WFTW Body: 

1. వేషధారణ

వేషధారిగా ఉండుట అంటే మనము ఉన్నదానికంటే ఎక్కువ పరిశుద్ధుల మన్న అభిప్రాయమును ఇతరులకు కలుగజేయుట. అది అబద్ధముగా ఉండుటకు లేక అబద్ధము చెప్పుటతో సమానము. మత్తయి 23:13-29లో యేసు వేషధారులను ఏడు మారులు శపించెను. మన నోళ్ళు తెరువకుండా కూడా అబద్ధమాడుట సాధ్యమే. వారి అంతరంగ జీవితము "అజితేంద్రియత్వముతో నిండియున్నది" అని యేసు పరిసయ్యులతో చెప్పెను (మత్తయి 23:25) - దాని అర్థము తమనుతాము సంతోషపెట్టుకొనుటకే వారు జీవించిరి. కాని వారు లేఖనములను బాగా ఎరిగియున్నందున, వారు ఉపవాసముండి ప్రార్థించి వారి రాబడిలో దశమబాగములను ఇచ్చినందున, వారు పరిశుద్ధులన్న అభిప్రాయమును ఇతరులకు కలుగజేసిరి. వారు బయటకు ఎంతో భక్తిగలవారిగా కనిపించిరి. ఈనాడు అనేకమంది వలే వారు బహిరంగముగా సుదీర్ఘమైన ప్రార్థనలు చేసిరి. కాని రహస్యముగా ప్రార్థనలు చేయలేదు. అన్ని సమయాలలో మన హృదయాలలో స్తుతితో కూడిన ఆత్మను కలిగియుండకుండా ఆదివారము ఉదయమున మాత్రము మనము దేవున్ని స్తుతించిన యెడల అది వేషధారణగా ఉండును.

2. ఆత్మీయగర్వము

పరిశుద్ధత కొరకు ప్రయాసపడువారిలో కనబడు అత్యంత సామాన్యమైన పాపము ఆత్మీయగర్వము. తన ప్రార్థనలో సహితము ఇతరులను తక్కువగా చూచిన స్వనీతిపరుడైన పరిసయ్యుని ఉపమానము మనకందరికి తెలుసు (లూకా 18:9-14). విశ్వాసులు బహిరంగముగా చేయు ప్రార్థనలలో 90% వినువారిని ఆకట్టుకొనుటకే గాని దేవునికి ప్రార్థనలు కాకపోవుటకు అవకాశమున్నది. ఈ ఉపమానములో పరిసయ్యుడు తన బాహ్య జీవితములో ఇతర పాపులవలె చెడ్డవాడు కాకపోవచ్చును. కాని తన ఆత్మీయ కార్యచరణను తలంచుకొని ఇతరులను తృణీకరించునట్లు చేసిన అతని గర్వాన్ని యేసు ద్వేషించెను. ఇతర విశ్వాసులను నిరంతరము తీర్పు తీర్చునట్లు చేయునది ఆత్మీయగర్వమే. పరలోకములో అతిగొప్ప వ్యక్తి అత్యంత దీనుడైనవాడని యేసు బోధించెను (మత్తయి 18:4). పరలోకములో కనబడు అతిగొప్ప సద్గుణము దీనత్వము.

3. అపవిత్రత

అపవిత్రత మన హృదయాలలోకి ప్రధానముగా మన కళ్ళద్వారా మన చెవుల ద్వారా ప్రవేశించును. ఆ తరువాత ఈ అపవిత్రత మన హృదయాలనుండి బయటకు వచ్చి మన శరీరము యొక్క వివిధ అవయవముల ద్వారా వ్యక్తపరచబడును - అవి ప్రధానముగా మన నాలుకలు మరియు మన కళ్ళు. కాబట్టి పవిత్రముగా ఉండగోరువారు తాను చూచువాటిని గురించి వినువాటిని గురించి ప్రత్యేక జాగ్రత్త వహించవలెను. యేసు అపవిత్రతను ఎంతగా ద్వేషించెనంటే, వాటితో పాపము చేయుటకంటే తమ కుడికన్నును పెరికివేయుటకును, కుడి చేతిని నరికివేయుటకును సిద్ధముగా ఉండవలెనని యేసు తన శిష్యులతో చెప్పెను (మత్తయి 5:27-29). కుడి చేతి విచ్చేదనమును లేక కంటిని శస్త్రచికిత్స ద్వారా తీసివేయుటను వైద్యులు ఎప్పుడు సిఫార్సు చేయుదురు? ఎప్పుడైతే పరిస్థితి తీవ్రముగా మారి, ఈ అవయవములను తీసివేయకుంటే శరీరమంతయు చనిపోవును అని వారికి అనిపించినప్పుడు సిఫార్సు చేయుదురు. అలాగే పాపము విషయంలో కూడా మనము అర్థము చేసుకోవలసినది ఇదే. పాపము ఎంత తీవ్రమైనదంటే అది మన జీవితానికే ముప్పు తెచ్చును.

