WFTW Body: 

1. అతడు ప్రభువైన యేసు యొక్క దాసుడు :

యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూతద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసు క్రీస్తు సాక్ష్యము గూర్చియు, తాను చూచినదంతటిని గూర్చియు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు" (ప్రకటన 1:1-3). ఈ ప్రత్యక్షత "ఆయన (క్రీస్తు యొక్క) దాసులకు" కనుబరచుటకు ఇవ్వబడెను. ఇది అందరికీ కాదు. ఇది ప్రభువు యొక్క దాసులుగా ఉండుటకు ఇష్టపడిన వారికి మాత్రమే. ఒక జీతము తీసుకొని పనివానికి, ఒక దాసునికి వ్యత్యాసమున్నది. ఒక పనివాడు జీతము కొరకు పనిచేయును. కాని ఒక దాసుడు తన యాజమానికి చెందిన ఒక బానిస మరియు అతనికి ఎటువంటి హక్కులు ఉండవు. అయితే ప్రభువునకు దాసులైన వారెవరు? తమ ప్రణాళికలను, ఆశయాలను మరియు తమ హక్కులన్నిటినీ సంతోషముగా విడిచిపెట్టి, ఇప్పుడు తమ జీవితాలలో ప్రతియొక్క విషయములో దేవుని చిత్తమును చేయుటకు కోరుకొనువారే ఆయన దాసులు. అటువంటి విశ్వాసులు మాత్రమే నిజమైన దాసులు. ప్రభువుకు అనేకమంది పనివారు ఉన్నారు కాని, దాసులుగా ఉండుటకు ఇష్టపడువారు చాలా కొద్దిమందే ఉన్నారు. దేవుని వాక్యము ఆయన దాసులకు మాత్రమే నిర్థిష్టంగా (సరిగా) అర్థమగును. ఇతరులు దానిని ఒక పాఠ్యపుస్తకమును చదివినట్లు తమ మేథాశక్తితో దానిని అధ్యయనం చేయగలరు గాని దానిలో ఉన్న ఆత్మీయమైన వాస్తవాలను ఎప్పటికీ గ్రహించలేరు. దేవుని చిత్తమునకు విధేయత చూపుట ద్వారా మాత్రమే ఒకడు సత్యమును తెలిసికోగలడని యేసు యోహాను 7:17లో స్పష్టముగా చెప్పెను.

2. అతడు అంతమువరకు సహోదరుడుగానే ఉండెను :

"మీ సహోదరుడును, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసుద్వీపమున పరవాసినైతిని. ప్రభువు దినమందు ఆత్మవశుడనైయుండగా బూరధ్వనివంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని" (ప్రకటన1:9,10). ఇక్కడ యోహాను తనను తాను "మీ సహోదరుడు" అని పిలచుకొనుట మనము చదువుచున్నాము. ఆ సమయములో యేసు ఎన్నుకొన్న 12 మందిలో యోహాను మాత్రమే జీవించుచున్న అపొస్తులుడు. పత్మాసు ద్వీపమున ప్రభువు ఈ ప్రత్యక్షతను అతనికిచ్చినప్పుడు అతనికి సుమారు 95 సంవత్సరములు. అప్పటికే అతడు దేవునితో 65 సంవత్సరములు నడిచెను. కాని అతడు అప్పటికీ ఒక సహోదరుడే. అతడు పోప్ యోహాను లేక రెవరెండ్ యోహాను కాదు. అతడు పాస్టరు యోహాను కూడా కాదు! అతడు ఒక సాధారణమైన సహోదరుడు. యేసు తన శిష్యులకు బిరుదులన్నిటినీ నిరాకరించి తమను తాము కేవలము సహోదరులుగా సంబోధించుకొనవలెనని బోధించారు (మత్తయి 23:8-11). ఈ రోజున అనేకుల వలేకాక అపొస్తలులు ఆయనకు అక్షరానుసారమైన విధేయత చూపించిరి. మనకున్నది ఒకే ఒక శిరస్సు మరియు ఒకే ఒక్క నాయకుడు - అది క్రీస్తే. మిగిలిన వారమైన మనమందరము ఎటువంటి పరిచర్య కలిగియున్నప్పటికీ, సంఘములో ఎంతో అనుభవమున్నప్పటికీ, సహోదరులమే.

