WFTW Body: 

దేవుని భయముతో మన పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనవలెనని 2కొరింథీ 7:1లో మనము ఆజ్ఞాపించబడ్డాము. కాబట్టి గత సంవత్సరము కంటే ఇప్పుడు మన పరిశుద్ధత ఎక్కువ కానియెడల, మనము దేవునికి సరిగా భయపడుట లేదని అది రుజువు పరచుచున్నది. ఈ విషయములో పెద్దలమైన మనము ఒకరితో ఒకరు సహకరించవలెను - ఎందుకనగా మన సహోదరులకు మనము కావలివారము. అందువలన ఒకరికంటె ఎక్కువ పెద్దలను ఒక సంఘములో దేవుడు నియమించును. హెబ్రీ 3:15లో పాపము వలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండునట్లు ఒకనినొకడు ప్రతిదినం ప్రోత్సహించుకోవాలి. ఆ విధముగా మోసమునుండి తప్పించుకొనుటకు ఒకరికొకరము సహాయం చేసుకోవాలి.

యెషయా 11:2లో ప్రభువైనయేసులో "దేవునియెడల భయభక్తులు పుట్టించే ఆత్మ" ఉన్నదని చదివెదము. మనము అనుమతించిన యెడల, పరిశుద్ధాత్ముడు మనలో కూడా దేవునియెడల భయభక్తులు పుట్టించును. మనము నిజముగా పరిశుద్ధాత్మతో నింపబడిన యెడల, దేవుని యెడల భయభక్తులతో నింపబడెదము. దేవుడు ఎల్లప్పుడు మన పక్షముగా ఉండును మరియు మనము పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరేదాని కంటె ఎక్కువగా తన ఆత్మతో నింపాలని దేవుడు ఆసక్తి కలిగియున్నాడు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికిని, మనందరిలో ఆయన గొప్పకార్యము చేయగలడు. అయితే మనము ఎల్లప్పుడు దీనులమై యుండి ఆయనను వెదకవలెను. మన శరీరేచ్ఛలకును మరియు సాతానుకును వ్యతిరేకముగా దేవుడు మన పక్షమున ఉన్నాడు.

(శిష్యత్వమును కోరని) మరియొక యేసును ప్రకటించే, (ప్రజలను పరిశుద్ధ పరచక నకిలీ వరములను ఇచ్చే) మరియొక ఆత్మను పొందుకొనుచున్న, (ఆరోగ్యము మరియు సిరిసంపదలతో కూడిన) మరియొక సువార్త ప్రకటించే దినములలో ఉన్నాము (2కొరింథీ 11:4). కాబట్టి మనము నిజమైన యేసును, పరిశుద్ధాత్మను మరియు దేవునియొక్క కృపా సువార్తను ఈ సమయములో నమ్మకముగా ప్రకటించాలి.

నిన్ను నీవు సమర్థించుకొనక క్షమాపణ అడుగవలెను :

మనము విరిగి నలిగిన హృదయమును కలిగి మరియు ఆత్మలో దీనులము కానట్లయితే, మనము ఏదైనా తప్పు చేసినట్లు తెలుసుకొనిన వెంటనే దీనులమై క్షమాపణ చెప్పుటకు వెనుకాడెదము(ఇష్టపడము).

"నేను చింతించుచున్నాను, అది నాయొక్క పొరపాటు, దయచేసి నన్ను క్షమించండి" అను ఎనిమిది మాటలు చెప్పుట అనేకులకు కష్టమైయున్నది.

