వ్రాసిన వారు :   జాక్ పూనెన్ విభాగములు :   తెలిసికొనుట శిష్యులు
WFTW Body: 

విశ్వాసము మరియు ఓర్పు ద్వారా మాత్రమే వాగ్ధానములను స్వతంత్రించుకొనెదమని హెబ్రీ 6:12లో చదువుచున్నాము. కాబట్టి విశ్వాసమొక్కటే సరిపోదు. మనము దేవుని చిత్తము నెరవేర్చినవారమై వాగ్ధానము పొందు నిమిత్తము ఓర్పు అవసరమైయున్నదని హెబ్రీ 10:36 చెప్పుచున్నది. ఓర్పును 'సహనము'గా ఆంగ్ల NASB బైబిలులో తర్జుమా చేశారు.

దేవుడు సమస్తమును సమకూర్చి మన మేలు కొరకే జరిగించుచున్నాడు గనుక మనలను ఇబ్బంది పెట్టువారి గురించి ఫిర్యాదు చేయము (రోమా 8:28). రోమా 8:28 నీటిని శుద్ధిచేసే ఫిల్టర్ వంటిది. ప్రజలు దానిలో ఎటువంటి మురికి నీటిని పోసినప్పటికిని దానిలోనుండి శుభ్రమైన నీరు బయటకు వచ్చును. ప్రజలు మనకు మేలు చేసినను లేక కీడు చేసినను, వారు మనలను పొగడినను లేక శపించినను, వారు సహాయపడినను లేక హానిచేసినను, రోమా 8:28ను మనము విశ్వసించిన యెడల వీటిద్వారా మనము మేలే పొందెదము. కాని మనము విశ్వసించాలి. విశ్వాసము, నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ స్విచ్ వేయుటవంటిది. విద్యుత్‍శక్తి అనే విశ్వాసము లేనియెడల అది పనిచేయదు.

"రెవయ్య" అను హెబ్రీ పదమునకు సంపూర్ణమని అర్థము. పాతనిబంధనలో ఈ పదము రెండుసార్లు ఉన్నది.

1. కీర్తన 23:5 "ప్రవహించుచున్నది"(KJV); "పొర్లిపారుచున్నది" (NASB).

2. కీర్తన 66:12 "సమృద్ధిగల చోట" (KJV); "సమృద్ధిగా" (NASB).

ఈ రెండు వచనములను ఒకచోట పెట్టినయెడల, ఈ ఆత్మీయ సత్యమును పొందెదము: దేవుడు మన తలను నూనెతో అభిషేకించిన తరువాత (కీర్తన 23:5), దేవుడు బంధీగృహములో మనలను ఉంచి, నరులు మన నెత్తిమీద ఎక్కునట్లు చేయును. మన నడుముల మీద గొప్ప భారములు పెట్టును. కాని మనశక్తికి మించి అనుమతించడు. మరియు నిప్పులలోను నీళ్ళలోను నడుపును (కీర్తన 66:11,12). మరియు ఆ విధముగా మన గిన్నె నిండి పొర్లిపారునట్లు చేయును (కీర్తన 66:12ని కీర్తన 23:5తో పోల్చిచూడండి). కాబట్టి అభిషేకమునకు మరియు నిండి పొర్లిపారుటకును మధ్యలో మనము శ్రమలలో గుండా వెళ్ళవలసియుండును. అప్పుడు మాత్రమే ప్రవహించే జీవితము కలిగియుండెదము.

కాబట్టి మనకు ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికి ఇతరులయొక్క పొరపాట్ల ద్వారా కాని లేక దుష్టులు ఉద్దేశ్యపూర్వకంగా చేసినప్పటికి లేక ప్రమాదవశాత్తు జరిగినప్పటికిని, వీటిద్వారా క్రీస్తుయొక్క స్వరూప్యము మనలో ఏర్పడునట్లు మన మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగించును (రోమా 8:29).

విశ్వాసమనగా జ్ఞానము, ప్రేమ మరియు శక్తిగల దేవునిలో పూర్తి నమ్మకముంచటం. దేవుడు వాటన్నింటిని మన జీవితములో అనుమతించుటయే కాక, వాటన్నింటిని మన మేలు కొరకు సమకూర్చి జరిగించునని ధైర్యముతో విశ్వసించవలెను.