WFTW Body: 

సిరి విషయంలో నమ్మకముగా ఉన్నవారే ఆత్మసంబంధమైన ఐశ్వర్యమును పొందెదరని ప్రభువైనయేసు సృష్టముగా చెప్పారు (లూకా 16:11). సిరి విషయంలో నమ్మకముగా లేనందువలన అనేకమంది సహోదర సహోదరిలు ఆత్మీయ పేదరికంలో ఉన్నారు. ఈ రోజులలో అనేకమంది బోధలో అభిషేకం లేకపోవుటకు కూడా ఇది ఒక కారణం.

రోమా 13:8లో ఉన్న "ఎవనికిని అచ్చియుండవద్దు" అను దేవుని ఆజ్ఞకు విశ్వాసులందరు లోబడుట నేర్చుకోవాలి.

"అప్పు చేయవద్దు" అని బైబిలు చెప్పుట లేదు. నీకు అత్యవసరము ఉన్న యెడల డబ్బును అప్పుగా తీసుకొనుట పాపము కాదు. అయితే అలాగే ఎక్కువకాలం అప్పు చెల్లించకుండా ఉండుట పాపము కనుక సాధ్యమైనంత త్వరగా అప్పును తిరిగి చెల్లించాలి. "అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు" (సామెతలు 22:7). తన పిల్లలెవరైనను ఏ మనుష్యునికైనను దాసునిగా ఉండాలని దేవుడు కోరుట లేదు. కొద్ది కొద్దిగా చెల్లించినప్పటికినీ సాధ్యమైనంత త్వరగా ప్రతి ఒక్కరు అప్పు తీర్చవలెను. అప్పు చెల్లించుటకు నీ దగ్గర కొద్ది మొత్తమే ఉన్నప్పటికిని కొద్ది కొద్దిగా చెల్లించినప్పటికినీ, నీ హృదయములో దేవునియొక్క ఆజ్ఞకు లోబడాలని కోరుచున్నావో లేదో అని దేవుడు చూచుచున్నాడు (2 కొరింథీ 8:12). నీవు అప్పు తీసుకొని 6 నెలలు దాటిన యెడల నీవు దానిని తిరిగి చెల్లించునప్పుడు బ్యాంకు యొక్క సంవత్సర వడ్డితో కలిపి ఇవ్వాలి(జక్కయ్య చేసినట్లు లూకా 19:8). ఇది చేయదగిన నీతికార్యము.

అప్పుల్లో జీవించవద్దని వారి సంఘసభ్యులకు సంఘపెద్దలందరు బోధించవలసిన బాధ్యత దేవునియెదుట కలిగియున్నారు. వ్యభిచారములో జీవించుటకు అనుమతించనట్లే అప్పులలో కూడా ఉండి జీవించుటకు విశ్వాసులను అనుమతించవద్దు.

(గమనిక: ఒక గృహ రుణముకాని, కారు రుణంకాని, స్కూటర్ రుణంకాని అప్పుగా భావించకూడదు. ఎందుకనగా అప్పుకు సరిపోను ఆ ఇల్లుగాని ఆ వాహనంగాని ఉన్నవి. ఒక లాభం పొందుచున్న వ్యాపారం చేయుటకైనను వ్యాపార రుణమును తీసుకొనవచ్చును. కాని చాలామంది విశ్వాసులు వారు వ్యాపారం చేయుటకు అనుభవం లేనప్పటికిని మరియు ఆ వ్యాపారములో లాభం వస్తుందో లేదో తెలియనప్పటికి వ్యాపారం కొరకు అప్పు చేసి చాలా సంవత్సరములు అప్పులో ఉండియున్నారు. ఎక్కువ మొత్తంలో వ్యాపార రుణం తీసుకునే ముందు, ముందుగా ఒక దైవజనున్ని సంప్రదించాలి).

క్రెడిట్ కార్డుతో అప్పు చేయుట చాలా తీవ్రమైనది. ఎందుకనగా అది త్వరగా పెరుగుతుంది. కాబట్టి విశ్వాసులు క్రెడిట్ కార్డు కంటె డెబిట్ కార్డ్ కలిగియుండటం మంచిదని బోధించాలి. క్రెడిట్ కార్డ్‍ను ఉపయోగించినట్లయితే ప్రతినెలా క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చాలి. ఒక్క నెలైనను అప్పు చెల్లించలేని యెడల తమ్ముతాము క్రమశిక్షణలో పెట్టుకొని అప్పంతయు తీరు వరకు క్రెడిట్ కార్డ్ వాడకుండుట మంచిది. అప్పు విషయంలో తీవ్రముగా ఉన్నవారిని దేవుడు ఘనపరచును. అప్పు చేసి ఒక పెద్దవస్తువును కొనకూడదు. దానికి అవసరమైన డబ్బును మొదటిగా పొదుపు చేసుకొని అప్పుడు మాత్రమే దానిని కొనాలి. ప్రభువైనయేసు ఆవిధముగా చేసియుండెడి వారు.

