WFTW Body: 

"దేవుడు మన అర్పణలను కోరటలేదని" మనం హెబ్రీ 10:5లో చదువుతాము. దేవుడు వారి అర్పణలను(కానుకలను) కోరుకుంటున్నాడని చెప్పే బోధకుల ద్వారా శ్రమపడే వారికి నేను ఈ వచనము చూపిస్తాను. దేవుడు మననుండి ఏమి కోరుకుంటున్నాడని మనకు చెప్పబడినది? -మన శరీరములను. పాతనిబంధనలో "మీ దశమభాగములను లేవీయులకు చెల్లించుడి" అను ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వబడెను. క్రొత్తనిబంధనలో "మీ శరీరములను దేవునికి ఇయ్యుడి" అను ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది (రోమా 12:1). సంఘస్థులను ఎల్లప్పుడు దశమభాగము చెల్లించమని అడిగే సంఘము పాత నిబంధన సంఘము. ఒక క్రొత్త నిబంధన సంఘము మన శరీరములను - అంటే మన కళ్ళను, మన చేతులను, మన నాలుకలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుటకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ రోజున దేవుడు మననుండి కోరుకొనేది భౌతిక అర్పణలను కాదుగాని మన శరీరములను.

పస్కాదినమున పాత నిబంధన గొఱ్ఱెపిల్ల అర్పించబడుటకు, క్రీస్తుసిలువ మీద మరణించుట ఎలాగు సమానమో క్రొత్త నిబంధనలో మన శరీరములను దేవునికిచ్చుట, పాత నిబంధన దశమభాగములతో సమానము. అంటే ఇప్పుడు భూమిమీద ప్రభువు పనికొరకు మనము డబ్బులు ఇవ్వనక్కరలేదని దీని అర్థమా? మీరు ఖచ్చితంగా ఇవ్వవచ్చు కాని మీరు సంతోషముగా ఇచ్చే వాటిని మాత్రమే దేవుడు కోరుచున్నాడు(2 కొరింథీ 9:7). ఏదేమైనప్పటికీ ఆయన మొట్టమొదటిగా నీ శరీరాన్ని కోరుచున్నాడు. తమ శరీరాలను ఇచ్చువారు సాధారణంగా మిగతావాటిని కూడా ఇచ్చెదరు. కాని సమస్తము సంతోషకరంగా ఆనందకరంగా ఇవ్వబడవలెను.

యేసు ఈ లోకములోనికి వచ్చినప్పుడు తన తండ్రికి దశమభాగములను అర్పణలను ఇవ్వడానికి రాలేదు(హెబ్రీ 10:5). ఆయన తన శరీరమును ఒక బలి అర్పణగా ఇచ్చుటకు వచ్చెను. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై ఉన్నాడు మరియు దేవుడు మననుండి ప్రధానంగా కోరుకొనేది మన శరీరమని మనకు నేర్పించాడు.

యేసు పరలోకములో ఉన్నప్పుడు శరీరమును కలిగియుండలేదు. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఒక శరీరమునిచ్చెను. ఆ శరీరముతో ఆయన ఏమి చేయవలసియుండెను? ఒక మిషనరీగా ఆఫ్రికా వంటి కష్టమైన ప్రదేశమునకు వెళ్ళుట ద్వారా తండ్రి పట్ల ఆయనకున్న ప్రేమను కనుపరవవలెనా? లేక ఆయన ప్రతి రోజు నాలుగు గంటలు ప్రార్థన చేసి వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయవలెనా? వీటిలో ఏదీ కాదు. "దేవా, నేను బలులర్పించుటకు కాక నీ చిత్తము చేయుటకు నేను భూమి మీదకు వచ్చియున్నాను" అని చెప్పెను(హెబ్రీ 10:7). యేసు తన శరీరమును దేవుని చిత్తమును చేయుటకు ఉపయోగించెను - మనము కూడా ఇందుకే మన శరీరములను ఉపయోగించవలెను. మన శరీరములను దేవునికి అర్పించినప్పుడు, వాటిలో ఉన్న ప్రతి అవయవమును, మన చేతులను, కళ్ళను, ఆశలను, కోరికలను దేవునిచిత్తమును చేయుటకే ఉపయోగించెదము. అప్పటినుండి ప్రతిదినము దేవుని చిత్తము చేయుట మన జీవితము యొక్క ఏకైకవాంఛగా ఉండును.

