WFTW Body: 

"యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను - నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యోర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి"(యెహోషువ 1:1,2). మోషే తరువాత నాయకుడిగా ఉండటానికి యెహోషువను లేవనెత్తి నియమించినది దేవుడే. దేవుడే స్వయంగా మనలను ఒక స్థానములో నియమించకపోతే నాయకత్వముచేయుటకు ప్రభావవంతముగా సాధకము చేయబడలేము. "మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను" (యెహోషువ 1:3) మరియు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీయెదుట నిలువలేకయుండునని యెహోషువ 1:5 లో యెహోషువాతో దేవుడు చెప్పియున్నాడు. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్ధానము, "మీరు కృపలో ఉన్నారు గనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు" (రోమా 6:14) నకు సాదృశ్యముగా ఉన్నది. గతంలో కనాను దేశములో అనేకమంది ఉన్నత దేహములు గలవారయినప్పటికీ వారు ఓడిపోయారు. ఎటువంటి పాపమైనను (ఎంత శక్తి కలిగినప్పటికీ) మనలను జయించలేదు. ఇది మనయెడల దేవుని సంకల్పము. కాని యెహోషువ, ప్రభువునామములో ఆ దేశములో అడుగుపెట్టి జయించాలి. అప్పుడు అతడు జయము పొందుతాడు. మన విషయంలో కూడా అంతే. విశ్వాసముద్వారా మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. దేవునియొక్క ప్రతి వాగ్ధానాలను మనవిగా మనము పట్టుకొననట్లయితే ఆవాగ్ధానాలన్నియు మనలో నెరవేరి మన అనుభవంగా మారవు.

పౌలు యేసునామమున సువార్తలో ఉన్న తన హక్కులను స్వతంత్రించుకున్నాడు. దాని ఫలితంగా మహిమకరమైన జీవితంలోనికి వచ్చాడు. మనలను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని 2 కొరింథీ 2:14లో చెప్పాడు. "ఎల్లప్పుడు విజయము" అనే పాట పౌలు యొక్క జయగీతము, అది మన గీతము కూడా కావచ్చు. కాని ఎక్కువ మంది క్రైస్తవులు ఈ జయజీవితములోకి ఎప్పుడూ ప్రవేశించరు. ఆరులక్షలమంది ఐగుప్తునుండి బయటకు వచ్చిరి, కాని వారిలో ఇద్దరే(యెహోషువ, కాలేబు) కానానులో ప్రవేశించిరి. ఈ రోజున కూడా అదే ప్రమాణములో(ఆరు లక్షలమందిలో ఇద్దరు) క్రైస్తవులు జయజీవితములో ప్రవేశిస్తారు. "దేవుడు మనలను ఆ దేశమును స్వతంత్రించుకోమని చెప్తే మనమలా చేయగలము" అనే వైఖరి వారు కలిగియుండిరి గనుక వారు వాగ్ధాన దేశములో ప్రవేశించిరి. అదే విశ్వాసము. విశ్వాసము దేవుని వాగ్ధానమునే పరిగణలోకి తీసుకుంటుంది. మనము ఎదుర్కొనే కష్టాలను పరిగణలోకి తీసుకొనదు. "ఇది అసాధ్యం, ఆజానుబాహులు ఎంతో శక్తివంతమైన వారు" అని ఇతర ఇశ్రాయేలీయులు అన్నారు. ఈ రోజున కూడా కోపాన్ని, మోహాన్ని జయించడం అసాధ్యమని క్రైస్తవులు అనుకుంటారు. ఎందుకంటే ఈ దురాశలు ఎంతో శక్తివంతమైనవి మరియు వారిని ఎంతో కాలము పరిపాలించియున్నవి. అటువంటి విశ్వాసులు తన జీవితకాలమంత ఓటమిలో ఉండిపోయి ఆత్మానుసారముగా చెప్పాలంటే అరణ్యములో నశించిపోతారు.

