామున గాలి సూర్యుడిని పోటీకి సవాలు చేసింది. ఒక వ్యక్తి తన కోటుతో రోడ్డు వెంట నడుస్తున్నాడు మరియు గాలి సూర్యునితో ’నీకంటే ముందు ఆ వ్యక్తి తన కోటును తీసివేయగలిగేలా చేయగలనని అనుకుంటున్నాను’ అని చెప్పింది. సూర్యుడు దానికి అంగీకరించాడు. గాలి తాను ముందుగా వెళ్తానని చెప్పింది. గాలి ఆ వ్యక్తిపై వీచింది, వీలైనంత బలంగా వీచింది, గాలి ఎంత గట్టిగా వీచిందో ఆ వ్యక్తి తన కోటును అంత గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు సూర్యుడు, ’సరే ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. సూర్యుడు ఆకాశంలో పైకి లేచి కొంచెం ప్రకాశించాడు. కొద్ది సమయంలోనే, ఆ వ్యక్తి తన కోటును నెమ్మదిగా తీసివేసాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒక వ్యక్తిని కోపంతో, శక్తితో నియంత్రించడానికి ప్రయత్నించడం కంటే, ప్రేమతో వారికి వెచ్చదనం ఇవ్వడం మంచిది.

మన పరలోకపు తండ్రి గాలిలా లేదా సూర్యుడిలా ఉన్నాడా? మనం ఆయనను ప్రేమించేలా చేసింది దేవుని ప్రేమ అని బైబిలు చెబుతుంది (1 యోహాను 4:19), మరియు ఆయన కనికరం మనల్ని పశ్చాత్తాపపడేలా చేసింది (రోమా 2:4). ఇతరులతో వ్యవహరించేటప్పుడు మన జీవితంలో కూడా ఆ సూత్రాన్ని మనం చూస్తామని నేను నమ్ముతున్నాను. ఇతరులతో పోరాడి, మనతో ఏకీభవించమని లేదా మనతో సరిగా వ్యవహరించమని బలవంతం చేయడానికి ప్రయత్నించడం కంటే, ఇతరులను శ్రద్ధతో, నిస్వార్థంగా ప్రేమించడం సంబంధాలలో ఐక్యతను మరియు ఒప్పందాన్ని తీసుకురావడానికి మార్గం.

చాలా సార్లు ప్రేమ, శత్రువు హృదయాన్ని మన పట్ల వెంటనే మార్చదు (బహుశా ఎప్పటికీ మార్చలేకపోవచ్చు), అది సరే. మన శత్రువులను, మనకు వ్యతిరేకంగా పాపం చేసే పశ్చాత్తాపపడని ప్రజలను మనం ప్రేమిస్తూనే ఉంటే, మన పరలోకపు తండ్రిలా ఉండే ఆధిక్యతను మనం పొందవచ్చు, ఎందుకంటే ఆయన అలాగే ఉన్నాడు - ఆయనను తమ శత్రువుగా భావించే దుష్టుల పట్ల కూడా ఆయన అపారమైన ఓపిక మరియు ప్రేమ కలిగి ఉన్నాడు:

మత్తయి 5:44-45 “అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించండి మరియు మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి, తద్వారా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులుగా ఉంటారు; ఎందుకంటే ఆయన చెడ్డవారిపై మరియు మంచివారిపై తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతులపై మరియు అనీతిమంతులపై వర్షం కురిపిస్తున్నాడు".

కుమారుడు అంటే తన తండ్రిలాగే ఉండేవాడు. యేసు మన శత్రువులను ప్రేమించమని చెప్పాడు. ఈ విషయంలో మనం పరలోకమందున్న మన తండ్రికి కుమారులుగా ఉండగలము.

సామెతలు 15:1 "మృదువైన మాట కోపాన్ని చల్లార్చుతుంది."

నాలుక శక్తివంతమైనది. "ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!" (యాకోబు 3:5).

దాని ద్వారా యుద్ధాలు ప్రారంభమవుతాయి మరియు ముగుస్తాయి. ఇంకా మంచి విషయం ఏమిటంటే, యుద్ధాలు నిరోధించబడతాయి! కోపానికి కోపంతో, ఉగ్రతకు ఉగ్రతతో ప్రతిస్పందించే బదులు, కోపానికి బదులుగా మృదువైన మాటలు మరియు మృదువైన సమాధానాలు ఇవ్వడం ఉత్తమమని బైబిలు చెబుతోంది. ఇది శాంతికి ఉత్తమమైన మార్గం. దేవుడు పోరాడేవారిని కోరుకోవడం లేదు (చెడు మాటలకు చెడు మాటలు తిరిగి చెప్పడం), కానీ సమాధానపరిచే వారిని కోరుకుంటున్నాడు (మత్తయి 5:9). ఇతరుల కోపానికి మృదువైన మాటలతో ప్రతిస్పందించడం ద్వారా మనం సమాధానపరచు వారిగా ఉండగలము.

సామెతలు 17:13-14 "మేలుకు ప్రతిగా కీడుచేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట; వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము".