వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట పునాది సత్యము
WFTW Body: 

మీరు దేవుని వాక్యాన్ని గౌరవించడం నేర్చుకున్నారని అపవాది చూసినప్పుడు, అతను దేవుని వాక్యాన్ని దాని అర్థం కాక మరొక అర్థం వచ్చేలా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అతను దేవుని వాక్యాన్ని తప్పుగా చూపిస్తాడు మరియు దేవుని వాక్యాన్ని దాని సందర్భంతో సంబంధం లేకుండా చెప్తాడు. అతను యేసుతో కూడా ఇలాగే చేశాడు!

మత్తయి 4:6లో, "నీవు దేవుని కుమారుడివైతే, దేవాలయం పైనుండి ఎందుకు కిందకు దుముకకూడదు?". అతను 91వ కీర్తనను కూడా ఉటంకించాడు, "ఆయన నీ గురించి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు; నీ కాలు రాయికి తగలకుండా వాళ్ళ చేతులతో నిన్ను పట్టుకుంటారు అనే దేవుని వాగ్దానాన్ని స్వంతంత్రించుకో?"

మీతో పాపం చేయించడానికి సాతాను దేవుని వాక్యాన్ని కూడా చూపిస్తాడని ఇది మనకు బోధిస్తుంది.

ఇది మొదటి శోధనకు సంబంధించినది. మొదటిసారి, సాతాను రాళ్లను రొట్టెగా మార్చమని యేసుకు చెప్పినప్పుడు, యేసు, "మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు; అతను దేవుని నోటనుండి వచ్చే ప్రతి మాటతో జీవిస్తాడు" అని చెప్పాడు. సాతాను దానిని పట్టుకుని, "దేవుని ప్రతి మాట, అవునా? సరే, ఇదిగో దేవుని వాక్యం: ’ఆయన నీ గురించి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు; నీ కాలు రాయికి తగలకుండా వాళ్ళ చేతులతో నిన్ను పట్టుకుంటారు’. కాబట్టి దేవాలయం పైనుండి ఎందుకు దూకకూడదు?"

నేను చెప్పినట్లుగా, మీరు దేవుని వాక్యాన్ని గౌరవించడం నేర్చుకున్నారని అపవాది చూసినప్పుడు, అతను తదుపరి చేసే పని ఏమిటంటే అతను దేవుని వాక్యాన్ని దాని అర్థం కాక మరొక అర్థం వచ్చేలా దాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తాడు. అతను దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్తాడు మరియు దేవుని వాక్యాన్ని దాని సందర్భంలోనుండి వేరు చేసి చెప్తాడు. నా జీవితంలో నేను, తమ స్వంత కోరికను తీర్చుకోవడానికి అక్కడక్కడ పూర్తిగా సందర్భం లేకుండా ఒక వచనాన్ని తీసుకునే అనేక మంది క్రైస్తవుల చూశాను. లేఖనాలలోనికి వెళ్లి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ఒక వచనం కనుగొనడం చాలా సులభం. చాలా మంది వ్యక్తులు లేఖనాలలోనికి వెళ్లి, వారు ఏమి చేయాలనుకుంటున్నారో దానిని ఖచ్చితంగా సమర్థించే ఒక వచనం కనుగొంటున్నారు.

దేవుని వాక్యాన్ని స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించినప్పుడు మరియు లేఖనాలను క్రమం తప్పకుండా చదివినప్పుడు, సాతాను వచ్చి లేఖనాలను తప్పుగా ఉటంకించగలడని ఈ శోధన నుండి మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనం లేఖనాలను దాని సందర్భంలో అధ్యయనం చేయడం ముఖ్యం, యేసు చెప్పినట్లుగా, కేవలం ఒక వచనం ద్వారా కాకుండా "దేవుని ప్రతి వాక్యం" ద్వారా మొత్తం లేఖనాలను అధ్యయనం చేయడం ముఖ్యం. మనం ఒక వచనం ద్వారా జీవించలేము (ఉదాహరణకు, "దేవుని ప్రతి మాట ద్వారా మానవుడు జీవిస్తాడు"), అందుకే మొత్తం లేఖనాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే దాన్ని అధ్యయనం చేయడం ముఖ్యం. మీరు యౌవనస్థులైతే, ఒక నిర్దిష్ట అంశంపై లేఖనం ఏమి చెబుతుందో అర్థం చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నప్పుడల్లా వాక్యాన్ని తెలిసిన దైవభక్తిగల పెద్దల నుండి సలహా తీసుకోవడం మంచిది. ఇది చాలా సులభం. మొత్తం లేఖనాల ద్వారా కాక కేవలం ఒక నిర్దిష్ట వచనం ద్వారా మాత్రమే జీవించాలని కోరుకోవడం ద్వారా తమను తాము మోసం చేసుకున్న చాలా మంది వ్యక్తులను నేను ఎదుర్కొన్నాను.

