"నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను" (మత్తయి 4:19) అనే సరళమైన మాటను పరిశీలిద్దాం. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా ఎవరు చేయబోతున్నారు? క్రీస్తు. ఏ మనిషి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేయలేడు. మీరు బైబిల్ కళాశాలకు వెళ్లి అక్కడ సంవత్సరాలు గడపవచ్చు, కానీ అది మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేయదు. బైబిల్ అధ్యయనం చేయడం ద్వారా, మిషనరీ సవాలును విని మీ చేయి పైకెత్తడం ద్వారా లేదా దేవుని పని కోసం మీ జీవితాన్ని అంకితం చేయడానికి ముందుకు వచ్చి మోకరిల్లడం ద్వారా మీరు మనుషులను పట్టే జాలరులుగా మారరు. మీరు మనుషులను పట్టే జాలరులుగా ఉండాలనుకుంటే, "నన్ను అనుసరించండి" అని ప్రభువు అంటున్నాడు. "బైబిల్ అధ్యయనం చేయండి" అని కూడా కాదు, "నన్ను అనుసరించండి" అని అంటున్నాడు.
తొలి క్రైస్తవులకు బైబిల్ లేదు. వారు మనుషులను పట్టే జాలరులుగా ఎలా మారగలరు? యేసును అనుసరించడం ద్వారానే. మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ అధ్యయనం ప్రారంభంలో మనం నేర్చుకున్నట్లుగా మనం ఖచ్చితంగా లేఖనాలను అధ్యయనం చేయాలి: "దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా మనిషి జీవించును" (మత్తయి 4:4) . కానీ మనం బైబిలును ఆరాధించే విగ్రహారాధికులుగా మారకూడదు. బైబిల్ యేసును సరిగా అనుసరించడానికి మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. యేసుక్రీస్తు మహిమను మనకు చూపించడానికి పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని ఉపయోగిస్తాడు. యేసును అనుసరించడమే మనుషులను పట్టుకునే జాలరిగా మారడానికి మార్గం. మిమ్మల్ని మనుషులను పట్టుకునే జాలరిగా చేయబోయేది యేసుక్రీస్తే, ఏదో మిషనరీ బైబిల్ శిక్షణా సంస్థ కాదు. దేవుడు మనుషులను ఉపయోగించవచ్చు, కానీ చివరికి మీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని కోరుకునేది క్రీస్తే, మరియు ఆయన మాత్రమే మిమ్మల్ని మనుషులను పట్టుకునే జాలరిగా చేయగలడు.
మనుషులను పట్టుకునే జాలరిగా ఉండటం అంటే ఏమిటి? మనుషులను పట్టుకునే జాలరిగా ఉండటం అంటే సముద్రంలోకి లేదా నదిలోకి వెళ్లి చేపలను పట్టుకుని ఒడ్డుకు తీసుకురావడానికి తమ వలలను వేసే జాలరిలా ఉండటమే. వారు వాటిని ఒక వాతవరణంలో నుండి మరొక వాతవరణంలోకి తీసుకువస్తారు. సహజంగా చేప భూమిపై సౌకర్యవంతంగా ఉండదు; సముద్రంలో అది సౌకర్యవంతంగా ఉంటుంది! ఒక జాలరి ఆ చేపను నీటి నుండి తీసి అది ఉన్న వాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణానికి భూమిపైకి తీసుకువస్తున్నాడు.
ఇది ఒక సింహాన్ని లేదా ఏనుగును బంధించి బోనులో పెట్టడం లాంటిది కాదని అర్థం చేసుకోవడం ముఖ్యం, ఎందుకంటే సింహం ఇప్పటికే సముద్రంలో కాకుండా భూమిపై నివసించడానికి అలవాటు పడింది. కానీ మీరు ఒక చేపను పట్టుకున్నప్పుడు, దానిని ఒక వాతావరణం నుండి తీసికొని, పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఉంచుతున్నారు. భూమి మరియు నీరు పూర్తిగా వ్యతిరేకమైనవి. కాబట్టి మనుషులను పట్టుకునే జాలరి - నిజమైన మనుషులను పట్టుకునే జాలరి - అంటే ఈ లోకం అనే నీటిలో ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి, అక్కడి నుండి వారిని తీసుకొని పరలోక రాజ్యమనే పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి తీసుకురావడం.
మీరు ఈ లోకరాజ్యం నుండి పరలోక రాజ్యంలోకి ఒక వ్యక్తిని తీసుకురాకపోతే, మీరు నిజంగా ఆ చేపను బయటకు తీసుకురాలేదు. మీరు ఆ చేపను మీ వలలో ఉంచుకుని ఉండవచ్చు, కానీ అది ఇంకా నీటిలో ఉంటే, మీరు నిజంగా బయటకు తీసుకురాలేదు. మీరు నిజంగా మనుషులను పట్టుకునే జాలరి కాలేదు. ఏ జాలరి, ఒక చేపను వలలో పట్టుకుని నీటిలోనే ఉండనిస్తాడు, అక్కడ చేప చాలా సౌకర్యంగా ఉంటుంది? కానీ మీరు దానిని భూమిపైకి తీసుకువచ్చిన తర్వాత, చేప ఎలా ప్రవర్తిస్తుందో మీరు చూస్తారు. అది భూమిపై ఉన్నప్పుడు అటుఇటు ఎగిరిపడుతూ, "ఓ, నేను ఇక్కడ అంత సౌకర్యంగా లేను!" అని చెబుతుంది.
ఒక వ్యక్తిని లోకరాజ్యం నుండి పరలోక రాజ్యానికి తీసుకెళ్లినప్పుడు - ఒక చేప నీటి నుండి బయటకు వచ్చి భూమిపైకి వచ్చినప్పుటి వలె - అతను పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి తీసుకురాబడతాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పరలోక రాజ్యంలో సౌకర్యవంతంగా ఉంచుతాడు. కాబట్టి మీరు వంద మందిని "ప్రభువైన యేసు, నా హృదయంలోకి రండి" అని చెప్పించినందున, మీ పనిని పూర్తి చేశారని మరియు మిమ్మల్ని మీరు "మనుష్యులను పట్టే జాలరులు" అని భావించకండి. దురదృష్టవశాత్తు, చాలా మంది విశ్వాసుల విషయంలో అదే జరిగింది. ఇతర మనుషులు మరియు బోధకులు వారిని మనుషులను పట్టే జాలరులుగా మార్చారు కాని క్రీస్తు కాదు. కాబట్టి వారు మనుషులను పట్టే జాలరి అంటే ఏమిటో దానిని ధ్యానించలేదు. క్రీస్తు మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తే, ఆయన రెండు వచనాలకు ముందు బోధించిన, "మారుమనస్సు పొందండి, ఎందుకంటే పరలోక రాజ్యం దగ్గరపడింది" అనే సూత్రంపైనే ఇది కూడా ఉంటుంది. ఈ ’చేపలకు’, పూర్తిగా తిరిగి పరలోక రాజ్యాన్ని వెతకమని, అవి ఉన్న దానికంటే పూర్తిగా భిన్నమైన వాతావరణంలోకి రమ్మని మనం నేర్పించాలి.
ఒక జాలరి చేస్తున్నది అదే. అతను సముద్రం నుండి భూమిపైకి ఒక చేపను తీసుకువెళుతున్నాడు. మనం నిజమైన మనుషులనుపట్టే జాలరులుగా ఉండాలంటే, మనం లోకరాజ్యం నుండి పరలోక రాజ్యంలోకి, అపవాది రాజ్యం నుండి దేవుని రాజ్యంలోకి ప్రజలను తీసుకెళ్లాలి. యేసు మాత్రమే మనల్ని మనుషులను పట్టే జాలరులుగా చేయగలడు. మరెవరూ అలా చేయలేరు.
మనుష్యులను పట్టే జాలరి సువార్తికుడు మాత్రమే కాదు. సువార్తికుడు ఆ పనిలో కొంత భాగాన్ని మాత్రమే చేస్తున్నాడు. ప్రవక్త, అపొస్తలుడు, బోధకుడు, కాపరి, పాస్టర్ కూడా ఈ ప్రజలను వారి కొత్త వాతావరణంలో, పరలోక రాజ్యంలో నిజంగా సౌకర్యవంతంగా చేసే పనిని పూర్తి చేయాలి.
పూర్తి పని ఏమిటంటే, ఒక వ్యక్తిని సముద్రం నుండి భూమిపైకి - లోకరాజ్యం నుండి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లడం. అలా చేయడానికి మార్గం క్రీస్తును అనుసరించడం. నేను యేసును అనుసరిస్తే, ఆయన చేసినట్లుగానే నేను కూడా చేస్తాను.