వ్రాసిన వారు :   Bobby McDonald విభాగములు :   గృహము సంఘము తెలిసికొనుట
WFTW Body: 

"ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి..." (1 కొరింథీ 14:39).

1. నిర్వచనం. "క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు" కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు - ఇంకొక మాటలో చెప్పాలంటే "ప్రోత్సహించుట, బలపరచుట, ఓదార్చుట" (1 కొరింథీ 14:3-ఆంగ్ల లివింగ్ తర్జుమా). ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, ప్రేమతో పైకి లేవనెత్తాలని హెబ్రీ 3:13లో మనకు చెప్పబడింది. కాబట్టి ప్రవచనంలో, మొదట మనం ప్రోత్సహించుటపై దృష్టి పెట్టాలి - ఆ విధంగా నిరుత్సాహపడిన ప్రజలను మనం పైకి లేవనెత్తుతాము - తత్ఫలితంగా పాపం ద్వారా వారు కఠినపరచబడకుండా నిరోధించగలం. మనం దాన్ని సరిగా చేసినట్లయితే, ప్రభువు కూడా పాపాన్ని సవాలుచేసే, హెచ్చరించే, ఒప్పింపచేసే మాటలు మాట్లాడుటకు మనకు సహాయం చేస్తాడు. అన్యభాషలు మాట్లాటడం కంటే ప్రవచించుట ఉత్తమమైనది, ఎందుకంటే ప్రవచనం సంఘంలోని ప్రజలకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. అయితే భాషలు మాట్లాడటం కేవలం ఆ వ్యక్తికి మాత్రమే క్షేమాభివృద్ధిని కలుగిస్తుంది (1 కొరింథీ 14:4).

2. ప్రవచనం ప్రతి ఒక్కరి కోసం. సంఘంలోని ప్రతి ఒక్కరు ప్రవచించే వరాన్ని వెదకాలి (1 కొరింథీ 14:31 ప్రకారం). ఈ వరం కేవలం సహోదరులే కాదు, సహోదరీలు కూడా కలిగి ఉండవచ్చు. సహోదరీలు ప్రవచించేటప్పుడు, వారు తమ తలలపై ముసుకు వేసుకోవాలి. దానికి కారణం ఇది: స్త్రీ యొక్క శిరస్సు పురుషుడని 1 కొరింథీ 11:3-15 బోధిస్తుంది. ఒక స్త్రీ తన తలను కప్పుకున్నప్పుడు, సంఘంలో పురుషుని మహిమ తప్పనిసరిగా కప్పబడి ఉండాలని ఆమె నిశ్శబ్దంగా సాక్ష్యమిస్తుంది - తద్వారా దేవుని మహిమ మాత్రమే కనిపిస్తుంది.

౩. అది వ్యక్తిగతమైనదని నిర్ధారించుకోండి. బోధించడానికి మాటలను సిద్ధం చేస్తున్నప్పుడు, అది ఒక సిద్ధాంతంగా కాక మన వ్యక్తిగత అనుభవముగా ఉన్నదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి. యేసు తాను మొదట ఆచరించిన వాటి గురించి మాత్రమే మాట్లాడాడు (అపొ.కా. 1:2, యేసు చేసి తరువాత బోధించెనని చెప్తుంది). మనం అభ్యసించని సిద్ధాంతాలను ఎప్పటికీ బోధించకుడదు. మనకు బోధించడానికి కొత్తగా ఏమీ లేకుంటే, మన జీవితంలో అభ్యసించని విషయాన్ని చెప్పడం కంటే, ఇప్పటికే బోధించిన వాటిని పునరావృతం చేయడం (మళ్ళీ చెప్పటం) మంచిది. ఆయనకు లోబడి జీవించినప్పుడు మాత్రమే క్రీస్తు అధికారం మనలను బలపరుస్తుంది. కాబట్టి, మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు, మన స్వంత జీవితంలో మొదట దానికి విధేయత చూపాలి. అప్పుడు మనం, మన జీవితంలో ఆచరించిన మరియు అనుభవించిన వాటి గురించి మాట్లాడవచ్చు.