దురాశ మరియు దుబారా ఖర్చు పెట్టుకుంటు జీవించుటయే అధిక అప్పులకు కారణం.

విశ్వాసులందరు ప్రతి నెలా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. వారికంటే పై స్థాయిలో జీవిస్తున్న వారిని చూచి వారివలె జీవించుటకు ప్రయత్నించక వారికున్న రాబడిని బట్టి వారు జీవించాలి. వారు అనవసరమైన వాటిని కొనకూడదు. మరియు స్నేహితుల విందుల కొరకు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. స్నేహితుల నుండి ఘనత పొందుటకే చాలామంది విందులు చేస్తారు(ఇది ఒక విగ్రహరాధన వంటిది). మీ ఆర్ధికస్థోమతను బట్టి మాత్రమే మీరు ఆతిథ్యమియ్యాలి.

మీరు ఆతిథ్యమిస్తారనే మంచి పేరు తెచ్చుకొనే కంటే, భవిష్యత్తులో మీ కుటుంబ అవసరము కొరకు కొంత సొమ్మును పొదుపు చేయుట మంచిది. "తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది" అని బైబిలు చెప్పుచున్నది (2 కొరింథీ 12:14). నీ అవసరముల నిమిత్తము దేవునిని నమ్ముట అనగా నీ కుటుంబం కొరకు కొంత సొమ్మును పొదుపు చేయకుండుట కాదు. ఈ భూమి మీద అతి చిన్నవైన చీమల నుండి ఈ జ్ఞానం నేర్చుకొనమని బైబిలు మనకు ఆజ్ఞాపించుచున్నది. చలికాలంలో ఇబ్బందులు వస్తాయని చీమలు వేసవిలోనే తమ కొరకు ఆహరము సిద్ధపరచుకొనును(సామెతలు 6:6-11). భవిష్యత్తులో అనుకొనని రీతిగా వచ్చే ఖర్చుల నిమిత్తము పొదుపు చేసుకొనుటను చీమల యొద్దనుండి మనము నేర్చుకోవాలి. చాలా మంది మనుష్యులకున్న పెద్ద మెదడులో కంటే చీమలకున్న ఎంతో చిన్న మెదడులో ఎక్కువ జ్ఞానమున్నది.

ఈ రోజులలో మన పిల్లలను చదివించుట, మన కుటుంబములో ఆరోగ్యసంబంధమైన ఖర్చులు ఎక్కువగుచున్నవి. కాబట్టి దాని నిమిత్తం డబ్బును పొదుపు చేసుకోవాలి. నీవిప్పుడు దానిని చేయనట్లయితే, భవిష్యత్తులో ఇతర విశ్వాసులను నీవు అడుగుకోవలసివచ్చును. ఒక విశ్వాసి తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల అతడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడైయుండునని పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు (1 తిమోతి 5:8). చాలా సందర్బములలో ఉద్యోగము చేయని భార్యలు ఎక్కువ డబ్బును ఖర్చుపెడతారు, ఎందుకనగా ఆమెకు తమ కుటుంబము యొక్క ఆర్ధికపరిస్థితి తెలియదు. తమ కుటుంబం యొక్క ఆర్ధికపరిస్థితిని గురించి భర్తలు తమ భార్యలకు వివరించి మరియు భవిష్యత్తు ఖర్చుల కొరకు కొంత ధనం ఉండునట్లు వ్యర్ధమైన వాటి నిమిత్తం ఖర్చుపెట్టవద్దని చెప్పాలి. కొంత క్రమశిక్షణలో పెట్టుకొని మరియు ప్రతినెలా కొన్ని ఖర్చులు తగ్గించుకొనినయెడల ప్రతి కుటుంబం కూడా కొంత డబ్బును పొదుపు చేసుకొనవచ్చును.

మనం అంత్యదినములలో ఉన్నాము కనుక డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అంతకంతకు జాగ్రత్తపడాలి. "అశాశ్వతమైన ఐశ్వర్యమందు" మనం విశ్వాసముంచము. పరలోకమందున్న మన తండ్రిలోనే మనం విశ్వాసముంచుతాము (1 తిమోతి 6:17). మనం దేవుని వాక్యానికి లోబడి పైన చెప్పిన విధంగా చీమలయొద్దనుండి నేర్చుకొని దేవుని రాజ్యమును మొదటిగా వెదకినయెడల "దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును" (ఫిలిప్పీ 4:19) అను వాగ్ధానం నెరవేరుతుందని మనమెల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి (మత్తయి 6:33).

