"మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి -నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును" (మత్తయి 7:1-5).
ఎల్లప్పుడూ మనలను మనమే తీర్పు తీర్చుకోవాలని, ఇతరులకు ఎన్నడూ తీర్పు తీర్చకూడదని మనమందరము నిరంతరము గుర్తుచేయబడవలసిన అవసరత ఎంతైనా ఉంది.
అయితే మనకందరికీ వివేచన ఉండాలి - వివేచన అనేది ఒక ఆత్మీయ లక్షణము. అది శారీరక క్రియయైన ‘ఇతరులకు తీర్పు తీర్చడం’ కంటే పూర్తిగా భిన్నమైనది.
రోమా 14వ అధ్యాయాన్ని మనమందరము తరచుగా ధ్యానించాలి - ఎన్నో విషయాలలో దేవుడు తన పిల్లలకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని అది మాటిమాటికి మనకు గుర్తుచేస్తుంది.
బాహ్యంగా గానీ, అంతరంగంలో గానీ మనము ఇతరులకు తీర్పు తీర్చే అవకాశమున్న కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాము. ఇటువంటి విషయాలలో ఇతరుల పట్ల మనము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచకుడదు (మనస్సులో కూడా ఎటువంటి అభిప్రాయాలు కలిగి ఉండకుడదు):
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉంటాయని నేను నిశ్చయంగా చెప్పగలను. వీటిలో అనేక నిర్ణయాలు ఆయా కుటుంబాల ఆదాయంపై ఆధారపడి ఉంటాయి - విశ్వాసుల మధ్య ఆదాయ స్థాయిలు ఎంతో భిన్నంగా ఉంటాయి. ఒక పెద్ద నగరంలో ఎంతో సాధారణమైనదిగా భావించే కారు, ఇల్లు, విద్య, ఉద్యోగం లేదా పెళ్లి... ఒక పేద గ్రామంలో నివసించే వారి ప్రమాణాల ప్రకారం చూస్తే విపరీతమైన విలాసవంతమైనదిగా అనిపించవచ్చు. కాబట్టి, మనము ఒకరికొకరము తీర్పు తీర్చలేము.
ఒక వివాహం ఏ స్థాయిలో జరగాలనేది ఇరువైపుల తల్లిదండ్రుల సంపదతో పాటు, వారి పూర్ణహృదయ సమర్పణను బట్టి కూడా నిర్ణయించబడుతుంది. సమాధానం కలిగి ఉండుట కొరకు, ఇరువైపుల తల్లిదండ్రులలో గానీ, వరుడు లేదా వధువులలో గానీ ఏ ఒక్కరి అరకొర హృదయపు ఆలోచననైనా చివరి నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, ఒకరు తమ వివాహాన్ని ఎలా జరిపించుకున్నారనే విషయంలో మనము ఎవరికీ తీర్పు తీర్చకూడదు.
మనము ఏ విషయాలలో నిరాడంబరంగా ఉంటామో, కేవలం ఆ విషయాలలోనే ఇతరుల ఆడంబరాన్ని విమర్శించే స్వభావం మనకు ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలలో ఒక విషయంలో ఇతరులకు తీర్పు తీర్చేవారు, తరచుగా తాము వేరొక విషయంలో తప్పిపోతుంటారు -అయితే వారిలోని విమర్శించే మనస్తత్వపు గుడ్డితనం వల్ల, వారు తమ సొంత బలహీనతలను చూడలేరు. కాబట్టి ఎదుటివారి కంటిలోని నలుసును బట్టి తీర్పు తీర్చకుండా ఉండటమే ఎంతో శ్రేష్ఠమైనది.
మనము "మన సొంత పనిని చూసుకోవడం" నేర్చుకోవాలి మరియు ఇటువంటి విషయాలలో ఇతరులు ఏమి చేయాలో వారికి ఆజ్ఞాపించకూడదు. లేకపోతే, "పరుల జోలికిపోవుచు" జీవించే స్వనీతిపరులైన పరిసయ్యులుగా మనము మిగిలిపోతాము (1 పేతురు 4:15). ప్రతి ఒక్కరూ తమ మనస్సాక్షి ప్రకారం నడచుకొనునట్లు విడిచిపెట్టడమే మంచిది.
సంఘములో మనము ప్రధానంగా పాపమునకు వ్యతిరేకంగాను, ధనాపేక్షకు వ్యతిరేకంగాను మాట్లాడాలి; సంఘానికి హాని కలిగించే స్పష్టమైన పాపపు ప్రవర్తన ఉంటే తప్ప, మిగిలిన విషయాలలో ఎవరైనా మన సలహాను అడిగినప్పుడు మాత్రమే మనము సలహా ఇవ్వాలి.
ఆర్థిక విషయాలలో మాత్రం, విశ్వాసులందరూ తమ ఆర్థిక సరిహద్దుల లోపలే జీవించేలా మనము ప్రోత్సహించాలి. అప్పులలో కూరుకుపోవడం అంటే దేవుడు మన చుట్టూ నిర్మించిన ఆర్థిక ప్రాకారాన్ని పడగొట్టడమే. ప్రసంగి 10:8 చూడండి [అక్కడ "పాము కరచుట" కొరకు వాడబడిన హెబ్రీ పదం "నాషక్"(nashak), ఇది "అప్పు" కొరకు వాడే హెబ్రీ పదమైన "నాషా"(nasha)ను ఎంతగానో పోలియుంటుంది]. అత్యవసర పరిస్థితులు, వైద్య ఖర్చులు, ఇల్లు కొనుక్కోవడం/కట్టుకోవడం లేదా వాహనం కొనడం వంటి అనివార్యమైన సందర్భాలలో తప్ప, సాధ్యమైనంతవరకు అప్పులకు దూరంగా ఉండేలా విశ్వాసులను మనము ప్రోత్సహించాలి. ఒకవేళ అప్పు చేసినప్పటికీ, ఆ అప్పులను సాధ్యమైనంత త్వరగా తీర్చివేయమని వారిని ప్రోత్సహించాలి (రోమా 13:8).