4. దీన హృదయాన్ని కలిగి ఉండండి . ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడూ పంచుకోవద్దు. ఎప్పుడూ ప్రజలను గుచ్చుతూ బోధించవద్దు. మన జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించాము అనే అభిప్రాయాన్ని ఇతరులకు ఇవ్వకూడదు! బదులుగా, మన విశ్వాస స్థాయిని బట్టి మాత్రమే మనం ప్రవచించాలి (రోమా 12:6). మనం ఎల్లప్పుడూ వినయమైన హృదయంతో మాట్లాడాలి, యేసును మాత్రమే లేవనెత్తాలి. యేసు మాత్రమే పైకి ఎత్తబడినప్పుడు, ఆయన ప్రజలను తనవైపుకు ఆకర్షించుకుంటాడు (యోహాను 12:32). కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ వినయంతో కూడిన హృదయాన్ని కలిగి ఉండటానికి ప్రభువు సహాయం చేయునట్లు మనం ఎక్కువగా ప్రార్థించాలి.

5. శరీరంపై విశ్వాసం ఉంచవద్దు. "శరీరమును ఆస్పదము చేసికొనక... క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము" (ఫిలిప్పీ 3:3). మనకు బహిరంగంగా మాట్లాడే ధైర్యం లేకుంటే, మనం వెనక్కి తగ్గకూడదు, కానీ శక్తికోసం ప్రభువును వెతకాలి - ఆయన మనల్ని బలపరుస్తాడు. ఒకవేళ బహిరంగంగా బాగా మాట్లాడే సహజ సామర్థ్యం మనకు ఉంటే, మనం దానిపై ఆధారపడకుండా చూసుకోవాలి; మనలను బలపరచుటకు ప్రార్ధనలో ప్రభువుపై మరింత ఎక్కువగా ఆధారపడాలి. విశ్వాసం మరియు ప్రభువుపై ఆధారపడటం అనేవి ప్రవచనంలో ఖచ్చితమైన ఆవశ్యకతలు.

6. ఎక్కువగా ప్రార్థించండి. ఖచ్చితంగా ఏది పంచుకోవాలి, ఏది పంచుకోకూడదు అనేదానిపై జ్ఞానం కోసం దేవుణ్ణి మనం ప్రార్థించాలి (యాకోబు 1:5). మనం మాట్లాడేటప్పుడు, సరైన ఆత్మతో మరియు సరైన ఉద్దేశ్యాలతో మాట్లాడటానికి వీలుగా పరిశుద్ధాత్మ శక్తిని మనం అడగాలి (లూకా 11:13). మనం ముగించిన తర్వాత ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. విత్తిన విత్తనం మంచి నేలపై పడి ఫలాలను అందించాలని మనం ఖచ్చితంగా ప్రార్థించాలి; మనం పంచుకున్న వాటిని ఇతరులు అభినందించడం వలన కలిగే గర్వంనుండి, ఎవరూ మెచ్చుకోకపోతే కలిగే నిరుత్సాహం నుండి కాపాడమని కూడా మనం ప్రార్థించాలి. మనం ఏమి మాట్లాడాలని ప్రభువు కోరుకున్నాడో దానిని మాట్లాడామా మరియు మనం వినయంగా మాట్లాడామా అనేది మాత్రమే చాలా ముఖ్యమైనది. మనం అలా చేసినట్లయితే, దేవుడు మహిమపరచబడతాడు - అది మాత్రమే ప్రాముఖ్యమైనది.

