WFTW Body: 

లూకా 18:13లో సుంకరి "దేవా! నేను పాపిని నన్ను కరుణించుము" అని ప్రార్థించెను. తనను తాను నేను పాపిని అని పిలచుకొనెను. తన భావమేమిటంటే అతడితో పోల్చుకుంటే అతడి చుట్టూ ఉన్న వారందరూ పరిశుద్ధులు అని!. ఈ భూమిపై అతడు మాత్రమే పాపి! అతడు నీతిమంతుడుగా తీర్చబడి(క్షమింపబడి) ఇంటికి వెళ్ళెను అని యేసుక్రీస్తు చెప్పెను. అటువంటి వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా తీర్పు తీర్చును.

ఈ "నీతిమంతునిగా తీర్చబడుట" అనేమాట గూర్చి కొంత చెప్పాలనుకుంటున్నాను. లూకా 18:14లో నుండిన నీతిమంతునిగా తీర్చబడుట అనేమాట ఎంతో చక్కనిది మరియు విడుదల చేసే మాట, దాని అర్థం చెబుతాను. ఒక పుస్తకంలో ఉన్న పేజీలు చూడండి. ప్రతి పేజిలో ఎడమప్రక్క వాక్యపు ప్రారంభము, కుడిప్రక్క వాక్యపు ముగింపు ఒకే వరుసలో ఉంటాయి. కంప్యూటర్ పరిభాషలో దానిని "జస్టిఫై"(సమాంతరం చేయుట - MS Officeలో ఒక భాగము) అంటాము. ఆ పేజీలో వేరు వేరు వరుసలలో వాక్యాలు హెచ్చుతగ్గులున్నా, అక్షరాల సంఖ్య ఎక్కువ తక్కువలున్నా కంప్యూటర్లో ఒక మీట నొక్కగానే అవి ఒకే వరుసలోనికి వచ్చును. ఇప్పుడు నీవు నీ కంప్యూటర్లో "జస్టిఫై" అనేది చేయకుండా ఏదొకటి వ్రాసినట్లయితే నీవు వ్రాసిన వ్రాత కుడి ప్రక్క వంకరటింకరగానుండును. మనము గతంలో టైపు మిషన్లు ఉపయోగించినప్పుడు మన పేజీలు అలా ఉండేవి. కనీసం ఒక్క పేజీలోనైనా ప్రతి వరుస సమానంగా ఉండేటట్లు వ్రాయుట అసాధ్యమయ్యేది. కాని ఇప్పుటి అద్భుతం చూడండి. ఇప్పుడు జస్టిఫికేషన్ అనేది వచ్చినది. ఇది వరుస చివర గీతపెట్టి పదాన్ని పూర్తి చేయాల్సిన అవసరము లేదు. నీవు ఒక పుస్తకములో పేజీలు చూచినట్లయితే పుస్తకం అంతట్లో కూడా వరుస చివరన గీతలేమి కనబడవు. అది చూచుటకు చక్కగా ఉండదు కాబట్టి అట్లు చేయలేదు. కంప్యూటర్ వరుసలో నుండిన పదముల మధ్య ఖాళీని సరిగా పూరించుట వలన ప్రతి వరుస చక్కగా 'జస్టిఫై' అయినది. నీవొకవేళ ఒక పేజీలో 30 వరుసలు చివరన వంకరగా వచ్చినట్లు వ్రాసినా, నీవు అంతవరకు వ్రాసినది 'జస్టిఫై' అగునట్లు ఒక్క ఆజ్ఞ ఇచ్చినట్లయితే అనగా ఒక మీటను నొక్కితే వ్రాయబడిన వరుసలన్నీ ఒకే తీరులోనికి వచ్చును. దేవుడు నీ జీవితంలో అదే చేస్తాడు. నీ గత జీవితంలో ప్రతిరోజూ నీవు నీ జీవితాన్ని గలిబిలి చేసుకొని ఉండవచ్చును. కాని నీవు క్రీస్తు వద్దకు వచ్చినట్లయితే దేవుడు ఒక్క క్షణంలో నిన్ను "జస్టిఫై"(సరిగా/నీతిమంతునిగా) చేయును. నీ గత జీవితంలో ప్రతి వరుస సరికాబడును. అది నీ జీవితమంతటిలో ఒక్క మారు కూడా పాపము చేయనట్లు, ఏ విధమైన వంకర టింకర వరుసలు లేకుండా ఖచ్చితమైన తిన్నని వరుసలోనికి వచ్చును.

అది అద్భుతం కాదా? కంప్యూటర్ మన పేజీలకు ఎట్లు చేయునో దేవుడు మన జీవితాలకు అట్లే చేయును. అందులో "నీతిమంతులుగా తీర్చబడుట" అను దానికి 20వ శతాబ్దమునకు చెందిన ఉదాహరణను మనము ఇక్కడ చూడగలము.

ఇక్కడ ఇంకొంచెం చెప్పుదును. మనము కంప్యూటర్‍కు 'జస్టిఫై' అని ఆజ్ఞ ఇస్తే అటు తరువాత వ్రాయబడిన వరుసలన్ని కూడా వాటికవే యితర వరుసలతో సమానంగా తిన్నగా వచ్చును. నీతిమంతులుగా తీర్చబడుట మన గత జీవితమునకు ఎట్లు అన్వయింపబడునో అట్లే రాబోవు జీవితానికి అన్వయింపబడును. ఇది నిజముగా అద్భుతమైన సువార్త.

దేవుడు మనలను క్రీస్తునందు చూచును. చెప్పుకొనుటకు మనకంటూ మన నీతి ఏమిలేదు. క్రీస్తే మన నీతియైయుండెను. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చినప్పుడు, అది మనమెప్పుడు మన జీవితమంతటిలో ఏ ఒక్క పాపము కాని లేక పొరపాటు కాని చేయని దానితో సమానము. మనము ఆయన వెలుగులో నడుచుచున్నందున, మనము తెలిసిచేసిన మరియు తెలియక చేసిన ప్రతిపాపము నుండి క్రీస్తు రక్తము మనలను కడిగి ఎల్లప్పుడూ నీతిమంతులుగా తీర్చుచుండును.

మనము వాక్యమును చదువునప్పుడు మనముచేసే ఒక ముఖ్యమైన పొరపాటు - మనము లెక్కలు చేసేటప్పుడు ఉపయోగించే తర్కజ్ఞానమును ఉపయోగించి వాక్యమును అర్థము చేసికొనుటకు ప్రయత్నించుట. దేవుని మనసును మనము అట్లు అర్థము చేసికొనలేము. ఎందుకంటే దేవుడు గణితశాస్త్రపు సిద్ధాంతముతో పనిచేయడు. కనుక మనము గతములో ఎన్నో పొరపాట్లు చేసి కూడా మన జీవితాల్లో దేవుని పరిపూర్ణ ప్రణాళికను నెరవేర్చగలమా అను దానిని తెలుసుకొనుట మన తర్కాన్ని ఉపయోగించి ప్రయత్నించలేము. గణితశాస్త్రపు సిద్ధాంతాల ప్రకారం అది అసాధ్యము. గణితశాస్త్ర పద్ధతుల ప్రకారము లెక్క చేసేటప్పుడు ఎక్కడైనా ఒక్క మెట్టు తప్పయినా, చివరకు వచ్చేసరికి జవాబు ఎప్పుడూ తప్పవుతుంది. నీవొకవేళ ఆ తర్కమును ఉపయోగించిదలిస్తే, నీవు గతంలో ఎక్కడో దేవునిచిత్తమును తప్పిపోతే (అది నీవు 2 సంవత్సరముల వయసప్పుడు కావచ్చును లేక 52 సంవత్సరముల వయసప్పుడు కావచ్చును, అది అంత ప్రాముఖ్యము కాదు) ఇప్పుడు నీ వెంతగా ప్రయత్నించినా, ఎంతగా పశ్చాత్తాపపడినా తిరిగి దేవునిచిత్తమును నెరవేర్చలేవు. గణితశాస్త్ర సిద్ధాంతప్రకారము నీవు ఏ సమయములో తప్పుచేసావనేది ముఖ్యము కాదు (అది 2వ మెట్టు కావచ్చు లేక 52వ మెట్టు కావచ్చును) కాని, చివరకు జవాబు తప్పుగా వచ్చును. కాని దేవుడు "నా మార్గములు మీ మార్గముల వంటివి కావు" అని చెప్పుచున్నాడు.

