WFTW Body: 

మన శత్రువులకు శత్రువునై ఉండెదనని దేవుడు వాగ్ధానమిచ్చియున్నాడు (నిర్గమకాండము 23:22). పాత నిబంధనలో మనుష్యులే ఇశ్రాయేలీయుల శత్రువులై యున్నారు. ఈనాడు మనకు సాతాను మరియు అతని దూతలు మరియు మన శరీరేచ్ఛలు మనకు శత్రువులై యున్నారు. మనము శరీరులతో పోరాడము (ఎఫెసీ 6:12). నీవు మనుష్యులతో పోరాడను అని నిర్ణయించుకొనినయెడల, దేవుడు నీ కొరకు పోరాడును. సాతానుకు విరోధముగా దేవుడు ఎల్లప్పుడూ నీ పక్షముగా ఉన్నాడు అని గుర్తుంచుకొనుము.

దేవునికి పేతురుమీద నమ్మకము ఉండుట వలన మరియు అతని యెడల గొప్ప పరిచర్య కలిగియుండుట వలన, పేతురుని జల్లించుటకు ఆయన అనుమతినిచ్చెను. కాని అతను జల్లించబడినప్పుడు అతని నమ్మిక తప్పిపోకుండునట్లు ప్రభువైనయేసు పేతురు కొరకు ప్రార్థించెను. సాతాను నిన్ను జల్లించే ప్రతిసారి ప్రభువైనయేసు నీ కొరకు ప్రార్థించుచున్నాడనే గొప్ప ఆదరణ మనకు ఉన్నది.

ఒక ఇల్లు మంటలలో కాలిపోవుచున్నప్పుడు, ఆ ఇంటిలో ఉన్న విలువైన వాటిని కాపాడవలెనని ప్రజలు కోరెదరు. ఆ ఇంటిలో పసిబిడ్డ ఉన్నట్లయితే, పాత వార్తాపత్రికలు కాదుగాని ఆ బిడ్డను రక్షించెదము. అదే విధముగా పేతురు అగ్నిలోనుండి వెళ్ళినప్పుడు అతని విశ్వాసము కాపాడబడునట్లు ప్రభువైనయేసు ప్రార్థించెను. ఎందుకనగా విశ్వాసము ప్రాముఖ్యమై యుండి అమూల్యమైయున్నది. మిగతావన్నియు పాత వార్తాపత్రికలవలె పనికి రానివి.

సాతాను మిమ్మును జల్లించినప్పుడు మీ విశ్వాసము తప్పిపోకూడదు. మీకు విశ్వాసము ఉన్న యెడల మీరు శ్రమలగుండా వెళ్ళుచున్నప్పుడు ఈవిధముగా నోటితో ఒప్పుకొనెదరు: "నా పరలోకపు తండ్రి నన్ను సంపూర్ణముగా ప్రేమించుచున్నాడు. మరియు ఆయన పరలోకమును భూలోకమును పరిపాలించుచున్నాడు. ప్రభువైనయేసు సిలువ మీద సాతానుని ఓడించియున్నాడు. సాతాను అబద్ధికుడు మరియు నా జీవితము మీద అధికారము లేదు. దేవుడు సమస్తమును సమకూర్చి నా మేలు కొరకే జరిగించుచున్నాడు." విశ్వాసము గలవాడు ఈ విధముగా నోటితో ఒప్పుకొనును. జల్లించబడిన తరువాత అతడు మారుమనస్సు పొంది తన సహోదరులను స్థిరపరచునని ప్రభువైనయేసు చెప్పారు (లూకా 22:31,32). మనము పరీక్షించబడినప్పుడు విశ్వాసము నుండి తప్పిపోయినయెడల ఇతరులను బలపరచలేము.

ప్రభువు పేతురుని సాతాను అని పిలిచినప్పుడు అభ్యంతరపడలేదు గనుక ప్రభువైనయేసు పేతురులో గొప్ప కార్యము చేసియున్నారు (మత్తయి 16:23). కాని బేతనియలో చిన్న దిద్దుబాటును కూడా స్వీకరించక అభ్యంతరపడిన యూదా కొరకు ప్రభువు ఎప్పుడూ ప్రార్థించలేదు (యోహాను 12:4-8; మత్తయి 26:8-15 కలిపి చదవండి).

ప్రభువు నిన్ను గద్దించినప్పుడు అభ్యంతరపడకూడదు. మీ అందరియెడల దేవునికి గొప్ప ఉద్దేశ్యము ఉన్నది. మన యెడల ఎంత గొప్ప సంకల్పమున్నదో అంతగా సాతాను చేత జల్లించబడుటకు దేవుడు అనుమతించును. కాని ప్రతి శోధనలో నుండి జయోత్సవముతో జయించెదము.