3. అతడు ఆత్మలో ఉండెను:

ప్రకటన 1:9,10లో యోహాను ఆత్మవశుడై యుండెను గనుక అతడు ప్రభువుయొక్క స్వరమును వినగలిగెను. మనము కూడా ఆత్మవశులమైతే ఆ స్వరమును మనము కూడా వినగలము. అదంతా మన మనస్సు దేనిపైనున్నదో ఆధారపడియున్నది. మన మనస్సు భూసంబంధమైన వాటియందున్న యెడల మనము విను స్వరములు కూడా భూసంబంధమైన వాటి గురించేయగును.

4. అతడు దీనుడైన సహోదరుడు :

ప్రభురాత్రి విందులో యేసు రొమ్ముపై అనుకొన్న యోహానే ఇప్పుడు చచ్చినవాని వలే ఆయన పాదముల యొద్ద పడెను (ప్రకటన 1:17). యోహాను దేవునితో 65 ఏళ్ళు నడిచెను. నిస్సందేహముగా అతడు ఆ సమయములో భూమిపై నున్న అతిపరిశుద్ధుడు. అయినప్పటికీ అతడు ప్రభువు సన్నిధిలో నిలకడగా నిలువలేకపోయెను. ప్రభువును అత్యధికముగా ఎరిగినవారే ఆయనను ఎక్కువగా సన్మానించెదరు. ఆయనను అతితక్కువగా ఎరిగినవారు ఆయనతో అతి చనువున్నట్లు నటించుదురు. పరలోకములో సెరాపులు ప్రభువు యెదుట తమ ముఖములను కప్పుకొందురు (యెషయా 6:2,3). యోబు, యెషయా తమ పాపస్వభావమును మరియు దేవుని మహిమను చూచినప్పుడు దుఃఖించిరి (యోబు 42:5,6; యెషయా 6:5). కాని "దేవదూతలు వెళ్ళుటకు భయపడే స్థలమునకు మూర్ఖులు పరుగిడుదురు!!" ఒక శరీరానుసారియైన విశ్వాసి యొక్క మూర్ఖత్వము ఇటువంటిదే. మనము ప్రభువును ఎరిగిన కొలదీ, మనమాయన పాదముల యొద్ద ఆశ్చర్యముతో ఆరాధించుటకు పడి ధూళిలో మూతి పెట్టుకొనెదము. మనము ప్రభువు యొక్క మహిమను నిత్యము చూచినప్పుడు మన స్వంత క్రీస్తు విరుద్ధ స్వభావమును చూడగలము. అప్పుడు మాత్రమే మనము ఇతరులకు తీర్పు తీర్చుట మాని మనలను మనము తీర్పు తీర్చుకొనుట మొదలు పెట్టెదము. అప్పుడు మాత్రమే యోహాను పత్మాసులో అనుభవించినట్లు మనము ఆయన స్పర్శ యొక్క శక్తిని అనుభవించగలము.

5. అతడు శ్రమలలో గుండా వెళ్ళెను :

యోహాను తనను తాను "యేసును బట్టికలుగు శ్రమలో పాలివానిగా" సంబోధించుకొనెను. యేసు ప్రభువు యొక్క ప్రతియొక్క పూర్ణ హృదయముగల శిష్యుడు, ఈ లోకములో ఉన్నంత వరకు "యేసును బట్టి కలుగు శ్రమలో" పాలుపొందుటకు సిద్ధముగా నుండవలెను. యోహాను సుఖముగా జీవించుచున్నప్పుడు ఈ ప్రత్యక్షతను పొందలేదు. అతడు "దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును" పత్మాసు ద్వీపములో శ్రమను అనుభవించుచున్నప్పుడు దానిని పొందెను (ప్రకటన 1:9). చివరి దినములలో పరిశుద్ధులు క్రీస్తువిరోధి నుండి ఎదుర్కొనబోవు శ్రమలను గూర్చి వ్రాయగలుగుటకు అతడు కూడా శ్రమలను అనుభవించవలసి యుండెను. శ్రమలను ఎదుర్కొనే వారికి ఒక పరిచర్యను ఇచ్చేముందు దేవుడు మనలను మొదట శోధనలద్వారా, శ్రమలద్వారా తీసుకువెళ్ళును.