మన జీవితాల్లో ఆయన ఉద్దేశ్యాలు తర్కజ్ఞానాన్ని బట్టి పనిచెయ్యుటలేదు. అందుకు దేవునికి వందనాలు. ఒకవేళ అలా అయినట్లయితే ఒక మానవ మాత్రుడు కూడా (చివరకు అపొస్తులుడైన పౌలు కూడా) దేవుని పరిపూర్ణ ఉద్దేశ్యాన్ని నెరవేర్చలేడు. మనలో ప్రతి ఒక్కరము ఎక్కడో ఒక్క దగ్గర తప్పిపోయాము. మనము విశ్వాసజీవితంలోనికి వచ్చిన తరువాత కూడా అనేకమార్లు పడిపోవుచుంటిమి. మనము తెలిసి కూడా అనేకమార్లు పాపము చేసాము. నిజాయితీగా నున్నవారు అది వెంటనే ఒప్పుకొందురు. అయితే అద్భుత విషయం ఏమంటే మనలో ప్రతి ఒక్కరికి ఇంకను నిరీక్షణ ఉన్నది. గణితశాస్త్ర సమస్యలు ఏ చిన్న తప్పు చేసిన వారినైనా ఖండించును. ఏ చిన్న తప్పుకు కూడా అవకాశముండదు. 2+2=3.9999999 కు సరికాదు. అది సరిగా 4గా ఉండవలెను. అంతే తప్ప ఎక్కువగాని తక్కువగాని కాకూడదు.

అయితే దేవుని ప్రణాళిక గణితశాస్త్రమువలె పని చేయదు. " ఆయన ప్రణాళికలో తప్పిపోవుట అవసరమైయున్నది". తప్పిపోవుట ద్వారా తప్ప, మనలో ఎవ్వరము ఇంకొక విధముగా విరుగగొట్టబడము. అందుచేత మన ఆత్మీయ విద్యాభ్యాసములో తప్పిపోవుట అనునది ఒక ముఖ్యమైన పాఠ్యాంశము అని మనము చెప్పగలము. యేసుప్రభువు ఒక్కరే ఎప్పుడూ దేనిలోనూ తప్పిపోకుండా జీవించెను. కాని మనలో (ఎంతో గొప్పవారిని) కూడా తప్పిపోవుట ద్వారా దేవుడు విరుగగొట్టెను. చివరకు పేతురు, పౌలులు కూడా మరల మరల తప్పిపోవుట ద్వారా విరుగగొట్టబడిరి. గనుక సువార్త సందేశమును బట్టి సంతోషించుము, దేవుని యొక్క అనుగ్రహము నిన్ను మారుమనస్సులోనికి నడిపించునుగాక. అది నిన్ను సంతోషకరమైన జీవితమునకును మరియు దేవునిలో సంపూర్ణ విశ్రాంతిలోనికి నడిపించును. ఆ విశ్రాంతి దేవుడు "నిన్ను ఆయన కుమారునిలో శాశ్వతముగా అంగీకరించెను" అని తెలుసుకొనుట ద్వారా కలుగును (ఎఫెసీ 1:16).

ప్రతిదినము మనము ఎన్నో పొరపాట్లు చేయుచుందుము. మనకు తెలియకుండా ఊహించని విధముగా మనము పాపములోనికి జారిపడిపోదుము. కొన్ని సమయాల్లో మనపై నున్న ఒత్తిడి చాలా ఎక్కువగా నుండుటచేత, మనము కృంగిపోయి నిరుత్సాహపడుదుము. ఇంకా మనము ఎక్కువ పాపము చేయునట్లు శోధింపబడుదుము. దేవుడు మనపై నుండిన ఒత్తిడిని అర్ధము చేసికొనగలడు మరియు ఆయన కనికరము గలవాడు. ఆయన మనలను సహింపజాలనంతటి కంటె ఎక్కువగా శోధనతో పాటు మనము తప్పించుకొను మార్గమును కూడా ఏర్పాటు చేయును. ఆయన మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి దానిని సరిగా చేయును. క్రైస్తవజీవితము మానవ తర్కజ్ఞానముతో పనిచేయదు. అది పరలోకమందున్న తండ్రి యొక్క అద్భుతములు చేయు శక్తితోనూ, సంపూర్ణ జ్ఞానముతోనూ మరియు ప్రేమతోను పనిచేయును.

ఏ ఒక్కరు వారి జీవితాన్ని సరియైన వరుసలో నుండునట్లు టైపు చేసి వరుసలన్నీ పరిపూర్ణముగా చెయ్యలేరు. మనలో ప్రతి వారిని - చివరకు మనలో శ్రేష్టులైన వారిని కూడా దేవుడే నీతిమంతులుగా తీర్పు తీర్చవలెను. ఏ మనుష్యుడు కూడా దేవుని యెదుట అతిశయపడుటకు లేదు.