WFTW Body: 

యేసు జీవితము సంపూర్ణమైన విశ్రాంతిలో ఉండేది. ఆయనకు ప్రతిదినము తండ్రి చిత్తము చేయుటకు 24 గంటలలో సరిపడు సమయముండేది. కాని తనకు మంచియని తోచినది చేయుటకు నిశ్చయించుకొన్నట్లయితే, అప్పుడు ఆయనకు 24 గంటలు సరిపోయి ఉండేవి కాదు, దానిని బట్టి ఆయన అనేక రోజులు నెమ్మది లేకుండా ఉండవలసి వచ్చేది.

శృంగారమను యెరూషలేము దేవాలయ ద్వారము వద్ద, ఒక కుంటివాడు బిక్షమడుగుటను యేసు తరచుగా చూస్తుండేవారు. కాని తన తండ్రి నుండి ఆయనకు నడిపింపు లేనందున ఆయన అతడిని స్వస్థపర్చలేదు. తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడైన తరువాత తండ్రి యొక్క పరిపూర్ణ సమయములో పేతురు, యోహానులు అతడికి స్వస్థత కలిగించారు. దాని ఫలితముగా అనేకులు ప్రభువు వైపునకు తిరిగారు (అపొ.కా. 3:1-4:4). అదే ఆ మనుష్యుని స్వస్థపరచుటకు తండ్రి యొక్క సమయము, దానికి ముందు కాదు. ఆ మనుష్యుని అంతకు ముందు స్వస్థపరచినట్లయితే, తండ్రి యొక్క చిత్తమును ఆయన ఆటంక పరచియుండేవారు. తండ్రి యొక్క సమయము పరిపూర్ణమైనదని ఆయన ఎరుగుట చేత ఏదైనా చేయుటకు ఆయనెప్పుడూ తొందరపడలేదు.

తన యొక్క రోజువారి కార్యక్రమములను గూర్చి ప్రణాళిక వేసేది పరలోకములో నుండిన సర్వాధికారియైన తన తండ్రియని ఎరిగియుండుట చేత ప్రతి అంతరాయమును సంతోషముతో యేసు అంగీకరించేవారు. కనుక ఆయన అంతరాయములను బట్టి ఎప్పుడూ కోపము తెచ్చుకొనే వారుకాదు. యేసుయొక్క జీవితము మన అంతరంగములను కూడా సంపూర్ణమైన విశ్రాంతిలోనికి తెచ్చును. దీని అర్థము మనము ఏమి చేయనక్కర్లేదని కాదు, కాని ఏదైతే మన జీవితాల్లో తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్నదో అది మాత్రమే చేయుదుము. అప్పుడు తండ్రి చిత్తమును, మనము ముందుగా అనుకొనిన కార్యక్రమముల కంటే త్వరగా పూర్తి చేయుటకు తొందర కలిగియుందుము.

మానసిక సంబంధమైన క్రైస్తవులు వారి స్వంత ఉద్దేశ ప్రకారమే చేయుటకు ఎంతో ఆసక్తి కలిగియుండుట చేత వారు తరుచుగా తొందరపడుతూ నెమ్మది లేక యుందురు. వారిలో కొందరు చివరకు మానసికంగా(నరాల క్రుంగుదల) లేక శారీరకంగా క్రుంగిపోయి చతికిల పడుదురు. మార్త ప్రభువుకు మరియు ఆయన శిష్యులకు పరిచర్య చేయుటవలన పాపమేమి చేయలేదు. అయినప్పటికిని ఆమె నెమ్మది లేకుండాయుండి ఆమె సోదరిని విమర్శిస్తుయుండినది. ఇది మానసిక సంబంధమైన పరిచర్యకు తేటయైన దృశ్యముగా యున్నది. మానసిక సంబంధియైన క్రైస్తవుడు నెమ్మది లేకుండాయుండి చిరాకు పడుతూ ఉండును. అతడు తన స్వంత కార్యములను మాని దేవుని విశ్రాంతిలో ప్రవేశింప లేదు (హెబ్రీ 4:10). అతడి ఆలోచనలు మంచివి, కాని అతడి స్వంత కార్యములు అవి ఎంత మంచివైనా, చివరకు అతడు క్రైస్తవుడుగా మారిన తరువాత కూడా అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు మాత్రమే (యెషయా 64:6).

మార్తవలె పరిచర్య చేయు వారందరు, వారెంత నిష్కపటముగా ఉండినా, నిజానికి వారు వారినే సేవించుకొనుచున్నారు. వారు దేవుని సేవకులుగా పిలువబడరు, ఎందుకంటే సేవకులు వారు ఏదైనా చేయుటకు ముందు వారి యజమాని ఏమి చెప్పునో వినుటకు సిద్ధపడియుందురు. యేసుప్రభువు అంతరంగములో సంపూర్ణమైన విశ్రాంతితో నుండుట చేత, ఆయన నరముల క్రుంగుదలతో చతికిల పడడము అసంభవము.

"మీమీద నా కాడి యెత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును" (మత్తయి 11:29) అని ఆయన మనతో చెప్పు చుండెను.

దేవుని‌ఆత్మ వాక్యములో మనకు చూపుచున్న యేసు యొక్క మహిమ ఇదే. ఆయన దానిని మనకు ఇవ్వాలని మరియు మన ద్వారా ప్రత్యక్ష పర్చవలెనని ఆశించుచుండెను.

యెహోవా మన కాపరి ఆయన తన గొఱ్ఱెలను విశ్రాంతి గల పచ్చిక బయలుల యొద్దకు నడిపించును. గొఱ్ఱెలు తమంత తాముగా కార్యక్రమమును రూపొందించుకొనవు లేక తరువాత ఏ పచ్చిక బయలు యొద్దకు వెళ్ళాలో నిర్ణయించుకొనవు. అవి కేవలము వాటి కాపరిని వెంబడించును. అయితే కాపరిని వెంబడించుటకు ఒకడు తనపై తనకుండిన నమ్మకమును, తన సామర్థ్యమును ఖాళీ చేసికొనవలసియుండును. యేసు తన తండ్రిని సాత్వికముతో వెంబడించారు. మానసిక సంబంధమైన జీవమును బట్టి నడిచే క్రైస్తవులు గొఱ్ఱెలుగా ఉండుటకు యిష్టపడరు. అందుచేత వారి స్వంత తెలివి తేటలను అనుసరించుట వలన దారి తప్పిపోవుదురు. మనకుండిన బుద్ధి దేవుడిచ్చిన అద్భుతమైన, ఎంతో ఉపయోగకరమైన వరము, కాని దానిని మనపై ఏలుబడి చేయునట్లు హెచ్చించినట్లయితే అది వరములన్నిటిలో బహు ప్రమాదకరమైనదిగా మారును.

ప్రభువు తన శిష్యులకు "తండ్రీ, పరలోకమందు నీ చిత్తము ఏవిధముగా జరుగుతుందో అట్లే భూమియందును నీ చిత్తము జరుగును గాక" అని ప్రార్థించమని నేర్పెను. పరలోకములో దేవుని చిత్తము ఎలాగు జరుగును? అక్కడున్న దేవదూతలు దేవుని కొరకు ఏదో చెయ్యాలను ప్రయత్నములో చుట్టూ పరిగెత్తరు. వారు అలా చేసినట్లయితే పరలోకములో గలిబిలిగా యుండును. వారేమి చేయుదురు? వారు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చు ఆజ్ఞలు వినుటకు వేచియుందురు మరియు అప్పుడు వారికి ఒక్కొక్కరికి ఏమి చేయమని చెప్పబడునో అది చేయుదురు. జెకర్యాతో గబ్రియేలు దూత "నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని" అని చెప్పిన మాటలు వినండి (లూకా 1:19). యేసు ప్రభువు కూడా ఇటువంటి స్థానమునే ఎన్నుకొనెను - అది ఆయన తండ్రి సన్నిధిలో వేచియుండి, ఆయన స్వరమును విని, ఆయన చిత్తమును చేయుట.

మానసిక సంబంధమైన జీవముతో నడిపింపబడే క్రైస్తవులు ఎంతో కష్టపడవచ్చు, ఎంతో త్యాగం చేయవచ్చు కాని నిత్యత్వము యొక్క స్పష్టమైన వెలుగు "వారు రాత్రంతా శ్రమపడినను ఏమియు పట్టలేదు" అని బయల్పర్చును. కాని ఎవరైతే వారి సిలువను ప్రతి దినము ఎత్తికొందురో (వారిని వారు ఉపేక్షించుకొని ప్రకృతి సంబంధమైన జీవమును మరణింపజేయుదురో) మరియు ప్రభువుకు విధేయత చూపుదురో వారి వలలు ఆ దినమున చేపలతో నిండుగా ఉండును (యోహాను 21:1-6).

"ఎవడైతే తన కొరకు నేను ఏర్పాటు చేసిన పనినుండి ప్రక్కకు తొలగునో వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని" యేసు చెప్పెను (లూకా 9:62 లివింగ్‌ బైబిలు).