ఈ అంశాన్ని ఎత్తిచూపడానికి నేను హాస్యభరితమైన దృష్టాంతాన్ని చెప్తాను: కృప అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న యువకుడిని పరిగణించండి. అతను దేవుని చిత్తాన్ని కనుగొనాలని కోరుకుంటున్నాడు, లేదా కనీసం అతను అలా అనుకుంటున్నాడు, కానీ అతను ఇప్పటికే ఈ అమ్మాయితో చాలా ప్రేమలో ఉన్నాడు. నిజం ఏమిటంటే, అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, అతను కేవలం దేవుని ఆమోదాన్ని కోరుకుంటున్నాడు. ఒకరోజు అతను 2 కొరింథీ 12:9లో, "నా కృప నీకు చాలును" అని చదివి ఒప్పించబడ్డాడు. "ఇదిగో, దేవుడు నాతో మాట్లాడాడు, కృప అనే అమ్మాయి నాకోసమే" అని తనలో తాను చెప్పుకున్నాడు. అతను కేవలం తన ఆశను సంతృప్తి పరచుకుంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కృప అనే పేరుగల అమ్మాయిని సూచించిన మరొక యువకుడిని పరిగణించండి. అతను ఆమెను అస్సలు ఇష్టపడుటలేదు మరియు అతనికి ఆసక్తి లేదు, కాబట్టి అతను తన తల్లిదండ్రులతో "నేను దేవుని చిత్తాన్ని కనుగొంటాను" అని చెప్పాడు. అతను అదే వచనం 2 కొరింథీ 12: 9, "నా కృప నీకు చాలును" అని చదివాడు. అతను తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, "ఆయన కృప నాకు సరిపోతుందని దేవుడు చెప్పాడు, నాకు ఈ కృప అనే అమ్మాయి వద్దు, దేవుడి కృప నాకు సరిపోతుంది" అని అన్నాడు. ఒకే వచనం నుండి ఈ ఇద్దరు యువకులు తమ సొంత కోరికలను తీర్చుకోవడానికి రెండు వేర్వేరు సమాధానాలను ఎలా పొందారో మీరు చూడవచ్చు. వారు ఏమి చేయాలనుకుంటున్నారో, దాన్ని దేవుని వాక్యంలో ఉంచడానికి ప్రయత్నించారు. అపవాది ఒక వచనం తీసుకొని దానిని మీకు ఎలా చెప్తాడనుటకు ఇది ఒక ఉదాహరణ. అతను దానిని యేసుపై ప్రయత్నించినట్లయితే, అతను దానిని మీపై ప్రయత్నిస్తాడని మీరు అనుకోవటంలేదా?

అపవాదికి యేసు ఇచ్చిన సమాధానం ఏమిటి? మత్తయి 4:6లో, "ఇది వ్రాయబడి ఉన్నది" అని అపవాది చెప్పినప్పుడు, యేసు మత్తయి 4:7లో, "ఇది కూడా వ్రాయబడి ఉన్నది" లేదా "మరోకప్రక్క ఇలా కూడా వ్రాయబడింది" అని జవాబిచ్చాడని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. "మరొకచోట ఇలా వ్రాయబడింది" అనే మాటకు అర్థం అదే. సంపూర్ణ సత్యం "ఇలా వ్రాయబడింది"లో మాత్రమే కనుగొనబడదు, కానీ "ఇలా వ్రాయబడింది, మరియు మరొకచోట ఇలా కూడా వ్రాయబడింది"లో కనుగొనబడుతుందని ఇది మనకు బోధిస్తుంది.

మీరు రెండు లేఖనాలను కలిపినప్పుడు సత్యాన్ని పొందుతారు. అందుకే దేవుడు మీతో ఏమి చెబుతున్నాడో వినడానికి లేఖనాలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే, మీరు వాక్యంలోని ఒక వచనాన్ని తీసుకొని పూర్తిగా తప్పుదారి పట్టవచ్చు.