7. సిద్ధపడుటకు సమయాన్ని వెచ్చించండి.మనకు మాట్లాడటం కష్టమైతే, మనం ఏమి చెప్పబోతున్నామో దాన్ని సిద్ధపడటానికి ఎక్కువ సమయం వెచ్చించాలి, మాట్లాడటానికి ఇచ్చిన సమయానికి కట్టుబడి ఉండాలి మరియు మనం నొక్కిచెప్పే ప్రధాన అంశానికి కట్టుబడి ఉండాలి. మనం పంచుకోవాలనుకుంటున్నది రాసుకుంటే, పక్కకు తప్పిపోకుండా ఉండటం సులభం మరియు ఇచ్చిన సమయానికి కట్టుబడి ఉండగలం. అయితే మనం ముందుగా కష్టపడి పనిచేయాలి. మనం ఏమి విత్తుతామో దానిని కోస్తామని బైబిల్ చెబుతోంది (గలతీ 6:7). శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండునని సామెతలు 13:4 చెప్తుంది. కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. "సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి" అని 1 కొరింథీ 14:40 మనకు చెప్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ స్పష్టంగా మరియు క్రమబద్ధంగా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. ప్రజలు తేలికగా జీర్ణించుకోగలిగే భోజనాన్ని సిద్ధం చేయడానికి మంచి వంటగాడు కష్టపడి పనిచేసినట్లే, మనం ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రజలు సులభంగా స్వీకరించగలిగే విధంగా అందించాలి. మనం ఎల్లప్పుడూ ఏదైనా కొత్తగా మాట్లాడాలని కోరుకోకుండా, కొన్ని విషయాలను పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువు మన హృదయంపై ఉంచినది చాలా ఉత్తేజకరమైనదిగా అనిపించకపోవచ్చు. అయితే దేవుడు మనం పంచుకోవాలని కోరుకునే దానిని మనం పంచుకుంటున్నామని (మన తెలిసినంత వరకు) మనకు నమ్మకం ఉంటే, ప్రభువు దానిని ఆశీర్వదిస్తాడని మనం నిశ్చయించుకోవచ్చు.

8. సరళంగా ఉంచండి. యేసు ఎప్పుడూ సరళంగా మాట్లాడేవాడు. ఆయన బోధించిన దానిలో ఆచరణాత్మకంగా ఉన్నాడు - మరియు ఆయన మాటలు ఎల్లప్పుడూ అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండేవి. ప్రజలు తెలివైన పదాలను మరియు వారి వక్తృత్వ నైపుణ్యాలను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు సత్యాన్ని కోల్పోవచ్చు. మనం ఎప్పుడూ చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా, మనం చెప్పేదాని నుండి వారు ఏదైనా పొందేలా మాట్లాడాలి.

9. ఎప్పుడు ఆపాలో తెలుసుకోండి. యేసు ఎప్పుడూ తన సందేశాలను ఎక్కువసేపు లాగలేదు. కొండమీద ప్రసంగం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దేవుడు చాలా తక్కువ సమయంలో శక్తివంతమైన సందేశాన్ని అందించగలడు! ఎక్కువసేపు మాట్లాడటం వలన చాలా మందికి ఆ సందేశాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది. అలాగే చాలామంది ఏకాగ్రతను కోల్పోయేలా కూడా చేస్తుంది. పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. ప్రసంగి 6:11 ఇలా చెబుతోంది, "మీరు ఎంత ఎక్కువ మాటలు మాట్లాడితే అంత తక్కువ అర్థం అవుతుంది. కాబట్టి వాటి వలన ఉపయోగమేంటి?" (ఆంగ్ల లివింగ్ తర్జుమా). చాలా కొద్ది మంది మాత్రమే ప్రజల ఏకాగ్రతను ఎక్కువసేపు పట్టిఉంచగలరు. ప్రజలు ఆసక్తిని కోల్పోయి వారి గడియారాలను నిరంతరం చూసుకునేలా, దీర్ఘ సందేశాలు బోధించడం కంటే ప్రభువు మన హృదయంలో ఉంచిన వాటిని క్లుప్తంగా మాట్లాడటం మంచిది (లూకా 14:8-11).

10. భయపడకండి, పిరికిగా ఉండకండి కానీ ధైర్యంగా ఉండండి . "దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెనుగాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు" (2 తిమోతి 1:7). క్రీస్తు ఎవరు అనే దానిని బట్టి, మన స్వంత జీవితంలో ఆయన ఏమి చేసాడో మనకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం. దేవుడు మన అపరిపూర్ణతలను కూడా ఉపయోగించుకొని, వాటి ద్వారా ఇతరులను ఆశీర్వదించగలడు. మనం చేయగలిగిన కొంచెం చేస్తే, దేవుడు మనం చేయలేనిది చేస్తాడు మరియు మనం మాట్లాడిన దాన్ని ఆశీర్వదిస్తాడు. కానాలో వలె బానలను నీటితో నింపడానికి మనం నమ్మకంగా ఉంటే, అప్పుడు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు (యోహాను 2:1-11). అలా చేయడానికి మనం దేవుణ్ణి నమ్మాలి. మనం ఆయనపై నమ్మకం ఉంచితే, దేవుడు మన బలహీనత ద్వారా అనేకులను ఆశీర్వదించగలడు.