4. మానవ అవసరతల పట్ల ఉదాసీనత (అశ్రద్ధ)

అది సబ్బాతు దినము గనుక సమాజమందిరము యొక్క నాయకులు ఆయనను ఒక వ్యక్తిని స్వస్థపరచనీయక పోవుట వలన యేసు కోపపడెను. "మానవ అవసరతపట్ల వారి ఉదాసీనత(బిన్నత్వం)ను బట్టి ఆయన ఎంతో కలత చెందెను" (మార్కు 3:5-లివింగ్ బైబిల్). మనుష్యులందరికిని ప్రత్యేకముగా దేవుని పిల్లలకు మనము మంచి చేయవలెనని ఆజ్ఞాపింపబడితిమి (గలతీ 6:10). జీవించుటకు అవసరమైన ప్రాథమిక విషయాలలో తన సహోదరులకు సహాయపడుటకు ఏమియు చేయనివారు అంత్యదినమున తన సముఖమునుండి వెళ్ళగొట్టబడుదురని యేసు బోధించెను (మత్తయి 25:41-46). వ్యాధిగ్రస్తులైన విశ్వాసులను స్వస్థపరచుటకు మనము స్వస్థతవరమును కలిగియుండకపోవచ్చు. కాని మనము నిశ్చయముగా వాధిగ్రస్తులను దర్శించి వారిని ప్రోత్సహించవచ్చును. ప్రభువు మనలను అడిగేది అదే. ధనికుడు తన తోడి యూదుడును, అబ్రహాము కుమారుడును తన సహోదరుడైన లాజరును పట్టించుకోనందున నరకమునకు వెళ్ళెను. మంచి సమరయుని ఉపమానములో యాజకుడు లేవియుడు రోడ్డు మీద గాయపడి పడియున్న తమ తోడి సహోదరుడగు యూదునిపైన కనికరపడనందున యేసుచేత వేషధారులుగా బయటపెట్టబడిరి.

5. అవిశ్వాసము

విశ్వాసములేని హృదయమును దుష్ఠహృదయమని బైబిలు పిలచుచున్నది (హెబ్రీ 3:12). యేసు తన శిష్యుల అవిశ్వాసమును బట్టి వారిని ఏడు మారులు గద్దించెను (మత్తయి 6:30; 8:26; 14:31; 16:8; 17:17-20; మార్కు 16:14; లూకా 24:25). ఆయన తన శిష్యులను దాదాపుగా మరి దేనివిషయములో ఇన్నిసార్లు గద్దింపలేదని అనిపించుచున్నది. అవిశ్వాసము దేవునికి అవమానకరము, ఎందుకనగా భూమి మీదనున్న చెడ్డతండ్రులు వారి పిల్లలను పట్టించుకొని ఇచ్చినంతగా కూడా, దేవుడు తన పిల్లలను పట్టించుకొని వారికి కావలసినవి ఇవ్వడని అది సూచిస్తున్నది. పరలోకమందు ప్రేమగల తండ్రియందును ఆయన తన వాక్యములో మనకిచ్చిన వాగ్ధానములయందును విశ్వాసముంచుట ద్వారానే నిరాశ, నిరుత్సాహము, చెడు మనోభావాల మీద విజయము వచ్చును. యేసు ఆశ్చర్యపడుటను గూర్చి మనము రెండు మారులు చదివెదము: ఒకసారి ఆయన విశ్వాసమును చూచినప్పుడు, మరియెకసారి ఆయన అవిశ్వాసమును చూచినప్పుడు (మత్తయి 8:10; మార్కు 6:6). ప్రజలలో ఆయన విశ్వాసమును చూచినప్పుడెల్లా యేసు ఉత్సాహపడెను. పరలోకములో ఉన్న ప్రేమగల తండ్రిని విశ్వసించుటకు ప్రజలు ఇష్టపడనప్పుడు ఆయన నిరుత్సాహపడెను.