నేను విశ్వాసిగా ఉన్న 59 సంవత్సరములు, వివాహ జీవితములోని 50 సంవత్సరములు నేను అనుసరించిన దానిని బోధిస్తున్నాను. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు లేక ఒక్క రోజు కూడా మేము అప్పులో లేము. మా వివాహమైన తొలిదినములలో మేము చాలా బీదవారముగా ఉన్నప్పుడు, రోమా 13:8ని పూర్తిగా లోబడి మేము అప్పు చేయలేదు. మరియు మత్తయి 6:33 ప్రకారము దేవుని రాజ్యమును మొదటిగా వెదికాము. మరియు మన పరలోకపు తండ్రి ఎల్లప్పుడు మా భూసంబంధమైన అవసరమును తీర్చియున్నాడు. దానితో పాటు అనేక ఆత్మీయ ఐశ్యర్యములను నాకు అనుగ్రహించియున్నాడు. కాబట్టి ఈనాడు దేవునివాక్యానుసారముగా ఒకని రాబడికి తగినట్లుగా జీవించుట మరియు అప్పు చేయకుండుట విషయంలో "నన్ను వెంబడించుడి" అని ధైర్యముగా చెప్పగలను.

కొందరు విశ్వాసులు వారి అప్పు చెల్లించుటకు తగినంత డబ్బు ఉన్నప్పటికినీ వారు అప్పు చెల్లించరు. అటువంటి విశ్వాసులు పూర్తిగా బాధ్యాతారహితులైయుండి మరియు అవిశ్వాసుల వలె ప్రవర్తించుచున్నారు. కొన్నిసార్లు వారికి అప్పిచ్చినవాడు మరచిపోయియుంటాడని అనుకుంటారు. అటువంటి విశ్వాసులు పూర్తిగా భక్తిహీనులుగాను పూర్తిగా చెడ్డవారునైయున్నారు.

"నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము నీ సొమ్ము ఎత్తుకొని పోవువానియొద్ద దాని మరలా అడుగవద్దు" (లూకా 6:30) అని ప్రభువైనయేసు యొక్క ఆజ్ఞ గురించి మనం ఏమి చేద్దాం?

మనమెప్పుడైనను ఒక్క వచనమును ఆధారముగా తీసుకొనకూడదు. "ఈ విధముగా వ్రాయబడియున్నది" అని సాతాను ప్రభువైనయేసుతో చెప్పినప్పుడు, ప్రభువైనయేసు "ఈ విధముగా కూడా వ్రాయబడియున్నది" అని చెప్పారు (మత్తయి 4:6,7). కాబట్టి దేవుని వాక్యములోని సత్యమంతయు "ఈ విధముగా వ్రాయబడియున్నది" అనే దానిలో మాత్రమే లేదు కాని "ఈ విధముగా కూడా వ్రాయబడియున్నది" అను దానిలో దేవుని వాక్యములోని సత్యమంతయు ఉన్నది. "నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము నీ సొమ్ము ఎత్తుకొని పోవువానియొద్ద దాని మరలా అడుగవద్దు" (లూకా 6:30) అని మనం చదివినప్పుడు "భూమి మీద ఉన్న సమస్తము ప్రభువునకు చెందినది" (1కొరంథీ 10:23) అని కూడా వ్రాయబడియున్నదని మనం గుర్తు పెట్టుకోవాలి. అనగా నీవు సంపాదించిన డబ్బంతయు మరియు నీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతయు మరియు నీ ఆస్తులన్నియు ప్రభువుకు చెందియున్నవి. మరియు అవి నీవి కావు. కాబట్టి నీవెవరికైనా డబ్బును ఇవ్వాలని కోరినా అప్పు ఇవ్వాలని కోరినా ఆ డబ్బు యొక్క నిజమైన యజమానుడైన ప్రభువైనయేసు యొద్ద ప్రార్థించి ఆయన యొద్ద నుండి స్పష్టమైన ఆజ్ఞను పొందాలి. అప్పుడు మాత్రమే నీవు ఇవ్వాలి. కాని నీ దగ్గర ఉన్న డబ్బంతయు నీదనుకొని మరియు నీ ఇష్టమొచ్చిన రీతిగా నీవిచ్చినట్లయితే అప్పుడు నీవు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటావు. ఈ భూమి మీద ఉన్న డబ్బంతయు ప్రభువుదే. మనది అంటూ ఏది లేదు. కాబట్టి నీవు వేరే వారికి కానుకగా ఇచ్చినను లేక అప్పుగా ఇచ్చినను ఆయనను అడిగి స్పష్టమైన జవాబు పొందుకొనుట మంచిది.

ఆ విధముగా నీవు ప్రభువును తీవ్రముగా వెదకిన యొడల, నీవు డబ్బు అడుగు వాని హృదయములో ఉన్న దాని బట్టి కొన్నిసార్లు దాన్ని ఇమ్మనవచ్చును లేక కొన్నిసార్లు ఇవ్వవద్దని చెప్పవచ్చును. ఈ విధముగా మోసగాళ్ళ నుండి నీవు కాపాడబడుదువు.

చాలా ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన క్రమశిక్షణలో ప్రభువైనయేసు యొక్క అడుగు జాడలలో నడచుటకు ప్రభువు మనకు సహాయం చేయునుగాక!!.