అయితే దీని అర్థం బైబిలు స్పష్టంగా బోధించే ఉపదేశాలను మనము బోధించకూడదని కాదు: ఉదాహరణగా.. - సంఘము మహాశ్రమల గుండా వెళ్ళడం (సంఘము మరియు మహాశ్రమలు(The Church And The Tribulation) అనే ఆంగ్ల వ్యాసాన్ని చూడండి) - స్త్రీలు ప్రార్థన చేయునప్పుడు/ప్రవచించునప్పుడు ముసుగు వేసుకోవడం (‘స్త్రీలు ముసుగు ధరించడం’(Head-covering for Women) మరియు ‘ముసుగు ధరించుట - రెండు ఆత్మీయ సత్యాలు’ అనే వ్యాసాలను చూడండి) - ఇటువంటి ఇతర విషయాలు.
ఈ విషయాలలో కొందరు విశ్వాసులకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మనము వారికి తీర్పు తీర్చము. కానీ బైబిలు స్పష్టంగా బోధిస్తున్న సత్యాన్ని సంఘములో నిక్కచ్చిగా బోధిస్తూనే ఉంటాము.
తీతు 2:4, 5 వచనాలను గమనించండి; అక్కడ భార్యలు ప్రధానంగా "ఇంట ఉండి పని చేసికొనువారై" ఉండాలని స్పష్టంగా చెప్పబడింది. దానిని మనము బోధించాలి. అయితే ఒక భార్య ఇంటి బయట ఉద్యోగం చేయకూడదని బైబిలు ఎక్కడా నిషేధించలేదు. కాబట్టి మనము కూడా దానిని నిషేధించకూడదు. భర్త అనారోగ్యంతో ఉండటం వలనో, లేదా అతనికి సరైన ఉద్యోగం దొరకకపోవడం వలనో భార్య ఉద్యోగానికి వెళ్లడం అనివార్యమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఉద్యోగానికి వెళ్లే ఏ భార్యనూ మనము ఎన్నడూ తీర్పు తీర్చకూడదు.
క్రిస్మస్ మరియు ఈస్టర్ పండుగల ఆచరణను చూడండి. ఈ పండుగల యొక్క అన్య మూలాల గురించి మనకు స్పష్టమైన నిశ్చయత ఉండవచ్చు. కానీ ఇతర విశ్వాసులకు ఈ వాస్తవం గురించి ఏమాత్రం అవగాహన లేకపోవచ్చు.
మన ఒప్పుదలలను మనము గట్టిగా పట్టుకోవాలి. కానీ ఆ పండుగలను ఆచరించే వారికి మనము తీర్పు తీర్చకూడదు. రోమా 14:4-6 ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది.
రోమా 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని తన విశ్వాసులకు ఇవ్వని ఏ సంఘమైనా సరే అది అక్షరాణుసారముగా (లీగలిస్టిక్‍గా) ఉన్నట్లే.
దేవుని వాక్య సత్యాలను ప్రకటించడానికి, ఇతరులకు తీర్పు తీర్చడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎంతో ప్రాముఖ్యం. దేవుని సంకల్పమంతటినీ మన సంఘాలలో మనము ప్రకటించాలి. మనలను "అక్షరాణుసారులు" అని పిలుస్తారేమోనన్న భయంతో దేవుని సత్యంలో ఏ భాగాన్నీ దాచకూడదు. కానీ ప్రాథమికం కాని ఇటువంటి ఉపదేశాలలో మనము బోధించిన దానిని కొందరు అంగీకరించకపోయినా లేదా ఆచరించకపోయినా, మనము వారికి తీర్పు తీర్చకూడదు. వారి ప్రవర్తన సంఘాన్ని పాడుచేసేదిగా లేనంతవరకు, వారికి తీర్పు తీర్చే బాధ్యతను దేవునికే విడిచిపెట్టాలి.
అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది; అదేంటంటే - స్వయంగా యేసుప్రభువు కంటే మరియు ఆయన సారూప్యములోనికి మారడం కంటే, పైన పేర్కొన్న ప్రాథమికం కాని విషయాల పట్లే మనము ఎక్కువ పట్టుదల కలిగియుండటం.
పైన చెప్పబడినవన్నీ బాహ్య సంబంధమైన విషయాలు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు - ఆ హృదయాన్ని మనము చూడలేము. కాబట్టి మనము దైవభీతి కలిగి ఉండాలి - అప్పుడు మనము "కంటిచూపును బట్టి తీర్పు తీర్చక, వినికిడిని బట్టి విమర్శ చేయక, నీతిని బట్టి తీర్పు తీర్చుదుము" (యెషయా 11:3, 4).
మనము హృదయపూర్వకంగా "ప్రేమను కలిగియుండుటకు ప్రయాసపడుతూ" (1 కొరింథీ 14:1), మన ప్రభువు యొద్ద నుండి "దీనమనస్సును నేర్చుకోవడానికి" ఆశపడితే (మత్తయి 11:29), ఇతరులకు తీర్పు తీర్చే ఈ ప్రమాదకరమైన గోతిలో పడకుండా తప్పించబడతాము.
ఎల్లప్పుడూ తమను తామే తీర్పు తీర్చుకుంటూ, ఇతరులకు ఎన్నడూ తీర్పు తీర్చని వారే ఈ లోకంలో అత్యంత సంతోషకరమైన వ్యక్తులు.