11. ఎల్లప్పుడూ హృదయం నుండి ప్రవచించండి. మన తల నుండి బోధించకూడదు. అందరూ ప్రవచించగలరు (1 కొరింథీ 14:31) కానీ అందరూ బోధకులు కాలేరని (1 కొరింథీ 12:29) బైబిల్ చెబుతోంది. బోధించడం చాలా ముఖ్యం. కానీ చాలా కొద్దిమంది మాత్రమే బోధకులుగా ఉండుటకు పిలవబడ్డారు; దేవుడు మనకు అలాంటి పిలుపు ఇవ్వకపోతే, మనం బోధించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. "జ్ఞానం ఉప్పొంగచేయును" (అహంకారులను చేయగలదు) అని 1 కొరింథీ 8:1 చెబుతుంది. అది మనల్ని ఇతరులను చిన్నచూపు చూసేలా చేస్తుంది. మనం చెప్పేది మాత్రమే కాదు, ఎలా చెబుతున్నామో (మరియు ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నామో) అనేది కూడా ముఖ్యమే. ఇతరుల మంచిని మనం ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోకపోతే, మనం జ్ఞానం, సిద్ధాంతం మరియు వ్యక్తుల మనస్సులను ఉత్తేజపరిచే, వారిని అలరించే విషయాలపై దృష్టి సారిస్తాము!! అయితే ప్రజలను పైకి లేవనెత్తడం మరియు వారిని సవాలు చేయడమే మన పిలుపు.

12. ఇతరులపై ప్రేమతో ప్రవచన వరాన్ని ఆసక్తితో వెతకండి (1 కొరింథీ 14:1). మనం చేసే ప్రతిదీ ప్రేమ నుండి ప్రవహించాలి. ప్రేమ లేని ఉత్తమమైన కార్యం విలువలేనిది. కాబట్టి, సంఘం పట్ల ప్రేమతో మరియు ఇతరులను నిర్మించి వారికి సహాయం చేయాలనే కోరికతో మనం ప్రవచన వరం కోసం వెతకాలి. ఇది ఎల్లప్పుడూ మన ప్రేరణగా ఉండాలి. సహో. జాక్ పూనెన్ చెప్పినట్లుగా, "దేవుని సేవకుడు తన హృదయంలో ఎల్లప్పుడూ కలిగి ఉండవలసిన రెండు విషయాలు, దేవుని వాక్యం మరియు దేవుని ప్రజలు".

13. వ్యక్తిగత సంభాషణలో కూడా ప్రవచించండి. సంఘ సమావేశంలో మనం బహిరంగంగా మాట్లాడుటకే ప్రవచించుట పరిమితం కాదు. ఇతరులతో మన సంభాషణలలో కూడా మనం ప్రవచించగలము. ఇది ఫోన్ ద్వారా లేదా సందేశాల ద్వారా లేదా వారి ఇంటిలో ఎవరితోనైనా పంచుకుంటు వారిని ప్రోత్సహిస్తున్నప్పుడు కూడా ప్రవచించవచ్చు. ప్రోత్సాహం అనేది ప్రవచనం, మనం ప్రతిరోజూ ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి (హెబ్రీ 3:13). అది మనం ప్రేమించే వ్యక్తులను పాపంచేత కఠినతరం చేయకుండా కాపాడుతుంది. మనం ఇతరులను ఆశీర్వదించాలనుకుంటే మనం ఈ విధంగా చేయవచ్చు. అవకాశాల కోసం మనం కళ్లు తెరవబడి ఉండాలి. ప్రభువు మనతో మాట్లాడినది మనలను ఆశీర్వదించినప్పుడు, దానితో మరొకరిని కూడా ఆశీర్వదిద్దాం. ప్రవచించడం అంటే "సరైన మాటని - సరైన సమయంలో పంచుకోవడం". అది ఇతరులకు అధికమైన ఆశీర్వాదాన్ని తెస్తుంది (సామె. 15:23).

దేవుని మహిమ కొరకు ప్రవచించుటకు మనము శ్రద్ధగా వెదకుదాము!!