నేను నీతో ఉండెదను అని ప్రభువు యెహోషువకు ప్రమాణము చేసెను. అందుచేతనే ఏ మనిషి యెహోషువ యెదుట నిలువలేక పోయెను. మనము ఒక సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా లేక ఒక అనుభవాన్ని పొందండం ద్వారా పాపాన్ని జయించలేము. అలాకాదు, ప్రభువు తన ఆత్మ ద్వారా ఎల్లప్పుడు మనతోను(మనలోను) ఉండటమే మనలను జయించువారిగా చేయును. ఎవరి హృదయాలైతే పవిత్రమైనవో, ఎవరినైతే ఆయన సమర్థంచి ఆమోదించగలడో అట్టి నాయకుల కొరకు దేవుడు ఈ రోజున క్రైస్తవ లోకములో చూస్తున్నాడు. "నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము గలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాదీనము చేసెదవు"(యెహోషువ 1:6) అని దేవుడు యెహోషువతో చెప్పెను. మనము ఏ పాపమునకు భయపడకూడదు. మనము బయలువెళ్ళి అనేక సంవత్సరాలుగా తన శరీరాలలో పాపము చేత ఏలబడిన దేవుని ప్రజలను తమ శరీరాలలో పాపమును జయించేవారిగా మనము చేయగలగాలి. వారిని విశ్వాసములోనికి, రెండు బాప్తీస్మములలోనికి (అంటే గడప కమ్మలపైన రక్తము చల్లడం, ఎఱ్ఱ సముద్రము దాటడం, మేఘము చేత ఆవరింపబడటం) తీసుకువస్తే సరిపోదు. అది ఆరంభము మాత్రమే. అది కేజీ(నర్సరీ) తరగతి పాఠము మాత్రమే. మన పిల్లలు కేజీ(నర్సరీ) తరగతిని పాసైన తరువాత వారి విద్యాభ్యాసమును ఆపివేస్తామా? లేదు. కాని ఈ రోజున క్రైస్తవ లోకంలో అదే జరుగుతుంది.

మేఘ స్తంభము(అంటే పరిశుద్ధాత్మ బాప్తీస్మము) వారిని వాగ్ధాన దేశమునకు నడిపించుటకు వచ్చెను. వారు రెండు సంవత్సరాలలో దానిలోనికి ప్రవేశించవలసియుండెను కాని వారి నాయకులకు విశ్వాసము లేనందున వారు 40 సంవత్సరాల వరకు ప్రవేశింపలేకపోయిరి. క్రీస్తును గూర్చి వినుట వలన విశ్వాసము కలుగును(రోమా 10:17). విశ్వాసులకు సంఘ కూటాలలో ఈ విషయాలు బోధించబడకపోతే వారెలా నమ్మగలరు? తరువాత వారెలా పాపాన్ని జయించగలరు?.

"అయితే నీవు నిబ్బరము గలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగానుండి నా సేవకుడైన మోషే నీకు ఆఙ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటిచొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు"(యెహోషువ 1:7)లో దేవుడు యెహోషువాతో చెప్పియున్నాడు. పాపము మీమీద ప్రభుత్వము చెయ్యదని చెప్పినప్పుడు దానిని నీ హృదయంలో విశ్వసించి, నీ నోటితో ఒప్పుకొనుచు ఉండుము(రోమా 6:14). కుడి లేక యెడమకు తొలగిపోవద్దు. అనగా ఆ వాగ్ధానాన్ని కుదించవద్దు, పూర్తిగా నమ్మాలి. ఆ వాగ్ధానాన్ని కొన్ని పాపములకే పరిమితం చేయవద్దు. అలాగే దానిని ఎక్కువగా చేసికూడా చెప్పవద్దు. అనగా భూమిమీద ప్రభువైన యేసువలె పరిపూర్ణులమవుతామని చెప్పవద్దు. ఈ భూమిమీద మనం సంపూర్ణంగా పాపరహితులం కాలేము. ఇట్టి జీవితాన్ని ఆ వచనం వాగ్ధానం చేయుటలేదు. అది కేవలం మనం ఎరిగిన పాపముమీద జయము పొందుట గురించి మాత్రమే చెప్పుచున్నది. ప్రభువైన యేసు వచ్చినప్పుడే మనం ఆయనవలె మార్పు చెందుదము. 1 యోహాను 3:2 లో ఈ విషయం స్పష్టంగా ఉంది. కాబట్టి మనం లేఖనాలకు మించి వెళ్ళకూడదు మరియు లేఖనాలలో వాగ్ధానాలను తక్కువ చేయకూడదు.