మనము విరుగగొట్టబడని యెడల, క్షమాపణ చెప్పినను మనలను మనము సమర్థించుకొనెదము. మనము ఏ విధముగానైనను సమర్థించుకొనుచున్నయెడల, క్షమాపణ చెప్పినను అది క్షమాపణ అడిగినట్లు కాదు. మనము క్షమాపణ చెప్పునప్పుడు, మనలను మనము సమర్థించుకొనే వాసన కొంచెమున్నప్పటికిని, మనము విరుగగొట్టబడలేదని నిశ్చయించుకొనవచ్చును. తన్నుతాను సమర్థించుకొనుట పరిసయ్యునియొక్క లక్షణమని ప్రభువైనయేసు చెప్పారు (లూకా 16:15). మనము తప్పుచేసియున్నామని గుర్తించిన వెంటనే దానిని ఒప్పుకొని సరిచేసుకోవాలి. ఒక విరుగగొట్టబడిన వ్యక్తి దీనిని సులభముగా చేయును కాని ఒక విరుగగొట్టబడని వ్యక్తి వీటిని చేయుటకు ఆలస్యము చేయును. మరియు అతడు క్షమాపణ అడిగినప్పటికిని, అతడు ఎవరో ఒకరిని నిందించును. ఆదాము పాపము చేసినప్పుడు, తినకూడని పండును తాను తిన్నానని ఒప్పుకొనినప్పటికి దేవుడు తనకు ఇచ్చిన భార్య తనకు ఇచ్చినందుకే తిన్నానని తనను తాను సమర్థించుకొన్నాడు. ఆ విధముగా అతడు అతని భార్యను మరియు అటువంటి భార్యను తనకు ఇచ్చిన దేవునిని నిందించాడు. ఏ పాపమునైనను మరియు పొరపాటునైనను ఈ విధముగా ఒప్పుకొనకూడదు.

కాని 51వ కీర్తనలో దావీదు పాపమును ఏవిధముగా ఒప్పుకొన్నాడో గమనించండి. అక్కడ తనను తాను సమర్థించుకొనుట అను వాసన కొంచెము కూడా లేదు. అదియే నిజముగా విరుగగొట్టబడిన వ్యక్తియొక్క గుర్తు. 51వ కీర్తనను మీరు ధ్యానించి, విరుగగొట్టబడుట యొక్క నిజమైన అర్థము, ఏవిధముగా పాపమును ఒప్పుకోవాలో దేవునినుండి అర్థం చేసుకొనవలెనని కోరుచున్నాను. నిన్ను నీవు సమర్థించుకొనుటకు నీవు ఒక అబద్ధమును కూడా చెప్పవచ్చును. జరిగిన సంఘటనలను దాచుటకుగాని లేక అతిశయోక్తిగాగాని ఉండుటకు మరియు మనలను మంచిగా చూపించుకొనుటకు ఒక చిన్న అబద్ధమై ఉండవచ్చును. ఒక అబద్ధము చెప్పుట సులభమేగానీ కాని కేవలం ఒక్క అబద్ధమే చెప్పుట కష్టం -ఎందుకంటే ఆ మొదటి అబద్ధమును సమర్థించుటకు అనేక అబద్ధములు చెప్పాలి. అబద్ధమును ద్వేషించి మరియు సత్యమును హృదయపూర్వకముగా ప్రేమించవలెను. లేనట్లయితే మన అభిషేకమును కోల్పోయెదము మరియు దేవునికి ఇష్టులముగా ఉండము - ఆ గొప్ప నష్టమును మనము భరించలేము.

మనలో బహిర్గతము చేయబడి నశింపచేయబడవలసిన గర్వమును దేవుడు చూచినప్పుడు, మనము తొట్రుపడి, పడిపోవునట్లుగా దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించును (యెహెజ్కేలు 3:20 చూడండి: "నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా...."). మనము పడిపోయినప్పుడు, 1. మనము పడిపోవుటకు కారణమైన గర్వమును ఒప్పుకొనుచున్నామా?, 2. మన పాపమును ఒప్పుకొనుచున్నామా?, 3. ఆయన యెదుట దీనులముగా ఉన్నామా?, 4. మనుష్యులతో సంగతులు సరిచేసుకొనుచున్నామా? అని ప్రభువు మనలను పరీక్షించును. మనలను మనము పరీక్షించుకొని మరియు ఈ విధముగా చేసినయెడల, మనము తీర్పుపొందము. కాని మనలను మనము సమర్థించుకొంటూ, విరుగగొట్టబడని యెడల ఒక దినము మనము లోకముతో పాటు తీర్పుతీర్చబడెదము (1కొరింథీ 11:31,32).