మొట్టమొదటిగా, మన పట్ల దేవుని చిత్తమేమైయున్నది? "మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము"(1థెస్సలొనీయులు 4:3). మనలో ప్రతి ఒక్కరి పట్ల ఇదే దేవుని చిత్తముయొక్క మొదటి భాగమైయున్నది. మన పరిచర్య విషయానికొస్తే దేవుని కొరకు ఏదో చేయడానికి మనము అటు ఇటు పరుగెత్తకూడదు. మన పరిచర్యలో కూడా మనము దేవుని చిత్తమును చేయవలెను. "నీ చిత్తము పరమందు నెరవేరినట్లు భూమిమీద నెరవేరును గాక" అని ప్రార్థించాలని యేసు మనకు నేర్పెను. పరలోకములో దూతలు దేవుని కొరకు ఏదో చేయలని తీరికలేకుండా అటుఇటు పరుగెత్తరు. యేసు కూడా తన తండ్రి కొరకు ఏదో చేయాలని అటు ఇటు పరుగెత్తలేదు. ఆయన తండ్రి చిత్తాన్ని వెదకి దాన్ని మాత్రమే చేశాడు. 18 నుంచి 30 ఏళ్ళవరకు తండ్రి ఆయనను ఒక వడ్రంగిగా పనిచేయమని చెప్పినప్పుడు ఆయనలా చేసెను. ఆ సంవత్సరాలన్నిటిలో తండ్రి పనిలో ఆయన నమ్మకముగా ఉన్న తరువాత తండ్రి ఆయనను బయటకు వెళ్ళి మూడున్నర ఏళ్ళపాటు సువార్తను ప్రకటించమని చెప్పెను. యేసు సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచినప్పుడు దేవునికెంత ఇష్టుడిగా ఉండెనో 12ఏళ్ళపాటు కుర్చీలను, బల్లలను చేసినప్పుడు కూడా దేవునికి అంతే ఇష్టుడిగా ఉండెను.

యేసు భూమిమీదకు వచ్చింది ఒక మిషనరీగా ఉండుటకో లేక పూర్తికాల పరిచర్య చేయుటకో కాదు. తండ్రి చిత్తమేదైతే దాన్ని చేయడానికి ఆయన వచ్చెను. తండ్రి చిత్తము వండ్రంగిపనైతే ఆయన ఆ పనిని చేసెను. తండ్రి చిత్తము పూర్తికాల పరిచర్యయైతే ఆయన దాన్ని చేసెను. మనము ఈ పనో ఆ పనో కాకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి మనలను మనము ప్రతిష్టించుకోవాలి. దేవుడు నిన్ను మిషనరీగా కాకుండా ఒక వడ్రంగివానిగా ఉండుటకు పిలువవచ్చు. నీకిష్టమేనా?

"దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను" అని యేసు చెప్పారు. తద్వారా ఆయన మొదటి నిబంధనను కొట్టివేసి రెండవ నిబంధనను స్థిరపరచెను(హెబ్రీ 10:8,9). మొదటి నిబంధనలో ఎన్నో మతపరమైన కార్యకలాపాలుండేవి, ప్రత్యేకంగా ప్రత్యక్షపు గుడారములోను మరియు దేవాలయములోను ఉండేవి. అయితే యేసు తన జీవితంలో 90% సమయము మతపరమైన పనిని చేయలేదు. ముపై ఏళ్ళపాటు ఆయన ఇంటియొద్ద తన తల్లికి సహాయము చేసెను. మరియు ఒక వడ్రంగిగా తన కుటుంబాన్ని పోషించెను. తరువాత మూడున్నర సంవత్సరములు ఆయన సువార్తను ప్రకటించెను. ఆ విధంగా తండ్రి ఆయకిచ్చిన పనిని ఆయన పూర్తిచేసి తండ్రిని మహిమపరిచాడు(యోహాను 17:4). ఇంటియొద్ద నీ తల్లికి సహాయము చేయడము దేవుని దృష్టిలో రోగులను స్వస్థపరచినంత ముఖ్యమైనదని మనమక్కడ నేర్చుకుంటాము. క్రొత్తనిబంధనలో పలానా సమయమందు నీవేమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అదే దేవునిచిత్తము. ఆ సమయములో నీవు చేయగలిగిన అతి పరిశుద్ధమైన పని అదే.