WFTW Body: 

హెబ్రీ 3:8లో, "మీరాయన శబ్దమును వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి" అని మనము హెచ్చరింపబడినాము. మరియు హెబ్రీ 3:12లో, "విశ్వాసము లేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి" అని హెచ్చరింపబడినాము. పరలోకపు పిలుపులో పాలివారైన పరిశుద్ధసహోదరులు యేసు ఖచ్చితంగా వారివలే వచ్చెనని నమ్మని విశ్వాసములేని దుష్టహృదయముతో ఉండిపోకూడదని రచయిత వారిని హెచ్చరించుచున్నాడు. నీ ఓడిపోయిన జీవితముతో నీవు విసిగిపోయినప్పుడే నీకు మాదిరిగా ఉండుటకు యేసు నీవలే వచ్చెనన్న ప్రత్యక్షతను దేవుడు నీకిచ్చును. ఒకప్పుడు నేను పూర్తిగా ఓడిపోయిన క్రైస్తవుడను. కాని నా ఓడిపోయిన జీవితముతో విసిగి వేసారిపోయాను. నేను దేవునికి రాత్రింబగళ్లు మొఱ్ఱపెడుతూ, "ప్రభువా, సమాధానమేమిటో నాకు తెలియదు. నేనొక బోధకుడ్ని, గాని నా అంతరంగ జీవితములో పాపముచేత ఓడిపోయాను. నా తలంపులలో, నా మాటలలో, నా కుటుంబజీవితములో ఓడిపోయాను. నేను తిరిగి జన్మించాను మరియు నీటి బాప్తీస్మము తీసుకున్నాను. కాని నేను ఓడిపోయియున్నాను. నేను తెలుసుకోవలసిన దానిని నాకు చూపించుము" అని చెప్పేవాడను. అప్పుడు ప్రభువు దైవభక్తియొక్క రహస్యమును చూపించెను - క్రీస్తు శరీరధారియై వచ్చి ఖచ్చితముగా నావలెనే శోధింపబడినప్పటికీ పవిత్రమైన జీవితమును జీవించెనని చూపించెను. నేను దాన్ని నా పూర్ణహృదయముతో నమ్మాను - అది నా జీవితాన్ని మార్చివేసింది. మనము విశ్వాసములేని హృదయమును కలిగియున్న యెడల దేవుని విడచిపోగలమని మనమిక్కడ హెచ్చరింపబడ్డాము (హెబ్రీ 3:12).

అయితే విడిచిపోవుటకు బదులు మనము వేరొక పనిని చేయవచ్చని తరువాత వచనం చెప్తుంది - ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి, ఒకనికొకడు ప్రోత్సాహించుకొనుడి (హెబ్రీ 3:14). రేపు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. గనుక ఈ రోజునే ఒక పనిని చేద్దాము. ఈ రోజున ఎవరినైనా ప్రోత్సాహిద్దాము. ఈ రోజున ఎవరికైనా బుద్ది చెప్పెదము. ఈ అధ్యాయము యొక్క సందర్భము ప్రకారము, మనవంటి శరీరధారియైన యేసునందు లక్ష్యముంచమని ఎవరినైనా ప్రోత్సాహించడము.

యేసును పైకెత్తుట అనుదినము మన పిలుపైయున్నది. "యేసువైపు చూడండి. ఆయన ఎంత అద్భుతమైన రక్షకుడో చూడండి! ఆయన నా పాపములను క్షమించుట మాత్రమే కాకుండా నా జీవితాన్ని మార్చివేసాడు. ఆయన నా కుటుంబాన్ని మార్చివేసాడు, నేనెల్లప్పుడు ఆనందించునట్లు నన్ను ప్రభువునందు ఆనందముతో నింపివేసాడు. మరణభయమును నా నుండి తీసివేసాడు. యేసునందు లక్ష్యముంచుడి" అని మన ప్రవర్తన, మన మాటలు ఎల్లప్పుడు చూపుతూ ఉండాలి. మన జీవితము అనుదినము ఇతరులకు సవాలుగాను మరియు ప్రోత్సాహముగాను ఉండవలెను. ప్రజలు నీ ముఖమును చూచినప్పుడు వారు దేవుని మహిమను చూడవలెను.

ఒకడు దిగజారిపోవుటకు 24 గంటలు చాలు అని హెబ్రీ 3:14వ వచనము మనలను హెచ్చరిస్తుంది. అందుచేతనే మనము అనుదినము ఒకరికొకడు బుద్ది చెప్పుకొనుచు ప్రోత్సహించుకోవలెను. క్రీస్తు శరీరములో మనము ఒకరికొకరము బాధ్యులమైయున్నాము. "నేను నా సహోదరునికి కాపరిని కాను" అని కయీను చెప్పెను. కాని క్రీస్తు శరీరములో మనము మన సహోదరుల మరియు సహోదరీల కాపరులము. ఎవరైనా జారిపోవుట నీవు చూస్తే అతన్ని ప్రోత్సహించు. నిన్ను ప్రోత్సహించుటకు లేక హెచ్చరించుటకు ఎవరూ లేకపోతే నీకు పరిశుద్ధాత్ముడు మరియు బైబిలు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు నన్ను వ్యక్తిగతంగా అనేకసార్లు బైబిలులో ఉన్న తన మాటల ద్వారా ప్రోత్సహించెను. పేతురు, యాకోబు, యోహానులు కూడా నన్ను ప్రోత్సహించి హెచ్చరించిరి. నన్ను హెచ్చరించుటకు అనేకసార్లు నా దగ్గర సహోదరులు లేనప్పుడు, ఈ అపోస్తలులు బైబిలులో ఉన్న పేజీల ద్వారా నా యొద్దకు వచ్చి నన్ను ప్రోత్సహించిరి. మనలను అనుదినము ప్రోత్సహించుటకు పేతురు, పౌలు, యాకోబులు మన గదులలో మనతో ఉండుట అద్భుతమైన విషయము కాదా? నిన్ను ప్రోత్సహించుటకు వారినెందుకు అనుమతించవు? గ్రంథములో వారినెందుకు తాళమువేసి ఉంచుతావు.

బైబిలు గురించి చెప్పే పుస్తకాలన్నిటికంటే నీవు బైబిలునే ఎక్కువ చదువవలసిన అవసరమున్నది. పేతురు, పౌలు, యోహానులు వ్రాసిన వాటి గురించి గొప్ప బైబిలు పండితులు ఏమి చెప్తున్నారో నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. నేను వారినే నేరుగా వినాలనుకొనుచున్నాను. గనుక నేను బైబిలును గురించిన పుస్తకాలను కాకుండా బైబిలునే చదువుతాను.